హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ద్వారా 4.60 లక్షల ఎకరాలకు ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ నుంచి నీరందించనున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. జులై1 నాటికి కల్వకుర్తి నుంచి 1.50లక్షల ఎకరాలకు, నెట్టెంపాడు నుంచి 1.50లక్షల ఎకరాలకు, భీమా ప్రాజెక్టు నుంచి 1.40 లక్షల ఎకరాలకు, కోయిల్ సాగర్ కింద 20వేల ఎకరాలకు సాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తయ్యేట్లు చూడాలని అధికారులకు సూచించారు. కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు విషయంలో కచ్చితంగా ఉండాలని జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాకాలం ప్రారంభమైనందున చెరువుల సామర్ధ్యంపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్ తదితర జిల్లాల్లో వర్షాలకు చెరువులు నిండుకుండాల్లా ఉన్నాయని తెలిపారు. చెరువుల నీటి మట్టాన్ని ప్రతిరోజూ నమోదు చేసుకోవాలని నీటి ఒరవడికి చెరువులకు గండీ పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు.