సాగుకు ముందే చావు డప్పు
► 22 రోజుల్లో 12 మంది ఆత్మహత్య
► అనుమానాస్పద స్థితిలో మరో నలుగురు మృతి
► బ్యాంకు అప్పు పుట్టదు.. ప్రైవేట్ రుణాలే దిక్కు
► వచ్చేనెల 31తో ముగియనున్న ఖరీఫ్ రుణాల గడువు
► పట్టిసీమ నుంచి డెల్టాకు చుక్క లేదు.. పులి‘చింత’లే
► ఇప్పటికే పంట విరామాన్ని ప్రకటించిన కోనసీమ..
► లక్షన్నర ఎకరాలు సాగుకు దూరమయ్యే ప్రమాదం
► రైతు చావుల నివారణకు చర్యలు తీసుకోవాలన్న కోర్టు ఆదేశాలను పట్టించుకోని పాలకులు
► సగటున ప్రతి 40 గంటలకు ఒక రైతు బలిదానం
సాక్షి, హైదరాబాద్: ఆశల మోసులతో సాగుకు సన్నద్ధమైన అన్నదాతకు అప్పుడే కష్టాలు మొదలయ్యాయి. ఖరీఫ్ సాగుకు ముందే రాష్ట్రంలో అన్నదాతల ఇంట చావుడప్పు మోగుతోంది. వ్యవసాయ శాఖ లెక్క ప్రకారం జూన్ ఒకటిన ప్రారంభమైన ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటివరకు 16 మంది రైతులు విభిన్న కారణాలతో చనిపోయారు. తెచ్చిన అప్పులు తీరక కొందరు, బ్యాంకుల నుంచి కొత్త అప్పులు పుట్టక మరికొందరు, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వేధింపులతో ఇంకొందరు తనువు చాలించారు. సగటున ప్రతి 40 గంటలకు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తేలింది. అన్నదాతల ఆత్మహత్యలపై స్పందించాలని, నివారణకు చర్యలు చేపట్టాలని న్యాయస్థానాలు పాలకులకు పదేపదే మొట్టికాయలు వేస్తున్నా ప్రభుత్వం స్పందించడంలేదు. గిట్టుబాటు కాని సాగు చేయలేమని కోనసీమకు చెందిన అనంతవరం రైతులు ఇప్పటికే ‘క్రాప్ హాలీడే’ ప్రకటించారు. ఈ పిలుపు ప్రభావం సుమారు లక్షన్నర ఎకరాలపై ఉంటుందని అంచనా. కాలువల్లో నీరు పారుతుందో లేదో తేలకుండా పంటల్ని వేయలేమని మరికొన్ని ప్రాంతాల రైతులు చెబుతున్నారు. ఖరీఫ్‌కు ముందే సిద్ధం కావాల్సిన పులిచింతల ఇంకా చింతల్లోనే ఉంది. ఎంతో ఆర్భాటం చేసిన పట్టిసీమ ప్రాజెక్టు నుంచి కృష్ణా డెల్టాకు చుక్కనీరు రాలేదు. ఫలితంగా ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. బుధవారం అనంతపురం జిల్లా బొమ్మిరెడ్డిపల్లికి చెందిన వెంకటరమణారెడ్డి (55) అనే రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు.
ఖరీఫ్‌లో ఇవ్వాల్సిన వ్యవసాయ రుణాలు...
ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రు.36 వేల కోట్ల పంట రుణాలు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటికి 25 శాతానికి మించలేదని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణ మాఫీ ఉపశమనం కలిగించకపోగా తలకు మించిన భారంగా తయారైంది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు (డీసీసీబీలు), ప్రాథమిక సహకార సంఘాలు (పీఏసీలు), గ్రామీణ బ్యాంకులు మాత్రమే రైతుల పట్ల కాస్తంత ఉదారంగా వ్యవహరిస్తున్నాయి. పాత అప్పులపై వడ్డీ చెల్లిస్తే కొత్త రుణాలు ఇస్తున్నాయి. మిగతా బ్యాంకులేవీ ఇందుకు సుముఖంగా లేవు.
లీడ్ బ్యాంకులు ఆదేశించినా జాతీయ బ్యాంకులు పట్టించుకోవడం లేదు. అసలుతోపాటు వడ్డీని కూడా జమ చేస్తేనే రుణాలు ఇస్తామంటూ రైతుల్ని ఇబ్బందుల పాల్జేస్తున్నాయి. దీంతో రైతులు అనివార్యంగానే గ్రామాల్లో ఉండే వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. వాస్తవసాగుదార్లుగా ఉన్న కౌలు రైతుల పరిస్థితి మరింత దుర్భరంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన గడువు ప్రకారం ఏప్రిల్ ఒకటి నుంచి జూలై 31లోగా రైతులందరికీ పంట రుణాలు ఇవ్వాలి. ఇప్పటికి మూడు నెలలు గడిచినా ఇచ్చింది 25 శాతమే అయితే ఇంకా మిగిలిన 40 రోజుల్లో ఎంతమందికి ఇస్తారనేది ప్రశ్నార్థకమే.
ఇవ్వాల్సిన ఖరీఫ్ రుణాలు
జిల్లా ఖరీఫ్ రుణం(కోట్లలో)
శ్రీకాకుళం 1,446
విజయనగరం 1,048
విశాఖ 1,268
తూర్పుగోదావరి 4,250
పశ్చిమ గోదావరి 3,951
కృష్ణా 2,912
గుంటూరు 5,437
ప్రకాశం 2,876
నెల్లూరు 2,149
చిత్తూరు 2,869
వైఎస్సార్ 2,164
అనంతపురం 3,130
కర్నూలు 2,500
22 రోజులు... 12 మంది..
ఖరీఫ్ ప్రారంభమైన 22 రోజుల వ్యవధిలో 12 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మరో నలుగురు వేర్వేరు కారణాలతో చనిపోయారు. అన్నదాతల ఆత్మహత్యల్లో అనంతపురం జిల్లా అగ్రస్థానంలో ఉండగా వైఎస్సార్ కడప, కర్నూలు, గుంటూరు జిల్లాలు తర్వాతి స్థానాలలో ఉన్నాయి. విశాఖ జిల్లాలోనూ రైతు ఆత్మహత్యలు చోటుచేసుకోవడం గమనార్హం. లెక్కల్లోకి రాని ఆత్మహత్యలు మరెన్నో ఉన్నాయి. అనంతపురం జిల్లాకు చెందిన మరో ఇద్దరు రైతులు- రమణారెడ్డి (పొడ్రాళ్లపల్లి), శ్రీనివాసరెడ్డి (చాకర్లపల్లి) అనుమానాస్పద స్థితిలో పొలంలో చనిపోయారు. గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు- కాల్‌మనీ ముఠా వేధింపులతో మరణించారు. ఇవన్నీ మీడియాలో వచ్చినవే. పత్రికల్లో, టీవీల్లో రానివి మరెన్నో. మహిళా రైతుల ఆత్మహత్యల్ని మీడియా సైతం నివేదించడం లేదు. ఈ లెక్క చూస్తుంటే ప్రతి నిత్యం రాష్ట్రంలో ఏదో ఒక మూల ఎవరో ఒక రైతు మరణిస్తూనే ఉన్నట్టు స్పష్టమవుతోంది.
గత 22 రోజుల్లో ఆత్మహత్య చేసుకున్న రైతుల వివరాలు
జిల్లా మండలం గ్రామం రైతు పేరు
అనంతపురం నల్లచెరువు బొమ్మిరెడ్డిపల్లి వెంకట రమణారెడ్డి (55)
తాడిమర్రి చిల్లకొండయ్యపల్లి ఆర్వేటి నడిపి నాగప్ప(50)
పెద్దవడుగూరు జి.కొత్తపల్లి దమ్మర హనుమంతు(50)
యాడికి వెంగన్నపల్లి కొట్టి కొండారెడ్డి(65)
పెనుకొండ మరువపల్లి గొల్ల లక్ష్మీనారాయణ(50)
వైఎస్సార్ పులివెందుల చంద్రగిరి(ఇ.కొత్తపల్లె) షామీర్ (28)
బి.మఠం చెంచయ్యగారిపల్లె వేమరెడ్డి జయరామిరెడ్డి(44)
కర్నూలు గోనెగండ్ల గాజులదిన్నే కె.రాముడు(60)
గూడూరు గూడూరు గొల్ల రాముడు(52)
గుంటూరు ఈపూరు ఇనిమెళ్ల మందపాటి శ్రీనివాసరావు (40)
ఈపూరు ఈపూరు దురిశాల వెంకటేశ్వర్లు(55)
విశాఖపట్నం చోడవరం దండోరిపాలెం వబలరెడ్డి అప్పలనాయుడు (52)