సాక్షి, హైదరాబాద్
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను నిర్ణీత లక్ష్యాల మేరకు పూర్తి చేయడంలో భూసేకరణ అంశమే కీలకంగా మారనుంది. వచ్చే ఖరీఫ్ నాటికి ఆయకట్టుకు నీరు అందించాలంటే పలు ప్రాజెక్టుల కింద భూసేకరణను వేగంగా పూర్తిచేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ప్రాజెక్టులకు కేటాయించిన నిధుల్లో ఎక్కువ శాతం భూసేకరణ అవసరాలకే వినియోగించాల్సి రావడం ఒకవైపు.. ఆ స్థాయిలో శాఖకు నిధులు అందకపోవడం మరోవైపు ప్రాజెక్టుల పనులపై ప్రభావం చూపే అవకాశముంది. తక్షణ ఆయకట్టునిచ్చే ప్రాజెక్టుల కింద భూసేకరణ వేగిరం చేయాలని అధికారులు భావిస్తున్నా.. నిధుల సమస్యే గుదిబండగా మారుతోంది.
సేకరణ జరిగితేనే నీళ్లు పారేది..
రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులకు ఇంతవరకు భూసేకరణ అడ్డంకిగా మారుతూ వచ్చింది. ఆ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం జీవో 123ను తెచ్చినా.. నిర్వాసితులు, ప్రజా సంఘాల నుంచి వ్యతిరేకత, హైకోర్టు స్టే ఇవ్వడంతో ఆగిపోయింది. తర్వాత రాష్ట్రం తెచ్చిన భూసేకరణ బిల్లుకు ఆమోదం దక్కడంతో మిగతా భూసేకరణ కొంత సులభతరమైంది. కానీ ఇప్పుడు సేకరిస్తున్న భూములకు పరిహారం నిధులు లేకపోవడంతో పరిస్థితి మొదటికి వస్తోంది.
ఇంకా భారీగా భూముల అవసరం
రాష్ట్రంలో భారీ, మధ్య, చిన్నతరహా ప్రాజెక్టులు కలిపి మొత్తంగా 3.61 లక్షల ఎకరాల భూసేకరణ అవసరంకాగా... ఇప్పటివరకు 2.88 లక్షల ఎకరాలు సేకరించారు. మరో 73 వేల ఎకరాల మేర సేకరించాల్సి ఉంది. ప్రధాన ప్రాజెక్టులపరంగా చూస్తే కాళేశ్వరం పరిధిలో 28 వేల ఎకరాలు, పాలమూరు పరిధిలో 9 వేలు, సీతారామలో 3 వేల ఎకరాలతోపాటు తక్షణం ఆయకట్టునిచ్చే కల్వకుర్తి పరిధిలో 3,471 ఎకరాలు, భీమాలో 542, నెట్టెంపాడులో 833, కొమురం భీమ్‌లో 394, ఎస్సారెస్పీ–2లో 336, కోయిల్‌సాగర్ పరిధిలో 82 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ఇందులో వచ్చే ఏడాది జూన్ నాటికి నీళ్లిచ్చే ప్రాజెక్టుల కింద 7,600 ఎకరాల సేకరణ అవసరం. ఇందుకోసం రూ.3,800 కోట్లు కావాలని అంచనా.
పరిహారం బకాయిలూ భారీగానే..
ఇక వివిధ ప్రాజెక్టుల కింద సేకరించిన భూములకు సంబంధించి రూ.1,597 కోట్ల మేర పరిహారం బకాయిలు ఉన్నాయి. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించే రూ.894 కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉండగా.. పాలమూరు–రంగారెడ్డిలో రూ.175 కోట్లు, డిండిలో రూ.116 కోట్లు, నెట్టెంపాడులో రూ.20 కోట్లు, కల్వకుర్తిలో రూ.15 కోట్లు, వరద కాల్వలో రూ.80 కోట్లు, ప్రాణహితలో రూ.100 కోట్లు, ఎల్లంపల్లి పరిధిలో రూ.38 కోట్ల మేర పరిహారం చెల్లించాల్సి ఉంది. ఈ సొమ్ము చెల్లించడంతో పాటు జూన్ నాటికి మరో రూ.1,500 కోట్లు సమకూర్చితేనే భూసేకరణ పూర్తయి ప్రాజెక్టుల కింద నీళ్లు పారే అవకాశముందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు కొత్తగా సేకరిస్తున్న భూములకు పరిహారం చెల్లించాకే స్వాధీనం చేసుకోవాలన్న హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.
నేడు సీఎం సమీక్ష!
ప్రాజెక్టుల కింద భూసేకరణకు నిధుల సమస్య అవరోధంగా మారిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) రంగంలోకి దిగింది. నిధుల సమీకరణపై ఇప్పటికే సీఎం కేసీఆర్ సూచనల మేరకు సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, కార్యదర్శి స్మితా సబర్వాల్‌లు అధికారులతో ప్రతిరోజూ సమీక్షిస్తున్నారు. గత బుధవారం ప్రభుత్వ సెలవు దినమైనా కూడా.. నీటి పారుదల శాఖ అధికారులతో నర్సింగ్‌రావు మూడు గంటల పాటు చర్చించారు. ఆయన సూచనల మేరకు అదే రోజు మధ్యాహ్నం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు జలసౌధలో నీటి పారుదల శాఖ స్పెషల్ సీఎస్ ఎస్‌కే జోషి, ఈఎన్‌సీ మురళీధర్‌లతో చర్చలు జరిపారు. వివిధ ప్రాజెక్టుల సీఈలు సైతం అందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూన్ వరకు కనిష్టంగా రూ.16 వేల కోట్లయినా ఇవ్వాలని నీటిపారుదల శాఖ కోరినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో నీటిపారుదల శాఖ నిధుల అవసరాలపై గురువారం సీఎం కేసీఆర్ స్వయంగా సమీక్షించనున్నట్లు ఆర్థిక శాఖ అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment