సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రైతులకు సాగునీరు ఇవ్వడానికి ప్రాజెక్టులు కట్టుకుంటుంటే తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీక్షలు, ధర్నాలు, లేఖలు అంటూ పుల్లలు పెడుతున్నారని విమర్శించారు. అందుకే ఆ రెండు పార్టీలు తెలంగాణలో ఖాళీ అయ్యాయని, జనం ఆ రెండు పార్టీలను తిరస్కరిస్తున్నారని సీఎం అన్నారు. మెదక్ జిల్లా పటాన్‌చెరువు టీడీపీ ఇన్‌చార్జి ఎం.సపాన్‌దేవ్, పట్టణ అధ్యక్షుడు ఎం.విశ్వనాధం, నాయకులు ఎం.రవీందర్, మిరాజ్‌ఖాన్, భాస్కర్‌రెడ్డి, ఫరీదుద్దీన్, జగన్, చంద్రశేఖర్, మల్లేశం తదితరులు సోమవారం సీఎం సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.
ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ నీటిపారుదల శాఖా మంత్రి టి.హరీష్‌రావు పక్క రాష్ట్రాలతో నిత్యం చర్చలు జరిపి ప్రాజెక్టుల నిర్మాణానికి మార్గం సుగమమం చేశారన్నారు. ప్రాజెక్టులు ఎట్లయినా ఆపాలని ఆంధ్రా పార్టీలు కుట్రలు చేస్తున్నాయని సీఎం మండిపడ్డారు.తెలంగాణలో నిర్మించతలపెట్టిన ప్రాజక్టులు ఏవీ కొత్తవి కావని, సమైక్య రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు, సీఎంలు జీవోలు ఇచ్చిన ప్రాజెక్టులే అని తెలిపారు. సమైక్య ఏపీలో నీరు పారకుండా ప్రాజెక్టులు డిజైన్ చేశారని, తాము తెలంగాణలో ఎప్పటికీ నీటి ప్రవాహం ఉండేలా ప్రాజెక్టులు కడతామన్నారు. తెలుగుదేశం నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన వారందరినీ సీఎం కేసీఆర్ టీఆర్‌ఎస్‌లోకి సాదరంగా స్వాగతించారు.ఈ కార్యక్రమంలో మంత్రి టి.హరీష్‌రావు, ఎంపీలు బి.వి.పాటిల్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మహిపాల్‌రెడ్డి, చింత ప్రభాకర్, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, సీఎం రాజకీయ సలహాదారు సుభాష్‌రెడ్డి, మురళీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
'ప్రాజెక్టులను అడ్డుకునేందుకు యత్నం'
Published Mon, May 9 2016 7:07 PM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM