చివరి ఆయకట్టుకూ సాగునీరు | CM KCR Review Meeting On Irrigation Projects With Officials | Sakshi
Sakshi News home page

చివరి ఆయకట్టుకూ సాగునీరు

Published Mon, Jul 13 2020 2:13 AM | Last Updated on Mon, Jul 13 2020 10:59 AM

CM KCR Review Meeting On Irrigation Projects With Officials - Sakshi

సీఎం కె.చంద్రశేఖర్‌రావు

సాక్షి, హైదరాబాద్‌: ‘గోదావరి, కృష్ణా నదులపై ఎంతో వ్యయం చేసి, ఎన్నో అవరోధాలను అధిగమించి ప్రభుత్వం భారీ ప్రాజెక్టులను నిర్మిస్తున్నది. పెండింగ్‌ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసింది. ఉద్యమ స్ఫూర్తితో చెరువులను పునరుద్ధరించింది. ఇలా చేసిన పనుల ఫలితం ప్రజలకు అందాలంటే వీలైనంత ఎక్కువ వ్యవసాయ భూములకు సాగునీరు అందించడమే మార్గం. ఇప్పటివరకు తెలంగాణ సాగునీటికి గోస పడ్డది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నీటిపారుదల రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది.

కాళేశ్వరంతో పాటు ఇతర ప్రాజెక్టుల వల్ల ఇప్పుడు పుష్కలంగా నీటి లభ్యత ఏర్పడింది. అలా వచ్చిన నీటిని సంపూర్ణంగా వినియోగించుకోవాలి. ఇందుకు కార్యాచరణ ప్రణా ళిక సిద్ధం చేయాలి’ అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. వీలైనంత ఎక్కువమంది రైతులకు సాగునీటి సౌకర్యం కల్పించడానికి మించిన ప్రాధా న్యం ప్రభుత్వానికి మరోటి లేదని, దీనికోసం ఎంత ఖర్చయినా పెట్టడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఇప్పటివరకు సాగునీరు అందని ప్రాంతా లను గుర్తించి, వాటికి సాగునీరు అందించే ప్రణాళికపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.  

‘ముందుగా చెరువులను నింపాలి. తర్వాత రిజర్వా యర్లను నింపాలి. చివరికి ఆయకట్టుకు నీరందించాలి. ఈ విధంగా ప్రణాళిక ప్రకారం నీటి సరఫరా ఉండాలి. దీనివల్ల వానాకాలంలో లభించే నీటిని పెద్ద మొత్తంలో నిల్వ చేసుకోవడం సాధ్య మవుతుంది. తెలంగాణలో చెరువులు, చెక్‌ డ్యాములు ఎప్పుడూ నిండే ఉండాలి. ఫలితంగా భూగర్భ జలమట్టం పెరిగి రైతులు దాదాపు రూ.45 వేల కోట్ల వ్యయం చేసి వేసుకున్న బోర్లకు నీరందు తుంది. అటు కాల్వలు, ఇటు చెరువులు, మరోవైపు బోర్ల ద్వారా వ్యవసాయం సాగుతుంది’’అని ముఖ్యమంత్రి చెప్పారు. ‘అన్ని ప్రాజెక్టుల పరిధిలో చివరి ఆయకట్టు వరకు నీరు పంపించడానికి అనువుగా కాల్వల సామర్థ్యం ఉందా లేదా మరోసారి పరిశీలించాలి. అవసరమైతే కాల్వల నీటి ప్రవాహ సామర్థ్యాన్ని పెంచాలి’అని సూచించారు. 

ఎస్సారెస్పీ కింద 30 లక్షల ఎకరాలు పండాలి
‘శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పరిధిలోని వరద కాలువకు వీలైనంత ఎక్కువ ఆఫ్‌ టేక్‌ పాయింట్స్‌ (తూములు)  ఏర్పాటు చేసి, ఇతర స్కీములతో సాగునీరు అందని ప్రాంతాల చెరువులను నింపాలి. నీటి పారుదల శాఖలోని అన్ని విభాగాలను వెంటనే ఒకే గొడుగు కిందకి తీసుకురావాలి. కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితంగా ఎస్సారెస్పీ వరకు రెండు టీఎంసీల నీటిని తరలించే వెసులుబాటు కలిగింది. కాబట్టి ఎస్సారెస్పీ పరిధిలో 30 లక్షల ఎకరాల్లో రెండు పంటలు పండించాలి. వరద కాలువ, కాకతీయ కాలువ, అప్పర్‌ మానేరు, మిడ్‌ మానేరు, లోయర్‌ మానేరు ఏడాది పొడవునా నిండే ఉంటాయి. అవి జీవధారలుగా మారతాయి. ఎస్పారెస్పీ ప్రాజెక్టులో కూడా ఎప్పుడూ 25 నుంచి 30 టీఎంసీల నీటిని అందుబాటులో ఉంచాలి. 

అవసరానికి తగ్గట్టు, పరిస్థితులకు అనుగుణంగా ఎస్సారెస్పీని వాడుకోవాలి. గోదావరి నుంచి నీరు వస్తే నేరుగా ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుంచి నీరు తీసుకోవాలి. లేదంటే శ్రీరాంసాగర్‌ పునరుజ్జీవ పథకం ద్వారా నీటిని తరలించాలి’’అని సీఎం చెప్పారు. ‘ఎస్‌ఆర్‌ఎస్పీ పరిధిలోని వరద కాలువ, కాకతీయ కాలువ మధ్య దాదాపు 139 చెరువులున్నాయి. వాటిలో కొన్నింటికి నీరు అందడం లేదు. అలా నీరు అందని చెరువులను గుర్తించాలి. వరద కాలువకు వీలైనన్ని ఎక్కువ తూములు పెట్టి ఆ చెరువులన్నింటినీ నింపాలి. ఈ పని రాబోయే మూడు నాలుగు నెలల్లో పూర్తి కావాలి. అటు ఎస్సారెస్పీ నుంచి, ఇటు కాళేశ్వరం నుంచి వరద కాలువకు నీరందే అవకాశం ఉంది. 

వరద కాలువ 365 రోజుల పాటు సజీవంగా ఉంటుంది. కాబట్టి వరద కాలువ ద్వారా ఇప్పటి వరకు ఇతర స్కీముల ద్వారా నీరందని ప్రాంతాలకు నీరు ఇవ్వాలి. వరద కాలువ, కాకతీయ కాలువ మధ్య భాగంలోనే కాకుండా, వరద కాలువ దక్షిణ భాగంలో ఇతర స్కీముల ద్వారా నీరందని ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లోని చెరువులను నింపాలి. ఈ పని ఆరు నెలల్లో పూర్తి కావాలి. ఎల్లంపల్లి నుంచి అందే నీటి లభ్యతకు మించి ఆయకట్టును ప్రతిపాదించారు. దాన్ని మార్చాలి. ఎల్లంపల్లి నుంచి 90 వేల ఎకరాల లోపే ఆయకట్టుకు నీరందించడం సాధ్యమవుతుంది. మిగతా ఆయకట్టుకు ఎస్సారెస్పీ ద్వారా నీరు అందించాలి’అని ముఖ్యమంత్రి ఆదేశించారు. 

వెంటనే చెరువులకు కృష్ణా జలాలు..
‘ఈ ఏడాది కృష్ణా నదిలో కూడా ఎక్కువ నీటి లభ్యత ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే నారాయణ పూర్‌ రిజర్వాయర్‌ నుంచి నీరు వదిలారు. కాబట్టి వెంటనే జూరాల, భీమా 2 లిఫ్టుల ద్వారా నీటిని చెరువుల్లోకి తరలించాలి. రామల్పాడు రిజర్వాయర్‌ నింపాలి. కల్వకుర్తి లిఫ్టు ఇరిగేషన్‌ డి 82 డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌ పనులను వేగంగా పూర్తి చేసి, ఈ ఏడాదే 30 వేల ఎకరాలకు సాగునీరు అందించాలి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పరిధిలో నీటిని పెద్ద మొత్తంలో నిల్వ చేసుకోవడానికి రిజర్వాయర్‌ నిర్మించాలి. లేదంటే చెరువుల సామర్థ్యం పెంచాలి’అని ముఖ్యమంత్రి చెప్పారు. 

ఉజ్వలంగా రాష్ట్ర సాగునీటి రంగం...
‘తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి రంగం ఉజ్వలంగా మారింది. భారీ ప్రాజెక్టులు, కాల్వలు, రిజర్వాయర్లు వచ్చాయి. చెరువులు బాగుపడ్డాయి. కోటికి పైగా ఎకరాలకు సాగునీరు అందించే గొప్ప వ్యవస్థ ఏర్పడింది. వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడంతో పాటు, దాన్ని సమర్థవంతంగా నిర్వహించడం కూడా చాలా ముఖ్యం. ప్రతీ ప్రాజెక్టుకు నిర్వహణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ఆపరేషన్‌ రూల్స్‌ రూపొందించాలి. నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రతీ ఏడాది బడ్జెట్లోనే నిధులు కేటాయిస్తుంది. ప్రతీ ఏడాది వేసవిలోనే అన్ని ప్రాజెక్టుల్లో అవసరమైన మెయింటనెన్స్‌ పనులు, రిపేర్లు చేసుకోవాలి.

జూన్‌ నాటికి సర్వం సిద్ధం కావాలి. పని భారం పెరిగినందున సాగునీటి వ్యవస్థ సమర్థ నిర్వహణ కోసం నీటి పారుదల శాఖను పునర్విభజించాలి. ఎక్కువ జోన్లను ఏర్పాటు చేసి, ప్రతీ జోన్‌కు ఒక సీఈని బాధ్యుడిగా నియమించాలి. సీఈ పరిధిలోనే ప్రాజెక్టులు, కాల్వలు, రిజర్వాయర్లు, చెరువులు ఉండాలి. గతంలో మాదిరిగా భారీ, మధ్య తరహా, చిన్న తరహా, ఐడిసి అని నాలుగు విభాగాలుగా ఉండవద్దు. నీటి పారుదల శాఖ అంతా ఒకే విభాగంగా పనిచేయాలి.

అధికారులకు కావాల్సిన అధికారాలు అప్పగించాలి. ప్రతీస్థాయి అధికారికి అత్యవసర పనులు చేయడం కోసం నిధులు మంజూరు చేసే అధికారం కల్పించాలి’అని ముఖ్యమంత్రి చెప్పారు. ఇటీవల ముఖ్యమంత్రితో ఫోన్లో సంభాషించిన కథలాపూర్‌ జడ్పీటిసి భూమయ్య, రైతు శ్రీపాల్‌లను కూడా సమావేశానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సమీక్షలో మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, ఎస్‌. నిరంజన్‌ రెడ్డి, వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement