భవిష్యత్తరాలకు సౌందర్యాత్మక జీవితాన్ని వారసత్వంగా అందజేయాలనుకుంటే నదిలా ఆలోచించడం ప్రారంభించాలంటాడు ప్రముఖ పర్యావరణవేత్త డేవిడ్ బ్రోవర్. కోట్లాదిమందికి ప్రాణాధార జలాలుగా ఉన్న నదులు వినియోగంలోకి రాకుండా సముద్రంలో కలిసిపోతుంటే గుండె చెరువవుతుంది. నదిలా ఆలోచించ నిదే, విశాల దృక్పథంతో వ్యవహరించనిదే ఈ దుస్థితిని సరిచేయడం సాధ్యంకాదు. రాష్ట్రాల మధ్య సదవగాహన, సహకారం ఉన్నప్పుడు ఇలా వృథాగా కలిసే నదీ జలాలను ఒడిసిపట్టి మరిన్ని ప్రాంతాలను సస్యశ్యామలం చేయడానికీ...కరువు రక్కసిని పారదోలడానికీ వీలవుతుంది.
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ల మధ్య మంగళవారం ముంబైలో అంతర్రాష్ట్ర ప్రాజెక్టుల నిర్మాణంపై కుదిరిన ఒప్పందం ఈ కోణంలో చరిత్రాత్మకమైనది. ఆదర్శనీయమైనది. హర్షించదగినది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాజెక్టులకు సంబంధించి లోగడ కుదిరిన ఒప్పందాలనూ, భవిష్యత్తులో నిర్మించబోయే ప్రాజెక్టులనూ పరిశీలించేందుకూ, పర్యవేక్షించేందుకూ అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయడానికి ఈ ఒప్పందం వీలుకల్పిస్తున్నది. మండలికి రెండు రాష్ట్రాల సీఎంలూ ఏడాదికొకరు చొప్పున చైర్మన్‌గా వ్యవహరిస్తారు. రెండు రాష్ట్రా లకూ చెందిన వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారు. ప్రాజెక్టుల నిర్మాణంలో తలెత్తే ఎలాంటి సందేహాలైనా, సమస్యలైనా పరిష్కరించ డానికి ఇది వేదికగా ఉపయోగపడుతుంది.
మన దేశంలో ఒక చిత్రమైన స్థితి కొనసాగుతుంటుంది. ఒకపక్క కరువుకాట కాలతో అల్లాడే ప్రాంతాలుంటాయి. మరోపక్క తుపానుల పర్యవసానంగా వరదల్లో చిక్కుకుని విలవిల్లాడే ప్రాంతాలుంటాయి. ప్రపంచ జనాభాలో 17 శాతం నివసిస్తున్న మన దేశంలో ఏడాదికి కేవలం వంద రోజులు మాత్రమే నికరంగా వర్షాలు కురుస్తాయి. ఈ వర్షాలపై ప్రధానంగా ఆధారపడే వేర్వేరు రకాల నదులు 70కిపైగా ఉన్నాయి. వీటికి అనేక ఉపనదులున్నాయి. అయినప్పటికీ దేశ విస్తీర్ణం లోని 68 శాతం ప్రాంతాన్ని క్షామం పీడిస్తుంటుంది. గుక్కెడు నీళ్లు లేక గొంతెండే పల్లెలు లక్షల సంఖ్యలో ఉంటే వేల కోట్ల టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలుస్తున్నది. మనకుండే నదీ జలాల లభ్యతలో మూడోవంతు కూడా మనం వినియోగించుకోలేకపోతున్నామని జల నిపుణులు చెబుతారు. ఇలాంటి దుస్థితిని నివారించాలంటే నదుల అనుసంధానమే మార్గమనే వారుంటారు. అయితే లక్షల కోట్ల రూపాయల వ్యయమయ్యే అంతటి భారీ పథకంకన్నా ముందు నదీ పరివాహక ప్రాంతంలోని రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటే, అవసరమైన నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించుకుంటే గరిష్టంగా ప్రయోజనం పొందడం సాధ్యమవుతుంది.
తెలంగాణ, మహారాష్ట్రల మధ్య కుదిరిన ప్రస్తుత ఒప్పందం ఇరు రాష్ట్రాలకూ వరదాయిని కానుంది. తెలంగాణలో నిర్మించతలపెట్టిన ఆరు నీటిపారుదల ప్రాజె క్టులు పూర్తయితే ఉత్తర తెలంగాణలోని ఆరు జిల్లాలు-కరీంనగర్, వరంగల్, నిజా మాబాద్, నల్గొండ, రంగారెడ్డి, మెదక్‌లు లాభం పొందుతాయి. అక్కడి బీడు భూములు జీవంతో తొణికిసలాడతాయి. అటు మహారాష్ట్రలోని రెండు వెనకబడిన జిల్లాలు గడ్చిరోలీ, చంద్రాపూర్‌లు సైతం పచ్చగా కాంతులీనుతాయి. ఈ ప్రాజెక్టుల వల్ల తెలంగాణలో 17.5 లక్షల ఎకరాలకూ...మహారాష్ట్రలో 75,000 ఎకరాలకూ నీరందడంతోపాటు తాగునీటి సమస్య కూడా సమసిపోతుంది.
ఆదిలాబాద్ జిల్లా తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహితపై 148 మీటర్ల ఎత్తుతో నిర్మించే బ్యారేజీ వల్ల ఆ జిల్లాలోని 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. అటు మహారాష్ట్రలో 30,000 ఎకరాలకు సాగునీరు లభ్యమవుతుంది. ఈ ప్రాజెక్టుపై రెండు రాష్ట్రాలమధ్యానాలు గేళ్లక్రితం ఒప్పందం కుదిరినా బ్యారేజీ ఎత్తు తగ్గించాలని మహారాష్ట్ర పట్టుబట్టింది. 152 మీటర్ల ఎత్తు ఉంటే తమ రాష్ట్రంలో ముంపు ప్రాంతం ఎక్కువగా ఉంటుం దన్నది ఆ రాష్ట్రం అభ్యంతరం.
ఇప్పుడు కుదిరిన అవగాహనవల్ల మహారాష్ట్రలోని ముంపు ప్రాంతం తగ్గుతుంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించే మేడిగడ్డ ప్రాజెక్టు, పెన్‌గంగపై రాజాపేట బ్యారేజీ, చనాఖా-కొరటా బ్యారేజీ, పెన్‌పహాడ్ బ్యారేజీ, లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టులు సైతం లక్షలాది ఎకరాలను సాగులోకి తీసుకురావడంతోపాటు తాగునీటి సమస్యను కూడా తీరుస్తాయి. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుతో 14.5లక్షల ఎకరాలకు సాగునీరు, వివిధ జిల్లాల్లోని గ్రామాకూ, జంటనగరాలకూ తాగునీరు లభ్యమవుతుంది. పెన్‌గంగపై రాజాపేట, పెన్‌పహాడ్ బ్యారేజీలను మహారాష్ట్ర...ఛనాఖా-కొరటా బ్యారేజీని తెలంగాణ నిర్మిస్తాయి. ఎన్నడో ఎన్టీర్ హయాంలో 1985లో ఇరు రాష్ట్రాల మధ్యా ఒప్పందం కుదిరిన లెండి ప్రాజెక్టు నిర్మాణం పనులు మొదలై పదేళ్లయినా అది అనేక సమస్యల్లో చిక్కుకుంది. గతంలో కుదిరిన ఒప్పందాలను సైతం ఇప్పుడు ఏర్పడబోయే బోర్డు పరిగణనలోకి తీసుకుంటుంది గనుక దానికి సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారమవుతాయని ఆశించవచ్చు.
అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు అభివృద్ధికి పెద్ద అవరోధంగా పరిణ మిస్తున్నాయి. స్వాతంత్య్రానంతరం ప్రారంభించిన నాలుగువేల ప్రాజెక్టుల్లో దాదాపు సగం వివాదాల్లోనే చిక్కుకున్నాయి. ఇచ్చిపుచ్చుకునే రీతిలో వ్యవహరిస్తే, అవతలివారి సందేహాలనూ, అనుమానాలనూ నివృత్తి చేయగలిగితే ఇలాంటి ప్రాజెక్టుల్ని అనుకున్న రీతిన సకాలంలో పూర్తి చేయడానికి వీలుంటుంది. ఇందు కోసం సంబంధిత పక్షాలు ఎంతో కొంత త్యాగం చేయకతప్పదు. ఏళ్ల తరబడి వివాదంలో చిక్కుకుని పెండింగ్‌లో పడటం కంటే ఇదే ఉత్తమం. తెలంగాణ-మహారాష్ట్రల మధ్య ఇప్పుడు కుదిరిన ఒప్పందం మాత్రమే కాదు...దానికి సంబంధించిన ఆచరణ సైతం దేశంలో అందరికీ ఆదర్శనీయం కాగలదని ఆశిద్దాం.
చరిత్రాత్మక ఒప్పందం
Published Wed, Mar 9 2016 12:22 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement