ఉభయతారకం! | telangana, maharashtra deals over six irrigation projects | Sakshi
Sakshi News home page

ఉభయతారకం!

Published Wed, Mar 9 2016 3:19 AM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM

ఉభయతారకం! - Sakshi

ఉభయతారకం!

► అంతర్రాష్ట్ర ఒప్పందం కుదిరిన ఆరు ప్రాజెక్టులతో విస్తృత ప్రయోజనాలు
► రాష్ట్రంలో సుమారు 17.5 లక్షల ఎకరాలకు సాగునీరు
► తుమ్మిడిహెట్టి, కాళేశ్వరంతో మహారాష్ట్రలో 75 వేల ఎకరాలకు నీరు
► లెండి, పెన్‌గంగ ప్రాజెక్టుల కింద వచ్చే ఆయకట్టు అదనం
► 19న హైదరాబాద్‌లో మరో సమావేశం.. భవిష్యత్ ప్రణాళికలపై చర్చలు


 సాక్షి, హైదరాబాద్: ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని బీడు భూములకు ప్రాణం పోసే ఆరు ప్రాజెక్టుల నిర్మాణంపై తెలంగాణ, మహారాష్ట్రల మధ్య కుదిరిన అంతర్రాష్ట్ర ఒప్పందం ఇరు రాష్ట్రాలకూ ఎన్నో ప్రయోజనాలను సమకూర్చనుంది. నాలుగు దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న వివాదాలకు పరిష్కారాన్ని చూపడం ద్వారా... తెలంగాణలోని ఆరు జిల్లాలతోపాటు మహారాష్ట్రలోని రెండు జిల్లాలకు నీరు అందనుంది. తెలంగాణలో 17.5 లక్షల ఎకరాలకు నీరందనుండగా, మహారాష్ట్రలో కాళేశ్వరం, తుమ్మిడిహెట్టి ద్వారానే 75వేల ఎకరాలకు నీరందుతుంది. లెండి, పెన్‌గంగలో దక్కే నీటివాటాలకు అనుగుణంగా అదనంగా ఆయకట్టు ఏర్పడనుంది.
 
 మహారాష్ట్రతో తాజాగా ఒప్పందం కుదిరిన ప్రాజెక్టులివే...

 
 దిగులులేదు‘లెండి’
 లెండి నది నీటితో నిజామాబాద్ జిల్లాలోని మద్నూర్, బిచ్కుంద మండలాలతోపాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లోని వేలాది ఎకరాలకు నీరందించాలన్న ఉద్దేశంతో 1985లో లెండి ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం ఎన్‌టీ రామారావు, మహారాష్ట్ర సీఎం ఎస్‌బీ చవాన్‌లు ఒప్పందం చేసుకున్నారు. అప్పట్లో దీని అంచనా విలువ రూ.54కోట్లు. వ్యయంలో మహారాష్ట్ర 62శాతం, తెలంగాణ 38శాతం భరించాలని... ప్రాజెక్టులోని 6.36 టీఎంసీల నీటిలో తెలంగాణ వాటా 2.43 టీఎంసీలు కాగా, మహారాష్ట్రకు 3.93 టీఎంసీలను వాటాగా నిర్ణయించారు. ఈ నీటితో తెలంగాణలో సుమారు 25వేల ఎకరాలకు నీరందనుంది.
 
 ఇరువురికీ ‘తుమ్మిడిహెట్టి’ వరం
 ఆదిలాబాద్ జిల్లా తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తుతో నిర్మించనున్న బ్యారేజీతో ఆదిలాబాద్ జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. 4.5 టీఎంసీల సామర్థం ఉండే ఈ బ్యారేజీ ద్వారా ప్రాణ హిత నుంచి 14.4 టీఎంసీల నీటిని తరలిస్తారు. దీనికోసం మొత్తంగా రూ.4,231కోట్లు ఖర్చు కానుంది. ప్రధాన కాలువలోని 11, 54 కిలోమీటర్ల వద్ద నీటిని ఇతర కాలువలకు మళ్లించి నిర్ణీత ఆయకట్టుకు నీటిని తరలిస్తారు. ఇందుకోసం ఒక్కోటీ 0.2 నుంచి 0.3 టీఎంసీల సామర్థ్యముండే ఐదు రిజర్వాయర్లను (మొత్తంగా 1.1 టీఎంసీలు) నిర్మిస్తారు. వీటికి రూ.2,260కోట్లు అవసరం. ఇక ఇదే తుమ్మిడిహెట్టి ద్వారా మహారాష్ట్రలోని గడ్చిరోలి, చంద్రాపూర్ జిల్లాల్లో 30 వేల ఎకరాలకు సాగునీరందనుంది. సుమారు 3 టీఎంసీల మేర వారికి ప్రయోజనం దక్కనుంది.
 
 విస్తృత ప్రయోజనాల ‘కాళేశ్వరం’
 కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుతో మొత్తంగా 160 టీఎంసీలను మళ్లించడం ద్వారా కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, నల్లగొండ, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని 14.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. గోదావరి నదిపై కాళేశ్వరం దిగువన ఉన్న మేడిగడ్డ వద్ద ప్రధాన బ్యారేజీని నిర్మించనున్నారు. సుమారు రూ.70 వేల కోట్ల వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టులో గరిష్ట ప్రయోజనం మెదక్ జిల్లాకు దక్కేలా ప్రణాళిక సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టు నుంచి మార్గమధ్యంలోని గ్రామాలకు 10 టీఎంసీల తాగునీరు అందించడం, హైదరాబాద్, సికింద్రాబాద్‌లకు 30 టీఎంసీల తాగునీరు అందించడం, మరో 16 టీఎంసీల నీటిని పరిశ్రమల అవసరాలకు వినియోగించాలన్నది లక్ష్యం. ఈ ప్రాజెక్టు ద్వారా మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో 45 వేల ఎకరాలకు సాగునీరు (సుమారు 4.5 టీఎంసీలు) అందనుంది. దాంతోపాటు అదే జిల్లాలోని మెజార్టీ ఆదివాసీల దాహార్తిని తీర్చనుంది.
 
 దిగిరానున్న ‘పెన్‌గంగ ’
 గోదావరి ఉపనది అయిన పెన్‌గంగలో మొత్తంగా 42 టీఎంసీలను వాడుకునే హక్కు తెలంగాణ, మహారాష్ట్రలకు ఉంది. ఇందులో 12 శాతం వాటా అంటే 5.12 టీఎంసీలు తెలంగాణకు దక్కాల్సి ఉంది. ఈ నీటితో ఆదిలాబాద్ జిల్లాలోని తాంప్సి, జైనథ్, బేల మండలాల్లోని 47,500 ఎకరాలకు సాగునీరిచ్చే అవకాశముంది. ప్రధాన డ్యామ్‌ను మహారాష్ట్ర నిర్మించాల్సి ఉంది. ఈ డ్యామ్ నిర్మాణంతో పాటు, ప్రధాన పనులు, కాలువల తవ్వకానికి అటవీ, పర్యావరణ అనుమతులు లభించినా... హైడ్రాలజీ, కాస్ట్ అప్రైజల్‌కు సంబంధించి కేంద్ర జల సంఘం అనుమతులు రావాల్సి ఉంది. అవన్నీ లభించి ప్రాజెక్టు పూర్తయ్యేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉండడంతో... మహారాష్ట్ర దిగువ పెన్‌గంగలో వాడుకునే అవకాశమున్న 9 టీఎంసీలను బ్యారేజీల ద్వారా తరలించుకోవాలని నిర్ణయించింది. అందులో రాష్ట్రానికి వచ్చే వాటా 1.5 టీఎంసీలుగా తేల్చారు. తెలంగాణ భూభాగంలోని నదిఒడ్డులో మూడు బ్యారేజీలను నిర్మించాలని నిర్ణయించారు. ఇందులో రాజాపేట, పెన్‌పహాడ్ వద్ద నిర్మించే బ్యారేజీలను పూర్తిగా మహారాష్ట్ర నిర్మించనుండగా... 1.5 టీఎంసీల సామర్థ్యం గల ఛనాఖా-కొరట బ్యారేజీని తెలంగాణ నిర్మించనుంది. మహారాష్ట్ర ఇందులో తెలంగాణ వాటాగా రాజాపేట బ్యారేజీ కింద 2,500 ఎకరాలకు, పెన్‌పహాడ్ కింద 4,500 ఎకరాలకు, ఛనాఖా-కొరట కింద 13,500 ఎకరాలకు కలిపి మొత్తంగా 20,500 ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉంటుంది.
 
 19న మరోమారు సమావేశం
 ప్రాజెక్టులపై కుదిరిన ఒప్పందాల మేరకు భవిష్యత్ ప్రణాళికలపై ఇరు రాష్ట్రాల మధ్య ఈనెల 19న హైదరాబాద్‌లో మరోసారి సమావేశం జరగనుంది. 103 మీటర్ల ఎత్తుతో మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంపై ప్రధానంగా చర్చిస్తారు. ఒక వారంలో మేడిగడ్డకు టెండర్లు పిలిచేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మహారాష్ట్ర సమ్మతి తెలిపిన మేరకు 103 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణాన్ని ప్రారంభిస్తుంది. అయితే ముంపుపై మహారాష్ట్ర తేల్చిన తర్వాత కుదిరే అంగీకారం మేరకు బ్యారేజీ ఎత్తును నిర్ణయించి, ఆ ఎత్తులోనే నీటి నిల్వ చేస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement