deals
-
మూడు నెలల్లో రూ.5,330 కోట్ల ఒప్పందాలు
భారతీయ సాంకేతిక రంగంలోని కంపెనీలు 2024 జులై–సెప్టెంబర్ కాలంలో 635 మిలియన్ డాలర్ల (రూ.5,330 కోట్లు) విలువైన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఒప్పందాల విలువ 31 శాతం పెరుగుదలను నమోదు చేసినట్లు కన్సల్టింగ్ కంపెనీ ‘గ్రాంట్ థ్రాంటన్ భారత్’ వెల్లడించింది. అందుకుగల కారణాలు విశ్లేషిస్తూ సంస్థ నివేదిక విడుదల చేసింది.నివేదికలోని వివరాల ప్రకారం..యూఎస్ ఫెడ్ ఇటీవల కీలక వడ్డీరేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అది టెక్ కంపెనీలకు సానుకూలాంశంగా మారింది. లోన్లు అధికంగా జారీ చేస్తూ టెక్నాలజీ అప్‌గ్రేడ్ చేసుకునేందుకు ఫైనాన్స్ సంస్థలు ఆసక్తి చూపుతాయి. భారత్‌లో సార్వత్రిక ఎన్నికల తర్వాత అనిశ్చితులు తొలగి స్థిరమైన ప్రభుత్వం ఏర్పడింది. దాంతో సెప్టెంబర్ త్రైమాసికంలో 79 ఒప్పందాలు జరిగాయి. గతంలో కంటే ఈ ఒప్పందాల విలువ 31 శాతం పెరుగుదలను నమోదు చేసింది. 20 మిలియన్ డాలర్ల(రూ.168 కోట్లు)కు పైగా విలువ కలిగిన డీల్స్ 12 నమోదయ్యాయి. విలీనాలు, కొనుగోళ్లు జూన్ త్రైమాసికంతో పోలిస్తే 44 శాతం పెరిగాయి. ఇవి గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే 53 శాతం అధికమై 26 డీల్స్‌కు చేరుకున్నాయి. ఈ ఒప్పందాల విలువ 205 శాతం దూసుకెళ్లి 116 మిలియన్ డాలర్లు(రూ.975 కోట్లు)గా నమోదైంది.ఇదీ చదవండి: గరిష్ఠాలను చేరిన బంగారం ధర!భారత్‌పట్ల బుల్లిష్‌గా..‘పెట్టుబడిదారులు భారతీయ మార్కెట్‌పై చాలా బుల్లిష్‌గా ఉన్నారు. మార్కెట్లలోకి ప్రవహించే మూలధనం ప్రధాన లబ్ధిదారుల్లో భారత్ ఒకటి. వరుసలో పెద్ద సంఖ్యలో ఐపీవోలు ఉండటంతో భారీగా పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కొంతమంది పెట్టుబడిదారులు ఈ ఐపీవోల నుంచి మెరుగైన లాభాలు సంపాదించాలని భావిస్తున్నారు. ఏడాది కాలంలో స్టార్టప్ వ్యవస్థలో భారీగా నిధులు చేరాయి’ అని నివేదిక వివరించింది. -
పిజ్జాలు పంపించి.. రూ.కోట్ల డీల్స్ పట్టాడు!
కంపెనీలు తమ వ్యాపారం కోసం క్లయింట్లను ఆకర్షించడానికి చాలా చేస్తుంటారు. అయితే ఒక స్టార్టప్ సీఈఓ క్లయింట్లకు ఫుడ్ ట్రీట్ ఇచ్చి కోట్ల రూపాయల డీల్స్ దక్కించుకున్న సంగతి మీకు తెలుసా? ఈ డీల్స్ ద్వారా ఆ స్టార్టప్‌కు ఊహించనంత ఆదాయం వచ్చింది.న్యూయార్క్‌కు చెందిన టెక్ స్టార్టప్ యాంటిమెటల్ కో ఫౌండర్, సీఈవో మాథ్యూ పార్క్‌హస్ట్ గత ఏప్రిల్ నెలలో వెంచర్ క్యాపిటల్ సంస్థలు, టెక్ ఇన్ఫ్లుయన్సర్లతో సహా పలువురికి పిజ్జాలను కొనుగోలు పంపించారు. ఇందు కోసం 15,000 డాలర్లు (సుమారు రూ.12.5 లక్షలు) ఖర్చు పెట్టారు. బీటా దశలో తమ కంపెనీ గురించి అవగాహన పెంచడమే ఈ ట్రీట్ ఉద్దేశం.కేవలం రెండు నెలల్లోనే యాంటిమెటల్ తన ఖర్చులను లాభదాయక ఒప్పందాలుగా మార్చి ఒక మిలియన్ డాలర్లకు పైగా (రూ.8.3 కోట్లు) ఆదాయాన్ని ఆర్జించింది. పిజ్జాతో ట్రీట్ చేసిన 75 కంపెనీలు పార్క్ హస్ట్ క్లయింట్లుగా మారాయి. ఈ విషయాన్ని సీఈవో పార్క్‌హస్ట్ సీఎన్‌బీసీ మేక్ ఇట్తో స్వయంగా వెల్లడించారు. నిజానికి 'పిజ్జా' తమ ఫస్ట్ ఛాయిస్ కాదని చెప్పారు. షాంపైన్ పంపించాలనుకున్నామని, అయితే దానికి చాలా ఖర్చవుతుందని, పిజ్జాను ఎంచుకున్నట్లు పార్క్‌హస్ట్ వివరించారు. -
డీల్స్ @ రూ. 60,000 కోట్లు!
ముంబై: ఓ వైపు దేశీ స్టాక్ మార్కెట్లు ఈ నెల(ఆగస్ట్)లో ఆటుపోట్లు ఎదుర్కొంటున్నప్పటికీ మరోపక్క లిస్టెడ్ కార్పొరేట్ ప్రపంచంలో భారీస్థాయి విక్రయ లావాదేవీలు జోరుగా సాగుతున్నాయి. గత ఐదు నెలల తదుపరి ఆగస్ట్‌లో మార్కెట్లు కొంతమేర వెనకడుగు వేయగా.. షేర్ల అమ్మకపు డీల్స్ కొత్త రికార్డ్‌కు తెరతీశాయి. ఒక పరిశీలన ప్రకారం ఈ నెలలో 29 వరకూ మొత్తం రూ. 60,000 కోట్లమేర భారీ బ్లాక్‌డీల్స్ జరిగాయి. క్యాలెండర్ ఏడాదిలోని ఏ నెలలోనైనా విలువరీత్యా ఇవి అత్యధికంకాగా.. రెండు భారీ డీల్స్ ఇందుకు దోహదపడ్డాయి. సాఫ్ట్వేర్ సేవల దేశీ కంపెనీ కోఫోర్జ్(గతంలో ఎన్ఐఐటీ టెక్నాలజీస్)లో రూ. 7,684 కోట్ల విలువైన ఈక్విటీని పీఈ దిగ్గజం బేరింగ్ అనుబంధ కంపెనీ హల్ట్ విక్రయించింది. ఇదేవిధంగా ప్రయివేట్ రంగ విద్యుత్ కంపెనీ అదానీ పవర్లో ప్రమోటర్ గ్రూప్ రూ. 7,412 కోట్ల విలువైన షేర్లను యూఎస్ దిగ్గజం జీక్యూజీ పార్ట్నర్స్కు విక్రయించింది. ఈ బాటలో ఇండిగో బ్రాండు విమానయాన సేవల కంపెనీ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌లో సహవ్యవస్థాపకుడు రాకేష్ గంగ్వాల్ కుటుంబం 3 శాతం వాటాను రూ. 2,802 కోట్లకు విక్రయించింది. దేశీ డిజిటల్ పేమెంట్స్ కంపెనీ పేటీఎమ్‌లో చైనా దిగ్గజం అలీబాబా గ్రూప్ కంపెనీ యాంట్‌ఫిన్ రూ. 2,037 కోట్ల విలువైన వాటాను అమ్మివేయగా.. ఆన్లైన్ ఫుడ్ సర్వింగ్ ప్లాట్‌ఫామ్ జొమాటోలో పీఈ దిగ్గజం టైగర్ గ్లోబల్ 1.44 శాతం వాటాను రూ. 1,124 కోట్లకు విక్రయించింది. మార్కెట్ల వెనకడుగు.. ఈ ఏడాది జూలై 20న దేశీ స్టాక్ మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ సరికొత్త గరిష్టం 67,500 పాయింట్లను అధిగమించింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం దాదాపు 20,000 పాయింట్ల స్థాయికి చేరింది. ఈ రికార్డ్ స్థాయిల నుంచి సెన్సెక్స్, నిఫ్టీ నిజానికి ఆగస్ట్‌లో 3 శాతం వెనకడుగు వేశాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 65,100, నిఫ్టీ 19,350 వద్ద కదులుతున్నాయి. అయితే దేశీయంగా అదనపు లిక్విడిటీ, మిడ్, స్మాల్‌క్యాప్స్‌నకు విస్తరించిన యాక్టివిటీ, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడుల జోరు వంటి అంశాలు.. ఈ నెలలో భారీ స్థాయి లావాదేవీలకు కారణమవుతున్నట్లు కార్పొరేట్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనికితోడు దేశ ఆర్థిక వ్యవస్థపై మధ్య, దీర్ఘకాలిక వృద్ధి అంచనాలు, స్టాక్ మార్కెట్ భవిష్యత్‌పై పెరుగుతున్న ఇన్వెస్టర్ల విశ్వాసం జత కలుస్తున్నట్లు తెలియజేశాయి. ఇతర స్టాక్స్‌లోనే.. ప్రధానంగా ఇండెక్సేతర కంపెనీలలోనే ఇటీవల వాటాల విక్రయాలలో భారీ లావాదేవీలు నమోదైనట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో మొత్తం మార్కెట్లో జరుగుతున్న అంశాలను సెన్సెక్స్ లేదా నిఫ్టీ ప్రతిఫలించకపోవచ్చని తెలియజేశాయి. మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్‌లు), విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు), పీఈ సంస్థలు తదితర దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు స్వల్పకాలిక అంశాలను పరిగణనలోకి తీసుకోవని వివరించాయి. ఈ నెలలో మార్కెట్లు రికార్డ్ గరిష్టాల నుంచి కొంతమేర క్షీణించినప్పటికీ.. మిడ్, స్మాల్ క్యాప్స్ చరిత్రాత్మక గరిష్టాలకు చేరడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాయి. కాగా.. ఈ ఏడాది ఇప్పటివరకూ ఎన్ఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్స్ 23% జంప్‌చేయగా.. నిఫ్టీ దాదాపు 7% ఎగసింది. ఇక జూన్‌లోనూ మొత్తం రూ. 50,000 కోట్ల విలువైన భారీ బ్లాక్‌డీల్స్ నమోదుకావడం మార్కెట్ల లోతుకు నిదర్శనమని నిపుణులు విశ్లేíÙంచారు. -
జూలైలో కార్పొరేట్ డీల్స్ 3.1 బిలియన్ డాలర్లు
ముంబై: కార్పొరేట్ డీల్స్ (ఒప్పందాలు) విలువ జూలై నెలలో 58 శాతం పెరిగి 3.1 బిలియన్ డాలర్లుగా (రూ.25,730 కోట్లు) నమోదైంది. మొత్తం మీద డీల్స్ సంఖ్య తగ్గింది. ఈ వివరాలను గ్రాంట్ థార్న్టన్ విడుదల చేసింది. జూలైలో మొత్తం 3.1 బిలియన్ డాలర్ల కార్పొరేట్ ఒప్పందాలు నమోదయ్యాయి. విలువ పరంగా 58 శాతం పెరిగినా, సంఖ్యా పరంగా చూస్తే 46 శాతం తగ్గాయి. అంతర్జాతీయంగా మందగమనం కార్పొరేట్ డీల్స్‌పై ప్రభావం చూపించినట్టు గ్రాంట్ థార్న్టన్ పార్ట్నర్ శాంతి విజేత తెలిపారు. ఈ ఏడాది ఆరంభం నుంచి కార్పొరేట్ డీల్స్ విభాగంలో స్తబ్ధత ఉన్నట్టు చెప్పారు. సీమాంతర లావాదేవీలు డీల్స్ విలువ పెరగడానికి దోహదపడినట్టు చెప్పారు. అదే సమయంలో ప్రైవేటు ఈక్విటీ ఇన్వెస్టర్లలో అప్రమత్తత ఉండడంతో డీల్స్ సంఖ్య తగ్గినట్టు తెలిపారు. ముఖ్య డీల్స్.. ► 29 డీల్స్ విలువ 2 బిలియన్ డాలర్లుగా ఉంది. ► రూట్ మొబైల్లో 58 శాతం వాటా కొనుగోలుకు 721 మిలియన్ డాలర్లతో ప్రాక్సిమస్ ఓపల్ కుదుర్చుకున్న డీల్ అతిపెద్దదిగా ఉంది. ► అదానీ క్యాపిటల్, అదానీ హౌసింగ్ ఫైనాన్స్‌లో 90 శాతం వాటా కొనుగోలుకు బెయిన్ క్యాపిటల్ 176 మిలియన్ డాలర్లతో డీల్ కుదుర్చుకోవడం గమనార్హం. ► నాలుగు క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్యూఐపీ) విలువ 668 మిలియన్ డాలర్లుగా ఉంది. -
అదానీ పవర్లో 8.1% వాటా విక్రయం
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం జీక్యూజీ పార్ట్నర్స్, ఇతర ఇన్వెస్టర్లు తాజాగా అదానీ పవర్లో 8.1 శాతం వాటాలు కొనుగోలు చేశాయి. ఇందుకోసం 1.1 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 9,000 కోట్లు) వెచ్చించాయి. సెకండరీ మార్కెట్లో అత్యంత భారీ ఈక్విటీ డీల్స్‌లో ఇది కూడా ఒకటని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. స్టాక్ మార్కెట్ డేటా ప్రకారం.. 31.2 కోట్ల షేర్లను ప్రమోటర్ అదానీ కుటుంబం విక్రయించగా, సగటున షేరుకు రూ. 279.17 రేటుతో జీక్యూజీ పార్టనర్స్, ఇతర ఇన్వెస్టర్లు కొనుగోలు చేశారు. జీక్యూజీ ఇప్పటికే అదానీ గ్రూప్‌నకు చెందిన పలు సంస్థల్లో ఇన్వెస్ట్ చేసిన నేపథ్యంలో.. ఒక ఇన్వెస్టరు, ప్రమోటరు గ్రూప్ మధ్య ఈ తరహా లావాదేవీ జరగడం భారత్‌లో ఇదే తొలిసారని సంబంధిత వర్గాలు వివరించాయి.. అదానీ గ్రూప్ వ్యాపార ప్రమాణాలను, బలాన్ని ఇది సూచిస్తోందని తెలిపాయి. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ దెబ్బతో అదానీ గ్రూప్ అతలాకుతలం అయిన పరిస్థితుల్లో, ఈ ఏడాది మార్చి నుంచి ఆ గ్రూప్ సంస్థల్లో జీక్యూజీ క్రమంగా ఇన్వెస్ట్ చేస్తూ వస్తోంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో 5.4 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీలో 6.54%, అదానీ ట్రాన్స్‌మిషన్‌లో 2.5 శాతం వాటాలు కొనుగోలు చేసింది. జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీలోనూ.. మరో స్టాక్ మార్కెట్ డీల్‌లో జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీలో జేఎస్‌డబ్ల్యూ ఇన్వెస్ట్మెంట్స్ 1.27 శాతం వాటాలను రూ. 717.57 కోట్లకు విక్రయించింది. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా జీక్యూజీ పార్ట్నర్స్, వాషింగ్టన్ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ తదితర సంస్థలు కొనుగోలు చేశాయి. జేఎస్‌డబ్ల్యూ ఇన్వెస్ట్మెంట్స్.. షేరు ఒక్కింటికి రూ. 341.7 రేటు చొప్పున 2.10 కోట్ల షేర్లను విక్రయించింది. డీల్ అనంతరం జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీలో జేఎస్‌డబ్ల్యూ ఇన్వెస్ట్మెంట్స్ వాటా 20.22 శాతం నుంచి 18.95 శాతానికి తగ్గింది. ఇటీవలే జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీలో జీక్యూజీ పార్ట్నర్స్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఈక్విటీ ఫండ్ రూ. 411 కోట్లతో 1.19 కోట్ల షేర్లను కొనుగోలు చేసింది. -
ప్రథమార్ధంలో డీల్స్ డౌన్
ముంబై: ఈ ఏడాది ప్రథమార్ధంలో విలీనాలు, కొనుగోళ్ల (ఎంఅండ్ఏ) డీల్స్ పరిమాణంపరంగా పెరిగినా విలువపరంగా మాత్రం 75 శాతం క్షీణించింది. 32.6 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. గతేడాది ప్రథమార్ధంతో పోలిస్తే ఈ వ్యవధిలో డీల్స్ సంఖ్య 5.2 శాతం పెరిగి 1,400కి చేరింది. 1980లో ఎంఅండ్ఏ డీల్స్‌ను రికార్డు చేయడం ప్రారంభించిన తర్వాత ఇదే గరిష్ట స్థాయి. గతేడాది ఏప్రిల్‌లో హెచ్డీఎఫ్సీ ద్వయం 40 బిలియన్ డాలర్ల ఒప్పందం ప్రకటించగా.. ఈసారి కనీసం 5 బిలియన్ డాలర్ల ఒప్పందాలు కూడా లేకపోవడం గమనార్హం. ఫైనాన్షియల్ మార్కెట్ల డేటా సంస్థ రెఫినిటివ్ నివేదిక ప్రకారం.. తొలి త్రైమాసికంలో 1 బిలియన్ డాలర్ల లోపు ఒప్పందాలే ఎక్కువగా ఉండగా .. రెండో త్రైమాసికంలో 1 బిలియన్ డాలర్ల డీల్స్ నాలుగు నమోదయ్యాయి. ఈక్విటీ విభాగంలో 2018 తర్వాత ఈసారి ప్రథమార్ధంలో ఐపీవో మార్కెట్లో సందడి నెలకొంది. 75 చిన్న, మధ్య తరహా సంస్థలు లిస్ట్ కాగా.. 1.4 బిలియన్ డాలర్లు సమీకరించాయి. లిస్టయిన సంస్థల సంఖ్య వార్షికంగా చూస్తే 25 శాతం పెరిగినా.. సమీకరించిన నిధుల పరిమాణం మాత్రం 73 శాతం తగ్గింది. నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు.. ► ఫాలో ఆన్ ఆఫర్లు 127 శాతం పెరిగి 9 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అదానీ గ్రూప్‌లో భాగమైన నాలుగు సంస్థల్లో 1.9 బిలియన్ డాలర్ల వాటాలు విక్రయించడం ఇందుకు ఊతమిచ్చింది. ► ఆర్థిక రంగంలో అత్యధికంగా 7.5 బిలియన్ డాలర్ల మేర ఒప్పందాలు కుదిరినప్పటికీ.. విలువపరంగా 89 శాతం తగ్గాయి. ఇండ్రస్టియల్స్ విభాగంలో 5.2 బిలియన్ డాలర్లు (11.6 శాతం డౌన్), హై టెక్నాలజీలో 5 బిలియన్ డాలర్ల (73.1 శాతం తగ్గుదల) ఒప్పందాలు కుదిరాయి. ► ప్రైవేట్ ఈక్విటీ దన్ను గల ఎంఅండ్ఏ డీల్స్ విలువ 8.2 బిలియన్ డాలర్లుగా (56 శాతం క్షీణత) నమోదైంది. ► ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్లు 10.3 బిలియన్ డాలర్లు సమీకరించాయి. 2021 తర్వాత ప్రథమార్ధంలో ఇంత అత్యధికంగా నిధులు రావడం ఇదే ప్రథమం. ► ప్రైమరీ బాండ్ల జారీ 66 శాతం పెరిగింది. ఇందులో ఫైనాన్షియల్ రంగం 81.3 శాతం, ఇండస్ట్రియల్స్ 7 శాతం మేర వాటా దక్కించుకున్నాయి. -
స్మార్ట్‌ఫోన్స్ కొనేవారికి గుడ్‌న్యూస్.. ఫ్లిప్‌కార్ట్‌లో బెస్ట్ డీల్స్
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ (Flipkart Big Saving Days) పేరుతో తాజా సేల్ ఈవెంట్‌ను ప్రకటించింది. ఈ సేల్ జూన్ 10న ప్రారంభమై జూన్ 14 వరకు కొనసాగనుంది. ఈ పరిమిత కాల సేల్‌లో ఐఫోన్ 13, శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్23, పోకో ఎక్స్5తో సహా ప్రముఖ స్మార్ట్ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ బెస్ట్ డీల్స్, ఆకర్షణీయ తగ్గింపులను అందిస్తోంది. వీటితోపాటు ఎక్స్చేంజ్ ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. టాప్ బ్రాండ్స్.. ఫ్లాట్ డిస్కౌంట్స్ ⮞ ఐఫోన్13 (iPhone 13) 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను ఫ్లిప్‌కార్ట్ రూ.58,749 నుంచి ఆఫర్ చేస్తోంది. ఇది యాపిల్ ఆన్లైన్ స్టోర్‌లో రూ.69,900 ఉంది. అంటే రూ. 11,151 ఫ్లాట్ తగ్గింపు . అదనంగా, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఉన్న కస్టమర్లు అదనంగా 10 శాతం తగ్గింపు పొందవచ్చు. మొత్తంగా రూ.57,999లకే ఐఫోన్13ను కొనుగోలు చేయవచ్చు . ⮞ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 (Samsung Galaxy F23) 5Gని రూ.13,499లకే అందిస్తోంది. మార్చిలో లాంచ్ అయినప్పుడు దాని అసలు ధర రూ.17,499. రూ.6,500 తగ్గింపు అంటే ఎవరు వదులుకుంటారు? ఇంకా తక్కువ ధరకు ఫోన్ కావాలనుకునే వారికి శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 (Samsung Galaxy F13) రూ. 10,999 లకే అందుబాటులో ఉంది. అలాగే శాంసంగ్ గెలాక్సీ ఎం14 (Samsung Galaxy M14)ని అయితే ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 14,327 కంటే తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ⮞ ఇక రూ.15,499 ఉన్న మోటో జీ62 (Moto G62) రూ. 14,499లకు, 15,499 ఉన్న పోకో ఎక్స్5 (Poco X5 5G)ని రూ.14,999లకు కొనుగోలు చేయవచ్చు. దీనిపై రూ.4,000 తగ్గింపు అందుబాటులో ఉంది. ఇదీ చదవండి: గాల్లో డబుల్ డెక్కర్: భలే డిజైన్ చేశారు.. ఫొటో వైరల్ -
టెక్ ఒప్పందాల జోరుకు బ్రేకులు
న్యూఢిల్లీ: టెక్నాలజీ సర్వీసుల రంగంలో ఒప్పందాల జోరు తగ్గింది. ఈ ఏడాది (2023) తొలి త్రైమాసికంలో లావాదేవీల సంఖ్య 150కి పరిమితమైంది. గతేడాది ఇదే వ్యవధిలో 270 పైగా, 2021లో 220 పైచిలుకు ఒప్పందాలు కుదిరాయి. కన్సల్టెన్సీ ఈవై, ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ సంయుక్తంగా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2022లో విలీనాలు, కొనుగోళ్ల డీల్స్, ప్రైవేట్ ఈక్విటీ ఒప్పందాలు 57 బిలియన్ డాలర్ల స్థాయిలో నమోదయ్యాయి. 2020తో పోలిస్తే (27 బిలియన్ డాలర్లు) ఇది రెట్టింపు కావడం గమనార్హం. అయితే, గతేడాది ఆఖరులో నుంచి ఈ ఏడాది తొలి త్రైమాసికం వరకు డీల్స్ నెమ్మదించినట్లు నివేదిక తెలిపింది. అయినప్పటికీ రాబోయే రోజుల్లో మధ్య స్థాయి కంపెనీల మధ్య లావాదేవీలు మెరుగ్గానే ఉండవచ్చని భావిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది మిగతా కాలంలో రిస్కులను తగ్గించుకునే ఉద్దేశంతో ఒప్పందాలను కుదుర్చుకునేటప్పుడు సంస్థలు మరింతగా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉందని వివరించింది. నివేదికలోని మరిన్ని అంశాలు.. ►2022లో ఐటీ సర్వీసులు, బీపీఎం (బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్), ఈ–ఆర్అండ్డీ (ఇంజినీరింగ్, ఆర్అండ్డీ) తదితర విభాగాల్లో 947 డీల్స్ కుదిరాయి. అయిదేళ్లలో ఇదే అత్యధికం. ► 2020తో పోలిస్తే 2022లో మొత్తం ఒప్పందాల విలువ, పరిమాణం రెట్టింపైంది. ►ఐటీ సర్వీసుల ఒప్పందాల్లో ప్రైవేట్ ఈక్విటీ సంస్థల భాగస్వామ్యం 2020తో పోలిస్తే 2022లో 2.5 రెట్లు పెరిగింది. భారీ ఒప్పందాల సెగ్మెంట్లో (500 మిలియన్ డాలర్ల పై స్థాయి) 62.5 శాతం వాటా దక్కించుకుంది. ► అధునాతన టెక్నాలజీలను దక్కించుకునే ఉద్దేశంతో ఐటీ సర్వీసుల కంపెనీలు ఎక్కువగా ఐపీ/ప్రోడక్ట్ సంస్థల్లో వాటాలను కొనుగోలు చేయడంపై ఆసక్తి చూపుతున్నాయి. ►భారీ సంస్థలు ప్రధానంగా ఐవోటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్), ఏఆర్/వీఆర్ (ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ), హైపర్–ఆటోమేషన్, కోడింగ్ తక్కువగా ఉండే లేదా అసలు కోడింగ్ అవసరం ఉండని కొత్త టెక్నాలజీలపై ఆసక్తిగా ఉంటున్నాయి. ►ప్రస్తుతం ఆర్థిక అనిశ్చితులు ఎలా ఉన్నప్పటికీ కంపెనీల డిజిటల్ పరివర్తన ప్రక్రియ పలు దశాబ్దాల పాటు కొనసాగనుంది. దీనిపై సంస్థలు బిలియన్ల కొద్దీ డాలర్ల పెట్టుబడులు ఇన్వెస్ట్ చేయనున్నాయి. తద్వారా రాబోయే రోజుల్లోనూ అధునాతన ఐటీ సొల్యూషన్స్‌కు డిమాండ్ భారీగానే ఉండనుంది. ►గడిచిన 24 నెలల్లో కంపెనీల పెట్టుబడుల ధోరణుల్లో గణనీయంగా మార్పులు వచ్చాయి. సంస్థలు డిజిటల్, వ్యాపార పరివర్తన మీద ఇన్వెస్ట్ చేయడంపై దృష్టి పెడుతున్నాయి. ► ప్రస్తుతం తయారీ, ఆటోమోటివ్, సరఫరా వ్యవస్థలు మొదలైన విభాగాల్లో ఏఆర్, వీఆర్, ఐవోటీ వంటి టెక్నాలజీల వినియోగం పెరుగుతోంది. టెక్నాలజీ రంగంలో డిజిటైజేషన్, క్లౌడిఫికేషన్, డిజిటల్ సీఎక్స్ (కస్టమర్ అనుభూతి) వంటి విభాగాలు వృద్ధి చెందనున్నాయి. -
క్యూ1లో 35 శాతం తగ్గిన డీల్స్
ముంబై: ప్రస్తుత కేలండర్ ఏడాది(2023) తొలి త్రైమాసికంలో డీల్స్ 35 శాతం క్షీణించినట్లు గ్రాంట్ థార్న్టన్ నివేదిక పేర్కొంది. జనవరి–మార్చి(క్యూ1)లో 9.7 బిలియన్ డాలర్ల విలువైన 332 లావాదేవీలు జరిగినట్లు తెలియజేసింది. ప్రపంచ ఆర్థిక మాంద్య భయాలు, కొనసాగుతున్న రష్యా–ఉక్రెయిన్ యుద్ధం డీల్స్‌పై ప్రతికూల ప్రభావం చూపినట్లు పేర్కొంది. నివేదిక ప్రకారం మొత్తం డీల్స్‌లో సగభాగానికిపైగా ఆక్రమించిన విలీనాలు, కొనుగోళ్లు(ఎంఅండ్ఏ) విలువ 21 శాతం నీరసించి 4.4 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. 46 శాతం తక్కువగా 76 డీల్స్ నమోదయ్యాయి. ప్రధానంగా ఐపీవో మార్కెట్ క్షీణించడం ప్రభావం చూపింది. 2022 క్యూ1లో బిలియన్ డాలర్లు నమోదుకాగా.. తాజా సమీక్షా కాలంలో 84.4 మిలియన్ డాలర్లకు తగ్గింది. మరోపక్క క్విప్ విభాగంలో స్పైస్‌జెట్ కార్గో లాజిస్టిక్స్ బిజినెస్ 30.1 కోట్ల డాలర్లు, డేటా ప్యాటర్న్స్ 6 కోట్ల డాలర్లు చొప్పున సమీకరించాయి. అయితే 2022 క్యూ1లో 54.1 కోట్ల డాలర్ల సమీకరణతో పోలిస్తే తక్కువే. కాగా.. మొత్తం డీల్స్‌లో స్టార్టప్ రంగం వాటా 22 శాతంకాగా.. 6.9 కోట్ల డాలర్ల విలువైన 17 లావాదేవీలు జరిగాయి. అయితే ఇవి 2022 క్యూ1తో పోలిస్తే 71 శాతం క్షీణించడం గమనార్హం. -
మణిపాల్ హాస్పిటల్స్‌లో షియర్స్‌కు మెజారిటీ వాటా
న్యూఢిల్లీ: మణిపాల్ హాస్పిటల్స్‌లో మెజారిటీ వాటాలు దక్కించుకునే దిశగా షియర్స్ హెల్త్‌కేర్ ఇండియా ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. హెల్త్‌కేర్ రంగంలో ఇదే అతిపెద్ద ప్రైవేట్ ఈక్విటీ డీల్ కాగలదని పరిశ్రమవర్గాలు తెలిపాయి. డీల్‌పై వచ్చే వారం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని వివరించాయి. ఒప్పందం ప్రకారం మణిపాల్ హాస్పిటల్స్ విలువ సుమారు రూ.40,000 కోట్లు – రూ.42,000 కోట్లుగా మదింపు చేసినట్లు పేర్కొన్నాయి. ప్రమోటర్ కుటుంబం, ఇతర ఇన్వెస్టర్లయిన టీపీజీ, ఎన్ఐఐఎఫ్ నుంచి వాటాలు కొనుగోలు చేయడం ద్వారా తన వాటాను పెంచుకునేందుకు షియర్స్ ప్రయత్నాల్లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. మిగతా ఇన్వెస్టర్ల నుంచి 41 శాతం వాటాను కొనుగోలు చేయడం ద్వారా షియర్స్ తన మొత్తం వాటాను 59 శాతానికి పెంచుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వివరించాయి. మణిపాల్ గ్రూప్‌నకు 28 ఆస్పత్రులు, 8,000 పడకలు ఉన్నాయి. సింగపూర్‌కు చెందిన ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం టెమాసెక్‌కు సంబంధించిన హెల్త్‌కేర్ డెలివరీ అసెట్లను షియర్స్ నిర్వహిస్తోంది. షియర్స్‌కు మణిపాల్ హాస్పిటల్స్‌లో ప్రస్తుతం 18 శాతం వాటాలు ఉన్నాయి. దానితో పాటు అమెరికన్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టీపీజీకి 21%, భారత సార్వభౌమ వెల్త్‌ఫండ్ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఎన్ఐఐఎఫ్)కు 8 శాతం వాటాలు ఉన్నాయి. కోల్‌కతాకు చెందిన హాస్పిటల్ చెయిన్ మెడికా సినర్జీ, మెడాంటా హాస్పిటల్స్ ఆపరేటర్ గ్లోబల్ హెల్త్‌లోనూ షియర్స్ వాటాదారుగా ఉంది. -
అమెరికానే బురిడీ కొట్టించిన నిత్యానంద.. అసలు కైలాస దేశమే లేదు..
వాషింగ్టన్: వివాదాస్పద గురువు నిత్యానంద ఏకంగా అమెరికానే బురిడీ కొట్టించాడు. అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ కొద్దికాలం క్రితం భారత్ నుంచి పారిపోయిన ఈయన.. ఓ ఐలాండ్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దానికే 'యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస' అని పేరుపెట్టుకున్నాడు. ఇదే తన దేశమని ప్రకటించుకున్నాడు. ఇటీవల ఐక్యరాజ్య సమితిలో కైలాస ప్రతినిధులు పాల్గొని భారత్‌కు వ్యతిరేకంగా ప్రసంగించారు. వీరి ఫొటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అయితే 'సిస్టర్ సిటీ' పేరుతో కైలాస దేశం అమెరికాలోని నెవార్క్ నగరంతో ఒప్పందం కుదుర్చుంది. జనవరి 12న ఇందుకు సంబంధించిన ఒప్పంద ప్రతులపై ఇరువురు సంతకాలు కూడా చేశారు. దీంతో పాటు వర్జీనియా, ఓహియో, ఫ్లోరిడా సహా అమెరికాలోని 30 నగరాలు కైలసతో సాంస్కృతిక ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు ఆ దేశం తెలిపింది. కానీ అసలు కైలాస అనే దేశమే లేదని తెలుసుకున్నాక అమెరికా నగరాలు నివ్వెరపోయాయి. దీంతో నెవార్క్ నగరం కైలాసతో ఒప్పందాలు రద్దు చేసుకుంది. కనీసం ఒక దేశం ఉందో లేదో కూడా తెలుసుకోకుండా ఇలా గుడ్డిగా ఒప్పందాలు కుదుర్చుకోవడం ఏంటని నెవార్క్ అధికారులపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: పుతిన్‌పై ఐసీసీ అరెస్టు వారెంట్ -
జోరుగా కార్పొరేట్ డీల్స్..
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు నెలకొన్నా దేశీయంగా విలీనాలు, కొనుగోళ్లు (ఎంఅండ్ఏ).. ఇతరత్రా కార్పొరేట్ డీల్స్ మాత్రం గతేడాది భారీగానే జరిగాయి. కోవిడ్ పూర్వ స్థాయిని మించి 159 బిలియన్ డాలర్ల విలువ చేసే 2,103 లావాదేవీలు నమోదయ్యాయి. అంతక్రితం ఏడాదితో పోలిస్తే విలువపరంగా 29 శాతం పెరిగాయి. 2022 వార్షిక నివేదికలో పీడబ్ల్యూసీ ఇండియా ఈ అంశాలు వెల్లడించింది. దీని ప్రకారం మొత్తం డీల్స్‌లో ఎంఅండ్ఏ తరహా ఒప్పందాల వాటా అత్యధికంగా ఉంది. 20పైగా భారీ లావాదేవీలు జరిగాయి. వీటి విలువ 2021తో పోలిస్తే రెట్టింపై 107 బిలియన్ డాలర్ల స్థాయిలో నమోదైంది. అయితే, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీన డీల్ (సుమారు 60 బిలియన్ డాలర్లు)ను మినహాయిస్తే మాత్రం ఎంఅండ్ఏ ఒప్పందాల విలువ 2021తో పోలిస్తే 15 శాతం తగ్గిందని నివేదిక తెలిపింది. ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులూ 2021తో పోలిస్తే 22 శాతం తగ్గి 52 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్లు పేర్కొంది. అయితే, అంతకన్నా ముందు మూడేళ్ల వ్యవధితో పోలిస్తే విలువ, పరిమాణంపరంగాను 20 శాతం ఎక్కువగానే నమోదైనట్లు వివరించింది. ఇన్వెస్టర్లు భారత్‌ను దీర్ఘకాలిక దృష్టితో చూస్తున్నారని, ప్రస్తుత మార్కెట్ మందగమనం కాస్త కష్టతరంగానే ఉన్నా చాలా మందికి పెద్దగా ఆందోళకరమైన అంశం కాకపోవచ్చని ఈ ధోరణుల ద్వారా తెలుస్తోందని పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్నర్ దినేష్ ఆరోరా తెలిపారు. ఆకర్షణీయంగా ఆర్థిక సేవలు, టెక్నాలజీ.. దేశీయంగా ఆర్థిక సేవలు, టెక్నాలజీ, హెల్త్‌కేర్, ఇంధనం, విద్యుత్, ఇండస్ట్రియల్స్ మొదలైన విభాగాలు ఆకర్షణీయంగా ఉండగలవని నివేదిక పేర్కొంది. గతేడాది కంపెనీలు తమ స్థానాలను పటిష్టపర్చుకోవడం, పోటీని కట్టడి చేయడం, కొత్త వినూత్న విభాగాల్లోకి ప్రవేశించడం వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు పేర్కొంది. దీనితో బ్యాంకింగ్, సిమెంట్, విమానయాన రంగాల్లో కొన్ని భారీ డీల్స్ చోటు చేసుకున్నాయని నివేదిక వివరించింది. -
క్షీణించిన కొనుగోళ్లు, విలీనాల డీల్స్ ..నవంబర్‌లో ఎంత శాతం అంటే
ముంబై: గత నెలలో కొనుగోళ్లు, విలీనాల (ఎంఅండ్ఏ) డీల్స్ విలువ 37 శాతం క్షీణించింది. 2021 నవంబర్‌తో పోలిస్తే 2.2 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. గణాంకాల ఆధారంగా గ్రాంట్ థార్న్టన్ రూపొందించిన నివేదిక ప్రకారం డీల్స్ పరిమాణం సైతం 40 శాతం తగ్గి 119కు చేరాయి. అయితే ఈ ఏడాదిలోనే అత్యధికంగా పబ్లిక్ ఇష్యూలు వెల్లువెత్తాయి. గత 11 ఏళ్లలో నాలుగోసారి గరిష్టస్థాయిలో కంపెనీలు లిస్టింగ్‌ను సాధించాయి. 2022 నవంబర్‌లో ఎంఅండ్ఏ పరిమాణంలో స్టార్టప్‌లదే హవా. 21 శాతం లావాదేవీలు నమోదయ్యాయి. -
మొదట ముంబై.. చివరన చెన్నై.. మరి హైదరాబాద్?
సాక్షి, హైదరాబాద్: వేగవంతమైన పట్టణీకర నేపథ్యంలో భూమి లభ్యత అనేది అత్యంత కీలకంగా మారింది. కరోనా నేపథ్యంలో ప్రధాన నగరాలలో పరిమిత స్థాయిలో స్థల లావాదేవీలు జరిగాయి. గతేడాది జులై – సెప్టెంబర్ (క్యూ3) నుంచి ఈ ఏడాది నవంబర్ వరకు దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో 1,757 ఎకరాలలో 45 భూ ఒప్పందాలు జరిగాయని అనరాక్ డేటా తెలిపింది. ఇందులో 69 శాతం వాటా 1,205 ఎకరాలు బహుళ నివాస సముదాయాల అభివృద్ధి కోసమే జరిగాయని.. వీటిల్లో సుమారు 4.5 నుంచి 5 కోట్ల చ.అ. విస్తీర్ణంలో రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌లుంటాయని వెల్లడించింది. ఫస్ట్ ముంబై దేశంలోని 7 ప్రధాన నగరాలలో గత ఏడాది కాలంలో 1,205 ఎకరాలలో రెసిడెన్షియల్ డెవలప్మెంట్ కోసం ప్రత్యేకంగా 28 భూ ఒప్పందాలు జరిగాయి. అత్యధికంగా 64 శాతం వాటాతో ముంబైలో 11 డీల్స్‌లో 768 ఎకరాల లావాదేవీలు జరిగాయి. 12 శాతం వాటాతో 4 డీల్స్‌లో ఎన్సీఆర్లో 150 ఎకరాల ఒప్పందాలున్నాయి. ఇందులో గుర్గావ్లో 77 ఎకరాలలో మూడు డీల్స్, నోయిడాలో 73 ఎకరాల ఒక డీల్ జరిగింది. కోల్‌కతాలో జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ (జేడీఏ) ప్రాతిపదికన 92 ఎకరాలలో రెండు ఒప్పందాలు జరిగాయి. రెండు భూ ఒప్పందాలలో 78 ఎకరాల లావాదేవీలతో హైదరాబాద్ నాలుగో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత బెంగళూరులో ఐదు డీల్స్‌లో 59 ఎకరాలు, పుణేలో మూడు డీల్స్‌లో 42 ఎకరాలు, చెన్నైలో ఒక డీల్‌లో 16 ఎకరాల లావాదేవీలు జరిగాయి. ఏ డెవలపర్లంటే.. గోద్రెజ్ ప్రాపర్టీస్, సన్‌టెక్ రియాల్టీ, ఆషియానా హౌసింగ్, మహీంద్రా లైఫ్‌స్పేసెస్, ఎం3ఎం గ్రూప్, రన్వాలా డెవలపర్స్ నివాస సముదాయాల తో పాటూ పారిశ్రామిక, వాణిజ్యం, డేటా సెంటర్లు, రిటైల్ డెవలప్మెంట్ కోసం భూ ఒప్పందాలు జరిపారు. ఆర్ధిక స్థోమత ఉన్న చాలా మంది డెవలపర్లు ప్రధాన నగరాలలోని కీలకమైన ప్రాంతాలలో ల్యాండ్ బ్యాంక్‌ను ఏర్పరుచుకునేందుకు డీల్స్‌ను జరిపారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లపైనే.. కరోనా, నగదు లేమి కారణంగా గత 7–8 నెలలుగా పరిమిత స్థాయిలో భూ ఒప్పందాలు జరిగాయని అనరాక్ గ్రూప్ వైస్ చైర్మన్ సంతోష్ కుమార్ తెలిపారు. మరీ ముఖ్యంగా గత 3–4 నెలలుగా పరిశ్రమ స్టాండ్‌స్టిల్ దశకు చేరుకుందని పేర్కొన్నారు. ఏడాది కాలం పాటు డెవలపర్లు రుణాలను తీర్చడం లేదా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడానికే ఇష్టపడతారని ఆయన అభిప్రాయపడ్డారు. గతేడాది క్యూ3 నుంచి కార్యకలాపాలు పునఃప్రారంభమయ్యాయని.. దీంతో గతంలో తమ వద్దే స్థలాలను అట్టిపెట్టుకున్న చాలా మంది భూ యజమానులు తిరిగి విక్రయానికి పెట్టారని పేర్కొన్నారు. దీంతో గతేడాది ధరల కంటే కొంచెం ఎక్కువ లేదా అదే ధరలకు పరిమిత స్థాయిలో భూ ఒప్పందాలు జరిగాయని వివరించారు. ఏ విభాగంలో ఎన్ని ఒప్పందాలంటే.. ► 1,757 ఎకరాలలో 45 భూ ఒప్పందాలు జరగగా.. ఇందులో ఆరు డీల్స్‌లో 411 ఎకరాలలో లాజిస్టిక్స్, పారిశ్రామిక పార్క్‌ల ఒప్పందాలున్నాయి. గుర్గావ్లో రెండు డీల్స్ ద్వారా 275 ఎకరాలు, చెన్నైలో 2 డీల్స్‌లో 83 ఎకరాలు, హౌరాలో 31 ఎకరాలలో ఒకటి, ముంబైలో 22 ఎకరాలలో మరో భూ ఒప్పందం జరిగింది. ► 58 ఎకరాలలో మిశ్రమ అభివృద్ధి కోసం మూడు భూ ఒప్పందాలు జరిగాయి. ముంబై, చెన్నై, గుర్గావ్లో ఒక్కోటి చొప్పున డీల్స్ జరిగాయి. ► 44 ఎకరాలలో వాణిజ్య అభివృద్ధి కోసం ఐదు ఒప్పందాలు జరిగాయి. ఇందులో బెంగళూరులో మూడు, ముంబైలో రెండు డీల్స్ ఉన్నాయి. ► నవీ ముంబైలో డేటా సెంటర్ల ఏర్పాటు కోసం 30 ఎకరాల లావాదేవీలు జరిగాయి. 9 ఎకరాలలో రిటైల్ అభివృద్ధి కోసం రెండు భూ ఒప్పందాలు జరిగాయి. చదవండి: హైదరాబాద్‌లో అమ్ముడవ్వని ఇళ్లు 12 వేలు! -
ఆగస్ట్‌లో డీల్స్ జూమ్
ముంబై: గత నెల(ఆగస్ట్)లో దేశీ కార్పొరేట్ ప్రపంచంలో డీల్స్ భారీగా ఎగశాయి. మొత్తం 219 డీల్స్ జరిగాయి. 2005 తదుపరి ఇవి అత్యధికంకాగా.. 2020 ఆగస్ట్‌తో పోల్చినా రెట్టింపయ్యాయి. వీటి విలువ 8.4 బిలియన్ డాలర్లు. కన్సల్టెన్సీ సంస్థ గ్రాంట్ థార్న్టన్ అందించిన వివరాలివి. అయితే ఈ(2021) జులైతో పోలిస్తే లావాదేవీలు పరిమాణంలో 21 శాతం ఎగసినప్పటికీ విలువలో 36 శాతం క్షీణించాయి. ఇందుకు విలీనాలు, కొనుగోళ్ల(ఎంఅండ్ఏ) విభాగంలో యాక్టివిటీ ఆరు రెట్లు పడిపోవడం కారణమైంది. ఆగస్ట్‌లో ప్రధానంగా ప్రయివేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ ద్వారానే అత్యధిక డీల్స్ నమోదయ్యాయి. 182 లావాదేవీల ద్వారా 7.6 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశాయి. దేశీ కంపెనీలు, యూనికార్న్(స్టార్టప్‌లు) ఇందుకు వేదికయ్యాయి. లాభదాయక అవకాశాలు, ఆర్థిక రికవరీపై విశ్వాసం, పరిశ్రమల స్థాపనలో నైపుణ్యం వంటి అంశాలు ప్రభావం చూపాయి. యూనికార్న్‌ల స్పీడ్ పారిశ్రామిక పురోగతి, బలపడుతున్న డిమాండ్, ఆర్థిక రికవరీ నేపథ్యంలో ఇకపై సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశమున్నట్లు గ్రాంట్ థార్న్టన్ నిపుణులు శాంతి విజేత పేర్కొన్నారు. వ్యాక్సినేషన్లు, విధానాల మద్దతు, ప్రపంచ దేశాల పురోభివృద్ధి ఇందుకు మద్దతుగా నిలవనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఎంఅండ్ఏ విభాగంలో 86.7 కోట్ల డాలర్ల విలువైన 37 డీల్స్ జరిగాయి. 2020 ఆగస్ట్‌లో 90.8 కోట్ల డాలర్ల విలువైన 30 లావాదేవీలు నమోదయ్యాయి. టెక్, ఎడ్యుకేషన్, ఫార్మా, ఎనర్జీ రంగాలలో అధిక డీల్స్ జరిగాయి. గత నెలలో ఏడు స్టార్టప్‌లో యూనికార్న్ హోదాను అందుకున్నాయి. బిలియన్ డాలర్ల విలువను సాధించిన స్టార్టప్‌లను యూనికార్న్‌లుగా వ్యవహరించే సంగతి తెలిసిందే. దేశీ స్టార్టప్ వ్యవస్థ 115 డీల్స్ ద్వారా 1.4 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకట్టుకుంది. -
3 శాతం పెరిగి, జులైలో కార్పొరేట్ డీల్స్ రూ.97,680 కోట్లు
ముంబై: దేశీయంగా కార్పొరేట్ డీల్స్ (ఒప్పందాలు) జూలై నెలలో 3 శాతం పెరిగి 13.2 బిలియన్ డాలర్లు (రూ.97,680 కోట్లు)గా నమోదైనట్టు గ్రాంట్ థార్న్టన్ భారత్ ఓ నివేదిక రూపంలో తెలిపింది. అంతక్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే 3 శాతం పెరగ్గా.. ఈ ఏడాది జూన్ నెలతో పోలిస్తే 6 శాతం పురోగతి కనిపించింది. కరోనా తర్వాత కంపెనీలు తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునే వ్యూహంలో భాగంగా చౌకగా నిధులు సమీకరించడంతోపాటు.. నగదు నిల్వలను ఖర్చు పెట్టడంపై దృష్టి సారించినట్టు గ్రాంట్ థార్న్టన్ పార్ట్నర్ శాంతి విజేత తెలిపారు. రానున్న నెలల్లోనూ ఒప్పందాలు సానుకూలంగానే ఉంటాయని అంచనా వేశారు. జూలై నెలలో విలీనాలు, కొనుగోళ్లకు సంబంధించి (ఎంఅండ్ఏ) 36 ఒప్పందాలు నమోదయ్యాయి. వీటి విలువ 5.6 బిలియన్ డాలర్లుగా ఉంది. సంఖ్యా పరంగా చూస్తే 13 శాతం పెరిగాయి. కానీ విలువ పరంగా ఎంఅండ్ఏ ఒప్పందాల విలువ 37 శాతం తగ్గింది. ప్రైవేటు ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ పెట్టుబడులకు సంబంధించి 145 ఒప్పందాలు నమోదు కాగా.. వీటి విలువ 7.5 బిలియన్ డాలర్లుగా ఉంది. ఐటీ సొల్యూషన్స్, ఈ కామర్స్, కన్జ్యూమర్ రిటైల్, డిజిటల్ హెల్త్‌కేర్, ఫిన్‌టెక్, ఎడ్టెక్ కంపెనీల విభాగాల్లో లావాదేవీలు ఎక్కువగా నమోదయ్యాయి. ఈక్విటీ మార్కెట్లు పెరగడం, నగదు లభ్యత అధికంగా ఉండడం, కరోనా కారణంగా ప్రయోజనం పొందే రంగాల పట్ల ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరగడం సానుకూలించినట్టు గ్రాంట్ థార్న్టన్ పేర్కొంది. చదవండి: భవిష్యత్తులో ఏం జరుగుతుందో, కనిపెట్టే పనిలో అమెరికా -
ప్రథమార్ధంలో డీల్స్ జోరు
న్యూఢిల్లీ: కోవిడ్–19 సెకండ్ వేవ్ ప్రభావాలు భారత్‌లో ఎలా ఉన్నప్పటికీ కార్పొరేట్ రంగంలో డీల్స్ జోరు కొనసాగుతోంది. ఈ ఏడాది ప్రథమార్ధంలో దాదాపు 41 బిలియన్ డాలర్ల విలువ చేసే ఒప్పందాలు కుదరడం ఇందుకు నిదర్శనం. కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ ఇండియా నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం జనవరి 1 నుంచి జూన్ 15 మధ్య కాలంలో దేశీ సంస్థలు 710 లావాదేవీలకు సంబంధించి 40.7 బిలియన్ డాలర్ల విలువ చేసే ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. విలువపరంగా గతేడాది ద్వితీయార్ధంతో పోలిస్తే ఇది రెండు శాతం అధికం. జనవరి–జూన్ మధ్య కాలంలో ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) లావాదేవీలు ఆల్‌టైమ్ గరిష్టమైన 26.3 బిలియన్ డాలర్లకు చేరాయి. గత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంతో పోలిస్తే ఇది 25 శాతం ఎక్కువ. బిలియన్ డాలర్ల స్థాయి కొనుగోళ్లు, స్టార్టప్‌లు పలు విడతలుగా నిధులు సమీకరించడం తదితర అంశాలు .. డీల్స్ జోరుకు దోహదపడ్డాయి. అనిశ్చితి నెలకొన్న ప్రస్తుత తరుణంలో డిజిటల్ .. టెక్నాలజీ విభాగంలోనూ, పర్యావరణ..సామాజిక..గవర్నెన్స్ (ఈఎస్జీ) విభాగంలోనూ పెట్టుబడులు గణనీయంగా వస్తున్నాయని పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్నర్ దినేష్ ఆరోరా తెలిపారు. ఇతర విశేషాలు.. ► ప్రథమార్ధంలో 6.2 బిలియన్ డాలర్ల విలువ చేసే విలీన, కొనుగోళ్ల (ఎంఅండ్ఏ) ఒప్పందాలు కుదిరాయి. ► అదానీ గ్రీన్ ఎనర్జీ సుమారు 3.5 బిలియన్ డాలర్లకు ఎస్బీ ఎనర్జీ ఇండియాను, ఐటీ దిగ్గజం విప్రో దాదాపు 1.45 బిలియన్ డాలర్లు పెట్టి బ్రిటన్‌కు చెందిన క్యాప్కోను కొనుగోలు చేశాయి. ► ఇవి కాకుండా విదేశాలకు చెందిన సంస్థల కొనుగోళ్లకు సంబంధించి 26 డీల్స్ కుదిరాయి. వీటి విలువ 385 మిలియన్ డాలర్లు. ► టెక్నాలజీ రంగంలో పీఈ పెట్టుబడులు అత్యధికంగా వచ్చాయి. ► 2021లో 16 స్టార్టప్‌లు..యూనికార్న్ (1 బిలియన్ డాలర్ల విలువ చేసే సంస్థలు) క్లబ్లో చేరాయి. -
మారిన ఐటీ కంపెనీల ఫోకస్
ముంబై, సాక్షి: సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజాలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్), ఇన్ఫోసిస్, విప్రో కొద్ది రోజులుగా యూరోపియన్ మార్కెట్లవైపు దృష్టి సారించాయి. ఇటీవల యూరోపియన్ ప్రాంతాల నుంచి భారీ డిల్స్‌ను పొందడంతో రూటు మార్చినట్లు టెక్ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా దేశీ ఐటీ కంపెనీలు యూఎస్ నుంచే అత్యధిక కాంట్రాక్టులు సంపాదిస్తుంటాయి. దీంతో ఆదాయంలో యూఎస్ 70 శాతం వాటా వరకూ ఆక్రమిస్తుంటుంది. అయితే ఇటీవల దేశీ కంపెనీలు యూరోపియన్ ప్రాంత కంపెనీలను కొనుగోలు చేస్తుండటం కూడా వ్యూహాల మార్పునకు కారణమవుతున్నట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. (టాటా క్లిక్‌లో టాటా గ్రూప్ భారీ పెట్టుబడులు) కోవిడ్-19 ఎఫెక్ట్ ఏడాది కాలంగా ప్రపంచాన్ని.. ప్రధానంగా యూరోపియన్ దేశాలను కోవిడ్-19 మహమ్మారి వణికిస్తోంది. దీంతో ఔట్‌సోర్సింగ్‌కు అంతగా ప్రాధాన్యత ఇవ్వని యూరోపియన్ మార్కెట్లు ఇతర దేశాలవైపు దృష్టిసారించాయి. ఫలితంగా దేశీ సాఫ్ట్వేర్ సేవల దిగ్గజాలకు అవకాశాలు పెరిగినట్లు టెక్ నిపుణులు చెబుతున్నారు. దీనికితోడు కోవిడ్-19 సంక్షోభం కారణంగా విక్రయానికి వచ్చిన అక్కడి కంపెనీలను సైతం కొనుగోలు చేసేందుకు సన్నద్ధమయ్యాయి. గత కొద్ది నెలలుగా చూస్తే టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో పలు చిన్న కంపెనీలను సొంతం చేసుకున్నాయి. అంతేకాకుండా సాఫ్ట్వేర్ సేవలలు అందించేందుకు భారీ డిల్స్‌ను సైతం కుదుర్చుకున్నాయి. ఈ బాటలో వచ్చే ఆర్థిక సంవత్సరం(2021-22)లోనూ ఇతర కంపెనీల కొనుగోళ్లు, లేదా కాంట్రాక్టులను పొందేందుకు ప్రయత్నించే వీలున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. (డిక్సన్ టెక్- ఐడీఎఫ్సీ ఫస్ట్.. భల్లేభల్లే) జర్మన్ జోష్ యూరోప్‌లో ఇటీవల జర్మనీ నుంచి దేశీ కంపెనీలు మెగా డీల్స్‌ను కుదుర్చుకున్నాయి. గతంలో ఎప్పుడూ ఔట్‌సోర్సింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వని జర్మన్ కంపెనీలు కరోనా కల్లోలంతో వ్యూహాలు మార్చుకున్నాయి. దీంతో ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో తదితరాలకు అవకాశాలు పెరిగినట్లు నిపుణులు పేర్కొన్నారు. కొద్ది నెలలుగా యూరోపియన్ ప్రాంత ఆదాయంలో వార్షిక ప్రాతిపదికన 20 శాతం వృద్ధిని సాధిస్తున్నట్లు టీసీఎస్ సీవోవో ఎన్జీ సుబ్రమణ్యం తెలియజేశారు. ఇది కొనసాగే వీలున్న్లట్లు అంచనా వేశారు. గతేడాది నవంబర్‌లో డాయిష్ బ్యాంక్ నుంచి పోస్ట్‌బ్యాంక్ సిస్టమ్స్‌ను టీసీఎస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తద్వారా 1,500 మంది జర్మన్ ఉద్యోగులకు శిక్షణ, తదితర సేవలను అందిస్తోంది. ఇదే నెలలో బీమా దిగ్గజం ప్రుడెన్షియల్ ఫైనాన్షియల్ నుంచి ప్రామెరికా సిస్టమ్స్ ఐర్లాండ్‌ను సైతం కొనుగోలు చేసింది. ఈ కొనుగోలు వల్ల వీసాల సమస్యలున్న ప్రాంతాలలో 2,500 మంది ఉద్యోగులను వెనువెంటనే వినియోగించుకునేందుకు వీలు చిక్కినట్లు సుబ్రమణ్యం చెప్పారు. ఇతర కంపెనీల కొనుగోళ్ల నేపథ్యంలో టీసీఎస్ 2022 ఆదాయ అంచనాలలో భారీగా వృద్ధిని ఆశిస్తున్నట్లు టెక్ నిపుణులు పేర్కొంటున్నారు. -
అమెరికా, చైనా చలో చలో..
బీజింగ్ : కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్నప్పటనుంచి అమెరికా, చైనాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినప్పటికీ తాజాగా మొదటిదశ వాణిజ్య ఒప్పందంలో ఇరుదేశాలు ముందడుగు వేశాయి. దీనికి సంబంధించి ఇరు దేశాల విదేశాంగ మంత్రులు ఫోన్లో ముచ్చటించారు. దిగుమతులు, ఎగుమతుల అంశంపై ఒప్పందాన్ని కొనసాగించేందుకు మొగ్గుచూపారు. ఇక్కడ చైనానే ఒక మెట్టుదిగినట్లు కనబడుతోంది. చైనాపై ఒత్తిడి తెచ్చేందుకు తమకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తామని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో చైనా కాస్త వెనక్కి తగ్గింది. ఇరుదేశాల మధ్య ఆర్థికపురోగతికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని బీజింగ్ ప్రకటన చేసింది. ఈ క్రమంలోనే చర్చలకు ముందుకొచ్చి అమెరికాతో సంప్రదింపులు జరిపింది. జనవరిలోనే యూఎస్, చైనా దేశాలు మొదటిదశ ఆర్థిక ఒప్పందంపై సంతకాలు చేశాయి. అయితే కరోనా వైరస్ సృష్టించిన కల్లోలంతో అమెరికా బాహాటంగానే చైనాపై అగ్గిమీద గుగ్గిలమయ్యింది. కావాలనే వైరస్‌ను ప్రపంచానికి అంటగట్టారంటూ పలు విమర్శలు చేసింది. కరోనా వైరస్‌పై అప్రమత్తం చేయడంలో చైనా విఫలమైందని, ఆ దేశం చర్యలపట్ల అసంతృప్తిగా ఉన్నానని ట్రంప్ రెండో దశ వాణిజ్య చర్చలకు ట్రంప్ విముఖత చూపారు. (అవసరమైతే చైనాతో అన్నీ బంద్: ట్రంప్) అంతేకాకుండా చైనా మాతృసంస్థ అయిన టిక్‌టాక్‌ను త్వరలోనే బ్యాన్ చేస్తాం అని అమెరికా ప్రకటించింది. టిక్‌టాక్ యాప్ వల్ల జాతీయ భద్రతకు ముప్పు ఉందని వాషింగ్టన్ మీడియా తమ ప్రకటనల్ని సమర్థించుకుంది.అయితే ఈ చర్యలను చైనా ప్రభుత్వం తీవ్రంగా విమర్శించింది. కావాలనే అమెరికా అణచివేత ధోరణి అవలంభిస్తుందని ఆరోపించింది. తదనంతరం ఆరోపణలు, ప్రత్యారోపణలు కాస్తా ట్రేడ్ వార్‌కు దారితీసిన సంగతి తెలిసిందే. చైనా ఉత్పత్తులపై అధిక సుంకాలు వేసిన అమెరికాపై చైనా కూడా అదే ధోరణి అవలంభించింది. అవసరమనుకుంటే చైనాతో అన్ని వ్యాపార సంబంధాలు తెంచుకుంటామని ట్రంప్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇరుదేశాలు మొదటిదశ ఆర్థిక ఒప్పందాలపై నిర్మాణాత్మక మార్పులకు శ్రీకారం చుట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. (మరో నాలుగేళ్లు ట్రంప్‌కు అవకాశమివ్వండి) -
వాల్‌మార్ట్‌తో టీఐహెచ్‌సీ ఒప్పందం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తెలంగాణలో తయారీ రంగంలోని ఖాయిలా పరిశ్రమలను పునరుద్దరించేందుకు ఏర్పాటు చేసిన తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ (టీఐహెచ్‌సీ) అమెరికాకు చెందిన రిటైల్ బహుళ జాతి కంపెనీ వాల్‌మార్ట్‌తో ఒప్పందం చేసుకోనుంది. టీఐహెచ్సీలోని ఎంఎస్ఈలకు ఆన్లైన్ వేదికను అందించడంతో పాటు మార్కెటింగ్ అవకాశాలను కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశమని టీఐహెచ్‌సీ అడ్వైజర్ డాక్టర్ బి. యెర్రం రాజు ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు తెలిపారు. ‘‘రూ.100 కోట్ల సోషల్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ కోసం పలు విదేశీ ఇన్వెస్టర్లతో చర్చలు జరుగుతున్నాయి. రెండేళ్ల లాకిన్ పీరియడ్‌తో 7 శాతం డివిడెండ్‌ను కేటాయిస్తాం. వచ్చే 3 నెలల్లో డీల్ క్లోజ్ చేస్తామని’’ ఆయన పేర్కొన్నారు. కాగా, ఇప్పటివరకు రాష్ట్రంలో ఖాయిలా పడ్డ 43 ఎంఎస్ఎంఈలను పునరుద్ధరించామని... వీటి ద్వారా సుమారు 1,100 మందికి ఉద్యోగ అవకాశాలొచ్చాయని చెప్పారు. ‘ప్రస్తుతం మరొక 12 ఎంటర్‌ప్రైజ్‌లు పునరుద్ధ్దరణ జాబితాలో ఉన్నాయి. మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా నారీ పథకాన్ని ఏర్పాటు చేశాం. వార్షిక వడ్డీ రేటు 9 శాతంగా ఉంటుంది. గరిష్ట రుణం రూ.25 లక్షలు’ అని ఆయన వివరించారు. -
ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్, ఆఫర్లు
సాక్షి, ముంబై: ఆన్లైన్ రీటైలర్ ఫ్లిప్‌కార్ట్ మరోసారి బిగ్ షాపింగ్ డేస్ సేల్‌ను ప్రకటించింది. బిగ్ షాపింగ్ డేస్ సేల్ -2019 లో భాగంగా స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఇతర గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్లు , ఇతర ఆఫర్లను అందించడానికి సిద్ధమవుతోంది. డిసెంబర్ 1 ఆదివారం నుండి ప్రారంభమయ్యే డిసెంబర్ 5 వరకు ఐదు రోజుల పాటుకొనసాగనుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు నవంబర్ 30, శనివారం రాత్రి 8 గంటల నుండే కొనుగోళ్లకు ముందస్తు అనుమతి లభిస్తుంది. ముఖ్యంగా రియల్‌మి, శాంసంగ్ గెలాకసీ, ఆపిల్ ఐ ఫోన్లపై ఆఫర్లను తీసుకొస్తోంది. టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై 75 శాతం వరకు తగ్గింపును కూడా అందిస్తున్నట్టు ఫ్లిప్‌కార్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే ల్యాప్‌టాప్‌లు, కెమెరాలపై 80 శాతం తగ్గింపు లభ్యం. డిఎస్ఎల్ఆర్, డిజిటల్ కెమెరాలపై రూ.10,000 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్. దీంతోపాటు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డు ద్వారా చేసిన కొనుగోళ్లపై 10 శాతం తక్షణ తగ్గింపును ఆఫర్ చేస్తోంది. ప్రధానంగా బిగ్ షాపింగ్ డేస్ అమ్మకం సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ "బ్లాక్ బస్టర్ డీల్స్" కూడా అందించనుంది. ఉదయం 12, 8 గంటలకు, సాయంత్రం 4 గంటలకు అదేవిధంగా తెల్లవారుజామున 2 గంటలకు "రష్ అవర్స్" లో స్పెషల్ సేల్ నిర్వహించనుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్ లో ప్రధానంగా రియల్‌మి 5, రియల్మే ఎక్స్, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 9, గెలాక్సీ ఎస్ 9 ప్లస్, గూగుల్ పిక్సెల్ 3 ఎ, ఆపిల్ ఐఫోన్ 7, ఆసుస్ 5 జెడ్ వంటి స్మార్ట్ఫోన్లపై తగ్గింపును అందించనుంది. మొబైల్ ఫోన్లపై ఆఫర్లు రియల్‌మి5 : అసలు ధర రూ. 9,999 డిస్కౌంట్ ధర రూ. 8,999 రియల్‌మి ఎక్స్: అసలు ధర రూ. 16,999 ఆఫర్ ధర రూ. 15,999 శాంసంగ్ గెలాక్సీ ఎస్ 9 : అసలు ధర రూ. 29,999 డిస్కౌంట్ ధర రూ. 27,999 గెలాక్సీ ఎస్ 9 ప్లస్ : అసలు ధర రూ. 37,999 డిస్కౌంట్ ధర రూ. 34,999 గూగుల్ పిక్సెల్ 3 ఎ : అసలు ధర రూ. 34,999 ఆఫర్ ధర రూ. 29,999 ఆపిల్ ఐఫోన్ 7: అసలు ధర రూ. 27,999 ఆఫర్ ధర రూ. 24,999 ఆసుస్ 5 జెడ్ : అసలు ధర రూ. 16,999 ఆఫర్ ధర రూ. 15,999 -
కాఫీ డేకు భారీ ఊరట
సాక్షి, ముంబై : కెఫే కాఫీడే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ ఆత్మహత్య అనంతరం భారీగా నష్టపోయిన కాఫీ డే షేర్లు సోమవారం భారీగా పుంజుకున్నాయి. ఒకవైపు రుణ భారాన్ని తగ్గించుకోనే చర్యలు, మరోపక్క పానీయాల గ్లోబల్ కంపెనీ కోక కోలా వాటాను కొనుగోలు చేయవచ్చన్న అంచనాల నేపథ్యంలో కాఫీ డే ఎంటర్ప్రైజెస్ కౌంటర్లో జోష్ నెలకొంది. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో 5 శాతానికిపైగా లాభపడి రూ. 65.80 వద్ద అప్పర్ సర్క్యూట్ అయింది. సిద్ధార్థ అదృశ్యం, మరణానంతరం షేరు ధర మూడువారాల్లో (జులై 26 నుంచి) 68 శాతం పతనమైంది. పానీయాల రిటైల్ స్టోర్ల కంపెనీ కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ రూ. 2,400 కోట్ల రుణాలను తిరిగి చెల్లించనున్నట్లు తాజాగా వెల్లడించింది. దీంతో గ్రూప్ రుణ భారం ఆమేర తగ్గనునందని వివరించింది. జులై చివరికల్లా గ్రూప్ రుణభారం రూ.4970 కోట్లుగా నమోదైనట్లు తెలియజేసింది. దీనిలో కాఫీడే రుణభారాన్ని రూ.3472 కోట్లుగా పేర్కొంది. ప్రధానంగా బెంగళూరులోని గ్లోబల్ విలేజ్ పార్క్‌ను పీఈదిగ్గజం బ్లాక్‌స్టోన్‌కు విక్రయించడం ద్వారా ఈ రుణభారాన్ని తగ్గించుకోనున్నట్టు వెల్లడించిన సంగతి తెలిసిందే. మరోపక్క కంపెనీలో వాటాను విక్రయించేందుకు గ్లోబల్ దిగ్గజం కోక కోలాతో కాఫీ డేలో తిరిగి చర్చలు ప్రారంభించినట్లు మీడియా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. అయితే ఈ అంశంపై రెండు కంపెనీలూ అధికారికంగా స్పందించాల్సి వుంది. -
పేటీఎం ఆఫర్లు: ఐఫోన్లపై క్యాష్‌బ్యాక్
బ్లాక్ ఫ్రైడే సందర్భంగా పేటిఎం మాల్ ఐఫోన్లపై డిస్కౌంట్ని ప్రకటించింది. దాదాపు 20 డివైస్‌లపై క్యాష్‌బ్యాక్‌ను కొనుగోలుదారులు పొందనున్నారు. మోడల్‌ను బట్టి రూ.4000 నుంచి 8000ల వరకూ క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. అదనంగా ఎస్ బ్యాంక్ నుంచి కొనుగోలు చేస్తే మరో 10 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ ఆఫర్లు ప్రధానంగా... ఐఫోన్ 7ప్లస్ 128 జీబీ రూ. 8000 క్యాష్‌బ్యాక్ ఐఫోన్ 7 32జీబీ రూ. 6750 క్యాష్‌బ్యాక్ ఐఫోన్ 7 128 జీబీ రూ. 6500 క్యాష్‌బ్యాక్ ఐఫోన్ 7ప్లస్ 32 జీబీ రూ. 8000 క్యాష్‌బ్యాక్ దీంతోపాటు మరి కొన్ని స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలపై కూడా భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. అలాగే ఎస్‌బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 10శాతం క్యాష్ బ్యాక్‌ను లభ్యం. మరింత సమాచారం కోసం పేటీఎం మాల్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. -
హీరో ఎలక్ట్రిక్ సైకిళ్లు జపాన్ కంపెనీలతో ఒప్పందాలు
న్యూఢిల్లీ: హీరో సైకిల్స్ కంపెనీ ఎలక్ట్రిక్ సైకిళ్ల తయారీ కోసం జపాన్‌కు చెందిన రెండు కంపెనీలతో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. జపాన్‌కు చెందిన యమహా మోటార్ కంపెనీ, మిత్సు అండ్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నామని హీరో సైకిల్స్ తెలిపింది. ఎలక్ట్రిక్ సైకిళ్ల తయారీ, టెక్నాలజీ, మార్కెటింగ్ కోసం ఈ రెండు కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు హీరో మోటార్స్ కంపెనీ (హెచ్‌ఎమ్‌సీ) చైర్మన్ పంకజ్ ఎమ్ ముంజాల్ వెల్లడించారు. ఈ భాగస్వామ్యం నుంచి తొలి ఉత్పత్తిగా హీరో బ్రాండ్ కింద హై ఎండ్ ఎలక్ట్రిక్ మౌంటెన్ బైక్‌ను (ఈ–ఎమ్‌టీబీ) అందించనున్నామని వివరించారు. లూథియానాలో సైకిల్ వ్యాలీ... హెచ్‌ఎమ్‌సీ గ్రూప్‌లో ప్రధాన కంపెనీ అయిన హీరో సైకిల్స్ లూధియానాలో సైకిల్ వ్యాలీని ఏర్పాటు చేస్తామని ఇటీవలే ప్రతిపాదించింది. సైకిళ్ల పరిశ్రమకు కావలసిన అన్ని వస్తువులను, సేవలను సరఫరా చేసే లక్ష్యంతో ఈ సైకిల్ వ్యాలీ ప్రాజెక్ట్‌ను ఈ కంపెనీ అందుబాటులోకి తేనుంది. ఈ ప్రాజెక్ట్‌కు కీలక పెట్టుబడిదారుగా హీరో సైకిల్స్ వ్యవహరించనుంది. -
రూ.3,000 కోట్లు సమీకరించిన ఆర్ఐఎల్
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) నాన్ కన్వర్టబుల్ రెడీమబుల్ డిబెంచర్ల జారీ ద్వారా రూ.3,000 కోట్లను సమీకరించి నట్టు ప్రకటించింది. 10 ఏళ్ల కాలానికి గడువు తీరే అన్ సెక్యూర్డ్, నాన్ కన్వర్టబుల్ రెడీమబుల్ డిబెంచర్లపై 8.95 శాతం వడ్డీని ఆఫర్ చేసినట్టు స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు ఆర్ఐఎల్ తెలిపింది. 2028 నవంబర్ 9న ఇవి గడువు తీరుతాయని పేర్కొం ది. ఇంధనం, పెట్రోకెమికల్, రిటైల్, టెలికం విభాగాల్లో గడిచిన ఐదేళ్ల కాలంలో రిలయన్స్ 30 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టిం ది. బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో బలపడేందుకు గాను హాత్వే కేబుల్ అండ్ డేటాకామ్, డెన్ నెట్‌వర్క్స్‌లో మెజారిటీ వాటాల కొనుగోలుకు గత నెలలో ఒప్పందాలు కూడా చేసుకుంది.