న్యూఢిల్లీ: టెక్నాలజీ సర్వీసుల రంగంలో ఒప్పందాల జోరు తగ్గింది. ఈ ఏడాది (2023) తొలి త్రైమాసికంలో లావాదేవీల సంఖ్య 150కి పరిమితమైంది. గతేడాది ఇదే వ్యవధిలో 270 పైగా, 2021లో 220 పైచిలుకు ఒప్పందాలు కుదిరాయి. కన్సల్టెన్సీ ఈవై, ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ సంయుక్తంగా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
దీని ప్రకారం 2022లో విలీనాలు, కొనుగోళ్ల డీల్స్, ప్రైవేట్ ఈక్విటీ ఒప్పందాలు 57 బిలియన్ డాలర్ల స్థాయిలో నమోదయ్యాయి. 2020తో పోలిస్తే (27 బిలియన్ డాలర్లు) ఇది రెట్టింపు కావడం గమనార్హం. అయితే, గతేడాది ఆఖరులో నుంచి ఈ ఏడాది తొలి త్రైమాసికం వరకు డీల్స్ నెమ్మదించినట్లు నివేదిక తెలిపింది.
అయినప్పటికీ రాబోయే రోజుల్లో మధ్య స్థాయి కంపెనీల మధ్య లావాదేవీలు మెరుగ్గానే ఉండవచ్చని భావిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది మిగతా కాలంలో రిస్కులను తగ్గించుకునే ఉద్దేశంతో ఒప్పందాలను కుదుర్చుకునేటప్పుడు సంస్థలు మరింతగా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉందని వివరించింది. నివేదికలోని మరిన్ని అంశాలు..
►2022లో ఐటీ సర్వీసులు, బీపీఎం (బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్), ఈ–ఆర్‌అండ్‌డీ (ఇంజినీరింగ్, ఆర్‌అండ్‌డీ) తదితర విభాగాల్లో 947 డీల్స్ కుదిరాయి. అయిదేళ్లలో ఇదే అత్యధికం.
► 2020తో పోలిస్తే 2022లో మొత్తం ఒప్పందాల విలువ, పరిమాణం రెట్టింపైంది.
►ఐటీ సర్వీసుల ఒప్పందాల్లో ప్రైవేట్ ఈక్విటీ సంస్థల భాగస్వామ్యం 2020తో పోలిస్తే 2022లో 2.5 రెట్లు పెరిగింది. భారీ ఒప్పందాల సెగ్మెంట్లో (500 మిలియన్ డాలర్ల పై స్థాయి) 62.5 శాతం వాటా దక్కించుకుంది.
► అధునాతన టెక్నాలజీలను దక్కించుకునే ఉద్దేశంతో ఐటీ సర్వీసుల కంపెనీలు ఎక్కువగా ఐపీ/ప్రోడక్ట్ సంస్థల్లో వాటాలను కొనుగోలు చేయడంపై ఆసక్తి చూపుతున్నాయి.
►భారీ సంస్థలు ప్రధానంగా ఐవోటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్), ఏఆర్/వీఆర్ (ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ), హైపర్–ఆటోమేషన్, కోడింగ్ తక్కువగా ఉండే లేదా అసలు కోడింగ్ అవసరం ఉండని కొత్త టెక్నాలజీలపై ఆసక్తిగా ఉంటున్నాయి.
►ప్రస్తుతం ఆర్థిక అనిశ్చితులు ఎలా ఉన్నప్పటికీ కంపెనీల డిజిటల్ పరివర్తన ప్రక్రియ పలు దశాబ్దాల పాటు కొనసాగనుంది. దీనిపై సంస్థలు బిలియన్ల కొద్దీ డాలర్ల పెట్టుబడులు ఇన్వెస్ట్ చేయనున్నాయి. తద్వారా రాబోయే రోజుల్లోనూ అధునాతన ఐటీ సొల్యూషన్స్‌కు డిమాండ్ భారీగానే ఉండనుంది.
►గడిచిన 24 నెలల్లో కంపెనీల పెట్టుబడుల ధోరణుల్లో గణనీయంగా మార్పులు వచ్చాయి. సంస్థలు డిజిటల్, వ్యాపార పరివర్తన మీద ఇన్వెస్ట్ చేయడంపై దృష్టి పెడుతున్నాయి.
► ప్రస్తుతం తయారీ, ఆటోమోటివ్, సరఫరా వ్యవస్థలు మొదలైన విభాగాల్లో ఏఆర్, వీఆర్, ఐవోటీ వంటి టెక్నాలజీల వినియోగం పెరుగుతోంది. టెక్నాలజీ రంగంలో డిజిటైజేషన్, క్లౌడిఫికేషన్, డిజిటల్ సీఎక్స్ (కస్టమర్ అనుభూతి) వంటి విభాగాలు వృద్ధి చెందనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment