న్యూఢిల్లీ: మహా కుంభమేళా తొక్కిసలాట ఘటనపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు సోమవారం కొట్టేసింది. ఘటన దురదృష్టకరమైనదే అయినప్పటికీ ఈ ఘటనపై విచారణ అంశం ప్రస్తుతానికి తమ పరిధిలో లేదని సీజేఐ బెంచ్ పిటిషనర్‌కు స్పష్టం చేసింది.
మహా కుంభమేళా దుర్ఘటనకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, అక్కడి అధికారులే బాధ్యత వహించాలంటూ అడ్వొకేట్ విశాల్ తివారీ సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశారు. ఘటనపై సమగ్ర నివేదికను సమర్పించేలా యూపీ సర్కార్‌ను ఆదేశించాలని, అదే సమయంలో తమ నిర్లక్య వైఖరితో మరణాలకు కారకులైన అధికారులపై చర్యలకు ఉపక్రమించాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారాయన. అంతేకాదు.. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకోకుండా రాష్ట్రాలకు స్పష్టమైన, విధానపర మార్గదర్శకాలు జారీ చేయాలని విశాల్ తివారీ తన పిల్‌లో ప్రస్తావించారు.
అయితే ఘటన దురదృష్టకరమైనదే అయినప్పటికీ.. ఉత్తర ప్రదేశ్ అధికారులపై చర్యలకు ఆదేశించలేమని చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా అన్నారు. అలాగే.. ఈ పిల్‌పై విచారణ జరపలేం అని చెప్పారు. ఈ ఘటనపై జ్యూడీషియల్ కమిటీ ఏర్పాటైంది. కాబట్టి, అలహాబాద్ హైకోర్టును సంప్రదించండి అని పిటిషనర్ విశాల్ తివారీకి సీజేఐ సూచించారు. దీంతో ఆయన తన పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. మరోవైపు.. హైకోర్టులో ఇదే అంశంపై పిల్ దాఖలైన విషయాన్ని యూపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు.
కుంభమేళాలో భాగంగా.. మౌనీ అమావాస్య అమృత స్నానాలను పురస్కరించుకుని త్రివేణి సంగమం వద్ద జనవరి 29వ తేదీ అర్ధరాత్రి దాటాక తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 30 మంది భక్తుల మృతి, 60 మందికి గాయాలైన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment