వరల్డ్‌ రికార్డు.. వికెట్‌ కోల్పోకుండానే 376 కొట్టేశారు | Services create world record in first-class cricket | Sakshi
Sakshi News home page

వరల్డ్‌ రికార్డు.. వికెట్‌ కోల్పోకుండానే 376 కొట్టేశారు

Published Mon, Feb 3 2025 8:53 AM | Last Updated on Mon, Feb 3 2025 9:59 AM

Services create world record in first-class cricket

భారత్‌లోని పిచ్‌లపై నాలుగో రోజు ఆటలో 200 పరుగుల లక్ష్యమైనా కొండంతలా అనిపిస్తుంది. ఆచితూచి ఆడితేనే దానిని ఛేదించే అవకాశం ఉంటుంది. అలాంటిది ఏకంగా 376 పరుగుల లక్ష్యం ముందుంటే... ఏ జట్టయినా విజయంపై ఆశలు వదులుకోవాల్సిందే. అయితే ఒడిశాతో జరిగిన రంజీ ట్రోఫీ దేశవాళీ క్రికెట్‌ టోర్నీ మ్యాచ్‌ సందర్భంగా సర్వీసెస్‌(Services) జట్టు బ్యాటర్లు మాత్రం అలా అనుకోలేదు. 

ప్రయత్నిస్తే పోయేదేమీ లేదు కదా అనే ఉద్దేశంతో బరిలోకి దిగారు. ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. దాంతో చూస్తుండగానే స్కోరు బోర్డుపై 100, 200, 300 పరుగులు నమోదయ్యాయి. చివరకు 376 పరుగుల లక్ష్యం కూడా కరిగిపోయింది. వెరసి సరీ్వసెస్‌ జట్టు రంజీ ట్రోఫీ చరిత్రలోనే చిరస్మరణీయ విజయం అందుకుంది. 

376 పరుగుల లక్ష్యంతో ఓవర్‌నైట్‌ స్కోరు 46/0తో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన సర్వీసెస్‌ జట్టు 85.4 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా లక్ష్యాన్ని అధిగమించింది. సర్వీసెస్‌ ఓపెనర్లలో శుభం రోహిల్లా (270 బంతుల్లో 209 నాటౌట్‌; 30 ఫోర్లు) డబుల్‌ సెంచరీ చేయగా... సూరజ్‌ వశిష్ట (246 బంతుల్లో 154 నాటౌట్‌; 15 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీ సాధించాడు. 

ఈ మ్యాచ్‌లో గెలిచినప్పటికీ సరీ్వసెస్‌ జట్టు నాకౌట్‌ దశకు చేరలేకపోయింది. ఆదివారంతో రంజీ ట్రోఫీలో లీగ్‌ దశ మ్యాచ్‌లు ముగిశాయి. ఈనెల 8 నుంచి 12వ తేదీ వరకు జరిగే క్వార్టర్‌ ఫైనల్స్‌లో గుజరాత్‌తో సౌరాష్ట్ర; ముంబైతో హరియాణా; విదర్భతో తమిళనాడు; జమ్మూ కశ్మీర్‌తో కేరళ తలపడతాయి.

సర్వీసెస్‌ వరల్డ్‌ రికార్డు..
ఇక ఈ మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించిన సర్వీసెస్‌ జట్టు పలు అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. రంజీ ట్రోఫీ హిస్టరీలోనే వికెట్‌ కోల్పోకుండా అత్యధిక టార్గెట్‌ను ఛేదించిన జట్టుగా సర్వీసెస్‌ రికార్డులకెక్కింది. ఓవరాల్‌గా రంజీల్లో అత్యధిక టార్గెట​్‌ను ఛేజ్‌ చేసిన రెండో జట్టుగా సర్వీసెస్‌ నిలిచింది.

 ఈ అరుదైన ఫీట్‌ సాధించిన జాబితాలో రైల్వేస్‌ అగ్రస్ధానంలో ఉంది. గతేడాది సీజన్‌లో అగర్తాల వేదికగా త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో 378 పరుగుల లక్ష్యాన్ని రైల్వేస్‌ జట్టు 5 వికెట్లు కోల్పోయి చేధించింది. తాజా మ్యాచ్‌తో సర్వీసెస్‌ రెండో స్ధానానికి చేరింది.

ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో నాల్గవ ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా అత్యధిక స్కోర్‌ సాధించిన జట్టుగా సర్వీసెస్‌ వరల్డ్‌ రికార్డు సృష్టించింది. ఇంతకుముందు ఈ రికార్డు పాకిస్తాన్‌కు చెందిన సర్గోధా క్రికెట్‌ క్రికెట్‌ క్లబ్‌ పేరిట ఉండేది. 1998-99 దేశవాళీ సీజన్‌లో లహోర్‌ సిటీపై సర్గోధా వికెట్‌ నష్టపోకుండా 332 పరుగులు చేసింది. తాజా మ్యాచ్‌తో సర్గోదా ఆల్‌టైమ్‌ రికార్డును సర్వీసెస్‌(376) బ్రేక్ చేసింది.
చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన అభిషేక్‌​.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement