ఏఐ ప్రభావం.. వచ్చే ఏడాది జరిగేది ఇదే.. | More tech adoption strategic partnerships in 2025 NASSCOM Chairperson | Sakshi
Sakshi News home page

ఏఐ ప్రభావం.. వచ్చే ఏడాది జరిగేది ఇదే..

Published Thu, Nov 14 2024 8:08 AM | Last Updated on Thu, Nov 14 2024 8:21 AM

More tech adoption strategic partnerships in 2025 NASSCOM Chairperson

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకుతోడు ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ప్రభావంతో 2025లో టెక్నాలజీ అమలు, వ్యూహాత్మక భాగస్వామ్యాలకు ప్రాధాన్యం పెరుగుతుందని నాస్కామ్‌ చైర్‌పర్సన్‌ సింధు గంగాధరన్‌ అభిప్రాయపడ్డారు. ఏఐతో పెద్ద ఎత్తున ఉద్యోగ కోతలు ఉంటాయన్న అంశంపై స్పందిస్తూ.. నైపుణ్యాల పెంపు, ఉత్పాదకత పెంపొందించడంలో ఏఐని సహాయకారిగా చూడాలన్నారు.

దీన్ని అసాధారణ సాంకేతికతగా అభివర్ణించారు. దీనివల్ల ఉద్యోగాల నష్టం తక్కువేనంటూ.. ఉత్పాదకతను గణనీయంగా పెంచుతుందని, ఎన్నో ప్రయోజనాలను అందిస్తుందని పేర్కొన్నారు. మారుతున్న అవసరాలకు అనుగుణంగా కొనసాగాలంటే వ్యాపార సంస్థలు అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవాల్సి ఉంటుందని ఆమె చెప్పారు. ఇందుకు సంస్థ పరిమాణంతో సంబంధం లేదన్నారు.

టెక్నాలజీ పరంగా వస్తున్న మార్పుల నేపథ్యంలో బలమైన భాగస్వామ్యాలతోనే పెద్ద సవాళ్లను అధిగమించి, రాణించగలమన్నారు. లాంగ్వేజ్‌ నమూనాలను అర్థం చేసుకుని, వాటిని ఏ విధంగా వినియోగించుకోగలమో చూడాలని సూచించారు. భారత్‌లో ఏఐ మిషన్, నైపుణ్యాల పెంపునకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

ఇదీ చదవండి: ఐటీలో కొత్త ట్రెండ్‌.. మీరొస్తామంటే మేమొద్దంటామా?

ఎస్‌ఏపీ ల్యాబ్స్‌ ఇండియా చీఫ్‌గానూ పనిచేస్తున్న గంగాధరన్‌ ఏటా 2,500–3,000 మేర ఉద్యోగులను పెంచుకుంటున్నట్టు చెప్పారు. బెంగళూరు, గురుగ్రామ్, పుణె, ముంబై, హైదరాబాద్‌లో ఎస్‌ఏపీకి కేంద్రాలున్నాయి. ఇక్కడ అత్యుత్తమ నైపుణ్యాలను గుర్తించడం తమకు కీలకమన్నారు. ఎస్‌ఏపీకి భారత్‌ అత్యంత వేగవంతమైన వృద్ధి కేంద్రంగా ఉందని సంస్థ సీఈవో క్రిస్టియన్‌ క్లీన్‌ తెలిపారు. భవిష్యత్‌లో అతిపెద్ద కేంద్రాల్లో ఒకటిగా అవతరిస్తుందన్నారు. ప్రస్తుతం ఎస్‌ఏపీకి టాప్‌–10 దేశాల్లో ఒకటిగా ఉన్నట్టు చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement