అధికారం చేపట్టి పట్టుమని రెండు వారాలు కూడా కాలేదు. ఈలోపే ఆయన్ని వైట్‌హౌజ్ పీఠం నుంచి దించేయాలనే డిమాండ్ మొదలైంది. అమెరికా ప్రయోజనాలే ముఖ్యమంటూ.. ఆయన తీసుకుంటున్న సంచలనాత్మక నిర్ణయాలు తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నాయి. అయితే ఇలాంటి చర్యలు అమెరికాకు శత్రువులను పెంచడంతో పాటు ఆయన పదవీకి ముప్పుగా మారవచ్చనే మాట ఇప్పుడు వినిపిస్తోంది.
2.0లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్నవన్నీ సంచలన నిర్ణయాలే. బయటి దేశాల నుంచే కాదు.. అమెరికాలోనూ ఆ నిర్ణయాలపై వ్యతిరేకత మేధోవర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ క్రమంలో ఆయన్ని అభిశంసించాలంటూ చేపట్టిన పిటిషన్ లక్ష సంతకాలను దాటేసింది. అదీ కేవలం 11 రోజుల్లోనే!
అధికారంలోకి రాకముందే కాదు.. ఎన్నికల ప్రచారంలోనూ ఆయన అవకతవకలకు పాల్పడ్డారన్నది ఈ పిటిషన్ వెనకాల ఉన్న ప్రధాన అభియోగం. అధికారం చేపట్టిన తొలిరోజు నుంచే తీసుకున్న.. తీసుకుంటున్న నిర్ణయాలను ఈ పిటిషన్ తప్పుబడుతోంది. ముఖ్యంగా కాపిటల్ హిల్స్ నిందితులకు క్షమాభిక్ష పెట్టడం, అమెరికా పౌరసత్వంపై రాజ్యాంగ విరుద్ధంగా తీసుకుంటున్న నిర్ణయలు ఇతరత్రాలు ఉన్నాయి.
వాషింగ్టన్‌కు చెందిన ఫ్రీ స్పీచ్ ఫర్ పీపుల్ అనే సంస్థ తన వెబ్‌సైట్ ద్వారా ఈ క్యాంపెయిన్ నడిపిస్తోంది. అయితే ఈ సంతకాలు లక్ష దాటిన నేపథ్యంతో.. ట్రంప్‌పై ప్రజా వ్యతిరేకతను కాంగ్రెస్(పార్లమెంట్)పరిగణనలోకి తీసుకోవాలని, అభిశంసన ద్వారా ఆయన్ని పదవీచ్యుతుడ్ని చేయాలని కోరుతోంది. అయితే.. ఇలా ఓ సంతకాల పిటిషన్ ద్వారా అమెరికా అధ్యక్షుడ్ని తొలగించడం సాధ్యమేనా?..
సంతకాల సేకరణ ద్వారా ఏ దేశ అధినేతను తొలగించిన దాఖలాలు లేవు. రాజకీయపరమైన కారణాలతోనే.. ఒక దేశ అధినేతను అభిశంసించేందుకు వీలు ఉంటుంది.అయితే ఈ తరహా సంతకాల సేకరణ చర్యతో.. సదరు అంశానికి ప్రజల మద్ధతు ఏమేర ఉందో చూపించొచ్చు. తద్వారా మీడియా, సోషల్ మీడియాను ఆకర్షించొచ్చు. అలా.. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా చట్టసభ్యులపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని ఒత్తిడి మాత్రం చేయొచ్చు. అందుకే వీలైనన్ని ఎక్కువ సంతకాల్ని సేకరించే పనిలో ఉంది ఫ్రీ స్పీచ్ ఫర్ పీపుల్ గ్రూప్. అలాగే ఫ్రీ స్పీచ్ ఫర్ పీపుల్ 2017లోనూ ట్రంప్‌పై ఇలాంటి క్యాంపెయిన్ నడిపించినా.. ఆ టైంలో ప్రజల నుంచి పెద్దగా స్పందన దక్కలేదు.
గత హయాంలో ట్రంప్ రెండుసార్లు అభిశంసన ఎదుర్కొన్నారు. 2019లో ఓసారి, 2021 కాపిటల్ దాడికి సంబంధించి రెండోసారి ఎదుర్కొన్నారు. అయితే ఆ రెండు సందర్భాల్లోనూ ఆయన తొలగింపును హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సమర్థించగా.. సెనేట్ మాత్రం వదిలేసింది. ప్రస్తుతం హౌజ్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్‌తో పాటు సెనేట్‌లోనూ రిపబ్లికన్ పార్టీ బలంగా ఉంది. సో.. ట్రంప్‌పై ఈ టర్మ్‌లో అభిశంసన పెట్టడం అంత వీజీకాదిప్పుడు.
Comments
Please login to add a commentAdd a comment