Republican Party
-
హష్ మనీ కేసులో ట్రంప్‌కు ఊరట
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన రిపబ్లికన్ పార్టీ నాయకుడు డొనాల్డ్ ట్రంప్‌కు కేసుల నుంచి భారీ ఉపశమనం లభిస్తోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హష్ మనీ కేసులో దోషిగా తేలిన ట్రంప్‌కు శిక్షను న్యాయస్థానం నిరవధికంగా వాయిదా వేసింది. వాస్తవానికి ఈ కేసులో న్యూయార్క్ కోర్టు ఆయనకు నవంబర్ నెలలోనే శిక్ష ఖరారు చేయాల్సి ఉంది. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించడంతో కేసుల విషయంలో విచారణ ఎదుర్కోకుండా ఆయనకు రక్షణ ఉంటుందని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలోనే హష్ మనీ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు న్యూయార్క్ కోర్టును ఆశ్రయించారు. దీంతో శిక్షపై స్టే కోసం దరఖాస్తు చేయాలని న్యాయస్థానం సూచించింది. ట్రంప్‌కు ఇది భారీ విజయమని ఆయన తరఫు ప్రతినిధులు చెప్పారు. శృంగార తార స్టార్మీ డేనియల్స్‌తో ట్రంప్ ఏకాంతంగా గడిపినట్లు ఆరోపణలు వచ్చాయి. 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆమె నోరువిప్పకుండా చేయడానికి రిపబ్లికన్ పార్టికి విరాళంగా అందిన సొమ్ము నుంచి డబ్బులు చెల్లించారని బయటపడింది. ట్రంప్ తన లాయర్ ద్వారా 1.30 లక్షల డాలర్లు ఇచ్చినట్లు రుజువైంది. అంతేకాదు స్టార్మీ డేనియల్స్కి చెల్లించిన డబ్బుల వివరాలను ట్రంప్ లెక్కల్లో చూపలేదు. -
దిగువసభపై పట్టుసాధించిన రిపబ్లికన్ పార్టీ
వాషింగ్టన్: అమెరికా పార్లమెంట్ ఎన్నికల ఫలితాల లెక్కింపు తాజా గణాంకాల ప్రకారం దిగువసభపై ట్రంప్ సారథ్యంలోని రిపబ్లికన్ పార్టీ పట్టుసాధించింది. బుధవారం తెల్లవారు జామున కాలిఫోర్నియా లోని మరోచోట గెలవగా తాజాగా అరిజోనాలో మరో స్థానంలో గెలవడంతో రిపబ్లికన్లు ఇప్పటిదాకా గెల్చిన సీట్ల సంఖ్య 218కి పెరిగింది. కమలా హారిస్ నేతృత్వంలోని డెమొక్రటిక్ పార్టీ కేవలం 208 చోట్ల మాత్రమే విజయం సాధించింది. దిగువసభలో మొత్తం 435 స్థానాలు ఉండగా ఇంకా 9 స్థానాల్లో ఫలితాలు వెల్లడికావాల్సి ఉంది. పార్లమెంట్ ఎగువ సభ అయిన సెనేట్‌లోనూ ఇటీవలి ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఆధిక్యత సాధించింది. ఎగువ, దిగువ సభల్లో ఆధిక్యత కారణంగా త్వరలో ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చే నూతన చట్టాలకు ఎలాంటి అవాంతరాలులేకుండా సులభంగా ఆమోదముద్ర పడనుంది. -
మళ్లీ హౌడీ.. అంటారా?
న్యూఢిల్లీ: చరిత్రాత్మక విజయంతో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండో విడత శ్వేతసౌధంలోకి కాలు మోపుతున్న నేపథ్యంలో వ్యూహాత్మక భాగస్వామి భారత్‌తో వాణిజ్య, దౌత్య సంబంధాలు ఇకపై ఎలా ఉంటాయి? ‘‘హౌడీ.. మోదీ!’’ ‘‘నమస్తే ట్రంప్..!’’ స్నేహ బంధం కొనసాగుతుందా? మరి మనకు అనుకూలతలు – ప్రతికూలతలు ఏమిటన్నవి ఆసక్తికరంగా మారాయి. ‘అమెరికా ఫస్ట్’ అనే సూత్రాన్ని అనుసరిస్తూ విదేశాంగ విధానాన్ని సంస్కరించనున్నట్లు ట్రంప్ ఇప్పటికే స్పష్టంగా చెప్పారు. అందువల్ల సహజంగానే ఆయన విధానాలు అందుకు అనుగుణంగానే ఉంటాయి. భారత్–రష్యా సంబంధాల విషయంలో చూసీ చూడనట్లు ఉన్నా వాణిజ్యం, ఇమిగ్రేషన్ నిబంధనలు, సుంకాల విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరించవచ్చని భావిస్తున్నారు. మిత్రుడంటూనే..2017 నుంచి 2021 వరకు ట్రంప్ తొలిసారి అధ్యక్షు డిగా ఉన్నప్పుడు అమెరికా పరిశ్రమల కోసం రక్షణాత్మక విధానాన్ని అనుసరించారు. భారత్, చైనా సహా పలు దేశాల ఎగుమతులపై భారీ సుంకాలను విధించారు. అమెరికా ఉత్పత్తులు, సేవలపై అత్యధిక సుంకాలు విధించే దేశాలపై కఠిన వైఖరి అనుసరించారు. ప్రధాని నరేంద్ర మోదీని ట్రంప్ పలు సందర్భాల్లో తన స్నేహితుడిగా అభివర్ణించినా అదే సమయంలో భారత విధానాలను గట్టిగా వ్యతిరేకించారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ భారీ సుంకాలను విధించటాన్ని ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకించారు. వాణిజ్య నిబంధనలను భారత్ ఉల్లంఘిస్తోందని, అత్యధికంగా సుంకాలను విధిస్తోందని.. టారిఫ్ కింగ్ అంటూ ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు. అయితే ట్రంప్ కోరిన విధంగా సుంకాల తగ్గింపు నిబంధనలను అమలు చేస్తే భారత జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి) 2028 నాటికి 0.1 శాతం వరకు పడిపోయే ప్రమాదం ఉందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రక్షణ సంబంధాలు..గతంలో ట్రంప్ హయాంలో అమెరికా – చైనా మధ్య సంబంధాలు గణనీయంగా క్షీణించాయి. చైనాను ఆయన గట్టి ప్రత్యర్థిగా పరిగణిస్తారు. ఇది కొంతవరకు భారత్ – అమెరికా మధ్య రక్షణ సంబంధాలు బలోపేతం కావటానికి దోహదం చేసింది. చైనాకు దీటుగా ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో అమెరికా, ఆస్ట్రేలియా, భారత్, జపాన్ కూటమి బలంగా ఎదగాలని ట్రంప్ భావించారు. ఇప్పుడు ఆయన రెండోసారి అధ్యక్షుడు అవుతున్నందున అమెరికా – భారత్ మధ్య ఆయుధ సంపత్తి, సంయుక్త సైనిక విన్యాసాలు, సాంకేతిక మార్పిడి విషయంలో మెరుగైన సమన్వయం ఉండవచ్చు.వీసా విధానం..ట్రంప్ విధానాలు వలసదారులకు ఇబ్బందికరమే! స్థానికుల ఉద్యోగాలను వారు లాక్కుంటున్నారని గుర్రుగా ఉన్నారు. వీసా నిబంధనలను కఠినతరం చేస్తే ఐటీ సంస్థలకు, నిపుణులకు కష్టకాలమే!! -
Donald Trump: ట్రంప్ రికార్డులు.. చరిత్రలో అతిపెద్ద పునరాగమనం
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ జయకేతనం ఎగురవేశారు. 132 ఏళ్ల అనంతరం మధ్యలో ఒక విరామం తర్వాత రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి అభ్యర్థిగా ఆయన చరిత్ర సృష్టించారు. సంచలనాలు, వివాదాలకు మారుపేరైన ట్రంప్ బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచారు. వ్యాపారం, స్థిరాస్తి, మీడియా రంగాల్లో తన ప్రతిభాపాటవాలతో రాణించారు. వ్యాపార కుటుంబంలో జన్మించిన ట్రంప్ విలక్షణ నాయకుడిగా పేరుపొందారు. రాజకీయ రంగంలో అగ్రస్థానానికి చేరుకోవడమే కాదు, అమెరికా రాజకీయాలపై తనదైన ముద్ర వేయడం విశేషం. 1982లోనే ఫోర్బ్స్ జాబితాలోకి.. ట్రంప్ అసలు పేరు డొనాల్డ్ జాన్ ట్రంప్. 1946 జూన్ 14న న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో జన్మించారు. ఆయన తల్లిదండ్రు లు ఫ్రెడ్ ట్రంప్, మేరీ అన్నే మెక్లి యోడ్ ట్రంప్. మొత్తం ఐదుగురు సంతానంలో ట్రంప్ నాలుగో సంతానం. ఫ్రెడ్ ట్రంప్ అమెరికాలో విజయవంతమైన రియల్ ఎస్టేట్ డెవలపర్‌గా పేరు ప్రఖ్యాతులు గడించారు. డొనాల్డ్ ట్రంప్ బాల్యం న్యూయార్క్‌లోనే గడిచింది. న్యూయార్క్ మిలటరీ అకాడమీలో చదువు కున్నారు. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాకు చెందిన వార్టన్ స్కూల్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్లో ఉన్నత విద్య అభ్యసించారు. 1968లో కామర్స్‌లో గ్రాడ్యుయేట్ పట్టా అందుకున్నారు. కాలేజీలో చదువు పూర్తయ్యాక ట్రంప్ 1971లో తన తండ్రి వ్యాపార సంస్థలోకి అడుగుపెట్టారు. తమ సంస్థను ‘ట్రంప్ ఆర్గనైజేషన్’గా పేరుమార్చారు. ట్రంప్ గ్రూప్‌నకు సంబంధించిన హోటళ్లు, క్యాసినోలు, గోల్ఫ్ కోర్సులను మరింత విస్తరింపజేశారు. తన పేరిట కొన్ని ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చారు. అనతికాలంలోనే ట్రంప్ బ్రాండ్‌కు మంచి పేరొచ్చింది. విజయవంతమైన వ్యాపారవేత్తగా డొనాల్డ్ ట్రంప్ పేరు మార్మోగిపోయింది. 200 మిలియన్ డాలర్ల సంపదతో 1982లో తొలిసారి ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో చేరారు. 2023లో ఆ సంపద విలువ 631 మిలియన్ డాలర్లతో సమానం. 2004లో ప్రారంభమైన అప్రెంటీస్ అనే టీవీ రియాలిటీ షోను ట్రంప్ స్వయంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువయ్యారు. ఇంటింటా అందరికీ అభిమాన పాత్రుడయ్యారు. ఆయనలో మంచి రచయిత కూడా ఉన్నారు. 14కుపైగా పుస్తకాలు రాశారు. 1987లో విడుదలైన ‘ద ఆర్ట్ ఆఫ్ ద డీల్’ అనే పుస్తకం విపరీతమైన పాఠకాదరణ పొందింది. నెరవేరిన స్వప్నం డొనాల్డ్ ట్రంప్‌కు చిన్నప్పటి నుంచి రాజకీయాలంటే ఆసక్తి ఉండేది. 1980వ దశకంలో రాజకీయ రంగంలో ప్రవేశించారు. రిపబ్లిన్ పార్టీలో చేరారు. అధ్యక్షుడు కావాలన్నది ట్రంప్ కల. అందుకోసం ఎంతగానో శ్రమించారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు సాగించారు. మొదట్లో ఆ ప్రయత్నాలు ఫలించకపోయినా నిరాశ చెందలేదు. మరింత పట్టుదలతో కృషిచేశారు. 2015 జూన్ 16న రిపబ్లిన్ అభ్యర్థిగా ఆయన పేరు బలంగా తెరపైకి వచ్చింది. ప్రైమరీ ఎన్నికల్లో పలువురు అభ్యర్థులను వెనక్కి నెట్టి, ఎట్టకేలకు 2016 జూలైలో అధ్యక్ష ఎన్నికల బరిలో ట్రంప్ నిలిచారు. రిపబ్లికన్ అభ్యర్థిగా ఆయన పేరు అధికారికంగా ఖరారైంది. 2016 నవంబర్ 8న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ సంచలన విజయం సాధించారు. డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ను ఓడించారు. రష్యా ప్రభుత్వం ఆయన విజయానికి సహకరించినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ట్రంప్ 2017 జనవరి 20 నుంచి 2021 జనవరి 20వ తేదీ దాకా అగ్రరాజ్యానికి 45వ అధ్యక్షుడిగా సేవలందించారు. పన్ను సంస్కరణలు, వలస విధానం, విదేశీ వ్యవహారాలపై ట్రంప్ ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. కొన్ని కీలకమైన పన్నులను తగ్గించారు. విదేశాలతో వాణిజ్య ఒప్పందాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. నాలుగేళ్ల పాలనలో యుద్ధాలకు దూరంగా ఉన్నారు. కానీ, చైనాతో వాణిజ్య యుద్ధానికి తెరతీశారు. శత్రుదేశంగా భావించే ఉత్తర కొరియాలో కాలుమోపిన తొలి అమెరికా అధ్యక్షుడిగా(పదవిలో ఉండగానే) ట్రంప్ చరిత్రకెక్కారు. వలసలపై కొంత కఠినంగానే వ్యవహరించారు. కొన్ని ఇస్లామిక్ దేశాల నుంచి ప్రజలు అమెరికాకు రాకుండా నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికా–మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మించేందుకు సైనిక నిధులను మళ్లించారు. తన పదవీ కాలంలో ముగ్గురిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా నియమించారు. ట్రంప్ పాలనలోనే కోవిడ్–19 మహమ్మారి వచ్చిపడింది. ఈ విపత్తును ఎదుర్కోవడంలో ట్రంప్ తీవ్ర అలసత్వం వహించారన్న ఆరోపణలు వచ్చాయి. వాతావరణ మార్పులకు సంబంధించిన పారిస్ ఒప్పందం, ఇరాన్‌తో అణు ఒప్పందం నుంచి వైదొలిగారు. ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్‌తో మూడుసార్లు సమావేశమయ్యారు. కానీ, అణ్వాయుధాల నియంత్రణ దిశగా ఆయనను ఓప్పించలేకపోయారు. ట్రంప్ వేగంగా, స్థిరంగా నిర్ణయాలు తీసుకుంటారన్న పేరుంది. అదే ఆయనను బలమైన నాయకుడిగా మార్చింది. రెండు సార్లు అభిశంసన అధ్యక్షుడిగా ట్రంప్ పాలనాకాలం పలు వివాదాలతో గడిచింది. శృంగార తార స్మార్మీ డేనియల్స్‌కు చెల్లించిన సొమ్మును రికార్డుల్లో చూపించకుండా వాటిని తారుమారు చేసిన ‘హష్ మనీ’ కేసులో న్యూయార్క్ కోర్టు ఈ ఏడాది మే నెలలో ట్రంప్‌ను దోషిగా తేల్చింది. ఒక నేరంలో అమెరికా అధ్యక్షుడు దోషిగా తేలడం ఇదే మొదటిసారి. ఈ కేసులో ట్రంప్‌కు ఇంకా శిక్ష విధించలేదు. మరికొన్ని కేసుల్లోనూ ఆయనపై ఆరోపణలు వచ్చాయి. అమెరికా కాంగ్రెస్‌లో దిగువ సభ అయిన ప్రతినిధుల సభలో ట్రంప్ రెండుసార్లు అభిశంసనకు(ఇంపీచ్మెంట్) గురయ్యారు. ఉక్రెయిన్ విషయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో 2019 డిసెంబర్లో అభిశంసనను ఎదుర్కొన్నారు. తన మద్దతుదారులతో క్యాపిటల్ భవనం వద్ద ఘర్షణను ప్రేరేపించినట్లు విమర్శలు వెల్లువెత్తడంతో 2021 జనవరిలో మరోసారి అభిశంసనకు గురయ్యారు. రెండుసార్లు అభిశంసనకు గురైన తొలి అధ్యక్షుడిగా అపకీర్తి పొందారు. అయితే, కాంగ్రెస్‌లో ఎగువ సభ అయిన సెనేట్ మాత్రం ఈ రెండు సందర్భాల్లో ట్రంప్‌ను నిర్దోషిగా తేల్చింది. 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ చేతిలో పరాజయం పాలయ్యారు. అయినప్పటికీ రిపబ్లికన్ పార్టీలో ట్రంప్ ప్రభావం చెక్కుచెదరలేదు. అందుకే అదే పార్టీ నుంచి మరోసారి పోటీ చేయగలిగారు. ఈ ఏడాది ఎన్నికల ప్రచారంలో ఉండగా ఆయనపై రెండుసార్లు హత్యాయత్నం జరిగింది. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డారు. మాజీ అధ్యక్షుడిగానూ ట్రంప్ నిత్యం వార్తల్లో వ్యక్తిగా నిలవడం కావడం విశేషం. కేసులు, విచారణలతో ట్రంప్ పేరు ప్రపంచవ్యాప్తంగా ప్రజల నోట్లో నానింది. 3 వివాహాలు.. ఐదుగురు సంతానం 78 ఏళ్ల డొనాల్డ్ ట్రంప్ కుటుంబం పెద్దదే. మూడు వివాహాలు చేసుకున్నారు. తొలుత చెక్ రిపబ్లిక్కు చెందిన మోడల్ ఇవానాను పెళ్లాడారు. 1977 నుంచి 1990 దాకా ఆమెతో కలిసున్నారు. తర్వాత విడాకులు తీసుకున్నారు. అనంతరం సినీ నటి మార్లా మాపిల్స్‌ను వివాహం చేసుకున్నారు. 1993 నుంచి 1999 దాకా వారి బంధం కొనసాగింది. విడాకులతో వేరయ్యారు. 2005లో స్లొవేనియా మోడల్ మెలాని యాతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఇరువురూ కలిసే ఉంటున్నారు. ట్రంప్‌కు ముగ్గురు భార్యలతో మొత్తం ఐదుగురు సంతానం ఉన్నారు. మొదటి భార్య ఇవానాతో డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఇవాంక, ఎరిక్, రెండో భార్య మార్లాతో టిఫానీ జన్మించారు. మూడో భార్య మెలానియాతో బారోన్ ట్రంప్ జన్మించాడు. మద్యం, సిగరెట్, డ్రగ్స్ తీసుకోవడం తనకు అలవాటు లేదని ట్రంప్ పలు సందర్భాల్లో చెప్పారు. ఆయన రోజుకు నాలుగు నుంచి ఐదు గంటలు మాత్రమే నిద్రిస్తారు. ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యం ఇస్తారు. గోల్ఫ్ ఆయనకు ఇష్టమైన క్రీడ. అదే ఆయన వ్యాయామం కూడా. ఇతర వ్యాయామాలేవీ చేయరు. నడక(వాకింగ్) కూడా పెద్దగా ఇష్టపడరు. మానవ శరీరం ఒక బ్యాటరీ లాంటిదని, అందులో సహజంగానే మనిషికి కావాల్సిన శక్తి ఉంటుందని, వ్యాయామాలతో ఆ శక్తి హరించుకుపోతుందని ట్రంప్ నమ్ముతారు. ట్రంప్ రికార్డులు→ ట్రంప్ ఖాతాలో అరుదైన ఘనత చేరింది. ఒక విరామం తర్వాత మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇలా జరగడం గత 132 ఏళ్లలో ఇదే తొలిసారి. గ్రోవర్ క్లీవ్‌లాండ్ తర్వాత ఈ రికార్డు ట్రంప్ సొంతమైంది. క్లీవ్‌లాండ్ 1885 నుంచి 1889 దాకా 22వ అధ్యక్షుడిగా, 1893 నుంచి 1897 దాకా 24వ అధ్యక్షుడిగా పనిచేశారు. ట్రంప్ 2017 నుంచి 2021 వరకు ఒకసారి అధ్యక్షుడిగా వ్యవహరించారు. మధ్యలో ఒక విరామంతో 2025 నుంచి 2029 దాకా మరో సారి అధ్యక్షుడిగా పని చేయబోతున్నారు. → 78 ఏళ్ల వయసులో ట్రంప్ మరోసారి అధ్యక్ష ఎన్నిక ల్లో గెలిచారు. అమెరికా చరిత్రలో అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గిన అత్యంత వృద్ధుడు ట్రంప్. → గత 20 సంవత్సరాల్లో పాపులర్ ఓటుతో గెలిచిన మొదటి రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్చరిత్రలో అతిపెద్ద పునరాగమనం నాలుగేళ్ల క్రితం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల ఫలితాలను జీర్ణించుకోలేక ఆయన అభిమానులు రాజధాని వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ భవనం వద్ద వీరంగం సృష్టించారు. వారి నిరసన హింసాత్మకంగా మారింది. ఈ వ్యవహారం చివరకు ట్రంప్ మెడకు చుట్టుకుంది. 2020 నాటి ఎన్నికల్లో పరాజయంతో ట్రంప్ రాజకీయ జీవితం ముగిసినట్లేనని అప్పట్లో రాజకీయ పరిశీలకులు తేల్చిచెప్పారు. పలు వివాదాల్లో ఇరుక్కుపోవడంతోపాటు హష్ మనీ కేసులో దోషిగా తేలిన ట్రంప్ ఇక ఎప్పటికీ రాజకీయ రంగంలో కనిపించే అవకాశం లేదని వాదించారు. వారి అభిప్రాయాలను ఫటాపంచలు చేస్తూ ట్రంప్ మరోసారి సమరోత్సాహంతో దూసుకొచ్చారు. 78 ఏళ్ల వయసులో అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. సరిగ్గా నాలుగేళ్ల తర్వాత మరోసారి వైట్‌హౌస్‌లో కాలు పెట్టబోతున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 'ట్రంప్ 2.0'
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ దుమ్ము రేపారు. హోరాహోరీ పోరు తదితర విశ్లేషణలన్నింటినీ తోసిరాజంటూ డెమొక్రాట్ల అభ్యర్ధి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌పై ఘనవిజయం సాధించారు. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి వెల్లడైన ఫలితాల్లో విజయానికి కావాల్సిన 270 ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల మార్కును ట్రంప్ అలవోకగా దాటేశారు. తద్వారా నాలుగేళ్ల విరామం తర్వాత రెండోసారి అధ్యక్ష పీఠాన్ని చేజిక్కించుకున్నారు. గ్రోవర్ క్లీవ్‌లాండ్ తర్వాత అమెరికా చరిత్రలో ఈ ఘనత సాధించిన ఏకైక నేతగా నిలిచారు. ఆ క్రమంలో పలు ఇతర రికార్డులూ సొంతం చేసుకున్నారు. అత్యంత ఎక్కువ వయసులో అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన వ్యక్తిగా కూడా 78 ఏళ్ల ట్రంప్ నిలిచారు. క్రిమినల్ అభియోగాల్లో దోషిగా తేలిన ఏకైక మాజీ అధ్యక్షునిగా ట్రంప్ ఇప్పటికే చెత్త రికార్డును మూటగట్టుకోవడం తెలిసిందే. తాజా విజయంతో అలాంటి చరిత్రతో అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గిన తొలి నేతగా కూడా నిలిచారు. పైగా పాపులర్ ఓటు కూడా గెలుచుకోవడంతో ట్రంప్ విజయానికి పరిపూర్ణత చేకూరినట్టయింది. 2016లో ట్రంప్ తొలిసారి అధ్యక్షునిగా నెగ్గినప్పుడు ఆయన కంటే ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్‌కు 28 లక్షల ఓట్లు ఎక్కువగా రావడం తెలిసిందే. ఈసారి మాత్రం దేశవ్యాప్తంగా పోలైన ఓట్లలో ట్రంప్ ఇప్పటికే హారిస్ కంటే ఏకంగా 50 లక్షలకు పై చిలుకు ఓట్ల మెజారిటీ సాధించారు. 20 ఏళ్ల తర్వాత ఈ ఘనత సాధించిన రిపబ్లికన్ అధ్యక్షునిగా నిలిచారు. అంతేగాక తనకు మాయని మచ్చగా మిగిలిన 2020 అధ్యక్ష ఎన్నికల ఓటమి తాలూకు చేదు గుర్తులను కూడా ఈ గెలుపుతో చెరిపేసుకున్నారు. బైడెన్ విజయాన్ని తిరస్కరిస్తూ తన మద్దతుదారులను క్యాపిటల్ హిల్‌పై దాడికి ఉసిగొల్పి క్రిమినల్ కేసుల్లో ఇరుక్కోవడంతో ట్రంప్ రాజకీయ భవితవ్యం ముగిసినట్టేనని అంతా భావించారు. అలాంటి స్థితి నుంచి పుంజుకుని నాలుగేళ్ల తర్వాత ఆయన సాధించిన ఘనవిజయం రిపబ్లికన్ పార్టీలో ఆనందోత్సాహాలు నింపగా 60 ఏళ్ల హారిస్ ఓటమితో డెమొక్రాట్లు తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు. విజయం ఖాయం కాగానే ట్రంప్ తన భార్య మెలానియాను ఆప్యాయంగా అక్కుని చేర్చుకుని ముద్దాడారు. ఫ్లోరిడాలోని తన వెస్ట్‌పామ్ బీచ్ నివాసం వెలుపల భారీగా గుమిగూడిన అభిమానులకు అభివాదం చేశారు. రన్నింగ్‌మేట్ జేడీ వాన్స్‌తో తన ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం కుటుంబంతో కలిసి అమెరికా ప్రజలనుద్దేశించి ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. మరోసారి తనపై విశ్వాసముంచినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘అపూర్వమైన, అత్యంత శక్తిమంతమైన ఫలితమిది. అమెరికా చరిత్రలో స్వర్ణయుగానికి నా విజయం నాంది’’ అని ప్రకటించారు. ‘‘భగవంతుడు ఏదో పెద్ద కారణంతోనే నాకు ప్రాణదానం చేశాడని చాలామంది చెప్పింది నిజమేనని ఈ ఫలితాలు రుజువు చేశాయి’’ అని ప్రచార పర్వంలో తనపై జరిగిన హత్యా ప్రయత్నాలనుద్దేశించి వ్యాఖ్యానించారు. ‘‘ఇది అమెరికా ప్రజల విజయం. అంతేగాక దేశ చరిత్రలోనే అతి గొప్పదైన, కనీవిని ఎరగని రాజకీయ ఉద్యమమిది’’ అని చెప్పుకొచ్చారు. ‘‘నా చివరి శ్వాస దాకా ప్రతి రోజూ మీ కోసం, మీ కుటుంబాల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పోరాడతా. మీ జీవితాల్లో వెలుగులు పంచుతా. ద్రవ్యోల్బణం, అక్రమ వలసలతో సహా అన్ని సమస్యలకూ సమర్థ పరిష్కారం చూపుతా’’ అని వాగ్దానం చేశారు. ఫలితాల వెల్లడి ప్రక్రియ పూర్తయి ట్రంప్‌ను అధ్యక్షునిగా లాంఛనంగా ప్రకటించేందుకు మరో రెండు నెలలు పట్టనుంది. అనంతరం జనవరి 20న ఆయన ప్రమాణస్వీకారం చేస్తారు. రెండోసారి శ్వేతసౌధంలో అడుగు పెట్టనున్న ట్రంప్‌కు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు దేశాధినేతల నుంచి అభినందనలు, శుభాకాంక్ష సందేశాలు వెల్లువెత్తాయి. ముందునుంచీ... అమెరికావ్యాప్తంగా బుధవారం ఉదయం నుంచి సాయంత్రం దాకా పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. ఆ వెంటనే రాష్ట్రాలవారీగా ఓట్ల లెక్కింపు మొదలైంది. మొదటినుంచీ ట్రంప్ ఆధిపత్యమే సాగుతూ వచ్చింది. చూస్తుండగానే ఏడు స్వింగ్ రాష్ట్రాల్లోనూ ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. వాటిలో ఒకటైన విస్కాన్సిన్లో గెలుపుతో ఆయన 270 ఓట్ల మెజారిటీ మార్కును దాటగానే రిపబ్లికన్ నేతలు, అభిమానులు, మద్దతుదారులు దేశవ్యాప్తంగా సంబరాల్లో మునిగిపోయారు. బుధవారం రాత్రి తుది ఫలితాలు వెల్లడయ్యే సమయానికి 538 ఎలక్టోరల్ ఓట్లలో ట్రంప్ 294 సొంతం చేసుకున్నారు. మరోవైపు హారిస్ 223 ఎలక్టోరల్ ఓట్లకే పరిమితమయేలా కన్పిస్తున్నారు. ట్రంప్‌కు 7.1 కోట్ల పై చిలుకు ఓట్లు రాగా ఆమెకు 6.6 కోట్లే వచ్చాయి. 50 రాష్ట్రాలకు గాను అరిజోనా, నెవడా, మెయిన్ ఫలితమే తేలాల్సి ఉంది. అరిజోనాల్లో ట్రంప్ గెలుపు లాంఛనమే కాగా మెయిన్, నెవడాల్లోనూ ఆయన ఇప్పటికే 50 వేల పై చిలుకు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆ మూడు రాష్ట్రాల్లోని 21 స్థానాలనూ గెలుచుకుని మరోసారి 300 మార్కు అలవోకగా దాటేలా కన్పిస్తున్నారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో కూడా ఆయనకు 304 ఓట్లు దక్కడం తెలిసిందే. తన ఓటమి ఖాయం కావడంతో హార్వర్డ్ వర్సిటీలో బుధవారం రాత్రి తలపెట్టిన ప్రసంగ కార్యక్రమాన్ని హారిస్ రద్దు చేసుకున్నారు. అధ్యక్షుడు బైడెన్ అభ్యర్థిత్వం పట్ల డెమొక్రాట్ల నుంచే తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆయనకు బదులుగా అనూహ్యంగా బరిలో దిగిన హారిస్‌కు ఈ ఫలితాలు నిరాశ కలిగించేవే. గెలిచి ఉంటే అధ్యక్ష పదవిని అధిష్టించిన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించేవారు. ట్రంప్, హారిస్ మధ్య పోటాపోటీ నెలకొన్నట్టు కొద్ది నెలలుగా ఎన్నికల సర్వేలన్నీ పేర్కొంటూ రావడం తెలిసందే. స్వింగ్ స్టేట్లలోనూ అదే పరిస్థితి ఉందని చెప్పడంతో ఫలితాలపై సర్వత్రా నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. -
ట్రంప్‌కే అమెరికా పట్టం
అంచనాలను మించిన విజయం ఇది. హోరాహోరీ పోరన్న సర్వేల జోస్యాన్ని తలకిందులు చేసిన ఫలితం ఇది. నవంబర్ 5 జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇటు పాపులర్ ఓటులోనూ, అటు ఎలక్టోరల్ ఓటులోనూ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ తిరుగులేని ఆధిక్యం సంపాదించారు. ప్రత్యర్థి, డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్‌కు అందనంత దూరంలో నిలిచి, అమెరికా 47వ అధ్యక్షుడిగా పీఠం ఖరారు చేసుకున్నారు. ఓట్ల లెక్కింపు పూర్తి కావడానికి మరింత సమయం పట్టనున్నప్పటికీ, ఇప్పటికే ఎలక్టోరల్ కాలేజ్‌లో కావాల్సిన 270 సీట్ల మెజారిటీని ఆయన దాటేశారు. పన్ను తగ్గింపు సహా ప్రజాకర్షక వాగ్దానాలు, కట్టుదిట్టమెన వాణిజ్య షరతుల విధానం, వలసదారులకు అడ్డుకట్ట లాంటి వాటితో అమెరికాను మళ్ళీ అగ్రస్థానానికి తీసుకువెళతానన్న ట్రంప్ మాటలను అమెరికన్లు విశ్వసించారు. అందుకే, గడచిన రెండు అధ్యక్ష ఎన్నికల్లోనూ ఫలితాన్ని హైజాక్ చేశారంటూ గెలిచిన పార్టీపై ఓడిన పార్టీ చేస్తూ వచ్చిన ఆరోపణలకు ఈసారి తావివ్వకుండా అఖండ విజయం అందించారు. ఇక, తమిళనాడుతో బంధమున్న కమల గెలవకున్నా, తెలుగు మూలాలున్న మనమ్మాయి ఉష భర్త జె.డి. వాన్స్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికవడం భారతీయులకు ఊరట నిచ్చింది. రెండుసార్లు అభిశంసనకు గురై, అనేక క్రిమినల్ కేసులను ఎదుర్కొంటూ, ఒక దశలో అధ్యక్ష పదవికి పోటీ చేయడానికీ అనర్హులవుతారనే ప్రచారం నుంచి పైకి లేచి, 900 పైగా ర్యాలీలతో తమ పార్టీకి తిరుగులేని విజయం కట్టబెట్టడం ట్రంప్ సృష్టించిన చరిత్ర. అలాగే, ఎప్పుడూ డెమోక్రాటిక్ పార్టీకే మద్దతుగా నిలిచే మైనారిటీ ఓటర్లను పెద్ద సంఖ్యలో ఆకర్షించి, అమెరికా దేశీయ రాజకీ యాల్లో కొత్త రాజకీయ పునరేకీకరణకు ఆయన శ్రీకారం చుట్టారు. ఎప్పుడూ డెమోక్రాట్లకు మద్దతుగా నిలుస్తూ వచ్చిన భారతీయ అమెరికన్లు సైతం ఈసారి ఎక్కువగా రిపబ్లికన్ల వైపే మొగ్గడం విశేషం. పీడిస్తున్న ద్రవ్యోల్బణం, పెరుగుతున్న నిరుద్యోగం నుంచి ట్రంప్ బయట పడేస్తారనే ప్రజా భావన కలిసొచ్చింది. ఎన్నికల ప్రచారంలో జరిగిన హత్యాయత్నాల సానుభూతి సరే సరి. ఇలాంటివన్నీ ట్రంప్‌కు అనుకూలించి, కమల అధ్యక్ష పదవి ఆశలను తలకిందులు చేశాయి. ఉదారవాదులు ఎంత వ్యతిరేకించినా విజయం ట్రంప్‌నే వరించింది. మహిళల అబార్షన్ హక్కుకు అనుకూలంగా కమల నిలబడడంతో స్త్రీలు ఆమెకు బ్రహ్మరథం పడతారని భావించారు. అది కొంతమేర జరిగింది కానీ, అధ్యక్ష పదవి అందుకోవడానికి అదొక్కటే సరిపోలేదు. శ్వేత మహిళల్లో గతంతో పోలిస్తే కమలకు కొంత మద్దతు పెరిగింది. అయితే, ఆఖరికి ఆ వర్గంలోనూ ట్రంప్‌కే అధికశాతం ఓట్లు పడ్డాయి. మొత్తం మీద పురుషుల్లో అధికంగా ట్రంప్‌కూ, మహిళల్లో ఎక్కువగా కమలకూ ఓటు చేశారని తొలి లెక్క. మహిళా నేత ఏలుబడికి అమెరికా సమాజం ఇప్పటికీ సిద్ధంగా లేదనీ, గతంలో హిల్లరీ క్లింటన్కైనా, ఇప్పుడు కమలకైనా ఎన్నికల ఫలితాల్లో ఈ లింగ దుర్విచక్షణ తప్పలేదనీ వినిపిస్తున్నది అందుకే. ఇక, గతంలో పెద్దగా ఓటింగ్‌లో పాల్గొనరని పేరున్న యువ, పురుష ఓటర్ల వర్గం ఈసారి పెద్దయెత్తున వచ్చి ఓటేయడం,ముఖ్యంగా శ్వేత జాతీయుల్లో అత్యధికులు ట్రంప్‌కే పట్టం కట్టడం గమనార్హం. ఒక్క నల్ల జాతీ యుల్లో మాత్రమే 78 శాతం మంది పురుషులు, 92 శాతం మంది స్త్రీలు కమలకు ఓటేశారు. అమె రికన్ సమాజంలోని కనిపించని నిట్టనిలువు చీలిక, వర్ణవిచక్షణకు ఇది ప్రతిబింబమని ఓ వాదన. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికవడం, సెనేట్‌లో రిపబ్లికన్ పార్టీ పూర్తి నియంత్రణ సాధించడం అమెరికా రాజకీయాల్లో అతి పెద్ద మలుపు. 2016లో తెలియకున్నా ఇప్పుడు మళ్ళీ పట్టం కడుతున్నప్పుడు ఆయన వ్యవహారశైలి సహా అన్నీ తెలిసే అమెరికన్లు ఆ నిర్ణయం తీసు కున్నారు. ఇప్పుడిక సెనేట్‌పై పట్టుతో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రజాస్వామ్యయుతంగా ప్రపంచానికి కట్టుబడిన అగ్రరాజ్య విధానం నుంచి పూర్తి భిన్నంగా అమెరికాను ట్రంప్ కొత్త మార్గం పట్టిస్తారని ఒక విశ్లేషణ. అమెరికా జాతీయ ప్రయోజనాల దృక్కోణం నుంచే ప్రపంచాన్ని చూడడం ట్రంప్ పద్ధతి. వాణిజ్య ప్రయోజనాలే గీటురాయిగా ఆయన ముందుకు సాగవచ్చు. అలాగే, ఉక్రెయిన్‌కు సైనిక సాయం ఆపి, ఆక్రమణ జరిపిన రష్యాతో శాంతి చర్చలు జరపాలన్న ట్రంప్ వైఖరి పర్యవసానం యూరప్ అంతటా ఉంటుందని అక్కడి దేశాలు బెంగపడుతున్నాయి.భారత్‌కు సంబంధించినంత వరకు ట్రంప్ ఎన్నిక శుభవార్తే. నిజానికి, ప్రస్తుత డెమోక్రాట్ల హయాంలోనూ అమెరికా – భారత సంబంధాలు బాగున్నాయి. అయితే, భారత ప్రధాని మోదీతో ట్రంప్ చిరకాల మైత్రి వల్ల రానున్న రిపబ్లికన్ ప్రభుత్వ ఏలుబడి మనకు మరింత సానుకూలంగా ఉంటుందని ఆశ, అంచనా. ఇతర దేశాల సంగతికొస్తే... ట్రంప్ ఎన్నిక ఇరాన్, బంగ్లాదేశ్ లాంటి వాటికి కష్టాలు తెస్తే, ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహూ లాంటి వారికి ఆనందదాయకం. కమల గద్దెనెక్కితే బాగుండనుకున్న చైనా, ఉక్రెయిన్ల ఆశ నెరవేర లేదు. అమెరికాలోని దాదాపు 1.1 కోట్ల మంది అక్రమ వలసదారులను వెనక్కి పంపుతానంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ట్రంప్ రానున్న జనవరిలో అధికారం చేపడుతూనే ఆ ఆపరేషన్‌ను ప్రారంభించనున్నట్టు ఆయన అధికార ప్రతినిధులు బుధవారమే తేల్చేశారు. అంటే, ఆది నుంచి ట్రంప్ దూకుడు చూపనున్నారన్న మాట. అంతర్జాతీయ సంబంధాలు, ప్రపంచ అధికార క్రమాన్నే మార్చేయాలని చూస్తున్న ఆయన ధోరణి అమెరికానూ, మిగతా ప్రపంచాన్నీ ఎటు తీసుకువెళుతుందో వేచి చూడాలి. సమస్యల్ని పరిష్కరి స్తానంటూ ఎన్నికల నినాదం చేసిన ట్రంప్ కొత్తవి సృష్టిస్తే మాత్రం కష్టమే! -
US Election Results: డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. అమెరికా ప్రజలు ట్రంప్ వైపు మొగ్గు చూపటంతో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌కు నిరాశ ఎదురైంది. అధ్యక్ష ఎన్నికల్లో ఆయన ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ 270 ఎలక్టోరల్ మార్క్‌ను దాటారు.విస్కాన్సిన్లో గెలుపుతో ఆయన ఈ మ్యాజిక్ ఫిగర్ దాటారు. ఇక.. ఇప్పటి వరకు అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో రిపబ్లిక్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ 277 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. దీంతో ఆయన అగ్రరాజ్యం అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. ట్రంప్-280కమలా హారిస్-224ఇంకా నెవడా 6, మిషిగన్ 15, మైన్ 2, ఆరిజోనా 11, అలస్కా 3 చొప్పున ఎలక్టోరల్ ఓట్లు ఉండగా.. ఫలితాలు ప్రకటించాల్సి ఉంది.ట్రంప్ నెగ్గిన రాష్ట్రాలుఅలబామా 9, ఆర్కాన్సాస్ 6, ఫ్లోరిడా 30, జార్జియా 16, అయోవా 6, ఐడహో 4, ఇండియానా 11, కాన్సస్ 6, కెంటకీ 8, లూసియానా 8, మైన్ 1, మిస్సోరి 10, మిసిసిపి 6, మోంటానా 4, నార్త్ కరోలినా 16, నార్త్ డకోటా 3, నెబ్రాస్కా 4, ఒహాయో 17, ఓక్లహోమా 7, పెన్సిల్వేనియా 19, సౌత్ కరోలినా 9, సౌత్ డకోటా 3, టెన్నెసీ 11, టెక్సాస్ 40, యుటా 6, వెస్ట్ వర్జీనియా 4,వయోమింగ్ 3, విస్కాన్సిన్ 10కమలా హారిస్ గెలిచిన రాష్ట్రాలివే..కాలిఫోర్నియా 54, కొలరాడో 10, కనెక్టికట్ 7, డీసీ 3, డెలవేర్ 3, హవాయి 4, ఇల్లినోయీ 19, మసాచుసెట్స్ 11, మేరీల్యాండ్ 10, మైన్ 1, మిన్నెసోటా 10, నెబ్రస్కా 1, న్యూహ్యాంప్‌షైర్ 4, న్యూజెర్సీ 14, న్యూమెక్సికో 5, న్యూయార్క్ 28, ఓరెగాన్ 8, రోడ్ ఐల్యాండ్ 4, వర్జినియా 13, వెర్మాంట్ 3, వాషింగ్టన్ 12ట్రంప్ ఖతాలో రెండు రికార్డులురెండు దశాబ్దాల తర్వాత పాపులర్ ఓటింగ్‌తో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ విజయం సాధించడం గమనార్హం. 2004 ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి జార్జ్ బుష్ 62,040,610 ఓట్లతో 286 ఎలక్టోరల్ దక్కించుకోగా.. డెమోక్రటిక్ అభ్యర్థి జాన్ కెర్రీకి 59,028,444 ఓట్లతో 251 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ట్రంప్ మళ్లీ ఆ ఘనత సాధించారు.ఇక.. 132 ఏళ్ల తర్వాత ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి అరుదైన ఫీట్ సాధించారు. 1885 అమెరికా ఎన్నికల్లో గ్రోవర్ క్లీవ్‌లాండ్ అధ్యక్షుడిగా నెగ్గారు. అయితే మళ్లీ ఒక టర్మ్ ముగిశాక.. అంటే 1893 ఎన్నికల్లోనూ గ్రోవర్ ప్రెసిడెంట్‌గా విజయం సాధించారు. అమెరికాకు 45వ అధ్యక్షుడిగా పని చేసిన ట్రంప్.. ఒక టర్మ్ గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్లీ మేజిక్ ఫిగర్ దాటేసి వైట్‌హౌజ్ వైపు అడుగులేశారు.చదవండి: Usha Chilukuri: ‘సెకండ్ లేడీ ఆఫ్ అమెరికా’గా తెలుగమ్మాయి ఉషా చిలుకూరి.. -
US Elections: కొనసాగుతున్న పోలింగ్.. రిజల్ట్ ఎప్పుడంటే?
అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం పోలింగ్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. అగ్రరాజ్యానికి తొలి మహిళా అధ్యక్షురాలిగా డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ చరిత్ర సృష్టించేందుకు సర్వశక్తులొడ్డుతుండగా.. దేశాన్ని మరోసారి గొప్పగా మార్చుదామన్న నినాదంతో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ రెండోసారి దేశాధ్యక్షుడిగా నిలిచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. -
తండ్రి నుంచి అప్పు తీసుకున్న ట్రంప్!! కారణం ఏంటంటే..
ప్రపంచ దేశాలు ఇప్పుడు అమెరికావైపు చూస్తున్నాయి. అధ్యక్ష ఎన్నికలో ఎవరు గెలుస్తారు?. అగ్రరాజ్య ముఖచిత్రాన్ని మార్చేది ఎవరు? అనే దాని కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఒకవైపు డెమోక్రటిక్ పార్టీ తరఫున ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, మరోసారి వైట్‌హౌజ్ నుంచి పాలించాలని రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఉవ్విళ్లూరుతున్నారు. అయితే.. రాజకీయాల్లోకి రాకముందు.. ట్రంప్ రియల్ ఎస్టేట్ రంగంలో మకుటం లేని మహారాజు అనే విషయం మీకు తెలుసా?.. డొనాల్డ్ ట్రంప్ న్యూయార్క్ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫ్రెడ్ ట్రంప్‌కు నాలుగో సంతానం. 13 ఏళ్ల వయసులో ట్రంప్ సైనిక్ అకాడమీలో చేరాడు. ఆ తరువాత యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియా.. వార్టన్ స్కూల్ నుంచి డిగ్రీ పొందిన తరువాత కుటుంబ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు.కుటుంబ వ్యాపారంలోకి అడుగుపెట్టడాని ముందే ట్రంప్ తన తండ్రి నుంచి కొంత మొత్తం అప్పుగా తీసుకుని రియల్ ఎస్టేట్‌లోకి ప్రవేశించినట్లు సమాచారం. ఆ తరువాత తండ్రి రెసిడెన్షియల్ హౌసింగ్ ప్రాజెక్ట్‌లను నిర్వహించడంలో కీలక పాత్రం పోషించాడు. 1971లో కంపెనీని నియంత్రణలోకి తీసుకున్న తరువాత.. దానిని ట్రంప్ ఆర్గనైజేషన్‌గా మార్చేశారు. ఆ తరువాత వివిధ వ్యాపారాలలోకి ప్రవేశించారు.1973 నాటికి ట్రంప్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడిగా ట్రంప్ బ్రూక్లిన్, క్వీన్స్ & స్టాటెన్ ఐలాండ్‌లో 14,000 అపార్ట్మెంట్లను పర్యవేక్షించారు. 1978లో గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ పక్కనే గ్రాండ్ హయత్ హోటల్‌ను అభివృద్ధి చేయడం కూడా ఈయన సారథ్యంలోనే జరిగింది. 1983లో మిడ్‌టౌన్ మాన్‌హట్టన్‌లోని 58 అంతస్తుల 'ట్రంప్ టవర్'ను ట్రంప్ పూర్తి చేశారు. ఈయన కుటుంబానికి చెందిన పలువురు సభ్యులు కూడా ఈ భవనంలోనే నివసిస్తున్నట్లు తెలుస్తోంది.వ్యాపార రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పాటు చేసుకున్న ట్రంప్ 2016 అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారు. అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన తరువాత.. ట్రంప్ సంస్థలోని అన్ని నిర్వహణ బాధ్యతలకు రాజీనామా చేసి, కంపెనీ నిర్వహణను తన కుమారులు డోనాల్డ్ జూనియర్, ఎరిక్‌లకు అప్పగించారు. కాగా ఇప్పుడు మరోసారి అమెరికా అధ్యక్ష పదవి కోసం కమలా హరిస్తో పోటీ పడుతున్నారు. -
అక్రమ వలసలపై ఉక్కుపాదమే: ట్రంప్
న్యూయార్క్: అమెరికాలోని అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపి తీరతానని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. తాను అధ్యక్షుడిని అయితే దేశ చర్రితలోనే అతి పెద్ద ఆపరేషన్ చేపట్టి కనీసం 10 లక్షల మందికి పైగా అక్రమ వలసదారులదరినీ వెనక్కు పంపించడం ఖాయమని ప్రకటించారు. అధ్యక్ష ఎన్నికల పోలింగ్ శరవేగంగా సమీపిస్తున్న వేళ ఆదివారం న్యూయార్క్‌లోని ప్రసిద్ధ మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో భారీ ర్యాలీలో ట్రంప్ ప్రసంగించారు. ఆయనతో పాటు రిపబ్లికన్ పార్టీ నేతలంతా డెమొక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్‌పై తీవ్ర స్థాయిలో వ్యక్తిగత దాడికి పాల్పడ్డారు. ఆమెను అవమానిస్తూ హేళనగా మాట్లాడారు. హారిస్‌ను దెయ్యంగా, ‘రాడికల్ లెఫ్ట్ మార్క్సిస్టు’గా అభివరి్ణంచారు. ‘‘ఆమెకు తెలివి లేదు. దేశ సమస్యలను పరిష్కరించలేరు’’ అంటూ విమర్శించారు. ట్రంప్ అయితే ఉపాధ్యక్షురాలిగా హారిస్ తన అసమర్థ పాలనతో అమెరికాను నాశనం చేశారని ఆరోపించారు. ట్రంప్‌కు మద్దతుగా మాట్లాడిన కమెడియన్ టోనీ హిచ్క్లిఫ్ చేసిన జాత్యహంకార వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. లాటిన్ అమెరికా వాసులు పిల్లల్ని కనేందుకే ఇష్టపడతారన్న వ్యాఖ్యలపై రిపబ్లికన్లే అసహనం వ్యక్తం చేశారు. పోర్టోరికోను తేలాడే చెత్తదిబ్బగా టోనీ పేర్కొనడాన్నీ రిపబ్లికన్లు ఖండించారు. -
ఐవీఎఫ్ తండ్రిని నేను: డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ మరో వివాదానికి తెరతీశారు. కృత్రిమ గర్భధారణ(ఐవీఎఫ్)కు తాను తండ్రి లాంటివాడినని చెప్పారు. తాను అధికారంలోకి వస్తే ఐవీఎఫ్(ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్)ను ఉచితం చేస్తానని ప్రకటించారు. తాజాగా జార్జియాలో ఫాక్స్ న్యూస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కృత్రిమ గర్భధారణకు తమ పార్టీ పూర్తి అనుకూలమని స్పష్టంచేశారు. ఈ విషయంలో డెమొక్రటిక్ పార్టీ నేతలు తమపై మాటల దాడి చేస్తారని తెలిసినప్పటికీ ఐవీఎఫ్‌కు మద్దతు ఇస్తూనే ఉంటామని అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో గర్భవిచ్చిత్తి చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయని, వాటిని మార్చాల్సిన అవసరం ఉందని చెప్పారు. అబార్షన్ హక్కులను రాష్ట్రాలకే వదిలేయాలన్నది తన విధానమని స్పష్టంచేశారు. అత్యాచారం వల్ల గర్భం దాలిస్తే, గర్భం దాలి్చన తల్లి ప్రాణానికి ముప్పు ఉంటే గర్భవిచ్చిత్తికి అనుమతి ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. అయితే, ఉచిత ఐవీఎఫ్ పథకానికి నిధులు ఎలా సమకూరుస్తారో ట్రంప్ వెల్లడించలేదు. అలాగే చట్టపరమైన ఇబ్బందులను ఎలా ఎదుర్కొంటారని తెలియజేయలేదు. ఐవీఎఫ్ తండ్రిని అంటూ ట్రంప్ చేసిన ప్రకటనను ట్రంప్ ప్రత్యర్థి, డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ తప్పుపట్టారు. -
అమెరికాలోనూ ఉచిత తాయిలాలు..!
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఉచితాలు అమెరికా వరకూ వెళ్లాయి’అంటూ ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే విద్యుత్తు చార్జీలను సగానికి తగ్గిస్తానంటూ అక్కడి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన హామీని శుక్రవారం ఆయన ‘ఎక్స్’లో ప్రస్తావించారు. ట్రంప్ ట్వీట్‌ను ఆయన రీ ట్వీట్ చేస్తూ.. ‘విద్యుత్తు బిల్లులు సగానికి తగ్గిస్తానంటూ ట్రంప్ ప్రకటించారు. ఉచిత తాయిలాలు అమెరికా వరకూ వెళ్లాయి’అంటూ పేర్కొన్నారు. కేజ్రీవాల్ ట్వీట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. విద్యుత్, వైద్యం, విద్య ఉచితమంటూ ప్రజలను మభ్యపెడుతున్నారంటూ కేంద్రంలోని బీజేపీ, ఎన్డీఏ పక్షాలు కేజ్రీవాల్‌పై మండిపడుతుండటం తెలిసిందే. కాగా, అధ్యక్షుడిగా ఎన్నికైతే 12 నెలల్లో కరెంట్ బిల్లులతో పాటు ఇంధన బిల్లులను 50 శాతానికి తగ్గిస్తానని, దీనివల్ల అమెరికాలో వ్యాపారావకాశాలు పెరుగుతాయని ట్రంప్ ట్వీట్ చేశారు. విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు పర్యావరణ అనుమతులను వేగవంతం చేస్తానని కూడా ట్రంప్ ప్రకటించారు. -
మరో నాలుగేళ్లు భరించలేం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్‌పై మాజీ అధ్యక్షుడు, డెమొక్రటిక్ నాయకుడు బరాక్ ఒబామా విరుచుకుపడ్డారు. అహంకారి, అసమర్థుడు, బడాయికోరు, ప్రజల మధ్య చిచ్చు పెట్టే నాయకుడు మనకు అవసరం లేదని తేల్చిచెప్పారు. అలాంటి వ్యక్తిని మరో నాలుగేళ్లపాటు మనం భరించలేమని అన్నారు. పేజీ తిప్పేయడానికి అమెరికా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఒకరిపై ఒకరు తిరగబడే పరిస్థితి రాకుండా కలిసి పనిచేసేలా ఉత్తమమైన పేజీ మన కోసం సిద్ధమవుతోందని తెలిపారు. అధ్యక్షురాలు కమలా హారిస్ కోసం మనం ఎదురు చూస్తున్నామని వ్యాఖ్యానించారు. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని పిట్స్‌బర్గ్‌లో గురువారం డెమొక్రటిక్ పార్టీ ప్రచార కార్యక్రమంలో బరాక్ ఒబామా మాట్లాడారు. ట్రంప్ ప్రతిపాదిస్తున్న పన్ను విధానం, విదేశాంగ విధానాన్ని తప్పుపట్టారు. ట్రంప్ పచ్చి అబద్ధాలకోరు అని మండిపడ్డారు. జో బైడెన్ ప్రభుత్వం రిపబ్లికన్లకు తుపాను సాయం అందించలేదంటూ ట్రంప్ చేసిన ఆరోపణలను కొట్టిపారేశారు. బాధితులకు సాయం అందించడంలో ఎలాంటి వివక్ష ఉండదన్నారు. అమెరికా విలువలను ఉల్లంఘించవద్దని ట్రంప్‌నకు సూచించారు. ఈసారి అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీగా జరగబోతున్నాయని, రిపబ్లికన్ అభ్యర్థి కమలా హారిస్ విజయం ఖాయమని ఒబామా స్పష్టంచేశారు. ఈ ఎన్నికల్లో కమలా హారిస్‌కు మద్దతుగా ఆయన ప్రచారంలో పాల్గొనడం ఇదే మొదటిసారి. అధ్యక్ష పదవిని చేపట్టేందుకు హారిస్ సర్వసన్నద్ధంగా ఉన్నారని ఒబామా తేల్చిచెప్పారు. ఆమె విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని చెప్పారు. కమలా హారిస్‌ను గెలిపిస్తే ఆమె తన సొంత సమస్యలపై కాకుండా ప్రజల సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కరిస్తారని వివరించారు. ప్రజల కష్టాలు ఏమిటో ఆమెకు క్షుణ్నంగా తెలుసని చెప్పారు. ఒకవేళ డొనాల్డ్ ట్రంప్‌ను ఎన్నుకుంటే ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్లేనని ప్రజలను అప్రమత్తం చేశారు. ట్రంప్ వస్తే సంపన్నులు, కార్పొరేట్లపై పన్నులు తగ్గిస్తారని, సామాన్య ప్రజలపై పన్నులు పెంచుతారని అన్నారు. మెరుగైన జీవితం, పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలనుకుంటే ఎన్నికల్లో కమలా హారిస్‌ను గెలిపించుకోవాలని అమెరికా ప్రజలకు ఒబామా పిలుపునిచ్చారు. -
భారత్‌లో దిగుమతి సుంకాలు అత్యధికం
వాషింగ్టన్: భారత్ ప్రపంచంలోనే అత్యధికంగా దిగుమతి సుంకాలు విధించే దేశమని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అధ్యక్షుడిగా గెలిస్తే అమెరికాకు భారత్ ఎగుమతులపై తానూ సమానస్థాయిలో పన్నులు విధిస్తానని స్పష్టం చేశారు. విదేశీ వస్తువులపై భారత్‌లోనే దిగుమతి సుంకాలు అత్యధికమని, అయితే చిరునవ్వుతో పన్నులు విధిస్తుందని తనదైన శైలిలో ముక్తాయించారు.‘అమెరికాను అత్యంత సుసంపన్నం చేయడానికి నా ప్రణాళికలోని ముఖ్యమైన అంశం.. పరస్పర క్రయ విక్రయాలపై సమానస్థాయిలో పన్నులు విధించడం (ఒక దేశం అమెరికా వస్తువులపై ఎంత శాతమైతే పన్ను వేస్తుందో.. అదే స్థాయిలో అమెరికాకు వాటి ఎగుమతులపై పన్ను వేయడం). సాధారణంగా మనం దిగుమతి సుంకాలు వేయం. అధ్యక్షుడిగా ఉండగా నేనే పన్నులు వేసే ప్రక్రియను మొదలుపెట్టా. చైనా 200 శాతం దిగుమతి సుంకం వేస్తుంది. బ్రెజిల్ కూడా భారీగా పన్నులు విధిస్తుంది. అందరికంటే భారత్ అత్యధికంగా వసూలు చేస్తుంది’ అని ట్రంప్ డెట్రాయిల్‌లో గురువారం ఒక ఆర్థిక విధాన ప్రసంగంలో అన్నారు. అయితే ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించి.. తన మాటల్లోని కాఠిన్యాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. ‘భారత్‌తో మనకు సత్సంబంధాలు ఉన్నాయి. నాకూ అంతే. ముఖ్యంగా నాయకుడు మోదీతో. ఆయన గొప్ప నాయకుడు. చక్కటిపాలన అందిస్తున్నారు. చాలావాటిల్లో చైనా కంటే ఎక్కువగా భారత్ పన్నులు వేస్తుంది. కాకపోతే చిరునవ్వుతో.. భారత్ వస్తువులు కొన్నందుకు ధన్యవాదాలు అని చెబుతారు’ అని ట్రంప్ అన్నారు. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు హార్లీ డేవిడ్సన్ మోటర్‌సైకిల్ కంపెనీ ప్రతినిధులు తనకిదే విషయం చెప్పారని వివరించారు. -
పుతిన్‌తో ట్రంప్ రహస్య స్నేహం.. పదవి నుంచి దిగిపోయాక ఆరుసార్లు ఫోన్
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రష్యా అధినేత పుతిన్ కోసం కోవిడ్–19 టెస్టింగ్ కిట్లు రహస్యంగా అందజేశారా? పుతిన్ వీటిని వ్యక్తిగతంగా వాడుకున్నారా? పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా పుతిన్‌తో ట్రంప్ రహస్యంగా స్నేహ సంబంధాలు కొనసాగించారా? అవుననే చెబుతోంది ఓ పుస్తకం. వాటర్‌గేట్ కుంభకోణంపై వార్తలు రాసిన విలేకరి బాబ్ వుడ్‌వర్డ్ రచించిన ‘వార్’అనే పుస్తకంలో ఈ సంచలన విషయాలు ప్రస్తావించారు. ఈ పుస్తకం ఈ నెల 15న విడుదల కానుంది. ఇందులోని కొన్ని ముఖ్య అంశాలను అమెరికా పత్రికలు బయటపెట్టాయి. ట్రంప్ 2021లో అధికారం నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ట్రంప్, పుతిన్ కనీసం ఆరుసార్లు ఫోన్లో సీక్రెట్‌గా మాట్లాడుకున్నారని ట్రంప్ సహాయకుడు చెప్పినట్లు పుస్తకాన్ని ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. ప్రస్తుతం ఈ వ్యవహారం మొత్తం అమెరికాలో సంచలనాత్మకంగా మారింది. ఇదిలా ఉండగా, వార్ పుస్తకంలోని అంశాలను ట్రంప్ ప్రచార బృందం ఖండించింది. అదొక చెత్త పుస్తకం, అందులోని కాగితాలు టాయిలెట్ టిష్యూగా వాడుకోవడానికి పనికొస్తాయని ఎద్దేవా చేసింది. ట్రంప్ సైతం స్పందించారు. కథలు చెప్పడంతో దిట్ట అయిన బాబ్ వుడ్‌వర్డ్ చెప్పే పనికిమాలిన విషయాలు నమ్మాల్సిన అవసరం లేదని అన్నారు. అతడొక చెడ్డవ్యక్తి అని విమర్శించారు. తాజా వివాదంపై రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ కూడా స్పందించింది. ‘వార్’పుస్తకంలో ప్రస్తావించిన వాటిలో ఏమాత్రం వాస్తవం లేవని, అవన్నీ అభూత కల్పనలు అని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తేలి్చచెప్పారు. -
ఎన్నికల్లో ఓడిపోతే.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గనుక ఓడిపోతే.. ఇక జీవితంలో మరోసారి బరిలో నిలవనని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారాయన.‘‘ఈసారి అధ్యక్ష ఎన్నికలో గెలుపు కోసం శాయశక్తుల కృషి చేస్తా. ఈసారి ఓడిపోయే ప్రసక్తే ఉండదని అనుకుంటున్నా. ఎందుకంటే అమెరికన్లలో డెమోక్రట్లపై అంతలా వ్యతిరేకత పెరిగిపోయింది. ఒకవేళ ఓటమి పరిస్థితే ఎదురైతే మాత్రం.. ఇక శాశ్వతంగా పోటీకి దూరమవుతా. ఇంకోసారి పోటీ చేయను’’ అని ట్రంప్ ప్రకటించారు. అమెరికాకు 45వ అధ్యక్షుడి కోసం జరిగిన 2016 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో తొలిసారి రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేశారు ట్రంప్. ప్రత్యర్థి హిలరీ క్లింటన్‌పై ఘన విజయం సాధించి.. 2017 నుంచి 2021 (జనవరి) మధ్య అధ్యక్షుడిగా పని చేశారు. 2021 ఎన్నికల్లో బైడెన్‌పై మరోసారి పోటీ చేస్తానని 2020లోనే ట్రంప్ ప్రకటించారు. అయితే ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు.ఇదీ చదవండి: ట్రంప్ అంతలా ద్వేషించినా.. ఆమె లాభపడింది!ముచ్చటగా మూడోసారి అధ్యక్ష ఎన్నికల్లో నిలబడతానని.. 2022 నవంబర్ నుంచే చెబుతూ వస్తున్నారు. ఈ ఏడాది ఆయన అభ్యర్థిత్వం ఖరారు కాగా.. నాటకీయ పరిణామాల అనంతరం బైడెన్ వైదొలగడంతో కమలా హారిస్ తెర మీదకు వచ్చారు. నవంబర్ 5న 47వ అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అయితే.. ట్రంప్‌కు డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ నుంచి గట్టి పోటీ ఎదురు కావొచ్చని సర్వేలు చెబుతున్నాయి. కీలక రాష్ట్రాల్లోనూ కమలదే పైచేయి కొనసాగుతోందని నివేదికలు ఇస్తున్నాయి. తొలి డిబేట్లో బైడెన్‌పై నెగ్గిన ట్రంప్.. రెండో డిబేట్లో కమలా హారిస్‌పై మాత్రం ఆయన తడబడ్డారు. దీంతో మూడో(ఆఖరి)డిబేట్‌కు దూరంగా ఉంటానని ప్రకటించిన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 23వ తేదీన మూడో డిబేట్ జరగాల్సి ఉంది. ఇప్పటికే తాను డిబేట్‌కు రెడీ అంటూ కమల ప్రకటించారు. ఈ సవాల్‌ను ట్రంప్ అంగీకరిస్తారో? లేదో? అనే ఆసక్తి నెలకొంది. -
Kamala Harris: రెండో డిబేట్‌కు నేను రెడీ
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో రెండో అధ్యక్ష చర్చకు డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ సమ్మతించారు. అక్టోబర్ 23న జరిగే డిబేట్లో పాల్గొనాలని సీఎన్ఎన్ ఛానల్ పంపిన ఆహ్వానాన్ని శనివారం హారిస్ అంగీకరించారు. ట్రంప్‌తో వేదిక పంచుకోవడానికి ఉపాధ్యక్షురాలు సిద్ధంగా ఉన్నారని హారిస్ ప్రచార బృందం సారథి ఒమాలి డిల్లాన్ ఒక ప్రకటనలో తెలిపారు.రెండో డిబేట్‌కు తాను సంతోషంగా సమ్మతిస్తానని హారిస్ శనివారం ట్వీట్ చేశారు. అక్టోబరు 23న ట్రంప్ తనతో చర్చకు వస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబరు 10న జరిగిన తొలి డిబేట్లో ట్రంప్‌పై హారిస్ పైచేయి సాధించడం తెలిసిందే. మరో డిబేట్ ఆహ్వానంపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబరు 5న జరగనున్న విషయం తెలిసిందే. -
ట్రంప్‌కు భారీ షాక్, సొంత పార్టీలోనే..
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్న డొనాల్డ్ ట్రంప్‌కు సొంత పార్టీ రిపబ్లికన్ పార్టీ నుంచి భారీ షాక్ తగిలింది. సుమారు 200 మంది రిపబ్లికన్లు, ఉపాధ్యక్షురాలు.. డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌కు మద్దతు ఇస్తూ లేఖ రాశారు. వీళ్లంతా.. గతంలో జార్జ్ డబ్ల్యూ బుష్ హయాంలో ఆయనకు అనుకూలంగా పనిచేసినవాళ్లే కావడం గమనార్హం. ఫాక్స్ న్యూస్ కథనం ప్రకారం.. అయితే ఇలా సొంత పార్టీ మద్దతు దారులే ట్రంప్‌ను వ్యతిరేకించడం ఇదేమీ తొలిసారి కాదు. అంతకుముందు 2020 నాటి అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. జార్జ్ డబ్ల్యు బుష్‌తో పాటు ఆయన మద్దతు దారులు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు.తాజాగా మరోసారి ట్రంప్‌కు వ్యతిరేకంగా తీర్మానించారు. కమలా హారిస్‌కు మద్దతిస్తూ జార్జ్ డబ్ల్యూ బుష్ మద్దతు దారులు, రిపబ్లికన్ పార్టీ నేతలు రాసిన బహిరంగ లేఖలో..ట్రంప్ తిరిగి రెండోసారి ఎన్నుకుంటే దేశానికి విపత్తు అని తోటి రిపబ్లికన్లను హెచ్చరించారు. నిజమే, ట్రంప్ అధ్యక్షుడిగా ఉంటే ప్రజాస్వామ్యాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీస్తారు ప్రతి ఒక్కరూ అంచనా వేస్తున్నారు’అని లేఖలో పేర్కొన్నారుఅంతేకాదు రాష్ట్రాలను బలోపేతం చేసేందుకు జార్జ్ హెచ్డబ్ల్యు బుష్ మద్దతుదాలందరం ఒక్కటవుతాం. ఈ ఏడాది నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికల్లో బరిలో ఉన్న డెమోక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్ ఓట్లు వేస్తున్నామని లేఖలో తెలిపారు. కమలా హారిస్‌తో మాకు విధానపరమైన విభేదాలు ఉన్నాయని అంగీకరిస్తూనే.. ఆమెకు ప్రత్యామ్నాయంగా, ఆ స్థాయిలో దేశానికి సేవ చేసే నేతలు లేరని స్పష్టం చేస్తున్నారు రిపబ్లికన్ పార్టీ నేతలు. -
ట్రంప్‌కు కెన్నెడీ జూనియర్ మద్దతు
ఫీనిక్స్: అమెరికా అధ్యక్ష పదవి రేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశ రాజకీయాలను ప్రభావితం చేసే ఎఫ్.కెన్నెడీ కుటుంబీకుడొకరు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతు ప్రకటించారు. స్వతంత్ర అభ్యరి్థగా అధ్యక్ష పదవి పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు కూడా ఆయన శుక్రవారం వెల్లడించారు. అధ్యక్షుడు బైడెన్ ఎన్నికల రేసు నుంచి తప్పుకుని, భారత సంతతికి చెందిన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను బలపరిచాక డెమొక్రటిక్ పార్టీ కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతుండగా, ట్రంప్ ప్రచారంలో వెనుకబడ్డారు. పలు కీలక రాష్ట్రాల్లో ప్రజాభిప్రాయం కూడా హారిస్‌కు అనుకూలంగా మారింది. ఈ పరిస్థితుల్లో ట్రంప్‌నకు రాబర్ట్ ఎఫ్.కెన్నెడీ జూనియర్ మద్దతు ప్రకటించడం రిపబ్లికన్ పారీ్టలో కొత్త ఉత్సాహం నింపినట్లయింది. ఇటీవలి వరకు ట్రంప్ విధానాలను ఆయన బహిరంగంగానే తప్పుబట్టారు. అనుచరగణాన్ని ఆయన పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. ట్రంప్ కూడా..అధ్యక్ష రేసులో అత్యంత తీవ్ర వామపక్ష భావాలు కలిగిన వ్యక్తిగా రాబర్ట్ ఎఫ్.కెన్నడీని విమర్శించారు. తాజాగా తన నిర్ణయాన్ని సమరి్ధంచుకుంటూ రాబర్ట్ ఎఫ్.కెన్నెడీ.. ‘ప్రస్తుతం జరుగుతున్న ఉక్రెయిన్ యుద్ధం భవిష్యత్తు తరాలపై జరుగుతున్న యుద్ధం..దీనిని వెంటనే ఆపాలి. అందుకే ట్రంప్‌కు మద్దతిస్తున్నా’అని ప్రకటించారు. రాబర్ట్ నిర్ణయాన్ని కెన్నడీ కుటుంబంలోని ఐదుగురు ప్రముఖులు తీవ్రంగా తప్పుబట్టారు. ట్రంప్‌కు మద్దతివ్వడం ‘విషాద గాథకు విషాదాంతం’వంటిదని రాబ ర్ట్ సోదరి కెర్రీ కెన్నెడీ వ్యాఖ్యానించారు. ‘హారిస్, వాల్జ్లపై మాకు విశ్వాసం ఉంది. ట్రంప్‌ను సమర్థించాలనే మా సోదరుడు రాబర్ట్ నిర్ణయం మా నాన్నకు, మా కుటుంబం అత్యంత ప్రియమైనవిగా భావించే విలువలకు ద్రోహం చేసినట్లే’అని పేర్కొన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు దివంగత జాన్ ఎఫ్.కెన్నడీ సోదరుడు, దివంగత అటార్నీ జనరల్, సెనేటర్ రాబర్ట్ కెన్నడీ కుమారుడే రాబర్ట్ ఎఫ్.కెన్నెడీ జూనియర్. -
ట్రంప్ రిపబ్లిక్ పార్టీకి ఎదురుదెబ్బ!.. తెరపైకి జేడీ వ్యాన్స్ వ్యాఖ్యలు
వాషింగ్టన్: అగ్ర రాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేళ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలోనే రిపబ్లికన్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి జేడీ వ్యాన్స్ వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చాయి. పిల్లలు లేనివారు పాలించేందుకు తగదు అంటూ గతంలో మాట్లాడిన మాటలు తాజాగా వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను కించపరిచినట్లు మాట్లాడారు. తాజాగా దీనిపై తాజాగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా రిపబ్లిక్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలే ఛాన్స్ ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.కాగా, జేడీ వ్యాన్స్ 2021లో అమెరికాలో పిల్లలులేని తల్లుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ కార్యక్రమంలో జేడీ వ్యాన్స్ మాట్లాడుతూ.. అమెరికాలో పిల్లలందరికీ ఓట్లు వేసే అవకాశం ఇద్దాం. ఇదే సమయంలో పిల్లల తల్లిదండ్రులకు ఆ ఓట్లపై నియంత్రణ ఉండేలా చూసుకుందాం. మీరు అమెరికాలో ఎన్నికలకు వెళ్లినప్పుడు ఒక పేరెంట్‌గా మరింత శక్తిని కలిగి ఉండాలి. పిల్లలు లేని వారి కంటే పిల్లులు ఉన్న పేరెంట్స్‌కి ప్రజాస్వామ్యంపై ఎక్కువ బాధ్యత ఉంటుంది. వారే తమ వాయిస్ వినిపించగలరు. ఇదే సమయంలో పిల్లలు లేని వారు వాయిస్‌ను ఎక్కువ వినిపించలేరు(చైల్డ్ లెస్ క్యాట్ లేడీస్). పిల్లలు లేని వారు పాలించేందుకు పనికిరారు అంటూ కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన వ్యాన్స్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో రాజకీయంగా చర్చకు దారి తీశాయి. అయితే, అధ్యక్ష ఎన్నికల వేళ జేడీ వ్యాన్స్ వ్యాఖ్యలు తాజాగా మరోసారి వైరల్‌గా మారాయి. డెమోక్రటిక్ పార్టీ నేతలు వ్యాన్స్ వ్యాఖ్యలపై ఘాటు విమర్శలు చేస్తున్నారు.JD Vance calls for taking away voting power from “people who don’t have kids”: “Doesn't this mean that non-parents don't have as much of a voice as parents? Yes. Absolutely” pic.twitter.com/rXhzMoat47— Kamala HQ (@KamalaHQ) July 25, 2024ఇదిలా ఉండగా.. రిపబ్లిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్ధిగా ఒకప్పుడు తనను వ్యతిరేకించే వ్యక్తినే ట్రంప్ ఎంపిక చేశారు. రిపబ్లికన్ నేత, ఓహియో సెనేటర్ జేమ్స్ వ్యాన్స్‌ను ఉపాధ్యక్ష అభ్యర్ధిగా ట్రంప్ ప్రతిపాదించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ విజయం సాధిస్తే.. జేడీ వాన్స్ ఉపాధ్యాక్షుడవుతారు. ఒకానొక సమయంలో ట్రంప్‌పై విమర్శలతో విరుచుకుపడి వార్తల్లో నిలిచిన వ్యాన్స్.. ప్రస్తుతం ఆయనకు బలమైన మద్దతుదారుల్లో ఒకరిగా మారిపోవడం గమనార్హం. -
మలుపు తిప్పిన నిష్క్రమణ
అందరూ అనుమానిస్తున్నట్టే జరిగింది. చెప్పాలంటే అనివార్యమైనదే అయింది. మరో నాలుగు నెలల్లో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు ఉన్నాయనగా రెండోసారి ఆ పదవికి ఎన్నికయ్యేందుకు చేస్తున్న ప్రచారం నుంచి డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత దేశాధ్యక్షుడు జో బైడెన్ పక్కకు తప్పుకున్నారు. వైట్‌హౌస్ పీఠానికి రేసు నుంచి వైదొలగుతున్నట్టు ఆదివారం ఆయన ఆకస్మికంగా చేసిన ప్రకటన ఒక విధంగా సంచలనమే. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒక పార్టీ అభ్యర్థి ఇలా అర్ధంతరంగా బరిలో నుంచి వైదొలగిన ఘటన మునుపెన్నడూ జరగనిదే. అలాగని కొద్ది వారాలుగా అమెరికాలో జరుగుతున్న పరిణామాల రీత్యా బైడెన్ ప్రకటన మరీ అనూహ్యమేమీ కాదు. ఎన్నికల్లో పోటీ పడకున్నా, పదవీకాలం పూర్తయ్యే వరకు దేశాధ్యక్షుడిగా బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తానని ప్రకటించిన ఆయన తన స్థానంలో పార్టీ అభ్యర్థిగా కమలా హ్యారిస్ పేరు ప్రస్తావించడం, ఆమె అభ్యర్థిత్వాన్ని తోటి డెమోక్రాట్లు బలపరుస్తుండడంతో అమెరికా ఎన్నికల కథ ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఇటీవలే ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్న ఘటనతో అన్నీ ప్రతికూలంగా కనిపిస్తున్న వేళ డెమోక్రాటిక్ పార్టీకి ఇది కొత్త ఊపిరి పోస్తోంది. మళ్ళీ ఆశలు చిగురింపజేస్తోంది. ఇరవై తొమ్మిదేళ్ళ వయసులో జో బైడెన్ జాతీయస్థాయి రాజకీయ జీవితం ప్రారంభించారు. రిపబ్లికన్ సెనెటర్‌ను ఓడించడం ద్వారా 1972లో ఆయన కెరీర్ మొదలైంది. సరిగ్గా 52 ఏళ్ళ తర్వాత అమెరికా చరిత్రలో అత్యంత పెద్ద వయసు అధ్యక్షుడైన ఆయన యుద్ధం చేయకుండానే అస్త్రసన్యాసం చేయాల్సి వచ్చింది. నెలన్నర క్రితం కూడా బరిలో నుంచి తప్పుకొనేది లేదని బల్లగుద్ది చెప్పిన బైడెన్ ఇప్పుడిలాంటి నిర్ణయం తీసుకున్నారంటే... ఒక రకంగా అది ఆయన స్వయంకృతం. మరోరకంగా క్షేత్రస్థాయి పరిస్థితుల పట్ల పెరిగిన అవగాహన అని చెప్పక తప్పదు. ఆయనలో ఈ ప్రాప్తకాలజ్ఞతకు చాలా కారణాలే దోహదపడ్డాయి. ట్రంప్‌తో తొలి చర్చలోనే తడబడడం దగ్గర నుంచి నడకలో, నడతలో, మాటలో మార్పు తెచ్చిన వయోభారం, అభ్యర్థిని మార్చాలంటూ సొంత పార్టీ వారి నుంచే కొంతకాలంగా పెరుగుతున్న ఒత్తిడి వరకు ఇలా అనేకం అందులో ఉన్నాయి. అలాగే, ఆరునూరైనా సరే ముందనుకున్నదే చేసి తీరాలన్న మంకుపట్టు కన్నా రాజకీయాల్లో పట్టువిడుపులు ముఖ్యమనీ, కళ్ళెదుటి వాస్తవాలను బట్టి విజయం కోసం ఆట తీరు మార్చడం కీలకమనీ డెమోక్రాటిక్ పార్టీ అర్థం చేసుకుంది. అందుకే, బైడెన్ పోటీ ఉపసంహరణ నిర్ణయం తీసుకుంది. దీన్ని స్వాగతించాల్సిందే తప్ప తప్పుబట్టడానికి లేదు. ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన పదవికి డెమోక్రాటిక్ అభ్యర్థిగా బరిలో దిగేందుకు 59 ఏళ్ళ కమలా హ్యారిస్ ఇప్పుడు ముందు వరుసలో ఉన్నారు. భారతీయ మూలాలున్న ఈ లాయర్ మొదట అటార్నీ జనరల్‌గా ఎదిగి, ఆ పైన సెనెటరయ్యారు. నిజానికి, అమెరికా ఉపాధ్యక్ష పదవిని చేపట్టిన తొలి మహిళ, తొలి నల్లజాతి అమెరికన్, తొలి దక్షిణాసియా అమెరికన్ ఆమే! ఉపాధ్యక్షు రాలిగా ఆమె అద్భుతాలు చేయకపోయినా, చిందరవందరైన డెమోక్రాటిక్ పార్టీని మళ్ళీ చక్కదిద్ది గాడిన పెట్టగలరని ఆశ. ఇప్పుడు ఆమె ముందున్న అసలు సవాలదే. ఆమెను అభ్యర్థిగా ప్రకటించడానికి డెమోక్రాట్లు జాగు చేయకపోవచ్చు. అదే జరిగాక... ఎంతైనా స్త్రీ అనీ, ఆమె జాతి ఫలానా అనీ ప్రత్యర్థి ట్రంప్ బృందం ప్రచార దాడులు ప్రారంభించడం ఖాయం. అయితే, గతంలో ఇలానే బరాక్ ఒబామాపై ప్రచారాలు సాగినా, అవేవీ ఓటర్లు పట్టించుకోలేదు. అధ్యక్షుడిగా ఆయన రెండు సార్లు గెలిచారన్నది గమనార్హం. ధాటిగా మాట్లాడుతూ, ప్రచారం చేసే సత్తా ఉన్న కమల ఎన్నికల్లో అద్భుతం చేసినా ఆశ్చర్యం లేదు. ఒకవేళ ట్రంప్‌కు అడ్డుకట్ట వేయలేకున్నా, కనీసం ఆయన తలతిక్క నిర్ణయాలు తీసుకొనే వీలు లేని రీతిలో అమెరికన్ కాంగ్రెస్ ఎన్నికయ్యేలా చేయగలరని విశ్లేషణ. పునర్వైభవం కోసం డెమోక్రాట్లు అంతా ఏకమవుతున్న వేళ సొంత నియోజకవర్గమంటూ లేని కమల ముందుగా భాగస్వాముల్ని, సమర్థకుల్ని, సహాయకుల్ని, అనుభవజ్ఞులూ – ప్రతిభావంతులైన బృందాన్నీ సమకూర్చుకోవాలి. కీలక రాష్ట్రాల్లో వారే ఆమెకు అండ. నిజానికి, పరిస్థితులు చూస్తుంటే ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు అమెరికా ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని నాయకత్వ కొరత పీడిస్తున్నట్టుంది. ఇటు డెమోక్రాట్లు, అటు రిపబ్లికన్లు – ఇరు పక్షాల్లోనూ ప్రజాదరణతో పాటు నేర్పు, ఓర్పున్న సమర్థులైన నాయకులెవరూ కనిపించడం లేదు. ఎవరూ రెండుసార్లకు మించి దేశాధ్యక్ష పదవిని చేపట్టరాదన్న అమెరికా రాజ్యాంగం ఒబామా లాంటి వారి పునఃప్రతిష్ఠకు అడ్డంకిగా మారింది. అది లోటే అయినా, ఆ నిబంధనలోని విస్తృత ప్రజాస్వామ్యస్ఫూర్తి, దూరాలోచన అర్థం చేసుకోదగినవే. అనుభవం లేనంత మాత్రాన అధ్యక్షబాధ్యతల్లో విఫలమవుతారనీ లేదు. మునుపటి అధ్యక్షులు చాలామంది అందుకు ఉదాహరణ. నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే, ఏ కొత్త బాధ్యతా కష్టం కాదు. పైగా, ట్రంప్‌కు మళ్ళీ పట్టం కట్టడానికి సుతరామూ ఇష్టం లేని అమెరికన్లకు ఇప్పుడు కమల మినహా ప్రత్యామ్నాయం లేదు. అదీ ఆమెకు కలిసిరావచ్చు. అయితే, హత్యాయత్నం తర్వాత పిడికిలి పైకెత్తి, పోరాటానికి నినదించి హీరో స్థాయికి పెరిగిన ట్రంప్ ప్రాచుర్యాన్ని తక్కువగా అంచనా వేయలేం. యువ ఓటర్లను ఆకర్షించడం కోసం ఉపాధ్యక్ష పదవికి 39 ఏళ్ళ జె.డి. వాన్స్‌ను ఎంపిక చేసుకొని ట్రంప్ మంచి ఎత్తుగడే వేశారు. మొత్తానికి, రోజులు గడుస్తున్నకొద్దీ అమెరికా ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారడం ఖాయమనిపిస్తోంది. ఎందుకంటే, అయిపోయిందనుకున్న ఆట అసలు ఇప్పుడే మొదలైంది! -
Kai Madison Trump: మా మంచి తాతయ్య!
మిల్వాకీ: అది రిపబ్లికన్ల నేషనల్ కాన్ఫరెన్స్. బుధవారం రాత్రి ఓ 17 ఏళ్ల అమ్మాయి వేదికనెక్కింది. తొలి ప్రసంగమే అయినా ఎక్కడా ఆ ఛాయలే లేవు. అనేకానేక అంశాలపై తడుముకోకుండా మాట్లాడి అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది. దాంతో హాలంతా పదేపదే చప్పట్లతో మార్మోగింది. ార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తనను అబ్బురంగా, ఒకింత గర్వంగా చూసుకుంటూ మురిసిపోయారు. ఆ టీనేజర్ కాయ్ మాడిసన్. ట్రంప్ మనవరాలు. ‘‘తాతా! మీరే నాకు స్ఫూర్తి’’ అని కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించారామె. 10 మంది మనవలూ, మనవరాళ్లలో కాయ్ అందరికంటే పెద్ద. ట్రంప్ పెద్ద కుమారుడు ట్రంప్ జూనియర్, ఆయన మాజీ భార్య వనెసా కూతురు. నేనూ ట్రంప్‌నే... తాతయ్య ఎప్పుడూ దేశం మంచినే కోరతారని కాయ్ చెప్పుకొచ్చారు. అమెరికాను మళ్లీ గొప్పగా మార్చేందుకు పోరాడుతున్నారన్నారు. ఎందరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొని నిలిచారంటూ ప్రశంసలతో ముంచెత్తారు. ‘‘ఆయనలో బయటికి ప్రపంచానికి పెద్దగా తెలియని కోణాన్ని మీతో పంచుకోదలిచా. తాతగా ఆయనెంతో ప్రేమాస్పదుడు. మేం చిన్నపిల్లలుగా ఉండగా అందరు తాతల్లాగే మమ్మల్నెంతో గారాబం చేసేవారు. మా పేరెంట్స్ చూడకుండా చాక్లెట్లు, కూల్డ్రింకులు ఇప్పించేవారు. మేం ఆనందపడితే చూసి మురిసిపోయేవారు. స్కూల్లో ఎలా చదవుతున్నామో ఎప్పటికప్పుడూ తెలుసుకునేవారు. ఓసారి నాకు బాగా మార్కులొస్తే ఆ ప్రోగ్రెస్ కార్డును ప్రింట్ తీయించి మరీ మిత్రులందరికీ చూపించుకుని సంబరపడ్డారు. నాకు తరచూ కాల్ చేసి గోల్ఫ్ ఎలా ఆడుతున్నానో ఆరా తీసేవారు. తన గోల్ఫ్ కథలన్నీ పంచుకునేవారు. ‘స్కూల్లో ఉన్నా తాతయ్యా, మాట్లాడలేను’ అని చెప్పాల్సి వచ్చేది. ఇద్దరం కలిసి గోల్ఫ్ ఆడేప్పుడు నన్ను ఓడించడానికి ప్రయతి్నంచేవారు. కానీ పడనిచ్చేదాన్ని కాదు. నేను కూడా ట్రంప్‌నే తాతయ్యా అనేదాన్ని!’’ అంటూ గుర్తు చేసుకున్నారు. 2015లో ట్రంప్ తొలిసారి అధ్యక్ష అభ్యర్థి అయినప్పటి నుంచీ కాయ్ ఆయనతో కలిసి పలు కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ప్రధాన ప్రచార వేదికపై కనిపించడం, మాట్లాడటం ఇదే తొలిసారి. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారామె. ట్రంప్‌పై కాల్పులు జరిగిన వెంటనే ఆయన పిడికిలెత్తి నినదిస్తున్న ఫొటోను పోస్ట్ చేసి, ‘‘తాతా, ఐ లవ్యూ. పోరాడుతూనే ఉండు!’’ అని రాశారు. ఆమెకు సొంత యూట్యూబ్ చానల్ ఉంది.మా నాన్నసింహసదృశుడు హత్యా యత్నాన్ని ట్రంప్ గొప్పగా ఎదుర్కొన్నారని ఆయన పెద్ద కుమారుడు ట్రంప్ జూనియర్ (46) అన్నారు. ‘‘రక్తం ధారగా కారుతున్నా రొమ్ము విరిచి నిలబడ్డారు. నేపథ్యంలో జాతీయ పతాకం రెపరెపలాడుతుండగా చెయ్యెత్తి పిడికిలి బిగించి పోరాట నినాదాలు చేశారు. అమెరికా పోరాట స్ఫూర్తికే ప్రతీకగా నిలిచారు. కాబోయే దేశాధ్యక్షుడు సింహసదృశుడని నిరూపించారు’’ అంటూ కొనియాడారు. ట్రంప్ భార్య మెలానియా, కూతురు ఇవాంకా, అల్లుడు జరేద్ కుష్నర్ తదితర కుటుంబ సభ్యులు గురువారం (అమెరికా కాలమానం ప్రకారం) సదస్సులో పాల్గొంటారు. -
అమెరికా రిపబ్లికన్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఆంధ్రా అల్లుడు! ప్రకటించిన ట్రంప్
మిల్వాకీ: రిపబ్లికన్ అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.. ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఒహియో సెనేటర్ జె.డి.వేన్స్ (39)ని ఎంపిక చేసుకున్నట్లు సోమవారం అర్ధరాత్రి దాటాక (భారత కాలమానం ప్రకారం) ప్రకటించారు. ఈ విషయాన్ని తన ‘ట్రూత్’ సోషల్ నెట్వర్క్ ద్వారా తెలిపారు. జేడీ వేన్స్ సతీమణి ఉషా చిలుకూరి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆమె తల్లిదండ్రులు అమెరికాలోని శాన్‌డియాగోలో స్థిరపడ్డారు. 2014లో వేన్స్, ఉషల వివాహం జరిగింది. యేల్ లా స్కూల్లో వీరిద్దరు కలిసి చదువుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం. తన ఎదుగుదలలో ఉషా పాత్ర ఎనలేనిదని వేన్స్ పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. -
మారకుంటే... ముప్పు
రక్తసిక్త అమెరికా రాజకీయ చరిత్రలో కొత్త పేజీ అది. అమెరికా దేశాధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా నేడో రేపో అధికారికంగా ఖరారవుతారని భావిస్తున్న మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌పై పెన్సిల్వేనియా రాష్ట్రంలోని బట్లర్ వద్ద శనివారం జరిగిన కాల్పులు, హత్యాయత్నంతో అగ్రరాజ్యమే కాదు... యావత్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఓ ఎన్నికల ర్యాలీలో చేసిన ఈ దాడిలో దుండగుడి తుపాకీ తూటా ట్రంప్ కుడి చెవి పైభాగాన్ని రాసుకుంటూ, రక్తగాయం చేసి పోయింది. నిఘా వర్గాల భద్రతా వైఫల్యాన్ని బట్టబయలు చేసిన ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఆయన బయట పడ్డారు. ఎన్నికల బరిలో ట్రంప్‌కు ప్రధాన పోటీదారైన ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ సహా ప్రపంచ దేశాల నేతలందరూ ఈ దాడిని ఖండించారు. దాడికి పాల్పడిన ఇరవై ఏళ్ళ వ్యక్తిని భద్రతా దళాలు మట్టుబెట్టారన్న మాటే కానీ, ఈ దుశ్చర్య వెనుక అసలు కారణాలు లోతైన దర్యాప్తులో గానీ వెలికిరావు. తాజా దాడి ఘటనతో అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయావకాశాలు పెరుగుతాయని ఓ అంచనా. అది నిజం కావచ్చు. కానీ, అంతకన్నా కీలకమైనది ఇంకోటుంది. ప్రపంచంలోని అతి ప్రాచీన ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకొనే నేలపై ఆ స్ఫూర్తి వెనకపట్టు పట్టి, హింసాకాండ చెలరేగుతోంది. అమెరికా సమాజమే కాదు... ప్రపంచమంతా ఆందోళన చెందాల్సిన విషయమిది. అమెరికాలో నేతలపై దాడులు, హత్యాయత్నాలు ఇదే తొలిసారి కాదు. గతంలో అబ్రహామ్ లింకన్, జాన్ ఎఫ్. కెనడీ సహా నలుగురు దేశాధ్యక్షులు దుండగుల దుశ్చర్యలకు బలయ్యారు. రీగన్, థియోడర్ రూజ్వెల్ట్ లాంటి వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు. అయితే, తాజా ఘటన జనంలో మునుపెన్నడూ లేని రీతిలో పేరుకున్న అణిచిపెట్టుకున్న ఆగ్రహానికీ, చీలికకూ ప్రతీకగా కనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే, ట్రంప్‌పై హత్యాయత్న ఘటన జరిగిన కొద్ది గంటల తరువాత కూడా అమెరికాలో రాజకీయ భాష రెచ్చగొట్టే విధంగా సాగడం విషాదం. ఘటన జరిగిన మూడు గంటలకే రక్తసిక్తమైన ట్రంప్ పిడికిలి బిగించిన ఫోటోలతో టీషర్ట్లు ఆన్లైన్లో అమ్మకానికి వచ్చేశాయి. ఈ జగడాలమారి వైఖరిని చూస్తుంటే, అగ్రరాజ్యంలో నేతలు పాఠాలు నేర్చుకున్నట్టు లేదు. విలువలు మరచిన మాటల దాడితో వేడెక్కుతున్న ఎన్నికల వాతావరణంలో ప్రజల్లో తీవ్రమైన ఇష్టానిష్టాలు ప్రబలి, పరిస్థితి ఎక్కడి దాకా పోయే ప్రమాదం ఉందో చెప్పడానికి ట్రంప్‌పై దాడి తార్కాణం. ఎన్నికలను యుద్ధంలా, రక్తం చిందించైనా సరే గెలవడమే పరమావధిగా భావించడం అతి పెద్ద తప్పు. ఇది అమెరికాయే కాక ప్రజాస్వామ్య దేశాలన్నీ విస్మరించలేని పాఠం. ఈ పాపంలో అన్ని పార్టీలకూ భాగం ఉంది. అనేక జాతులు, తెగలతో కూడిన అమెరికా రాజకీయ వ్యవస్థలో విభేదాలు సహజమే. కానీ, ట్రంప్ మళ్ళీ పగ్గాలు చేపడితే అది అమెరికాకు విలయమేనంటూ డెమొక్రాట్లు ప్రచారం సాగిస్తూ వచ్చారు. రిపబ్లికన్లు, ట్రంప్ సైతం సైద్ధాంతికంగా దిగజారుడుతనంలో తక్కువ తినలేదు. అమెరికాలో ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ప్రతీకగా దేశ చట్టసభకు పీఠమైన యూఎస్ క్యాపిటల్ భవనాన్ని చుట్టుముట్టి, 2021 జనవరి 6న ట్రంప్ అనుకూల మూకలు యథేచ్ఛగా వ్యవహరించినప్పుడే ప్రజాస్వామ్య సౌధంలో ప్రమాద ఘంటికలు మోగాయి. తాజా హత్యాయత్నానికి డెమోక్రాట్లు, బైడెన్ల ప్రచార ధోరణే కారణంటూ ట్రంప్ సహచరులు విరుచుకుపడుతున్నారు. ఒక్కమాటలో... అగ్రరాజ్యమనీ, భూతల స్వర్గమనీ అనుకొనే అమెరికాలో పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. పెరుగుతున్న హింసాత్మక ధోరణులు, పార్టీల వారీగా నిలువునా చీలిపోయిన జనం, ఆగని రాజకీయ హింస అక్కడి సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఆ దేశంలో తుపాకీ సంస్కృతి పెను సర్పమై బుసలు కొడుతోంది. అమెరికాలో తుపాకీలు బజారులో అతి సులభంగా కొనుక్కోవచ్చన్నది జగమెరిగిన సత్యం. అమెరికా రాజ్యాంగ ప్రకారం ఆత్మరక్షణార్థం ఆయుధాలు కలిగివుండే హక్కు పౌరులకుంది. అమెరికా వయోజనుల్లో ప్రతి పది మందిలో నలుగురింట్లో తుపాకులున్నాయి. చిత్రమేమిటంటే, 2023 జూన్ నాటి ప్యూ రిసెర్చ్ సెంటర్ సర్వే ప్రకారం తుపాకీ చేతిలో ఉంటే చట్టాన్ని పాటించే పౌరులుగా తమను తాము కాపాడుకోవచ్చని నూటికి 49 మంది అమెరికన్లు భావిస్తున్నారు. మరోమాటలో అమెరికన్ సమాజానికి దేశ శాంతి భద్రతలపై అంతటి అపనమ్మకం ఉందను కోవచ్చు. మరి, పౌరుల చేతిలోని ఈ ఆయుధాలు తప్పులు చేసేవారి చేతుల్లో పడితే పరిస్థితి ఏమిటన్నది ప్రశ్న. దేశంలో పాఠశాలలు, వాణిజ్యభవన సముదాయాల్లో విచక్షణారహితమైన కాల్పుల ఘటనల నుంచి తాజా హత్యాయత్నం దాకా అనేక సంఘటనలే అందుకు సమాధానాలు. తుపాకీలపై నియంత్రణలున్నంత మాత్రాన ఈ ఘటనలు జరగవని కాదు కానీ, లేనప్పుడు జరిగే అవకాశాలు ఇంకా ఎక్కువని ప్రత్యేకించి చెప్పనక్కర లేదు. ప్రస్తుతం అమెరికా ముందు, ఆ దేశ రాజకీయ నేతలు, పార్టీలు, ప్రజల ముందు ఓ పెను సవాలుంది. అంతకంతకూ దిగజారుతున్న పరిస్థితులు, పేట్రేగుతున్న రాజకీయ విద్వేషం, హింస లకు అడ్డుకట్ట వేయాల్సింది వారే. అన్ని పక్షాలూ కళ్ళు తెరిచి, ఈ పతనాన్ని నివారించాలి. అతివాదాన్ని నిరసించాలి. ఎన్నికల ప్రచారంలో పరస్పర గౌరవంతో సైద్ధాంతిక చర్చలే అనుసరణీయ మార్గమన్న తమ మౌలిక సూత్రాలనే మళ్ళీ ఆశ్రయించాలి. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదనీ, ఎన్నికలొక్కటే సామాజిక, రాజకీయ సమస్యలన్నిటికీ పరిష్కారమని ఓటర్లు తమ తీర్పు ద్వారా మరోసారి చాటాలి. అలా కాక, ఇలాంటి ఘటనల్ని వాటంగా చేసుకొని ఎవరికి వారు మరింత రెచ్చగొట్టుడు ధోరణికి దిగితే కష్టం. అది ప్రజాస్వామ్య వ్యవస్థకే పెను ప్రమాదం. -
ట్రంప్ భద్రత పెంపు.. దాడిపై రిపబ్లికన్ పార్టీ నేతల రియాక్షన్