మనపై ట్రంప్ 2.0 ప్రభావమెంత?
న్యూఢిల్లీ: చరిత్రాత్మక విజయంతో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండో విడత శ్వేతసౌధంలోకి కాలు మోపుతున్న నేపథ్యంలో వ్యూహాత్మక భాగస్వామి భారత్‌తో వాణిజ్య, దౌత్య సంబంధాలు ఇకపై ఎలా ఉంటాయి? ‘‘హౌడీ.. మోదీ!’’ ‘‘నమస్తే ట్రంప్..!’’ స్నేహ బంధం కొనసాగుతుందా? మరి మనకు అనుకూలతలు – ప్రతికూలతలు ఏమిటన్నవి ఆసక్తికరంగా మారాయి. ‘అమెరికా ఫస్ట్’ అనే సూత్రాన్ని అనుసరిస్తూ విదేశాంగ విధానాన్ని సంస్కరించనున్నట్లు ట్రంప్ ఇప్పటికే స్పష్టంగా చెప్పారు. అందువల్ల సహజంగానే ఆయన విధానాలు అందుకు అనుగుణంగానే ఉంటాయి. భారత్–రష్యా సంబంధాల విషయంలో చూసీ చూడనట్లు ఉన్నా వాణిజ్యం, ఇమిగ్రేషన్ నిబంధనలు, సుంకాల విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరించవచ్చని భావిస్తున్నారు.
మిత్రుడంటూనే..
2017 నుంచి 2021 వరకు ట్రంప్ తొలిసారి అధ్యక్షు డిగా ఉన్నప్పుడు అమెరికా పరిశ్రమల కోసం రక్షణాత్మక విధానాన్ని అనుసరించారు. భారత్, చైనా సహా పలు దేశాల ఎగుమతులపై భారీ సుంకాలను విధించారు. అమెరికా ఉత్పత్తులు, సేవలపై అత్యధిక సుంకాలు విధించే దేశాలపై కఠిన వైఖరి అనుసరించారు. ప్రధాని నరేంద్ర మోదీని ట్రంప్ పలు సందర్భాల్లో తన స్నేహితుడిగా అభివర్ణించినా అదే సమయంలో భారత విధానాలను గట్టిగా వ్యతిరేకించారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ భారీ సుంకాలను విధించటాన్ని ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకించారు. వాణిజ్య నిబంధనలను భారత్ ఉల్లంఘిస్తోందని, అత్యధికంగా సుంకాలను విధిస్తోందని.. టారిఫ్ కింగ్ అంటూ ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు. అయితే ట్రంప్ కోరిన విధంగా సుంకాల తగ్గింపు నిబంధనలను అమలు చేస్తే భారత జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి) 2028 నాటికి 0.1 శాతం వరకు పడిపోయే ప్రమాదం ఉందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రక్షణ సంబంధాలు..
గతంలో ట్రంప్ హయాంలో అమెరికా – చైనా మధ్య సంబంధాలు గణనీయంగా క్షీణించాయి. చైనాను ఆయన గట్టి ప్రత్యర్థిగా పరిగణిస్తారు. ఇది కొంతవరకు భారత్ – అమెరికా మధ్య రక్షణ సంబంధాలు బలోపేతం కావటానికి దోహదం చేసింది. చైనాకు దీటుగా ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో అమెరికా, ఆస్ట్రేలియా, భారత్, జపాన్ కూటమి బలంగా ఎదగాలని ట్రంప్ భావించారు. ఇప్పుడు ఆయన రెండోసారి అధ్యక్షుడు అవుతున్నందున అమెరికా – భారత్ మధ్య ఆయుధ సంపత్తి, సంయుక్త సైనిక విన్యాసాలు, సాంకేతిక మార్పిడి విషయంలో మెరుగైన సమన్వయం ఉండవచ్చు.
వీసా విధానం..
ట్రంప్ విధానాలు వలసదారులకు ఇబ్బందికరమే! స్థానికుల ఉద్యోగాలను వారు లాక్కుంటున్నారని గుర్రుగా ఉన్నారు. వీసా నిబంధనలను కఠినతరం చేస్తే ఐటీ సంస్థలకు, నిపుణులకు కష్టకాలమే!!
Comments
Please login to add a commentAdd a comment