విశ్లేషణ
ట్రంప్ గతంలో అధ్యక్షుడిగా వైట్‌హౌస్‌లో కొలువుదీరినప్పటికీ ఇప్పటికీ ప్రపంచం మారిపోయింది. అదే సమయంలో గతం హయాంలోని చాలామంది సహచరులను ఆయన వదిలేశారు, చాలామంది ఆయనను వదిలి వెళ్లారు. కాబట్టి ట్రంప్ 2.0 పాలన, ట్రంప్ 1.0 పాలన కంటే భిన్నంగా ఉంటుందని ఆశించాలి. అయితే, ట్రంప్ పదవిలో ఉన్న మొదటి సంవత్సరం బైడెన్ చివరి సంవత్సరం కంటే నిశ్శబ్దంగా ఉంటుందనైతే చెప్పవచ్చు. ట్రంప్ మునుపటి లాగే చైనాతో కఠినంగా ఉండవచ్చు, భారతదేశం పట్ల స్నేహపూర్వకంగా ఉండవచ్చు. కానీ అది ఆయన తక్షణ ప్రాధాన్యం కాకపోవచ్చు. ఈ నేపథ్యంలో గత నాలుగేళ్లలో చేసినట్లుగా, అమెరికా రాజకీయాల చిక్కుల్లో పడకుండా మోదీ ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేయడం మంచిది.
అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలు ఆకర్షించి నంత ఎక్కువగా మరే దేశ ఎన్నికా ప్రపంచ దృష్టిని ఆకర్షించలేదు. ప్రపంచంలోనే అత్యంత ప్రధానమైన దేశంగా అమెరికా కొనసాగుతోంది. దీని అధ్యక్షుడు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన వ్యక్తి. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, అతిపెద్ద సాంకేతిక, శాస్త్రీయ కేంద్రం, అతిపెద్ద సాయుధ దళాలను అమెరికా అధ్యక్షుడు నడుపుతారు.
అయినప్పటికీ దేశాధ్యక్షురాలిగా ఒక మహిళను ఎన్ను కునేందుకు అమెరికా ఇంకా సిద్ధంగా లేదు. డోనాల్డ్ ట్రంప్‌కు స్త్రీలను ద్వేషించే వ్యక్తిత్వం ఉన్నప్పటికీ హిల్లరీ క్లింటన్, కమలా హ్యారిస్‌లను ఓడించగలిగారు. జాతి, వర్గ ఆధిపత్య రాజకీయాలలో, లింగానికి వెనుక సీటు దక్కింది. ఎన్నికల ఒపీనియన్ పోల్స్ మరోసారి తలకిందులైపోయాయి.
కొత్త ముఖాల ప్రభుత్వం
బెర్లిన్ నుండి టోక్యో వరకు, మాస్కో నుండి బీజింగ్ వరకు, టెల్ అవీవ్ నుండి తెహ్రాన్, నిజానికి, న్యూఢిల్లీ వరకు, ప్రతి ప్రభుత్వం ట్రంప్ ఎన్నుకునే జట్టును నిశితంగా గమనిస్తుంది. ఇది ట్రంప్ రెండవ టర్మ్ అయినప్పటికీ, గతంలోని చాలామంది సహచరులను ఆయన వదిలేశారు. చాలామంది ఆయనను వదిలి వెళ్లారు. అధ్యక్షుడి చుట్టూ ఇప్పుడు కొత్త ముఖాలు ఉంటాయి. వైట్‌హౌస్‌లో ఆయన గతంలో కొలువు దీరినప్పటితో పోల్చితే ఇప్పటి పరిస్థితులు మారినందున ట్రంప్‌ను ప్రపంచం కొత్తగా అంచనా వేయడం జరుగుతుంది.
స్వదేశంలో, ట్రంప్ మొదటి బాధ్యత స్థిరత్వాన్ని సాధించడం; పెద్దగా ప్రాధాన్యత లేని తన మద్దతుదారులకు, ముఖ్యంగా శ్రామిక వర్గానికి ఆశను కల్పించడం. అమెరికా ఆర్థిక వ్యవస్థ పెద్ద వృద్ధి లేక పోయినా స్థిరంగానే ముందుకు సాగుతోంది. వృద్ధి 2 శాతానికి పైగా ఉంది. అయినప్పటికీ, నిరుద్యోగం పెద్ద ఆందోళనగా ఉంది. ఒక వైపు తన సొంత తరగతి మిలియనీర్లు, బిలియనీర్ల దురాశనూ, మరో వైపు తక్కువ ఆదాయం కలిగిన, సామాజికంగా, ఆర్థికంగా అణగారిన తన మద్దతుదారుల అవసరాన్నీ ట్రంప్ ఎలా సమతుల్యం చేస్తారో చూడాలి.
విదేశాలతో ఎలా వ్యవహరిస్తారు?
విదేశాల్లో, ముఖ్యంగా యూరప్, పశ్చిమాసియాలో విభేదాలను పూర్తిగా పరిష్కరించడంలో ట్రంప్‌పై పెను భారం ఉంటుంది. ఆర్థిక, విదేశాంగ విధానంపై ‘వాషింగ్టన్ ఏకాభిప్రాయం’ నుండి బయట పడతానని ఆయన హామీ ఇచ్చారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను చేరుకోవాలని భావిస్తున్నారు. అదే సమయంలో చైనాతో కఠినంగా ఉండవచ్చు, అధిక సుంకాలను విధించవచ్చు. కానీ వైరు ధ్యాలతోనే స్నేహాన్ని కోరుకోవచ్చు. పశ్చిమాసియాలో, ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుంటారనీ, బహుశా పాలన మార్పు కోసం ఒత్తిడి తెస్తారనీ భావిస్తున్నారు. అదే సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును కూడా అదుపులో ఉంచవచ్చు.
రాబోయే నాలుగేళ్లలో ’మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ అని ట్రంప్ వాగ్దానం చేసినందున, ఆయన ప్రతి ఒక్క చర్య కూడా అమెరికాకు, ప్రపంచానికి దీర్ఘకాలిక పరిణామాలను కలిగిస్తుంది. ట్రంప్ మూడో సారీ అధికారంలోకి వచ్చేందుకు వీలుగా రాజ్యాంగంలో మార్పు కోసం ప్రయత్నిస్తారా అనేది ట్రిలియన్ డాలర్ల ప్రశ్న. ఏమైనప్పటికీ, వయస్సు, సమయం ఆయన పక్షాన లేనందున ట్రంప్ 2.0 పాలన ట్రంప్ 1.0 పాలన నుండి భిన్నంగా ఉంటుందని ఆశించాలి.
అమెరికా ఎలా పరిపాలించబడుతుందనే దానిపై ట్రంప్ శాశ్వత ప్రభావాన్ని కలిగిస్తారు. కానీ అమెరికాకు ప్రపంచాన్ని రూపొందించే సామర్థ్యం పరిమితంగా ఉంది. అమెరికా తన మిత్రదేశాలతో కలిసి పని చేయాల్సి ఉంటుంది. ట్రంప్ అధ్యక్ష పదవిపై యూరప్, జపాన్ రెండూ ఆందోళనగా ఉన్నాయి. ట్రంప్ గత హయాంలో యూరప్‌లో ఏంజెలా మెర్కెల్, జపాన్ లో షింజో అబే ఉన్నారు. ప్రస్తుతం,ట్రంప్‌ను ఎదిరించే లేదా ఆయన్ని నిలువరించగల సామర్థ్యం ఉన్న యూరోపియన్ లేదా తూర్పు ఆసియా నాయకులు ఎవరూ లేరు. వారు బహుశా ట్రంప్‌కు అనుగుణంగా నడుచుకోవచ్చు.
పుతిన్‌ను ఊపిరి పిల్చుకోనిస్తారా, జెలెన్‌స్కీని కాస్త తగ్గమని అడుగుతారా అనేది ట్రంప్, ఆయన సలహాదారులు... యూఎస్ ‘డీప్ స్టేట్’పై, మిలిటరీ–ఇండస్ట్రియల్ కాంప్లెక్స్‌పై, జో బైడెన్ రష్యా విధానం వెనుక ఉన్న ప్రభావశీల వ్యక్తులపై ఎంత నియంత్రణను కలిగి ఉంటారు అనే దానిమీద ఆధారపడి ఉంటుంది. ఏమైనప్పటికీ, పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఇద్దరూ కనీసం మొదట్లోనైనా ట్రంప్ యంత్రాంగంతో సత్సంబంధాలు నెలకొల్పుకోవాలని కోరుకుంటారు. విరోధాబాస ఏమిటంటే, ట్రంప్ పదవిలో ఉన్న మొదటి సంవత్సరం బైడెన్ చివరి సంవత్సరం కంటే నిశ్శబ్దంగా ఉండవచ్చు.
ఇండియాతో వైఖరి?
అదృష్టవశాత్తూ, అధ్యక్షుడు ట్రంప్‌తో భారతదేశం మంచి సమీక రణాన్ని కలిగి ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇద్దరూ ట్రంప్ చుట్టూ ఉన్న వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉన్నారు. అయినప్పటికీ ట్రంప్ 2.0 అన్ని సంభావ్యతలలోనూ,ట్రంప్ 1.0 లాగా ఉండదనే ఎరుకతో భారత నాయకత్వం ముందుకు సాగాలి. ట్రంప్ వాస్తవికతా విధానం, ‘అమెరికా ఫస్ట్’ విధానం... వాణిజ్యం, వలసలు, వాతావరణ మార్పు వంటి భారత్‌కు ఆసక్తి ఉన్న రంగాలపై సవాళ్లు విసురుతాయి.
నేను ఉదారమైన అమెరికా వీసా విధానం పట్ల గొప్ప ఔత్సాహికుడిని కాదు. ఇది భారతదేశం నుండి ప్రతిభను హరించడానికి దోహదపడింది. అయితే ట్రంప్ పాత సలహా దారులలో కొందరు, ముఖ్యంగా అమెరికా మాజీ వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లైట్‌థైజర్ వంటి వ్యక్తులు తిరిగి కార్యాలయంలోకి వస్తే ఇరు దేశాల మధ్య వాణిజ్యం సవాలుగా మారవచ్చు.
అమెరికా నుంచి రక్షణ పరికరాలను కొనుగోలు చేయడం, సరఫరా గొలుసులతో అనుసంధానం కావడాన్ని భారతదేశం కొన సాగిస్తుంది. ఏది ఏమైనప్పటికీ, గత నాలుగేళ్లలో చేసినట్లుగా, అమెరికా రాజకీయాల చిక్కుల్లో పడకుండా జాగ్రత్తగా అడుగులు వేయాలని మోదీ ప్రభుత్వానికి సూచించడం మంచిది. గురుపత్వంత్ సింగ్ పన్నూన్ కేసు ఇప్పటికే కోర్టులో ఉన్నందున అది వీడి పోకపోవచ్చు. దాని అలలు భారత తీరాలను తాకుతూనే ఉంటాయి.
ట్రంప్ 1.0 సమయంలో షింజో అబే మొదట వైట్ హౌస్ తలుపులు తట్టారు, స్నేహపూర్వక హస్తాన్ని చాచారు, అహంభావిని పొగిడారు, భారత దేశానికి ప్రయోజనం కలిగించే క్వాడ్ వంటి ఆలోచనలను చేశారు. అబే రాజనీతిజ్ఞుడు, భారతదేశానికి స్నేహి తుడు. ఆయన వారసులు కేవలం రాజకీయ నాయకులు, పైగా భారత్‌కు అనుకూలమైనవారు కాదు.
చదవండి: ముంచింది జో బైడెనే.. కమలా హారిస్ తీరుపైనా విమర్శలు
ట్రంప్ భారత్ పట్ల స్నేహ పూర్వకంగా ఉండవచ్చు, కానీ మన దేశానికి ఆయన తక్షణ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి మోదీ వంటి మిత్రులు కాసేపు వేచివుండి, అమెరికా మిత్రదేశాలు, ముఖ్యంగా యూరోపి యన్లు వైట్‌హౌస్‌లో తమ ఆందోళనతో కూడిన సంభాషణలను ముగించేందుకు అనుమతించడం ఉత్తమం.
దేవుడు తనను కాపాడాడు కాబట్టే వైట్‌హౌస్‌కు తిరిగి వస్తున్నట్లు ట్రంప్ చెప్పుకొన్నారు. తమను తాము ‘దేవుడు, విధిచే ఎన్ను కోబడిన’ వారిగా భావించే రాజకీయ నాయకులు తరచుగా మంచి కంటే ఎక్కువ హాని చేస్తారు. అలాంటివారితో ఉన్న స్నేహాన్ని ప్రద ర్శించుకోవడం కంటే, ముందు వాళ్లను తమ పనిలో తలమునకలు కానివ్వడం మంచిది.
సంజయ బారు
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, విధాన విశ్లేషకుడు
(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment