సందర్భం
డోనాల్డ్ జాన్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక, చాలా వివరాలతో చాలా వ్యాసాలు ప్రచురితమయ్యాయి. వాటి లోని ఎక్కువ విషయాలు మేధావు లకు మాత్రమే అర్థం అయ్యేటట్టు వున్నాయనడంలో సందేహం లేదు. కానీ ఎక్కువ ఓట్లు వేసి గెలిపించింది సాధారణ మనుషులే గానీ, మేధావులు కాదు. ఈ సాధారణ మనుషులు ఏ విషయాలతో ప్రభావితం అయి ఓట్లు వేశారు? ఈ సాధారణ మనుషులకు పట్టని విషయాలు కూడా ఉన్నాయా?
(1) ట్రంపును స్త్రీల మీద అత్యాచారాలు చేసేవాడిగా ఒక సివిల్ కోర్టు జ్యూరీ నిర్ణయించి, తీర్పును ఇచ్చింది. ట్రంపు దాని మీద అపీల్ చేసుకున్నాడు కూడా. అయినా సరే, స్త్రీలతో సహా ఎంతో మంది తమ ఓటును ట్రంపుకు వేశారంటే, వారికి న్యాయస్థానాల మీద నమ్మకం లేనట్టా?
(2) ఒక అశ్లీల చిత్రాల నటీమణితో తనకున్న సంబంధాన్ని దాచి వుంచడానికి, ట్రంపు ఆమెకి డబ్బు ఇచ్చి, ఆ డబ్బును దొంగ లెక్కలలో చూపించాడని ఒక క్రిమినల్ కోర్టు జ్యూరీ నిర్ణయించి, తీర్పు ఇచ్చింది. జైలు శిక్షను ప్రకటించడం మాత్రం ఆలస్యం చేసింది రాజకీయ కారణాల వల్ల. శిక్షను ఇంకా ప్రకటించలేదు కాబట్టి, ట్రంప్ దీన్ని ఇంకా అపీల్ చేసుకోలేదు. ఇది కూడా సాధారణ ప్రజలకు పట్టలేదు.
(3) 2020 ఎన్నికలలో ఓడిపోయాక, ట్రంప్, ఎన్నో గవర్నమెంటు రహస్య పత్రాలను చట్టవ్యతిరేకంగా సొంత ఇంటికి తీసుకుపోతే, అతని చేత నియామకమయిన జడ్జి ఒకావిడ, ఏదో కారణం చూపించి ఆ కేసును కొట్టివేసింది.
(4) 2020 ఎన్నికలలో ఓడిపోయాక, ట్రంప్, తన అనుచరులను రెచ్చగొట్టి ప్రభుత్వ భవనం మీదకి ఉసి గొలిపాడు.
ఆ అనుచరులు చేసిన విధ్వంసకాండ అంతా అన్ని టీవీలలోనూ వచ్చింది. ట్రంప్ అనుచరులను ఎంతో మందిని జైల్లో పెట్టారు. వారందరినీ బయటకు తీసుకు వస్తానని ట్రంప్, ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేశాడు. ఈ విషయాలన్నీ తెలిసిన ప్రజలు, మళ్ళీ ఓట్లు వేశారు.
(5) కోవిడ్ సమయంలో, ట్రంప్ అసమర్థత వల్ల ఎంతో మంది మరణించడం అనేది 2020 ఎన్నికల్లో అతను ఓడిపోయాడనడానికి ఒక కారణమని అందరికీ తెలుసు.
(6) డబ్బూ, ఖ్యాతీ వున్న మొగవాళ్ళు, ఆడవాళ్ల జననాంగాలని పట్టుకోవచ్చుననీ, ఆ ఆడవాళ్ళు ఏమీ అనరనీ, ట్రంప్ పబ్లిక్‌గా అన్నాడు. అయినా, ఎంతో మంది ఆడవాళ్ళు అతనికే ఓటు వేశారు!
(7) స్త్రీలకి తమ శరీరం మీద తమకు హక్కు లేదనీ, అత్యాచారానికి గురయిన పదేళ్ళ బాలికయినా శిశువును కని తీరాల్సిందేననీ, తల్లి ప్రాణం మీదకి వచ్చినా సరే, ఆ తల్లికి అబార్షన్ చేయ కూడదనీ చెప్పే ఈ ట్రంపుకు, ఆ స్త్రీలే ఎలా ఓట్లు వేశారు?
(8) రాజకీయ శత్రువులందరినీ, తను నెగ్గాక జైళ్ళలో పడేస్తానని ట్రంప్ అన్నా, ఈ సాధారణ జనాలకి ఆ మాటలు పట్టలేదు.
చదవండి: డోనాల్డ్ ట్రంప్ పాలన ఎలా ఉండనుంది?
(9) ‘అందమైన తన కూతురు నిజంగా తన కూతురు కాకపోతే, ఆమెతో డేటింగ్ చేసేవాడి’నన్న ఆ తండ్రిని ఈ సాధారణ జనాలు క్షమించేశారు.
(10) రాజ్యాంగంలోని ఒక సూత్రాన్ని యాంత్రికంగా అన్వయించుకుని, చిన్న పిల్లలకి కూడా తుపాకీలు దొరికేలా వ్యాపార పరిస్థితు లను నెలకొల్పి, ఎన్నో స్కూళ్ళలో జరిగిన కాల్పులకి ఏ మాత్రం బాధ్యత వహించని ట్రంపుని ఈ సాధారణ ప్రజలు ఎలా సహించారు?
(11) అనాదిగా వుండిన నేటివ్ అమెరికన్లని అణగగొట్టిన వలసదార్ల చేత ఏర్పడ్డది అమెరికా! ఇలాంటి దేశ ప్రతినిధిగా, పొట్టకూటి కోసం వలసవచ్చిన వారికి వ్యతిరేకంగా వుండే ట్రంపుకి ఈ సాధారణ ప్రజలు ఎలా ఓట్లు వేశారు?
(12) సాధారణ ప్రజల సోషల్ సెక్యూరిటీ వసతులకీ, వారి మెడికల్ వసతులకీ భంగం కలిగిస్తానంటున్న ఈ రాజకీయ వేత్త ట్రంపుని ఎలా నమ్మారు?
(13) బిలియనీర్ అయినా సరే, గవర్నమెంటుకి ఏవో నష్టాలు చూపించి ఎన్నో యేళ్ళు పన్నులు కట్టని ఈ ట్రంపుని ఈ ప్రజలు క్షమించేశారు, వారు పన్నులు కడుతూ!
ఈ విషయాల వల్ల మనకి ఏం అర్థమవుతుందీ? అమెరికాలో అత్యధిక సాధారణ ప్రజల చైతన్య స్థాయి ఇలా వుందీ – అని. ఈ అమెరికా సాధారణ ప్రజలు, ఇండియాలోని అత్యధిక సాధారణ ప్రజలతో పోల్చినప్పుడు, పేదరికంలోనూ, విద్యాలేమి తోనూ లేరు. అయినా సరే, వీరి చైతన్య స్థాయి ఇలాగే వుంది. మోసపోయే వాళ్ళున్నంత వరకూ మోసగించే వాళ్ళు వుంటారు. చెయ్యాల్సినది ఆ మోసపోయే వాళ్ళకి చైతన్యం కలిగించడం. ఆ పని ఎవరు చెయ్యాలి? ఎంత వరకూ సాధ్యం అనేది వేరే విషయం!
-జె.యు.బి.వి. ప్రసాద్
వ్యాసకర్త రచయిత (క్యూపెర్టినో, కాలిఫోర్నియా నుంచి)
Comments
Please login to add a commentAdd a comment