Donald John Trump
-
అమెరికా ఓటర్లకు పట్టని గుణగణాలు
డోనాల్డ్ జాన్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక, చాలా వివరాలతో చాలా వ్యాసాలు ప్రచురితమయ్యాయి. వాటి లోని ఎక్కువ విషయాలు మేధావు లకు మాత్రమే అర్థం అయ్యేటట్టు వున్నాయనడంలో సందేహం లేదు. కానీ ఎక్కువ ఓట్లు వేసి గెలిపించింది సాధారణ మనుషులే గానీ, మేధావులు కాదు. ఈ సాధారణ మనుషులు ఏ విషయాలతో ప్రభావితం అయి ఓట్లు వేశారు? ఈ సాధారణ మనుషులకు పట్టని విషయాలు కూడా ఉన్నాయా? (1) ట్రంపును స్త్రీల మీద అత్యాచారాలు చేసేవాడిగా ఒక సివిల్ కోర్టు జ్యూరీ నిర్ణయించి, తీర్పును ఇచ్చింది. ట్రంపు దాని మీద అపీల్ చేసుకున్నాడు కూడా. అయినా సరే, స్త్రీలతో సహా ఎంతో మంది తమ ఓటును ట్రంపుకు వేశారంటే, వారికి న్యాయస్థానాల మీద నమ్మకం లేనట్టా? (2) ఒక అశ్లీల చిత్రాల నటీమణితో తనకున్న సంబంధాన్ని దాచి వుంచడానికి, ట్రంపు ఆమెకి డబ్బు ఇచ్చి, ఆ డబ్బును దొంగ లెక్కలలో చూపించాడని ఒక క్రిమినల్ కోర్టు జ్యూరీ నిర్ణయించి, తీర్పు ఇచ్చింది. జైలు శిక్షను ప్రకటించడం మాత్రం ఆలస్యం చేసింది రాజకీయ కారణాల వల్ల. శిక్షను ఇంకా ప్రకటించలేదు కాబట్టి, ట్రంప్ దీన్ని ఇంకా అపీల్ చేసుకోలేదు. ఇది కూడా సాధారణ ప్రజలకు పట్టలేదు. (3) 2020 ఎన్నికలలో ఓడిపోయాక, ట్రంప్, ఎన్నో గవర్నమెంటు రహస్య పత్రాలను చట్టవ్యతిరేకంగా సొంత ఇంటికి తీసుకుపోతే, అతని చేత నియామకమయిన జడ్జి ఒకావిడ, ఏదో కారణం చూపించి ఆ కేసును కొట్టివేసింది. (4) 2020 ఎన్నికలలో ఓడిపోయాక, ట్రంప్, తన అనుచరులను రెచ్చగొట్టి ప్రభుత్వ భవనం మీదకి ఉసి గొలిపాడు. ఆ అనుచరులు చేసిన విధ్వంసకాండ అంతా అన్ని టీవీలలోనూ వచ్చింది. ట్రంప్ అనుచరులను ఎంతో మందిని జైల్లో పెట్టారు. వారందరినీ బయటకు తీసుకు వస్తానని ట్రంప్, ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేశాడు. ఈ విషయాలన్నీ తెలిసిన ప్రజలు, మళ్ళీ ఓట్లు వేశారు. (5) కోవిడ్ సమయంలో, ట్రంప్ అసమర్థత వల్ల ఎంతో మంది మరణించడం అనేది 2020 ఎన్నికల్లో అతను ఓడిపోయాడనడానికి ఒక కారణమని అందరికీ తెలుసు.(6) డబ్బూ, ఖ్యాతీ వున్న మొగవాళ్ళు, ఆడవాళ్ల జననాంగాలని పట్టుకోవచ్చుననీ, ఆ ఆడవాళ్ళు ఏమీ అనరనీ, ట్రంప్ పబ్లిక్‌గా అన్నాడు. అయినా, ఎంతో మంది ఆడవాళ్ళు అతనికే ఓటు వేశారు!(7) స్త్రీలకి తమ శరీరం మీద తమకు హక్కు లేదనీ, అత్యాచారానికి గురయిన పదేళ్ళ బాలికయినా శిశువును కని తీరాల్సిందేననీ, తల్లి ప్రాణం మీదకి వచ్చినా సరే, ఆ తల్లికి అబార్షన్ చేయ కూడదనీ చెప్పే ఈ ట్రంపుకు, ఆ స్త్రీలే ఎలా ఓట్లు వేశారు? (8) రాజకీయ శత్రువులందరినీ, తను నెగ్గాక జైళ్ళలో పడేస్తానని ట్రంప్ అన్నా, ఈ సాధారణ జనాలకి ఆ మాటలు పట్టలేదు. చదవండి: డోనాల్డ్ ట్రంప్ పాలన ఎలా ఉండనుంది?(9) ‘అందమైన తన కూతురు నిజంగా తన కూతురు కాకపోతే, ఆమెతో డేటింగ్ చేసేవాడి’నన్న ఆ తండ్రిని ఈ సాధారణ జనాలు క్షమించేశారు. (10) రాజ్యాంగంలోని ఒక సూత్రాన్ని యాంత్రికంగా అన్వయించుకుని, చిన్న పిల్లలకి కూడా తుపాకీలు దొరికేలా వ్యాపార పరిస్థితు లను నెలకొల్పి, ఎన్నో స్కూళ్ళలో జరిగిన కాల్పులకి ఏ మాత్రం బాధ్యత వహించని ట్రంపుని ఈ సాధారణ ప్రజలు ఎలా సహించారు? (11) అనాదిగా వుండిన నేటివ్ అమెరికన్లని అణగగొట్టిన వలసదార్ల చేత ఏర్పడ్డది అమెరికా! ఇలాంటి దేశ ప్రతినిధిగా, పొట్టకూటి కోసం వలసవచ్చిన వారికి వ్యతిరేకంగా వుండే ట్రంపుకి ఈ సాధారణ ప్రజలు ఎలా ఓట్లు వేశారు? (12) సాధారణ ప్రజల సోషల్ సెక్యూరిటీ వసతులకీ, వారి మెడికల్ వసతులకీ భంగం కలిగిస్తానంటున్న ఈ రాజకీయ వేత్త ట్రంపుని ఎలా నమ్మారు? (13) బిలియనీర్ అయినా సరే, గవర్నమెంటుకి ఏవో నష్టాలు చూపించి ఎన్నో యేళ్ళు పన్నులు కట్టని ఈ ట్రంపుని ఈ ప్రజలు క్షమించేశారు, వారు పన్నులు కడుతూ! ఈ విషయాల వల్ల మనకి ఏం అర్థమవుతుందీ? అమెరికాలో అత్యధిక సాధారణ ప్రజల చైతన్య స్థాయి ఇలా వుందీ – అని. ఈ అమెరికా సాధారణ ప్రజలు, ఇండియాలోని అత్యధిక సాధారణ ప్రజలతో పోల్చినప్పుడు, పేదరికంలోనూ, విద్యాలేమి తోనూ లేరు. అయినా సరే, వీరి చైతన్య స్థాయి ఇలాగే వుంది. మోసపోయే వాళ్ళున్నంత వరకూ మోసగించే వాళ్ళు వుంటారు. చెయ్యాల్సినది ఆ మోసపోయే వాళ్ళకి చైతన్యం కలిగించడం. ఆ పని ఎవరు చెయ్యాలి? ఎంత వరకూ సాధ్యం అనేది వేరే విషయం! -జె.యు.బి.వి. ప్రసాద్ వ్యాసకర్త రచయిత (క్యూపెర్టినో, కాలిఫోర్నియా నుంచి) -
విజయాలు.. వివాదాలతో సహజీవనం!
‘కఠిన కాలాన్ని ఎదుర్కోవడం అద్భుతమైన అనుభవం. జీవితంలో ఒక్కసారైనా ఆ అనుభవం పొందాలి’– అమెరికా 45వ అధ్యక్షుడైన డొనాల్డ్ జాన్ ట్రంప్‌నకు ఇష్టమైన సొంత కొటేషన్ ఇది. ట్రంప్ జీవితాన్ని కొంతవరకు ఈ కొటేషన్ ప్రతిబింబిస్తుంది. ట్రంప్ జీవితంలో విజయాలు, వైఫల్యాలు, వివాదాలు.. ప్రశంసలు, విమర్శలు.. అవహేళనలు, ఆత్మీయతలు.. అన్నీ కనిపిస్తాయి. అదీ ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అన్నింటినీ ఆయన ఒక్కలాగే తీసుకోవడం కూడా కనిపిస్తుంది. ‘డబ్బు కోసం నేను పనిచేయడం లేదు. నా దగ్గర కావల్సినంత డబ్బు ఉంది. అవసరమైన దానికన్నా ఎక్కువే ఉంది. పని చేయడం కోసమే పని చేస్తున్నాను. వ్యాపారం నా కళాత్మక విధానం’ అంటారు ట్రంప్. తండ్రి ఫేమస్ రియల్టర్ డొనాల్డ్ ట్రంప్ న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో ఫ్రెడెరిక్ ట్రంప్, మేరీ మెక్లియడ్ దంపతులకు 1946 జూన్ 14 వ తేదీన జన్మించారు. ఫ్రెడెరిక్ ట్రంప్ క్వీన్స్‌లో పేరెన్నిక గన్న బిల్డర్, రియల్టర్. క్వీన్స్, స్టేటెన్ ఐలాండ్, బ్రూక్లిన్ల్లో మధ్యతరగతి వాసులకు చవకగా అపార్ట్మెంట్స్ నిర్మించి ఇచ్చేవాడు. మేరీ కుటుంబం స్కాట్లాండ్ నుంచి వలస వచ్చింది. ఫ్రెడ్, మేరీల వివాహం 1936లో జరిగింది. వారి ఐదుగురు పిల్లల్లో డొనాల్డ్ ట్రంప్ నాలుగవ వాడు. ఫోర్డమ్ యూనివర్సిటీ, వార్టన్ స్కూల్ ఆఫ్ ఫైనాన్స్, న్యూయార్క్ మిలటరీ అకాడమీల్లో ట్రంప్ విద్యనభ్యసించారు. మిలటరీ అకాడెమీలో స్టార్ అథ్లెట్‌గా, విద్యార్థి నాయకుడిగా ట్రంప్ నిలిచారు. ఆ తరువాత తన తండ్రి వారసత్వంగా రియల్టీ బిజినెస్‌లోకి దిగారు. కొద్ది కాలంలోనే అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగారు. మన్‌హటన్‌లో భారీ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తిచేశారు. 1980లో న్యూయార్క్‌లో ప్రారంభించిన ‘గ్రాండ్ హయత్ న్యూయార్క్’ ప్రాజెక్టు ఆయనకు డెవలపర్‌గా గొప్ప పేరు తీసుకువచ్చింది. రియాలిటీ టీవీ స్టార్ గానూ ట్రంప్ ప్రఖ్యాతి గాంచారు. ‘ది అప్రెంటిస్’ పేరుతో ఆయన ప్రారంభించిన రియాలిటీ షో బాగా పాపులర్ అయింది. ఆ తరువాత రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్న ట్రంప్.. రిపబ్లికన్ పార్టీలో సభ్యత్వం తీసుకున్నారు. 2015లో మెజారిటీ ప్రైమరీల్లో, కాకస్‌ల్లో విజయం అనంతరం రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా 2016 ఎన్నికల బరిలో నిలిచి, గెలిచారు. సోదరుడి ప్రభావం మద్యం వ్యసనానికి లోనై చనిపోయిన తన సోదరుడు ఫ్రెడ్ ట్రంప్ జూనియర్ ప్రభావం డొనాల్డ్ ట్రంప్‌పై ఎక్కువగా ఉంటుంది. ఈ విషయం ట్రంప్ పలు సందర్భాల్లో స్వయంగా చెప్పారు. సోదరుడి మరణం తరువాత తాను ఆల్కహాల్ ముట్టనని, డ్రగ్స్ తీసుకోనని ట్రం ప్ శపథం చేశారు. మతపరంగా, ట్రంప్‌ను ఆయన తల్లి ప్రెస్బిటేరియన్‌గా పెంచినప్పటికీ.. తనను తాను మెయిన్‌లైన్ ప్రొటెస్టెంట్నని ఆయన చెప్పుకుంటారు. ట్రంప్ వ్యాపారాల్లో ముఖ్యమైనవి ట్రంప్ ఆర్గనైజేషన్, అట్లాంటిక్‌లో కేసినోలు, టీవీ షోలు. ద ఆర్ట్ ఆఫ్ ద డీల్ 1987లో టోనీ ష్వాజ్తో కలిసి ట్రంప్ ‘ద ఆర్ట్ ఆఫ్ ద డీల్’ అనే పుస్తకం రాశారు. అందులో తన వ్యాపార విజయరహస్యాలను వివరించారు. న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్స్ లిస్ట్‌లో ఆ పుస్తకం నిలిచింది. కానీ, ఎన్ని కాపీలు అమ్ముడయ్యాయనే విషయంలో కచ్చితమైన సమాచారం లేదు. ‘క్రిపుల్డ్ అమెరికా: హౌ టు మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ అనే పుస్తకం కూడా ట్రంప్ రాశారు. 2005లో ఆయన ‘ట్రంప్ యూనివర్సిటీ’ని స్థాపించారు. అందులో రియల్ ఎస్టేట్ వ్యాపార మెళకువలను కోర్సులుగా నేర్పించేవారు. ఇవానా.. మేపుల్స్.. మెలానియా ట్రంప్ మొదట 1977లో ఇవానాను వివాహం చేసుకున్నారు. ఇవానా అప్పటికే ప్రముఖ ఫ్యాషన్ మోడల్. వారికి ముగ్గురు పిల్లలు. వారు డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఇవాంకా, ఎరిక్. 1992లో ట్రంప్, ఇవానా విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత, 1993లో ట్రంప్ మార్లా మేపుల్స్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆమె నటి. వారికి టిఫానా అనే కూతురు ఉంది. 1999లో మేపుల్స్‌కు 20 లక్షల డాలర్ల పరిహారం చెల్లించి ట్రంప్ విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత 2005లో మెలానియాను ట్రంప్ వివాహమాడారు. ఆమె స్లొవేనియాకు చెందిన మాజీ మోడల్. ట్రంప్ కన్నా వయసులో 23 ఏళ్లు చిన్న. ట్రంప్, మెలానియాల సంతానం బారన్ విలియమ్. డొనాల్డ్ ట్రంప్ పిల్లల్లో డొనాల్డ్ జూనియర్, ఎరిక్‌లు వారి కుటుంబ వ్యాపార సామ్రాజ్యం ‘ట్రంప్ ఆర్గనైజేషన్’లో వైస్ ప్రెసిడెంట్స్‌గా ఉన్నారు. -
ఎవరీ ట్రంప్.. ఏమిటి ఆయన కథ?
న్యూయార్క్: డోనాల్డ్ జాన్ ట్రంప్.. కఠినమైన సవాళ్లను ఎదుర్కొని, బలమైన ప్రత్యర్థిని చిత్తుచేసిన విజేత. అమెరికా 45వ అధ్యక్షుడిగా అగ్రరాజ్యం భవిష్యత్తును నిర్ణయించబోయే ప్రజానేత. మంగళవారం రాత్రి నుంచి వెలువడుతున్న ఫలితాలలో ట్రంప్ టోర్నడోను చూసి ‘ఇన్నాళ్లూ కంపు వ్యాఖ్యలు చేసిన ఇతనేనా గెలిచింది?’ అని విస్తుపోయిన చాలామంది.. నిదానంగా చేదు నిజాన్ని జీర్ణం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. 2008 నాటి ఒబామా ప్రభంజనంతో సమానంగా 2016లో ట్రంప్ భారీ మెజారిటీ సాధించాడు. 538 ఎలక్టోరల్ ఓట్లకుగానూ ఏకంగా 300 పైచిలుకు స్థానాలను ఖాతాలోవేసుకున్నాడు. అయితే అధ్యక్షుడు కావాలనే ట్రంప్ కల ఈనాటిదికాదు.. 2000 సంత్సరంలో మొదటిసారి అధ్యక్ష బరిలో నిలిచి అనూహ్యంగా తప్పుకున్నాడు. డోనాల్డ్ ట్రంప్ జీవితానికి సంబంధించిన సాధారణ, ఆసక్తికర విషయాలే ఈ ‘ఎవరీ ట్రంప్.. ఏమిటి ఆయన కథ?’ కథనం.. ‘బార్న్ విత్ గోల్డ్ స్పూన్’ అంటారు కదా, డోనాల్డ్ జాన్ ట్రంప్ కూడా అలాంటి సంపన్న కుటుంబంలోనే పుట్టాడు. ఫ్రెడ్ ట్రంప్, మేరీల నాలుగో సంతానంగా 1946, జూన్ 14న న్యూయార్క్ శివారు క్వీన్స్ లో జన్మించాడు. ట్రంప్ తండ్రివి జర్మన్ మూలాలుకాగా, తల్లి పూర్వీకులది స్కాట్ లాండ్. ఏడెనిమిది తరాల కిందటే ట్రంప్ కుటుంబం అమెరికాకు వలసవచ్చింది. ప్రెడ్ ట్రంప్ న్యూయార్క్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. కాలం క్రమంలో ‘ఎలిజబెత్ ట్రంప్ అండ్ సన్స్’ స్థాపించి లాభాలు గడించాడు. న్యూయార్క్ లోనే పుట్టి పెరిగిన డోనాల్డ్ ట్రంప్.. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా అనుబంధ వార్టన్ స్కూల్ నుంచి 1968లో ఎకనామిక్ పట్టాపుచ్చుకున్నారు. ఉరకలేసే ఉత్సాహవంతుడైన యువకుడిగా 1971 నాటికి తండ్రి స్థాపించిన సంస్థ పగ్గాలు చేపట్టాడు. వస్తూనే కంపెనీ పేరును ‘ట్రంప్ ఆర్గనైజేషన్’గా మార్చుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మొదట్లో పేద, మధ్యతరగతి వర్గాల కోసం పెద్ద సంఖ్యలో అపార్ట్ మెంట్లు నిర్మించిన ట్రంప్.. అనతికాలంలోనే తన కార్యాలయాన్ని న్యూయార్క్ వ్యాపార కేంద్రం మాన్ హట్టన్ కు మార్చేశారు. అనంతర కాలంలో లెక్కకుమించి భారీ టవర్లు, హోటళ్లు, క్యాసినో, గోల్ఫ్ కోర్సులు నిర్మించి ‘ట్రంప్’ను పెద్ద బ్రాండ్ గా మార్చేశారు. ఈ క్రమంలో పెద్ద మొత్తంలో సంపదనూ పోగేశారు. ట్రంప్ ఆస్తుల విలువ ఎంతంటే.. రియాలిటీ రంగంలో సక్సెస్ సాధించాక ట్రంప్ చూపు ఎంటర్ టైన్ మెంట్ రంగం వైపునకు మళ్లింది. టీవీ షోలు నిర్మించడమేకాక స్వయంగా ‘ది అప్రెంటిస్’అనే కార్యక్రమానికి హోస్ట్ గానూ వ్యవహరించాడు. 2004-2015 మధ్య కాలంలో ఎన్ బీసీ చానెల్ లో ఈ కార్యక్రమం ప్రసారమైంది. అందాల పోటీలపైనా మక్కువ చూపించే ట్రంప్.. 1996 నుంచి 2015దాకా జరిగిన ‘మిస్ యూఎస్ఏ’ పోటీలు అన్నింటికీ హాజరయ్యారు. డబ్బుతోపాటు పేరు కూడా సంపాదించిన తర్వాత రాజకీయ రంగప్రవేశం చేయాలనుకున్న ఆయన.. 2000 సంవత్సరంలో రిఫార్మ్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా పోటీకి దిగారు. అయితే పార్టీ నామినేషన్ ఖరారు కాకముందే ప్రయత్నాలను విరమించుకున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో తనకు విరాళాలు అవసరంలేదని(మొదట్లో) ట్రంప్ ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశమైంది. (ఆ తర్వాత ఆయన విరాళాలు ఎలాగూ స్వీకరించారనుకోండి). అసలింతకీ ట్రంప్ దగ్గరున్న సంపద ఎంతుందంటే.. అమెరికాలో అత్యంత ధనవంతుల జాబితాలో ట్రంప్ స్థానం 156. ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక 2015లో వెల్లడించిన వివరాల ప్రకారం ట్రంప్ ప్రపంచ కుబేరుల్లో 324వ స్థానంలో ఉన్నాడు. ఈ లెక్కన అతని సంపద ఎంతో మీరే ఊహించుకోవచ్చు. మధ్యవయస్కుడిగా ఉన్నప్పటి నుంచి రాజకీయాల్లోకి రావాలనుకున్న ట్రంప్ 70వ పడిలోగానీ.. 2015 జూన్ లో ‘రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేస్తా’అని ప్రకటించారు. అరడజను మంది పోటీదారుల్లో ఒకడిగా ప్రారంభమైన ట్రంప్ ప్రస్థానం.. అమెరికా ఉద్యోగాలన్నీ అమెరికన్లకేనన్న ప్రకటనతో ఊహించని మలుపు తిరిగింది. అదే సమయంలో ముస్లింలపై, మహిళల అబార్షన్లపై, చైనీస్, ఇండియన్, మెక్సికన్లపై ఆయన చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలు మీడియా, ప్రజల దృష్టిని తనవైపునకు తిప్పుకునేలా చేశాయి. ట్రంప్ నోటి దురుసును, రాజకీయ అనుభవలేమిని ప్రశ్నిస్తూ సాక్షాత్తూ రిపబ్లికన్ పార్టీ పెద్దలే అతని అభ్యర్థిత్వాన్ని సవాలు చేశారు. ఒక దశలో కాంగ్రెస్ స్పీకర్ సైతం ట్రంప్ గెలుపును అంగీకరించబోనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఏమనుకున్నా ట్రంప్ వెనక్కి తగ్గలేదు. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ నినాదంతో ప్రజలకు మరింత చేరువయ్యారు. బలమైన, అనుభవజ్ఞురాలైన డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ను తెలివిగా ఎదుర్కొన్నారు. ఎగ్జిట్ పోల్స్ రూపంలో వీచిన వ్యతిరేక పవనాలను తట్టుకుని, అమెరికన్ల మనసులు గెలుచుకుని ఆ దేశానికి 45వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ట్రంప్ వ్యక్తిగత జీవితం.. 1977లో ఇవాంకా ట్రంప్ ను పెళ్లాడిన ట్రంప్.. 1991లో ఆమెకు విడాకులిచ్చారు. రెండేళ్లు గడిచాక మార్లా జెల్నికోవాను పెళ్లాడి 1999లో ఆమెకూ విడాకులిచ్చారు. తర్వాతి ఆరేళ్లూ ఒంటరిగా జీవితాన్ని గడిపిన ట్రంప్.. 2005లో మెలానియాను పెళ్లాడారు. జనవరిలో అమెరికా ప్రథమ మహిళగా వైట్ హౌస్ లో అడుగుపెట్టబోయేది ఈవిడే. ముగ్గురు భార్యలద్వారా ట్రంప్ కు కలిగిన సంతానం మొత్తం ఐదుగురు సంతానం. డోనాల్డ్ జూనియర్, ఇవాంకా, ఎరిక్, టిఫ్పనీ, బరూన్ లు. తన పెద్దన్నయ్య ఫ్రెడ్ జూనియర్ ట్రంప్ తాగుడుకు బానిసై(1981లో) చనిపోవడం ఎంతగానో కలిచివేసిందని, అప్పటి నుంచి సిగరెట్లు, మద్యానికి దూరంగా ఉంటానని డోనాల్డ్ ట్రంప్ పలుమార్లు పేర్కొన్నారు.