హిల్లరీ దంపతులతో ట్రంప్(పాత ఫొటో)
న్యూయార్క్: డోనాల్డ్ జాన్ ట్రంప్.. కఠినమైన సవాళ్లను ఎదుర్కొని, బలమైన ప్రత్యర్థిని చిత్తుచేసిన విజేత. అమెరికా 45వ అధ్యక్షుడిగా అగ్రరాజ్యం భవిష్యత్తును నిర్ణయించబోయే ప్రజానేత. మంగళవారం రాత్రి నుంచి వెలువడుతున్న ఫలితాలలో ట్రంప్ టోర్నడోను చూసి ‘ఇన్నాళ్లూ కంపు వ్యాఖ్యలు చేసిన ఇతనేనా గెలిచింది?’ అని విస్తుపోయిన చాలామంది.. నిదానంగా చేదు నిజాన్ని జీర్ణం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు.
2008 నాటి ఒబామా ప్రభంజనంతో సమానంగా 2016లో ట్రంప్ భారీ మెజారిటీ సాధించాడు. 538 ఎలక్టోరల్ ఓట్లకుగానూ ఏకంగా 300 పైచిలుకు స్థానాలను ఖాతాలోవేసుకున్నాడు. అయితే అధ్యక్షుడు కావాలనే ట్రంప్ కల ఈనాటిదికాదు.. 2000 సంత్సరంలో మొదటిసారి అధ్యక్ష బరిలో నిలిచి అనూహ్యంగా తప్పుకున్నాడు. డోనాల్డ్ ట్రంప్ జీవితానికి సంబంధించిన సాధారణ, ఆసక్తికర విషయాలే ఈ ‘ఎవరీ ట్రంప్.. ఏమిటి ఆయన కథ?’ కథనం..
‘బార్న్ విత్ గోల్డ్ స్పూన్’ అంటారు కదా, డోనాల్డ్ జాన్ ట్రంప్ కూడా అలాంటి సంపన్న కుటుంబంలోనే పుట్టాడు. ఫ్రెడ్ ట్రంప్, మేరీల నాలుగో సంతానంగా 1946, జూన్ 14న న్యూయార్క్ శివారు క్వీన్స్ లో జన్మించాడు. ట్రంప్ తండ్రివి జర్మన్ మూలాలుకాగా, తల్లి పూర్వీకులది స్కాట్ లాండ్. ఏడెనిమిది తరాల కిందటే ట్రంప్ కుటుంబం అమెరికాకు వలసవచ్చింది. ప్రెడ్ ట్రంప్ న్యూయార్క్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. కాలం క్రమంలో ‘ఎలిజబెత్ ట్రంప్ అండ్ సన్స్’ స్థాపించి లాభాలు గడించాడు. న్యూయార్క్ లోనే పుట్టి పెరిగిన డోనాల్డ్ ట్రంప్.. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా అనుబంధ వార్టన్ స్కూల్ నుంచి 1968లో ఎకనామిక్ పట్టాపుచ్చుకున్నారు.
ఉరకలేసే ఉత్సాహవంతుడైన యువకుడిగా 1971 నాటికి తండ్రి స్థాపించిన సంస్థ పగ్గాలు చేపట్టాడు. వస్తూనే కంపెనీ పేరును ‘ట్రంప్ ఆర్గనైజేషన్’గా మార్చుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మొదట్లో పేద, మధ్యతరగతి వర్గాల కోసం పెద్ద సంఖ్యలో అపార్ట్ మెంట్లు నిర్మించిన ట్రంప్.. అనతికాలంలోనే తన కార్యాలయాన్ని న్యూయార్క్ వ్యాపార కేంద్రం మాన్ హట్టన్ కు మార్చేశారు. అనంతర కాలంలో లెక్కకుమించి భారీ టవర్లు, హోటళ్లు, క్యాసినో, గోల్ఫ్ కోర్సులు నిర్మించి ‘ట్రంప్’ను పెద్ద బ్రాండ్ గా మార్చేశారు. ఈ క్రమంలో పెద్ద మొత్తంలో సంపదనూ పోగేశారు.
ట్రంప్ ఆస్తుల విలువ ఎంతంటే..
రియాలిటీ రంగంలో సక్సెస్ సాధించాక ట్రంప్ చూపు ఎంటర్ టైన్ మెంట్ రంగం వైపునకు మళ్లింది. టీవీ షోలు నిర్మించడమేకాక స్వయంగా ‘ది అప్రెంటిస్’అనే కార్యక్రమానికి హోస్ట్ గానూ వ్యవహరించాడు. 2004-2015 మధ్య కాలంలో ఎన్ బీసీ చానెల్ లో ఈ కార్యక్రమం ప్రసారమైంది. అందాల పోటీలపైనా మక్కువ చూపించే ట్రంప్.. 1996 నుంచి 2015దాకా జరిగిన ‘మిస్ యూఎస్ఏ’ పోటీలు అన్నింటికీ హాజరయ్యారు. డబ్బుతోపాటు పేరు కూడా సంపాదించిన తర్వాత రాజకీయ రంగప్రవేశం చేయాలనుకున్న ఆయన.. 2000 సంవత్సరంలో రిఫార్మ్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా పోటీకి దిగారు. అయితే పార్టీ నామినేషన్ ఖరారు కాకముందే ప్రయత్నాలను విరమించుకున్నారు.
ప్రస్తుత ఎన్నికల్లో తనకు విరాళాలు అవసరంలేదని(మొదట్లో) ట్రంప్ ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశమైంది. (ఆ తర్వాత ఆయన విరాళాలు ఎలాగూ స్వీకరించారనుకోండి). అసలింతకీ ట్రంప్ దగ్గరున్న సంపద ఎంతుందంటే.. అమెరికాలో అత్యంత ధనవంతుల జాబితాలో ట్రంప్ స్థానం 156. ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక 2015లో వెల్లడించిన వివరాల ప్రకారం ట్రంప్ ప్రపంచ కుబేరుల్లో 324వ స్థానంలో ఉన్నాడు. ఈ లెక్కన అతని సంపద ఎంతో మీరే ఊహించుకోవచ్చు.
మధ్యవయస్కుడిగా ఉన్నప్పటి నుంచి రాజకీయాల్లోకి రావాలనుకున్న ట్రంప్ 70వ పడిలోగానీ.. 2015 జూన్ లో ‘రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేస్తా’అని ప్రకటించారు. అరడజను మంది పోటీదారుల్లో ఒకడిగా ప్రారంభమైన ట్రంప్ ప్రస్థానం.. అమెరికా ఉద్యోగాలన్నీ అమెరికన్లకేనన్న ప్రకటనతో ఊహించని మలుపు తిరిగింది. అదే సమయంలో ముస్లింలపై, మహిళల అబార్షన్లపై, చైనీస్, ఇండియన్, మెక్సికన్లపై ఆయన చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలు మీడియా, ప్రజల దృష్టిని తనవైపునకు తిప్పుకునేలా చేశాయి.
ట్రంప్ నోటి దురుసును, రాజకీయ అనుభవలేమిని ప్రశ్నిస్తూ సాక్షాత్తూ రిపబ్లికన్ పార్టీ పెద్దలే అతని అభ్యర్థిత్వాన్ని సవాలు చేశారు. ఒక దశలో కాంగ్రెస్ స్పీకర్ సైతం ట్రంప్ గెలుపును అంగీకరించబోనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఏమనుకున్నా ట్రంప్ వెనక్కి తగ్గలేదు. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ నినాదంతో ప్రజలకు మరింత చేరువయ్యారు. బలమైన, అనుభవజ్ఞురాలైన డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ను తెలివిగా ఎదుర్కొన్నారు. ఎగ్జిట్ పోల్స్ రూపంలో వీచిన వ్యతిరేక పవనాలను తట్టుకుని, అమెరికన్ల మనసులు గెలుచుకుని ఆ దేశానికి 45వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
ట్రంప్ వ్యక్తిగత జీవితం..
1977లో ఇవాంకా ట్రంప్ ను పెళ్లాడిన ట్రంప్.. 1991లో ఆమెకు విడాకులిచ్చారు. రెండేళ్లు గడిచాక మార్లా జెల్నికోవాను పెళ్లాడి 1999లో ఆమెకూ విడాకులిచ్చారు. తర్వాతి ఆరేళ్లూ ఒంటరిగా జీవితాన్ని గడిపిన ట్రంప్.. 2005లో మెలానియాను పెళ్లాడారు. జనవరిలో అమెరికా ప్రథమ మహిళగా వైట్ హౌస్ లో అడుగుపెట్టబోయేది ఈవిడే. ముగ్గురు భార్యలద్వారా ట్రంప్ కు కలిగిన సంతానం మొత్తం ఐదుగురు సంతానం. డోనాల్డ్ జూనియర్, ఇవాంకా, ఎరిక్, టిఫ్పనీ, బరూన్ లు. తన పెద్దన్నయ్య ఫ్రెడ్ జూనియర్ ట్రంప్ తాగుడుకు బానిసై(1981లో) చనిపోవడం ఎంతగానో కలిచివేసిందని, అప్పటి నుంచి సిగరెట్లు, మద్యానికి దూరంగా ఉంటానని డోనాల్డ్ ట్రంప్ పలుమార్లు పేర్కొన్నారు.