అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించడానికి ఇంకో వారం మాత్రమే ఉంది. ఈలోపు ఆయనకు సంబంధించిన ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ట్రంప్ గనుక ఓడిపోయే ఉంటే.. ఆయనకు కచ్చితంగా శిక్ష పడేదని అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ మంగళవారం ఓ నివేదిక రిలీజ్ చేసింది.
స్పెషల్ కౌన్సెల్ జాక్ స్మిత్(Jack Smith) నివేదిక ప్రకారం.. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మోసం జరిగిందంటూ ట్రంప్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే.. ఉద్దేశపూర్వకంగానే ఆయన అసత్య ప్రచారాలకు దిగారని, తద్వారా శాంతియుతంగా అధికార మార్పిడికి భంగం కలిగించారని అభియోగాలు నమోదయ్యాయి. దీనిని తీవ్ర నేరంగా స్పెషల్ కౌన్సల్ జాక్ స్మిత్ పరిగణించారు. అంతేకాదు.. అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థను తన అబద్ధాలతో ట్రంప్ భ్రష్టు పట్టించే యత్నమూ చేశారనే పేర్కొన్నారు.
ట్రంప్‌పై అభియోన్నింటికి సరైన ఆధారాలున్నాయి. ఒకవేళ ట్రంప్ కిందటి ఏడాది నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో గనుక ఓడిపోయి ఉంటే.. ఈ నేరాలకుగానూ కచ్చితంగా శిక్ష పడేది అని ఆ నివేదిక స్పష్టం చేసింది.
అయితే అర్ధరాత్రి విడుదలైన ఈ నివేదికను ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ తప్పుబట్టారు. జాక్ స్మిత్‌ను తీవ్రంగా విమర్శించారు. ఇదిలా ఉంటే.. 2020 ఎన్నికల వ్యవహారంపై గతంలో ట్రంప్ మీద స్మిత్ అనేక ఆరోపణలను నమోదు చేశారు. ట్రంప్‌పై నమోదైన రెండు ఫెడరల్ క్రిమినల్ కేసులను ఆయనే పర్యవేక్షించారు.
అయితే ట్రంప్ అధ్యక్షుడిగా గెలవడంతో ఆయన రాజీనామా చేస్తారని ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే తాజాగా ఆయన ట్రంప్‌పై పెట్టిన అన్ని కేసులను ఉపసంహరించుకున్నారు. అంతేకాదు.. తన నివేదిక బహిర్గతం అయ్యే సమయంలోనే తన పోస్టుకు సైతం రాజీనామా చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment