అమెరికా ఎన్నికలు ముగిశాయి. అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయం దాదాపు ఖరారైంది. దీంతో ఆయన రెండోసారి అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కేందుకు సిద్ధమయ్యారు. గతంలో పాలించిన జోబైడన్, అంతకుముందు పాలించిన డొనాల్డ్ ట్రంప్ హయాంలో భారత్‌తో వాణిజ్య సంబంధాలు మెరుగ్గానే ఉన్నాయి. అయితే ఎవరి హయాంలో ఎంత వృద్ధి చెందిందో తెలుసుకుందాం.
92 శాతం పెరిగిన వాణిజ్యం
యునైటెడ్ స్టేట్స్‌కు సరుకులు ఎగుమతి చేస్తున్న దేశాల్లో చైనా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది. గత దశాబ్ద కాలంలో భారత్-అమెరికా ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య సంబంధాలు గణనీయంగా పెరిగాయి. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) వద్ద అందుబాటులో ఉన్న డేటా ప్రకారం పదేళ్లలో యూఎస్‌తో భారత వాణిజ్యం 92 శాతం పెరిగింది. 2014లో ఇది 61.5 బిలియన్ డాలర్లు(రూ.5.13 లక్షల కోట్లు)గా ఉండేది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం ఏకంగా 118.3 బిలియన్ల(రూ.9.87 లక్షల కోట్లు)కు చేరుకుంది. ఈ నేపథ్యంలో అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్‌ను ఎన్నుకోనుండడంతో రానున్న రోజుల్లో ద్వైపాక్షిక వాణిజ్యం ఆసక్తికరంగా మారనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
గరిష్ఠ ఎగుమతులుండే విభాగాలు..
యూఎస్‌కు 2023-24లో భారత ఎగుమతులు 77.53 బిలియన్లుగా(రూ.6.47 లక్షల కోట్లు) ఉన్నాయి. ఇది అంతకుముందు సంవత్సరం గరిష్టంగా ఉన్న 78.40 బిలియన్లుగా(రూ.6.54 లక్షల కోట్లు) నమోదయ్యాయి. గత పదేళ్లలో భారత్ ఎగుమతులు 2014లో 39.1 బిలియన్ల(రూ.3.26 లక్షల కోట్లు) నుంచి 2024 వరకు 98 శాతం పెరిగి 77.5 బిలియన్ల(రూ.6.48 లక్షల కోట్లు)కు చేరుకున్నాయి. ఇంజినీరింగ్ ఉత్పత్తులు, రసాయనాలు, ఎలక్ట్రానిక్స్‌తో సహా భారతీయ వస్తువులకు అమెరికాలో భారీ గిరాకీ ఉంది.
డొనాల్డ్ ట్రంప్-జోబైడెన్ హయాంలో ఇలా..
డొనాల్డ్ ట్రంప్ హయాంలో జనవరి 2017 నుంచి జనవరి 2021 వరకు అమెరికాకు భారతదేశ ఎగుమతులు నాలుగేళ్లలో 22 శాతం పెరిగాయి. జోబైడెన్ హయాంలో అమెరికాకు దేశ ఎగుమతులు కేవలం మూడు సంవత్సరాల్లో(2025 ఆర్థిక సంవత్సరం డేటా ఇంకా అందుబాటులో లేదు) 51 శాతం అధికమయ్యాయి. ట్రంప్ హయాంలో నాలుగేళ్ల(2018-21)లో అమెరికా నుంచి భారత్ దిగుమతులు 29% పెరిగాయి. మరోవైపు జోబైడెన్ హయాంలో మూడేళ్లలో భారత్ దిగుమతులు 42% అధికమయ్యాయి.
ఇదీ చదవండి: ఆఫీస్‌కు రండి.. లేదా కంపెనీ మారండి!
విభాగాల వారీగా ఎగుమతుల విలువ
ఇంజినీరింగ్ వస్తువులు 16.3 బిలియన్ డాలర్లు(రూ.1.36 లక్షల కోట్లు)
రసాయనాలు, సంబంధిత ఉత్పత్తులు 12.8 బిలియన్ డాలర్లు(రూ.1.07 లక్షల కోట్లు)
ఎలక్ట్రానిక్ వస్తువులు 10.5 బిలియన్ డాలర్లు(రూ.88000 కోట్లు)
రత్నాలు, ఆభరణాలు 9.9 బిలియన్ డాలర్లు (రూ.83 వేలకోట్లు)
పెట్రోలియం ఉత్పత్తులు 5.8 బిలియన్ డాలర్లు (రూ.48,760 కోట్లు)
ఇతర ఉత్పత్తులు సంయుక్తంగా 22.2 బిలియన్ డాలర్లు(రూ.1.86 లక్షల కోట్లు)
Comments
Please login to add a commentAdd a comment