Biden
-
రష్యాపై భీకర దాడులకు బైడెన్ పచ్చజెండా
బ్రెజీలియా: ఉక్రెయిన్–రష్యా మధ్య యుద్ధం మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి. ఉత్తర కొరియా నుంచి వేలాది మంది సైనికులను రష్యా దిగుమతి చేసుకుంటోంది. వారిని ఉక్రెయిన్ సరిహద్దుల్లో మోహరిస్తోంది. ఉక్రెయిన్‌పై భీకర దాడులకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనికి విరుగుడుగా ఉక్రెయిన్, దాని మిత్రపక్షాలు కొత్త వ్యూహానికి తెరతీశాయి. ఉక్రెయిన్‌కు అందజేసిన లాంగ్రేంజ్ మిస్సైళ్ల వాడకంపై ఇప్పటిదాకా ఉన్న పరిమితులను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సడలించారు. రష్యా భూభాగంలోకి మరింత ముందుకు చొచ్చుకెళ్లి దాడులు చేసేందుకు తాజాగా అనుమతి ఇచ్చారు.అమెరికా అధికార వర్గాలు ఈ విషయం వెల్లడించాయి. బైడెన్ నుంచి అనుమతి రావడంతో ఆర్మీ టాక్టికల్ మిస్సైల్ సిస్టమ్(ఏటీఏసీఎం)ను రష్యాపై ప్రయోగించేందుకు ఆస్కారం ఏర్పడింది. దీనివల్ల రష్యాకు భారీగా నష్టం వాటిల్లే్ల అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి ముగింపు పలుకుతానని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ట్రంప్ ప్రత్యర్థి అయిన జో బైడెన్ యుద్ధాన్ని మరింత ఉధృతం చేసే దిశగా నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆదివారం దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. శత్రుదేశంపై కేవలం మాటలతో దాడులు చేయలేమంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. కొన్ని విషయాలు నోటితో చెప్పలేమని, క్షిపణులే మాట్లాడుతాయని పేర్కొన్నారు. అమెరికా సహా పశ్చిమదేశాలు ఇచ్చిన కీలక ఆయుధాలను రష్యాపై ప్రయోగించడానికి అనుమతి ఇవ్వాలంటూ జో బైడెన్‌పై కొన్ని నెలలుగా ఒత్తిడి వచ్చింది. ఆ ఒత్తిడికి తలొగ్గి ఆయన అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే సమయంలో డొనాల్డ్ ట్రంప్‌ను ఇరుకున పెట్టాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.అగ్నికి బైడెన్ ఆజ్యం పోస్తున్నారు: రష్యాఅమెరికా సరఫరా చేసిన దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యాపై ప్రయోగించడానికి అధ్యక్షుడు జో బైడెన్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంపై రష్యా అధికార వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అగ్నికి ఆజ్యం పోస్తున్నారంటూ బైడెన్‌పై మండిపడ్డాయి. తమను రెచ్చగొట్టే చర్యలు మానుకో వాలని హెచ్చరించాయి. అయితే, ఈ వ్యవహారంపై రష్యా అధినేత పుతిన్ ఇంకా స్పందించలేదు. -
ట్రంప్ విజయంపై కమలా హారిస్, జోబైడెన్ తొలి స్పందన..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చారిత్రాత్మక విజయాన్ని సాధించారు. డొనాల్డ్ ట్రంప్ తన ప్రత్యర్థి, డెమొక్రాట్ పార్టీ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను ఓడించారు.డొనాల్డ్ ట్రంప్ గెలుపుపై వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, ప్రెసిడెంట్ జో బైడెన్ల తొలి ప్రకటనలు మీడియాకు అందాయి. దానిలో కమలా హారిస్.. ఓటర్లు తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ఫలితం మనం కోరుకున్నది కాదని అమె అన్నారు. మనం నిరంతరం పోరాడుతూనే ఉందాం. ఈ ఎన్నికల ఫలితాలను మనం అంగీకరించాల్సిందేనన్నారు. అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌ను తాను కలుసుకుని, అభినందనలు తెలిపానని కమలా హారిస్ పేర్కొన్నారు.అధికార మార్పిడిలో ట్రంప్‌కు, ఆయన బృందానికి సహకరిస్తామని, ఇదంతా శాంతియుతంగా జరిగేలా చూస్తామని కమలా హారిస్ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఒక ప్రకటనలో కమలా హారిస్ చిత్తశుద్ధి మెచ్చుకోదగినదని అన్నారు. ఆమె అమెరికన్లకు ఛాంపియన్‌గా కొనసాగుతారన్నారు. జో బైడెన్.. డొనాల్డ్ ట్రంప్‌కు ఫోన్ చేసి, అభినందనలు తెలిపారు. కాగా ట్రంప్ ప్రచార ప్రతినిధి స్టీవెన్ చియుంగ్ మాట్లాడుతూ డొనాల్డ్ ట్రంప్.. బైడెన్ అభినందనలను అందుకున్నారని, త్వరలోనే బైడెన్‌ను కలుసుకోవాలని అనుకుంటున్నారని తెలిపారు.ఇది కూడా చదవండి: USA Presidential Election Results 2024: మహిళలకు మళ్లీ మొండిచెయ్యే -
ట్రంప్-బైడెన్.. ఎవరి హయాంలో భారత్ వృద్ధి ఎంత?
అమెరికా ఎన్నికలు ముగిశాయి. అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయం దాదాపు ఖరారైంది. దీంతో ఆయన రెండోసారి అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కేందుకు సిద్ధమయ్యారు. గతంలో పాలించిన జోబైడన్, అంతకుముందు పాలించిన డొనాల్డ్ ట్రంప్ హయాంలో భారత్‌తో వాణిజ్య సంబంధాలు మెరుగ్గానే ఉన్నాయి. అయితే ఎవరి హయాంలో ఎంత వృద్ధి చెందిందో తెలుసుకుందాం.92 శాతం పెరిగిన వాణిజ్యంయునైటెడ్ స్టేట్స్కు సరుకులు ఎగుమతి చేస్తున్న దేశాల్లో చైనా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది. గత దశాబ్ద కాలంలో భారత్-అమెరికా ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య సంబంధాలు గణనీయంగా పెరిగాయి. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) వద్ద అందుబాటులో ఉన్న డేటా ప్రకారం పదేళ్లలో యూఎస్‌తో భారత వాణిజ్యం 92 శాతం పెరిగింది. 2014లో ఇది 61.5 బిలియన్ డాలర్లు(రూ.5.13 లక్షల కోట్లు)గా ఉండేది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం ఏకంగా 118.3 బిలియన్ల(రూ.9.87 లక్షల కోట్లు)కు చేరుకుంది. ఈ నేపథ్యంలో అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్‌ను ఎన్నుకోనుండడంతో రానున్న రోజుల్లో ద్వైపాక్షిక వాణిజ్యం ఆసక్తికరంగా మారనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.గరిష్ఠ ఎగుమతులుండే విభాగాలు..యూఎస్‌కు 2023-24లో భారత ఎగుమతులు 77.53 బిలియన్లుగా(రూ.6.47 లక్షల కోట్లు) ఉన్నాయి. ఇది అంతకుముందు సంవత్సరం గరిష్టంగా ఉన్న 78.40 బిలియన్లుగా(రూ.6.54 లక్షల కోట్లు) నమోదయ్యాయి. గత పదేళ్లలో భారత్ ఎగుమతులు 2014లో 39.1 బిలియన్ల(రూ.3.26 లక్షల కోట్లు) నుంచి 2024 వరకు 98 శాతం పెరిగి 77.5 బిలియన్ల(రూ.6.48 లక్షల కోట్లు)కు చేరుకున్నాయి. ఇంజినీరింగ్ ఉత్పత్తులు, రసాయనాలు, ఎలక్ట్రానిక్స్‌తో సహా భారతీయ వస్తువులకు అమెరికాలో భారీ గిరాకీ ఉంది.డొనాల్డ్ ట్రంప్-జోబైడెన్ హయాంలో ఇలా..డొనాల్డ్ ట్రంప్ హయాంలో జనవరి 2017 నుంచి జనవరి 2021 వరకు అమెరికాకు భారతదేశ ఎగుమతులు నాలుగేళ్లలో 22 శాతం పెరిగాయి. జోబైడెన్ హయాంలో అమెరికాకు దేశ ఎగుమతులు కేవలం మూడు సంవత్సరాల్లో(2025 ఆర్థిక సంవత్సరం డేటా ఇంకా అందుబాటులో లేదు) 51 శాతం అధికమయ్యాయి. ట్రంప్ హయాంలో నాలుగేళ్ల(2018-21)లో అమెరికా నుంచి భారత్ దిగుమతులు 29% పెరిగాయి. మరోవైపు జోబైడెన్ హయాంలో మూడేళ్లలో భారత్ దిగుమతులు 42% అధికమయ్యాయి.ఇదీ చదవండి: ఆఫీస్‌కు రండి.. లేదా కంపెనీ మారండి!విభాగాల వారీగా ఎగుమతుల విలువఇంజినీరింగ్ వస్తువులు 16.3 బిలియన్ డాలర్లు(రూ.1.36 లక్షల కోట్లు)రసాయనాలు, సంబంధిత ఉత్పత్తులు 12.8 బిలియన్ డాలర్లు(రూ.1.07 లక్షల కోట్లు)ఎలక్ట్రానిక్ వస్తువులు 10.5 బిలియన్ డాలర్లు(రూ.88000 కోట్లు)రత్నాలు, ఆభరణాలు 9.9 బిలియన్ డాలర్లు (రూ.83 వేలకోట్లు)పెట్రోలియం ఉత్పత్తులు 5.8 బిలియన్ డాలర్లు (రూ.48,760 కోట్లు)ఇతర ఉత్పత్తులు సంయుక్తంగా 22.2 బిలియన్ డాలర్లు(రూ.1.86 లక్షల కోట్లు) -
కమలా హ్యారీస్ స్ఫూర్తిదాయక నాయకురాలు: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తమ పార్టీ నాయకురాలు, అధ్యక్ష ఎన్నికల అభ్యర్థి కమలా హ్యారీస్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. ఆమె పౌర హక్కులకు మద్దతుపలికే స్ఫూర్తిదాయక నాయకురాలని అన్నారు. టెక్సాస్‌లోని ఆస్టిన్లోని లిండాల్ బి. జాన్సన్ ప్రెసిడెన్షియల్ లైబ్రరీలో ప్రసంగించిన ఆయన తనకు పాలనలో కమలా హ్యారీస్ అద్భుత భాగస్వామ్యం అందించారని పేర్కొన్నారు.కమలా హ్యారీస్ పౌర హక్కుల విషయంలో తన గొంతును సమర్థవంతంగా వినిపిస్తూ, స్ఫూర్తిదాయక నాయకురాలుగా కొనసాగుతున్నారన్నారు. అమెరికా వైఖరిలో అందరూ సమానులే అని, తాము ఈ ఆలోచనకు ఎప్పుడూ దూరంగా వెళ్లలేదన్నారు. ఇప్పుడు కమలా కూడా ఈ స్ఫూర్తిని కొనసాగిస్తారని భావిస్తున్నానన్నారు. 81 ఏళ్ల జో బైడెన్ తాను ఎన్నికల రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అదేసమయంలో ఆయన కమలా హ్యారీస్‌కు(59)కు తన మద్దతును ప్రకటించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా కమలా హ్యారీస్‌కు మద్దతు పలికారు. -
క్వాడ్ సదస్సు కోసం భారత్‌కు బైడెన్
వాషింగ్టన్: భారత్ నేతృత్వంలో ఈ ఏడాది జరగనున్న క్వాడ్ దేశాధినేతల సదస్సుకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ హాజరవుతారని వైట్‌హౌజ్ ప్రకటించింది. ఈ ఏడాది క్వాడ్ నేతల సదస్సుకు హాజరయ్యేందుకు తాము కట్టుబడి ఉన్నామని వైట్‌హౌజ్ నేషనల్ సెక్యూరిటీ కమ్యూనికేషన్ సలహాదారు జాన్ కిర్బీ తెలిపారు.బైడెన్ ఈసారి అధ్యక్ష ఎన్నికల బరిలో నుంచి తప్పుకోవడంతో ఆయన షెడ్యూల్లో చాలా సమయం ఉందని చెప్పారు. 2020 నుంచి క్వాడ్ సదస్సులు వర్చువల్ విధానంలో జరుగుతున్నాయి. ఈ ఏడాది మాత్రం భారత్‌లో ప్రత్యక్షంగా నిర్వహించనున్నారు. ఈ ఏడాది జనవరి చివరివారంలో జరగాల్సిన క్వాడ్ సదస్సును భారత్ వాయిదా వేసింది. మళ్లీ ఎప్పుడు నిర్వహించేది ప్రకటించాల్సి ఉంది. -
అమెరికా రాజకీయంలో హింసాపర్వం
అమెరికా రాజకీయ జీవితంలో హింస ఒక భాగమైందన్నది వాస్తవం. తుపాకుల లభ్యత, వాటి యాజమాన్యంపై నియంత్రణలను సడలించారు.ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకోవడానికి ఉపయోగించిన కోల్ట్ ఏఆర్–15 వంటి ఆయుధాలను నిషేధించే ప్రయత్నం పదేళ్లే కొనసాగింది. ఇది కోర్టులో పదేపదే సవాళ్లను ఎదుర్కొంది. ఎక్కువగా ఇటువంటి ఆయుధాలతోనే సామూహిక కాల్పులు జరుపుతారు. 2023లో, 604 కాల్పులు జరగగా 754 మంది మరణించారు. ఇక ట్రంప్ మీద జరిగిన హత్యాయత్నం ఆయనకు రాజకీయంగా లాభిస్తుందనేది సుస్పష్టం. అలాగే ట్రంప్ వాచాలత్వం పెను మంటలు రగిలించేలా ఉందన్నదీ రహస్యం కాదు. ఆయన ఎలా వ్యవహరిస్తారనే దానిపై ప్రస్తుత పరిస్థితి చాలావరకు ఆధారపడి ఉంటుంది.అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నానికి సంబంధించిన రాజకీయ పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. అవి ఆయనకు ఎంతగానో ప్రయోజనం చేకూరుస్తాయి. తనపై జరిగిన దాడి పట్ల ట్రంప్ సహజమైన, పోరాట ప్రతిస్పందనలకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఆయనను సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు చుట్టుముట్టినప్పుడు, తన ముఖం మీద రక్తపు చారలతో, తన కుడి పిడికిలిని పైకెత్తి, ‘ఫైట్, ఫైట్, ఫైట్’(పోరాడు) అంటూ గర్జించారు. రక్తసిక్తమైన, ఆగ్రహోదగ్రుడైన ట్రంప్ పిడికిలి బిగించి ఉండగా, ఆయన వెనుక ఒక అమెరికన్ జెండా రెపరెపలాడుతున్న చిత్రాలు వైరల్‌గా మారాయి. రెండు వారాల క్రితం అధ్యక్ష అభ్యర్థుల మధ్య జరిగిన చర్చలో జో బైడెన్ ప్రదర్శన, సమర్థ వంతమైన ప్రచారాన్ని నిర్వహించగల ఆయన సామర్థ్యం వల్ల అధ్యక్ష పోటీ ఇప్పటికే గందరగోళంలో పడింది.తనపై ఉన్న కేసుల కారణంగా తనను తాను అమర వీరుడు గానూ, హింసకు గురైన వ్యక్తిగానూ ప్రదర్శించుకోవడం ట్రంప్ విధానం. కాల్పుల ద్వారా మృత్యువుకు సమీపంగా వెళ్లడం అనేది ఆయనకు అమరత్వ భావనను ఆపాదిస్తుంది. అధ్యక్షుల చర్చలో పరాజయం తరువాత డెమోక్రాటిక్ అభ్యర్థిగా బైడెన్‌ను తొలగించా లనే ప్రచారంపై ట్రంప్ మీద హత్యాయత్నం తప్పక ప్రభావం చూపు తుంది. ట్రంప్ వర్గానికి అంతకంటే కావాల్సింది లేదు.ట్రంప్‌పై కాల్పుల ఘటన బైడెన్ ప్రచారాన్ని క్లిష్టతరం చేస్తుంది. ఇప్పుడు నేరుగా ట్రంప్‌పై దృష్టి సారిస్తానని అమెరికా అధ్యక్షుడు గత వారంలో అన్నారు. ట్రంప్‌ను ఓడించడానికి తానే ఉత్తమ అభ్యర్థిగా ఉన్నానని ఆయన అభిప్రాయం. ‘లక్ష్యానికి సంబంధించిన కేంద్ర స్థానంలో ట్రంప్‌ను ఉంచే సమయం వచ్చింది’ అన్న బైడెన్ మాటల్ని, తమ అధ్యక్ష అభ్యర్థిపై హింసకు పిలుపుగా ఇప్పుడు కొంతమంది రిపబ్లికన్లు ఆపాదిస్తున్నారు. ఇది ఒక విడి ఘటన కాదనీ, ట్రంప్ ‘ఏ రకంగానైనా అడ్డుకోవలసిన నిరంకుశ ఫాసిస్ట్’ అనే డెమోక్రాటిక్ పార్టీ వాచాలత్వపు అనివార్య పరిణామమనీ రిపబ్లికన్ల ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ పోస్ట్ చేశారు.అమెరికా రాజకీయ జీవితంలో హింస ఒక భాగమైందన్నది వాస్తవం. తుపాకుల లభ్యత, వాటి యాజమాన్యంపై నియంత్రణ లను సడలించడం వంటి నిర్ణయాలతో కోర్టులేమీ మేలు చేయలేదు. ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకోవడానికి ఉపయోగించిన కోల్ట్ ఏఆర్–15 వంటి దాడి ఆయుధాలను నిషేధించే ప్రయత్నం కేవలం పదేళ్లపాటు కొనసాగింది. ఇది కోర్టులో పదేపదే సవాళ్లను ఎదుర్కొంది. ప్రస్తుతం, కొన్ని రాష్ట్రాలు తమ సొంత చట్టాల ద్వారా అటువంటి ఆయుధాలను నిషేధించాయి. కాల్పుల ఘటన జరిగిన పెన్సిల్వే నియా వాటిలో లేదు. ఎక్కువగా ఇటువంటి ఆయుధాలతోనే సామూహిక కాల్పులు జరుపుతారు. జూలైలో ఇప్పటికే మరొక కాల్పుల ఘటన, అయిదు మంది మరణాలకు దారితీసింది. 2023లో, 604 కాల్పులు జరగగా 754 మంది మరణించారు, దాదాపు 2,500 మంది గాయపడ్డారు. అమెరికన్ సుప్రీంకోర్ట్ సహాయకారిగా లేదని చెప్పడం చిన్న మాటే అవుతుంది.బైడెన్ గెలుపొందిన ఎన్నికల ఫలితాలను ట్రంప్ మద్దతుదారులు 2021 జనవరి 6న తారుమారు చేయడానికి ప్రయత్నించిన కాపిటల్ అల్లర్ల నుండి, అమెరికా ఎన్నికల ప్రక్రియ హింసకు దారితీసింది. తిరుగుబాటును అణిచివేసేందుకు ముందు రేగిన అల్లకల్లోలంలో తొమ్మిది మంది మరణించారు. దీనివల్లనే ట్రంప్ ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత అమెరికన్ రాజకీయాలు లోతుగా విభజనకు గుర య్యాయి. ‘ప్యూ రీసెర్చ్ సెంటర్’ పోల్ ప్రకారం, ప్రతి రాజకీయ పక్షంలోనూ దాదాపు మూడింట రెండు వంతుల మంది... ఇతర పార్టీలలోని వారు అనైతికులనీ, నిజాయితీ లేనివారనీ, సంకు చిత మనస్తత్వం గలవారనీ నమ్ముతున్నారు.ట్రంప్ వాచాలత్వం పెను మంటలు రగిలించేలా ఉందన్నది రహస్యం కాదు. తాను వచ్చే నవంబర్ అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోతే ‘రక్తపాతం’ ఉంటుందని మార్చ్ నెలలో ఒక ఇంటర్వ్యూలో ప్రకటించారు. తరువాత ఒక ర్యాలీలో, ‘ఇప్పుడు నేను ఎన్నిక కాకపోతే... అది దేశానికి రక్తపాత కారకం అవుతుంది’ అని పునరావృతం చేశారు. 2023 మార్చిలో, ట్రంప్ దోషిగా నిర్ధారించబడిన కేసులో మాన్ హట్టన్ జిల్లా ప్రభుత్వ న్యాయవాది తనపై అభియోగాలు మోపినట్లయితే ‘సంభావ్య మరణం, విధ్వంసం’ జరగొచ్చని మాజీ అధ్యక్షుడు హెచ్చరించారు. తనకు అన్యాయం జరిగితే ‘వీధుల్లో అల్లర్లు జరుగు తాయి’, ‘దేశంలో అల్లర్లు జరుగుతాయి’ అని బెదిరించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆయన అనుచరులు మరోవైపున వలసదారులు, విదేశీయులు, శ్వేతజాతీయేతర జాతుల ప్రజలపై హింస గురించి మాట్లాడారు. నిజానికి, వ్యాపార లావాదేవీల్లో 34 నేరాలకు ట్రంప్ పాల్పడ్డారని మే నెలలో న్యాయస్థానం ఆయనను దోషిగా ప్రకటించిన తర్వాత, ట్రంప్ అనుకూల వెబ్సైట్లు అల్లర్లు, విప్లవం, హింసాత్మక ప్రతీకారం అనే పిలుపులతో నిండిపోయాయి.ఇటీవలి సంవత్సరాలలోని హింసలో రాజకీయ నమూనా ఉంది. 2017లో, బేస్‌బాల్ గేమ్‌లో రిపబ్లికన్ హౌస్ మెజారిటీ విప్ అయిన స్టీవ్ స్కలైస్ మీద రిపబ్లికన్ వ్యతిరేక గన్ మ్యాన్ కాల్పులు జరిపాడు (ఆ గన్‌మ్యాన్‌ను అప్పుడే కాల్చి చంపారు). 2018లో, ఫ్లోరిడాకుచెందిన ఒక వ్యక్తి నాటి అధ్యక్షుడు ట్రంప్ విమర్శకులకు పైపు బాంబు లను మెయిల్ చేశాడు. అతడు లక్ష్యంగా చేసుకున్నవారిలో బరాక్ ఒబామా, హిల్లరీ క్లింటన్, కమలా హారిస్ ఉన్నారు. 2020 ఎన్నికలకు ముందు, మిషిగన్ గవర్నర్ గ్రెట్చెన్ విట్మెర్ను కిడ్నాప్ చేసి, రాజ ద్రోహ నేరం కింద ఆమెను ‘విచారణ’లో నిలబెట్టడానికి ఆరు గురు వ్యక్తులు కుట్ర పన్నారు. 2022లో, మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీని లక్ష్యంగా చేసుకున్నారు; దాడిలో ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డారు. దుండగుడు పెలోసీని బందీగా తీసుకోవాలని పథకం వేశాడు.ఈ పరిస్థితులలో, సగటు అమెరికన్ నిరుత్సాహానికీ, నిరాశకూ గురవుతాడు. రెండు పార్టీలలోని అతివాద శక్తులు అధికారం చేజిక్కించుకుని ఉన్నాయనీ, గతంలో అమెరికన్ రాజకీయాలకు ప్రతీకగా నిలిచిన ద్వైపాక్షికతకు పెద్దగా చోటు లేకుండా చేశాయనీ సగటు అమెరికన్లు భావిస్తున్నారు.రాబోయే రోజులూ, వారాల్లో బైడెన్ చర్చ వైఫల్యం, దానిపై పొరలుగా, ట్రంప్‌పై హత్యాయత్నం వంటి ఇటీవలి సంఘటనలకు చెందిన పరిణామాల పెరుగుదలను మనం చూస్తాం. చాలామంది సరైన ఆలోచనాపరులు ట్రంప్‌పై కాల్పుల దాడి కలిగించిన షాక్ ప్రభావం ఎంతో కొంత ప్రశాంతతను తెస్తుందని ఆశిస్తున్నప్పటికీ, అలా జరుగుతుందనడానికి ఎటువంటి హామీ లేదు. రష్యన్లు, చైనీయులు తమ వంతు పాత్రను జోడించడంతో ఇప్పటికే తప్పుడు సమాచారం, అతిశయోక్తి, తీవ్రవాదం, జాత్యహంకారం, విభజన, అపనమ్మకం లాంటివి సైబర్ ప్రపంచంలో చెడతిరుగుతున్నాయి.ట్రంప్ ఎలా వ్యవహరిస్తారనే దానిపై ప్రస్తుత పరిస్థితి చాలావరకు ఆధారపడి ఉంటుంది. తనపై హత్యాయత్నాన్ని ఆయన డెమో క్రాట్లపై దాడి చేయడానికి, విభజనలను మరింతగా పెంచడానికి ఉపయోగించవచ్చు లేదా నైతికంగా అత్యున్నత మార్గాన్ని చేపట్టి, పక్షపాత చీలికలను నయం చేయడానికి ఎంచుకోవచ్చు. కానీ ఫిర్యా దులు, ప్రతీకారం చాలాకాలంగా ట్రంప్ ఇతివృతాలుగా ఉన్నాయి. ఆయన తక్షణ ప్రతిస్పందన నెమ్మదిగానూ, తెలివిగానూ ఉన్నప్పటికీ, రాబోయే రోజుల్లో ట్రంప్ ఏ దిశలో వెళ్లగలరనే దానిపై అంచనాలు ఊహకందడం లేదు.- వ్యాసకర్త న్యూఢిల్లీలోని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్లోడిస్టింగ్విష్డ్ ఫెలో (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)- మనోజ్ జోషి -
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కరోనా
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో తెలియజేశారు. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్ పియర్ కూడా బైడెన్ ఆరోగ్య వివరాలను తెలియజేశారు. జో బైడెన్ తన సోషల్ మీడియా ఖాతాలోలో ఇలా రాశారు. ‘ఈ రోజు మధ్యాహ్నం నేను కోవిడ్ -19 టెస్టులు చేయించుకున్నాను. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. నా శ్రేయస్సు కోరుకునేవారందరికీ ధన్యవాదాలు. నేను అనారోగ్యం నుంచి కోలుకునేవరకూ అందరికీ దూరంగా ఉంటాను. ఈ సమయంలోనూ అమెరికా ప్రజల కోసం పని చేస్తూనే ఉంటాను’అని పేర్కొన్నారు. I tested positive for COVID-19 this afternoon, but I am feeling good and thank everyone for the well wishes. I will be isolating as I recover, and during this time I will continue to work to get the job done for the American people.— President Biden (@POTUS) July 17, 2024 బైడెన్‌కు చికిత్స అందిస్తున్న వైద్యుడు కెవిన్ ఓ కానర్ మాట్లాడుతూ బైడెన్ ప్రస్తుతం ముక్కు కారటం, దగ్గు వంటి తేలికపాటి లక్షణాలతో బాధపడుతున్నారన్నారు. అలసిపోయినట్లు కనిపిస్తున్నారని కూడా తెలిపారు. కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన దరిమిలా బైడెన్‌కు యాంటీ వైరల్ డ్రగ్ పాక్స్లోవిడ్ మొదటి డోస్ అందించాం. బైడెన్ ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు మీడియాకు సమాచారం ఇస్తూనే ఉంటామని తెలిపారు. లాస్ వెగాస్‌లో జరిగిన ఒక సదస్సులో ప్రసంగానికి ముందు బైడెన్‌కు కరోనా టెస్ట్ చేశారు. ఈ రిపోర్టుల ఆధారంగా ఆయనకు కరోనా సోకినట్లు వైద్యులు గుర్తించారు. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్ పియర్ మీడియాతో మాట్లాడుతూ జో బైడెన్ ప్రస్తుతం కరోనాలోని తేలికపాటి లక్షణాలతో బాధపడుతున్నారు. ఆయన డెలావేర్కు చేరుకుని కరోనా తగ్గేవరకూ ఒంటరిగా ఉంటారన్నారు.Earlier today following his first event in Las Vegas, President Biden tested positive for COVID-19. He is vaccinated and boosted and he is experiencing mild symptoms. He will be returning to Delaware where he will self-isolate and will continue to carry out all of his duties… pic.twitter.com/ka5hiBavTC— ANI (@ANI) July 17, 2024 -
Us Elections: ట్రంప్‌కు మస్క్ భారీ విరాళం!
న్యూయార్క్: పాపులర్ బిలియనీర్, టెస్లా అధినేత ఈలాన్ మస్క్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు భారీ విరాళమిచ్చినట్లు తెలుస్తోంది. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపు కోసం పనిచేస్తున్న అమెరికా పొలిటికల్ యాక్షన్ కమిటీ(ఎ ప్యాక్)కు మస్క్ డొనేట్ చేసినట్లు బ్లూమ్‌బర్గ్ ఒక కథనం ప్రచురించింది.అయితే సరిగ్గా ఎంత మొత్తం మస్క్ విరాళంగా ఇచ్చారనేది తెలియరాలేదు. ఎ ప్యాక్ తమ గ్రూపునకు విరాళమిచ్చిన వారి జాబితాను జులై 15న అధికారికంగా వెల్లడించనుంది. ఈ ఎన్నికల్లో తాను బైడెన్, ట్రంప్‌లలో ఎవరి తరపున ఖర్చు పెట్టబోనని మస్క్ గతంలో ప్రకటించారు. అయితే తాజాగా మస్క్ ట్రంప్‌నకు విరాళమివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల కోసం ధనవంతుల నుంచి ప్రచార నిధుల సేకరణలో బైడెన్ కంటే ట్రంప్ ముందున్నారు. ఈ పరిస్థితుల్లో మస్క్ కూడా ట్రంప్‌నకు విరాళమివ్వడం గమనార్హం.ఈ అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్, ట్రంప్‌లలో మస్క్ ఇప్పటివరకు ఎవరికీ అధికారికంగా మద్దతు ప్రకటించలేదు. -
బైడెన్‌కు తగ్గిన భారతీయ- అమెరికన్ల మద్దతు
ఈ ఏడాది నవంబర్‌లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఇంతలో బైడెన్‌కు మద్దతునిచ్చే విషయంలో భారతీయ-అమెరికన్లు కాస్త వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే ఆసియన్-అమెరికన్ ఓటర్ సర్వే (ఏఏవీఎస్) తెలిపిన వివరాల ప్రకారం 2020 ఎన్నికలు- 2024 ఎన్నికల మధ్యకాలంలో జో బైడెన్‌కు మద్దతునిచ్చే భారతీయ-అమెరికన్ మద్దతుదారులలో 19 శాతం క్షీణత కనిపించింది.ఆసియా అండ్ పసిఫిక్ ఐలాండర్ అమెరికన్ వోట్ ఆసియన్ అమెరికన్స్ అడ్వాన్సింగ్ జస్టిస్‌ల సర్వే ప్రకారం 49 శాతం మంది భారతీయ-అమెరికన్ పౌరులు ఈ ఏడాది జో బైడెన్‌కు ఓటు వేసే అవకాశం ఉంది. 2020లో ఇది 65 శాతంగా ఉంది. 30 శాతం మంది భారతీయ-అమెరికన్ పౌరులు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఓటు వేసే అవకాశాలున్నాయని సర్వే వెల్లడించింది.డొనాల్డ్ ట్రంప్‌కు రెండు పాయింట్ల మేరకు ప్రయోజనం ఉండబోతోందని ఈ సర్వే తెలిపింది. గత రెండు దశాబ్దాలుగా అమెరికాలో ఆసియా అమెరికన్ ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత నాలుగేళ్లలో 15 శాతం వృద్ధి నమోదైంది. భారతీయ-అమెరికన్ ఓటర్ల సంఖ్య తగ్గడం బైడెన్‌కు ఆందోళన కలిగించే అంశంగా మారింది.ఈ సర్వే ప్రకారం 55 శాతం భారతీయ-అమెరికన్ ఓటర్లు బైడెన్‌కు మద్దతు నివ్వగా, 38 శాతం మంది మాత్రమే ట్రంప్‌కు మద్దతు పలికారు. కాగా దక్షిణ కాలిఫోర్నియా గవర్నర్, అమెరికా రాయబారి నిక్కీ హేలీని 33 శాతం మంది భారతీయ-అమెరికన్లు ఇష్టపడుతున్నారు. అయితే హేలీ పేరు వినని వారు 11 శాతం మంది ఉండటం విశేషం. -
బిగ్ డిబేట్‌కు ముందు ట్రంప్‌కు ఊరట
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల క్యాంపెయిన్‌లో భాగంగా నిర్వహిస్తున్న బిగ్ డిబేట్‌కు కొద్ది గంటగల ముందు రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఊరట లభించింది. హష్ మనీ కేసులో భాగంగా న్యూయార్క్‌లోని మన్‌హట్టన్ కోర్టు గతంలో ట్రంప్‌పై విధించిన గ్యాగ్(సైలెన్స్) ఆంక్షలను కొద్దిగా సడలించింది.సవరించిన ఆర్డర్ ప్రకారం హష్ మనీ కేసులో సాక్షులపై మాట్లాడడానికి ట్రంప్‌నకు అనుమతి లభించింది. అయితే కేసులో ప్రాసిక్యూటర్లు, ఇతర వ్యక్తులపై కామెంట్ చేయడానికి మాత్రం కోర్టు అనుమతివ్వలేదు. త్వరలో జరగబోయే డిబేట్లో డెమొక్రాట్ అభ్యర్థి, ప్రస్తుత దేశ అధ్యక్షుడు జో బైడెన్ మాటల దాడిని ఎదుర్కొని ధీటుగా సమాధానం చెప్పేందుకు కోర్టు విధించిన ఆంక్షలు అడ్డొస్తున్నాయని ట్రంప్ లాయర్లు వాదించారు. ట్రంప్ లాయర్ల అభ్యర్థనకు ప్రాసిక్యూటర్లు కూడా వ్యతిరేకించకపోవడంతో కోర్టు ఆంక్షలను కొంత మేర సడలించింది.హష్ మనీ కేసులో ట్రంప్ దోషి అని కోర్టు ఈ ఏడాది మే30న తేల్చింది. ఈ కేసులో కోర్టు జ్యూరీ తుది తీర్పు వెలువరించడంతో పాటు శిక్షను ఖరారు చేయాల్సి ఉంది. తనను లైంగికంగా వాడుకొని ఆ విషయం బయటికి చెప్పకుండా ఉండేందుకు డబ్బులు చెల్లించాడని పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్ ట్రంప్‌పై హష్ మనీ కేసు పెట్టింది. కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక ఘట్టంగా చెబుతున్న ట్రంప్, జో బైడెన్ల బిగ్ డిబేట్ గురువారం(జూన్27)న జార్జియాలో జరగనుంది. పలు అంశాలపై 90 నిమిషాల పాటు జరగనున్న ఈ డిబేట్లో జో బైడెన్, ట్రంప్ పలు కీలక అంశాలపై ముఖాముఖి చర్చించనున్నారు. -
బైడెన్ వర్సెస్ ట్రంప్.. ‘బిగ్ డిబేట్’ వైపే అందరి చూపు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో భాగంగా వారిద్దరి మధ్య జూన్ 27న తొలి పబ్లిక్ డిబేట్(చర్చ) జరగనుంది. జార్జియాలోని అట్లాంటాలో 90 నిమిషాల పాటు ఈ డిబేట్ జరగనుంది. డిబేట్లో పలు కీలక అంశాలపై తమ వైఖరిని వారిద్దరు చెప్పనున్నారు. డిబేట్లో బైడెన్,ట్రంప్ ఇద్దరు కఠిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఈ ఎన్నికల్లో బైడెన్, ట్రంప్ వయసు కూడా ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. ముఖ్యంగా బైడెన్ ఇటీవల తన మతిమరుపును పదే పదే బయటపెట్టుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బైడెన్ ట్రంప్ దూకుడు తట్టుకోగలరా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఇద్దరు వృద్ధనేతల మధ్య జరగనున్న డిబేట్ ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు అన్ని ఒపినీయన్ పోల్ సర్వేలు ఇద్దరూ నువ్వానేనా అన్నట్లు పోటీపడుతున్నారనే చెబుతున్నాయి. ఈ డిబేట్ తర్వాత ప్రజాభిప్రాయం ఎవరో ఒకరివైపు కొంత మేర షిఫ్ట్ అవ్వొచ్చన్న వాదన వినిపిస్తోంది. ఈ ఏడాది నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. -
ట్రంప్ కోర్టు పోలింగ్ బూతేనా?
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను న్యాయస్థానం దోషిగా తేల్చిన తర్వాత ఆ దేశ రాజకీయాలు మరింత విభజనకు గురయ్యాయి. వాస్తవానికి, ఈ న్యాయవిచారణ ట్రంప్ బలహీనతను, అస్థిర ప్రవర్తనను నొక్కిచెప్పింది. పాత అమెరికాలో, ఒక అభ్యర్థిపై నేర నిర్ధారణ జరిగితే అది ఆయన విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపేది. కానీ ఇప్పుడు ఇది ట్రంప్ అమెరికా. విషయాలు అక్కడ భిన్నంగా జరుగుతున్నాయి. ఒకవేళ ఆయన తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికైతే తన దేశానికే కాదు, ప్రపంచానికి కూడా తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయి. ట్రంప్‌తో భారతదేశ సంబంధాలు బాగానే ఉన్నప్పటికీ, గత మూడేళ్లలో జరుగుతున్నట్టుగా ద్వైపాక్షిక సంబంధాలను నిర్మించడంలో క్రమబద్ధమైన కృషి మాత్రం ఆయన హయాంలో జరగలేదు.అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌ను తప్పుడు వ్యాపార రికార్డులపై 34 అంశాల్లో న్యాయస్థానం దోషిగా నిర్ధారించిన తర్వాత అమెరికా మరింతగా విభజనకు గురయింది. స్వభావ రీత్యా, ఈ కేసు చిన్నదే. కానీ న్యాయప్రక్రియను అపహాస్యం చేయడం ద్వారా, ప్రాసిక్యూటర్లపై, న్యాయమూర్తిపై కూడా ఎదురుదాడికి దిగుతూ కేసును ఎదుర్కొనాలని ట్రంప్ బృందం తీసుకున్న నిర్ణయం ఈ కేసును విషపూరితం చేసింది. ట్రంప్ ఇప్పుడు దీనిపై అప్పీల్ చేయనున్నారు. అయితే దీనిపై విచారణ జరగడానికి సంవత్సరాలు కాకపోయినా, నెలల సమయం పడుతుంది. ఒకవేళ తాను ఓడిపోయి, ఆ తర్వాత కేసు తారుమారైతే, అది అమెరికా న్యాయ వ్యవస్థ విచ్ఛిన్నమైనదనే ట్రంప్ మద్దతుదారుల అభిప్రాయాలను ధ్రువీకరిస్తుంది. మరోవైపు, ఇవన్నీ ఉన్నప్పటికీ ట్రంప్ గెలిచినట్లయితే, ఆ వ్యవస్థ ఎంత అధ్వాన్నంగా ఉందో అది వెల్లడిస్తుంది. ట్రంప్ న్యాయ ప్రక్రియను కొట్టిపడేస్తూ, ‘మనం ఫాసిస్ట్ రాజ్యంలో జీవిస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు. ట్రంప్ తనను తాను అభివర్ణించుకున్నట్లుగా ‘ఎంతో అమాయకపు వ్యక్తి’పై జరుగుతున్న ఈ విచారణ ఒక బూటకమని ఆయన మద్దతుదారులు అంటున్నారు. ఆయన తనను ’రాజకీయ ఖైదీ’గా చెప్పుకొంటున్నారు. పైగా అవకాశం వచ్చినప్పుడు తన ప్రత్యర్థులందరూ కూడా నేరారోపణలను ఎదుర్కొనే దశలోకి అమెరికా ప్రవేశిస్తోందని ట్రంప్ పార్టీ(రిపబ్లికన్) హెచ్చరించింది.ప్రత్యేకించి ఓటర్లలో ఆదరణ లేని ఇద్దరు ప్రధాన అభ్యర్థుల మధ్య జరుగుతున్న విచిత్రమైన రేసులో ఈ తీర్పు ఒక అస్థిరమైన, నాటకీయమైన అంశాన్ని ప్రవేశపెట్టింది. పాత అమెరికాలో, ఒక అభ్యర్థిపై నేర నిర్ధారణ అతని లేదా ఆమె అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపేది. కానీ ఇప్పుడు ఇది ట్రంప్ అమెరికా. ఇక్కడ విషయాలు భిన్నంగా జరుగుతున్నాయి. ఈ తీర్పు నిజానికి ఆయనకు రిపబ్లికన్ పార్టీ మద్దతును మరింతగా బలపరిచింది. తీర్పు వెలువడిన వెంటనే ట్రంప్ ప్రచారానికి వచ్చిన 52.8 మిలియన్ అమెరికన్ డాలర్ల రూపంలో ఇది వ్యక్తమయింది.మరోవైపు డెమోక్రాట్లు తమ ప్రత్యర్థిని, ప్రస్తుతం అగ్రగామిగా ఉన్న వ్యక్తిని న్యాయస్థ్ధానం దోషిగా నిర్ధారించినందుకు సంబరాలు చేసుకుంటున్నారు. అధ్యక్షుడు జో బైడెన్ ఈ అంశంపై వ్యాఖ్యానించడంలో జాగ్రత్తగా ఉన్నారు. కానీ ఆయన న్యాయవ్యవస్థను సమర్థించారు. పైగా, తీర్పు తమకు ఇష్టం లేదు కాబట్టి దాన్ని ఎవరైనా ప్రశ్నించడం అనేది ‘నిర్లక్ష్యపూరితమైనది, ప్రమాదకరమైనది, బాధ్యతారాహిత్యంతో కూడుకున్నది’ అని అన్నారు.ఈ కేసుకి సంబంధించిన అంశాలు చిన్నవిగానే ఉన్నప్పటికీ, ఇది బూటకపు విచారణ కాదు. సమర్పించిన సాక్ష్యాలు చేసిన నేరాలను నిర్ధారిస్తాయి. అవి ట్రంప్ జీవించే నీచమైన ప్రపంచానికి చెందిన సంగ్రహావలోకనాన్ని కూడా అందించాయి. ఆయన మద్దతుదారులు ఏం చెప్పినా సరే... జ్యూరీ ఆయన్ని ఏకగ్రీవంగానూ చాలా త్వరితంగానూ మొత్తం 34 అంశాల్లో దోషిగా నిర్ధారించింది. పైగా ఇది ట్రంప్ ఎదుర్కొనే ఆరోపణలలో ఒకటి మాత్రమే; మరో మూడు తీవ్రమైన ఆరోపణలు కూడా ఉన్నాయి. కానీ రిపబ్లికన్ల మనస్సులో, ఈ కేసులు ‘న్యాయ వ్యవస్థ ఆయుధీకరణ’ ఫలితం మాత్రమే.వీటిలో రెండు కేసులు 2020 ఎన్నికల ప్రక్రియకు నష్టం గావించడంలో ట్రంప్ పాత్రకు సంబంధించినవి. ఇక మూడవ కేసు, వైట్ హౌస్ నుండి నిష్క్రమించిన తర్వాత ఉద్దేశపూర్వకంగా రహస్య పత్రాలను ట్రంప్ తన వద్ద ఉంచుకున్నట్లు చెబుతోంది. అమెరికా న్యాయ వ్యవస్థలో ఒక భాగం ఇప్పటికీ సమర్థంగా పనిచేస్తున్నప్పటికీ, అమెరికా సుప్రీంకోర్టుతో సహా ఇతర విభాగాల పక్షపాత దృష్టి కారణంగా ట్రంప్‌పై ఇతర కేసులను అధ్యక్ష ఎన్నికలకు ముందుగా విచారించలేరని న్యూయార్క్ కోర్టు తీర్పు సూచించింది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ముఖ్యమైన ‘న్యాయస్థానం’ పోలింగ్ బూత్ మాత్రమే.ట్రంప్‌నకు ఉన్మాదపూరితమైన ఓటర్ బలం ఉంది. ఇది ఈ తీర్పు ద్వారా మరింత పెరిగింది. కానీ అది మాత్రమే ఆయనకు ఎన్నికల్లో గెలుపును ఇవ్వలేదు. తక్కువ ఉత్సాహవంతులైన, నేరారోపణలను బట్టి దూరం జరిగే వ్యక్తుల మద్దతు ఆయనకు అవసరం. వాస్తవానికి, ఈ న్యాయవిచారణ ట్రంప్ బలహీనతను, అస్థిర ప్రవర్తనను, కుంభకోణాలతోపాటు ఆయన అసభ్య ప్రవర్తనను నొక్కిచెప్పింది.ఈ తీర్పు వెలువడిన వెంటనే నిర్వహించిన ‘యూ–గవ్’ పోల్‌లో 27 శాతం మంది ట్రంప్‌నకు ఓటు వేసే అవకాశం తక్కువగా ఉందనీ, 26 శాతం మంది అలా వేసే అవకాశం ఎక్కువగా ఉందనీ, 39 శాతం మంది తీర్పు తమ ఓటు విధానాన్ని ప్రభావితం చేయదనీ చెప్పారు. ఇవి పూర్తిగా విభజనకు గురైన అమెరికన్ రాజకీయ వ్యవస్థ క్షీణత లోతును పట్టి చూపే భయంకరమైన సంకేతాలు. దేశంలోని సగం మంది మరొకరి అభిప్రాయాలను సహించటానికి ఇష్టపడకపోవటంతో, పెద్ద సంఖ్యలో అమెరికన్లు మూడవ పార్టీలకు ఓటు వేయడం లేదా ఎన్నికలకు దూరంగా ఉండడం కూడా మనం చూడవచ్చు.ట్రంప్ పదవికి పూర్తిగా అనర్హుడన్న విషయం ఈపాటికే స్పష్టం అయింది. అయినా సరే... ఆయన తిరిగి ఎన్నికైతే, తన దేశానికే కాదు, ప్రపంచానికి, భారతదేశానికి కూడా తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయి. ఉక్రెయిన్, గాజాలో జరుగుతున్న యుద్ధాల వల్ల ప్రపంచం అతలాకుతలం అవుతోంది. పైగా తైవాన్ లో ఒక ప్రమాదం పొంచి ఉన్నందున, అమెరికా నాయకత్వ పాత్ర చాలా ముఖ్యమైనది. చైనాతో తలపడుతున్న భారత్ భద్రతకు అమెరికా భాగస్వామ్యం ముఖ్యం.అధ్యక్షుడు బైడెన్ హయాంలో... దక్షిణ కొరియా, జపాన్‌లతో మాత్రమే కాకుండా ఫిలిప్పీన్స్, భారతదేశంతో కూడా పొత్తులు పెట్టుకోవడం ద్వారా అమెరికా తన ఇండో–పసిఫిక్ ముఖచిత్రాన్ని భారీగా బలోపేతం చేసింది. ఈశాన్య ఆసియాలో బైడెన్ ముఖ్యంగా అమెరికా, జపాన్, దక్షిణ కొరియాతో కూడిన త్రైపాక్షిక సంబంధాన్ని ఏర్పరచుకున్నారు. ట్రంప్ హయాంలో అమెరికా, ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి.ముఖ్యంగా, ఆయన ‘ఆకస్’(ఏయూకేయూఎస్–ఆస్ట్రేలియా, యూకే, యూఎస్) సైనిక కూటమిని రూపొందించడానికి కూడా చొరవ తీసుకున్నారు. ఇది భారత్ సభ్యురాలిగా ఉన్న క్వాడ్ సంస్థకు భిన్నం. ఇది ఇప్పుడు ప్రధానంగా ఆరోగ్య భద్రత, సరఫరా గొలుసు స్థితిస్థాపకత, వాతావరణ మార్పులు, క్లిష్టమైన, అభివృద్ధి చెందుతున్న సాంకేతికత, సైబర్ భద్రత, సముద్ర భద్రత వంటివాటిపై దృష్టి సారిస్తోంది. 2023 జూన్‌లో, బైడెన్ ఇండో–పసిఫిక్ ప్రాంతం మరొక అంచులో యూఎస్–ఇండియా రక్షణ, భద్రతా సంబంధాలను మరింత ఎత్తుకు తీసుకుపోయే ప్రయత్నంలో ప్రధాని నరేంద్ర మోదీతో కలిశారు. ట్రంప్‌తో భారతదేశ సంబంధాలు బాగానే ఉన్నాయి. కానీ గత మూడేళ్లలో జరిగినట్టుగా ద్వైపాక్షిక సంబంధాలను నిర్మించడంలో క్రమబద్ధమైన కృషి జరగలేదు.మనోజ్ జోషివ్యాసకర్త న్యూఢిల్లీలోని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్‌లో డిస్టింగ్విష్డ్ ఫెలో (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఇజ్రాయెల్‌పై అడ్డుకట్టకు ఖతార్‌తో జోబైడెన్ భేటీ
గత ఆరు నెలలుగా హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతోంది. హమాస్‌ను నిర్మూలించాలనే ఇజ్రాయెల్ లక్ష్యం.. గాజా స్ట్రిప్‌లోని ప్రజలను కష్టాలపాలు చేస్తోంది. గాజాలో తలెత్తుతున్న విధ్వంసకర పరిస్థితులపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది.అమెరికాలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఇది అధ్యక్షుడు జో బైడెన్‌కు కొత్త సమస్యలను తెచ్చిపెట్టేదిగా మారింది. దీంతో బైడెన్ గాజాలో యుద్ధాన్ని నివారించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. గాజాలో కాల్పుల విరమణ, బందీల విడుదల కోసం ఇజ్రాయెల్ ప్రతిపాదనను బైడెన్ ఇటీవలే ప్రకటించాడు.తాజాగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ మరోసారి ఈ ఒప్పందానికి సంబంధించి ఖతార్ ఎమిరేట్స్‌తో మాట్లాడారు. కాల్పుల విరమణ ప్రతిపాదనను ఆమోదించేలా హమాస్‌పై ఒత్తిడి తేవాలని కోరారు. గాజాలో సంక్షోభాన్ని అంతం చేయడానికి, కాల్పుల విరమణ, బందీ ఒప్పందాన్ని అమలు చేయడంపై ఖతార్ ఎమిర్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో చర్చించారు.‘నేను ఈ రోజు ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో మాట్లాడాను’ అని బైడెన్ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు. కాల్పుల విరమణ, బందీ ఒప్పందానికి సంబంధించిన ప్రణాళికను ఎలా రూపొందించాలనే దానిపై చర్చించానన్నారు. హమాస్ ఒప్పందాన్ని ఆమోదించేలా అన్ని తగిన చర్యలను తీసుకోవాలని తాను అమీర్ తమీమ్‌ను కోరానన్నారు. గాజాలో బందీలుగా ఉన్న వారిని విడుదల చేయడానికి కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలిపానన్నారు. ఈ ఒప్పందం అమలుకు ఈజిప్ట్, ఖతార్‌లతో కలిసి యునైటెడ్ స్టేట్స్ పని చేస్తుందని బైడెన్ పేర్కొన్నారు.ఐదు వేలకు పైగా రాకెట్లను ప్రయోగిస్తూ హమాస్ అక్టోబర్ 7న ఇజ్రాయెల్ నగరాలపై దాడి మొదలుపెట్టింది. అనంతరం హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించి అక్కడి ప్రజలపై దాడులు జరిపారు. దీనికి ప్రతిగా గాజాలోని హమాస్ ఉగ్రవాదులపై ఇజ్రాయెల్ ఆపరేషన్ ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌లో గాజాలోని హమాస్ స్థావరాలపై భారీ బాంబు దాడులు జరిగాయి. ఫలితంగా గాజాలోని పలు ప్రాంతాలు శిథిలమయ్యాయి. ఇజ్రాయెల్,గాజాలలో ఇప్పటివరకు మొత్తం 34,622 మంది మృతి చెందారు. The United States has worked relentlessly to support Israelis’ security, to get humanitarian supplies into Gaza, and to get a ceasefire and a hostage deal to bring this war to an end. pic.twitter.com/eGXgV3KSbV— President Biden (@POTUS) June 1, 2024 -
రూ.2.8 కోట్ల విరాళాలు నిలిపేసిన బైడెన్ పార్టీ
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు చెందిన డెమోక్రటిక్ పార్టీ ఇండో అమెరికన్ వ్యాపారవేత్త ఇచ్చిన మొత్తం సుమారు 3.4 లక్షల డాలర్లు(రూ.2.8 కోట్లు) విరాళాలను నిలిపేసినట్లు మీడియా కథనాల ద్వారా తెలిసింది. పొలిటికో కథనం ప్రకారం.. బిడెన్ విక్టరీ ఫండ్(బీవీఎఫ్) కోసం తాజాగా ఇండో అమెరికన్ వ్యాపారవేత్త గౌరవ్ శ్రీవాస్తవ 50,000 డాలర్లు(రూ.41 లక్షలు) విరాళాన్ని అందించాలని నిర్ణయించుకున్నారు. అయితే అమెరికా చట్టాల ప్రకారం అది సాధ్యంకాదని, ఆ విరాళాన్ని నిలిపివేస్తున్నట్లు జో బైడెన్ ప్రచార అధికారి తెలిపారు. గతంలోనూ డెమోక్రాటిక్ కాంగ్రెషనల్ ప్రచార కమిటీ (డీసీసీసీ)కు తాను ఇచ్చిన 2.9లక్షల డాలర్లను హోల్డ్‌లో పెడుతున్నట్లు చెప్పారు. లాస్ ఏంజిల్స్‌కు చెందిన శ్రీవాస్తవ తన భార్య గౌరవ్ షారన్ పేరుతో, శ్రీవాస్తవ ఫ్యామిలీ ఫౌండేషన్ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు. తనకు ఇతర కంపెనీలు ఉన్నాయి. అయితే ఆ సంస్థలు నిత్యం చట్టపరమైన వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. అవి ఎలాంటి వివాదాలో మాత్రం తెలియరాలేదు. 2022లో బాలిలో జరిగిన ప్రపంచ ఆహార భద్రతా ఫోరమ్‌కు తన ఫ్యామిలీ 1 మిలియన్ డాలర్లు విరాళం ప్రకటించింది. అనంతరం అతడి సంస్థల్లో వివాదాలు నెలకొన్నాయి. ఆ అంశాలు కోర్టు వరకు వెళ్లడంతో థింక్ ట్యాంక్ అట్లాంటిక్ కౌన్సిల్ అతనితో సంబంధాలు తెంచుకుంది. అమెరికా ఎన్నికల చట్టాల ప్రకారం..ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థికి ఒక వ్యక్తి 3,300 డాలర్లకు మించి విరాళం ఇవ్వకూడదనే నిబంధన ఉంది. అయితే నిర్దిష్ట అవసరాలను తీర్చే ప్రచార కమిటీలకు మాత్రం విరాళాలు ఇవ్వడానికి అనుమతులున్నాయి. దాంతో డీసీసీసీకు శ్రీవాస్తవ భారీగా విరాళం ఇచ్చారు. ఆ విరాళాలను బీవీఎఫ్ బైడెన్ ప్రచారానికి, డెమోక్రటిక్ నేషనల్ కమిటీకి, స్టేట్ పార్టీ యూనిట్లకు విభజించింది. ప్రస్తుతం తెరపైకి వస్తున్న వివాదాలతో ఆ విరాళాలను స్వచ్ఛంద సంస్థలకు బదిలీచేస్తున్నట్లు డెమోక్రాట్ల ప్రతినిధి చెప్పారు. డీసీసీసీకు విరాళం ఇచ్చిన సమయంలో గౌరవ్ తాను యూనిటీ రిసోర్స్ గ్రూప్ (యూఆర్జీ) ఛైర్మన్‌ను అంటూ చెప్పుకున్నారని కథనం ద్వారా తెలిసింది. ప్రతికూల వాతావరణంలో విజయాన్ని సాధించే వ్యాపారాలు, ప్రభుత్వాలు, సంస్థల సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారాలను అందించే ప్రముఖ సంస్థ యూఆర్జీ అంటూ తన వెబ్సైట్లో పేర్కొంది. ఇదీ చదవండి: వాట్సప్ స్టేటస్ పెడుతున్నారా..? అదిరిపోయే అప్డేట్ మీ కోసమే! బైడెన్ సెనేటర్‌గా ఉన్న సమయంలో అతడికి సహాయకుడిగా పనిచేసిన అంకిత్ దేశాయ్ నిర్వహించిన లాబీయింగ్ సంస్థ ఏర్పాటులో యూనిటీ రిసోర్స్ గ్రూప్ భాగమైందని పొలిటికో నివేదించింది. నాటో మిత్రపక్ష కమాండర్‌గా పనిచేసి, డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని చేజార్చుకున్న రిటైర్డ్ జనరల్ వెస్లీ క్లార్క్‌ను గౌరవ్ శ్రీవాస్తవ కన్సల్టెంట్‌గా నియమించుకున్నారు. కొన్ని కారణాల వల్ల విడిపోయారని పొలిటికో తెలిపింది. గౌరవ్ శ్రీవాస్తవకు వ్యక్తిగతంగా ఒక వెబ్సైట్ ఉంది. అందులోకి ‘హాయ్.. నేనో ఫిలాంథ్రోఫిస్ట్(పరోపకారిని)’ అంటూ రావడం విశేషం. -
USA: ‘నేను మళ్లీ గెలిస్తే’.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే తాను తొలుత చేసే పనులేంటో దేశ మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. 2021లో వాషింగ్టన్ క్యాపిటల్ హిల్ భవనంపై దాడి ఘటనలో అరెస్టయి జైళ్లలో ఉన్నవారిని వెంటనే విడుదల చేస్తానని, మెక్సికోతో సరిహద్దును మూసేసి అక్రమ వలసదారులకు అడ్డకట్ట వేస్తామని తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌లో ట్రంప్ తాజాగా ఒక పోస్టు పెట్టారు. 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత జో బైడెన్ గెలుపు అక్రమమని ట్రంప్ ఒక ప్రసంగం చేశారు. దీంతో రెచ్చిపోయిన ఆయన మద్దతుదారులు 2021, జనవరి 6న వాషింగ్టన్‌లోని చారిత్రాత్మక క్యాపిటల్ హిల్ భవనంపై దాడి చేశారు. ఈ కేసులో వందల మంది అరెస్టయి జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు. క్యాపిటల్ హిల్ తిరుగుబాటు కేసులో అధ్యక్షునికి రాజ్యాంగ రక్షణ ఉంటుందా లేదా అనే కేసులో ట్రంప్‌పై వచ్చే ఏప్రిల్ 25న అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించనుంది. ఈ తీర్పుపైనే ట్రంప్‌నకు రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టే అర్హత ఉందా లేదా అనేది తేలిపోనుంది. కాగా, ఈ ఏడాది నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ట్రంప్, ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ మళ్లీ తలపడనున్నారు. అధ్యక్ష అభ్యర్థిని నిర్ణయించే రిపబ్లికన్ ప్రైమరీల్లో ట్రంప్ ఇప్పటికే ఘన విజయం సాధించారు. ఇదీ చదవండి.. అమెరికాలో టిక్‌టాక్ పాలిటిక్స్.. ట్విస్ట్ ఇచ్చిన ట్రంప్ -
సరైన కార్యాచరణ ఎక్కడ?!
నటన ఒక స్థాయికి మించితే బెడిసికొడుతుంది. తెరపై అతిగా నటిస్తే ఓవరాక్షన్ అంటారు. ఆ పనే నిజజీవితంలో చేస్తే వంచన అంటారు. గాజాపై ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణకాండ 157 రోజులుగా అంతూ దరీ లేకుండా సాగుతోంది. ముస్లింలు ఎంతో పవిత్రంగా పరిగణించే రంజాన్ మాసం మొదలైనా మారణకాండ, విధ్వంసం ఆగటంలేదు. ఆకలితో అల్లాడుతున్న ప్రజానీకం అడపాదడపా వచ్చిపడుతున్న క్షిపణులకూ, బాంబులకూ పిట్టల్లా రాలుతున్నారు. ఇప్పటికి 31,000 మంది పౌరులు ఈ దాడుల్లో మరణించారని పాలస్తీనా అధికారులు, స్వచ్ఛంద సంస్థలు చెబుతుండగా అందులో 13,000 మంది ఉగ్రవాదులున్నారని ఇజ్రాయెల్ ప్రకటిస్తోంది. ‘సంపూర్ణ విజయం’ సాధించేవరకూ విశ్రమించబోమని ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ చెబుతున్నారు. నిరుడు అక్టోబర్ 7న ఇజ్రాయెల్ భూభాగంలోకి ప్రవేశించిన హమాస్ మిలిటెంట్లు 1,200 మంది ఇజ్రాయెల్ పౌరులను హతమార్చి, 250 మంది పౌరులను అపహరించినప్పటినుంచీ గాజాపై దాడులు సాగుతూనేవున్నాయి. కిడ్నాప్ చేసినవారిలో 150 మందిని హమాస్ విడుదలచేసింది. ఇంకా 100 మంది వారి చెరలోనేవున్నారు. ఈ మానవ హననాన్ని నిలువరించటానికి తన పలుకుబడిని వినియోగించాల్సిన అగ్రరాజ్యం అమెరికా అందుకు భిన్నంగా ద్విపాత్రాభినయం చేస్తూ తన నటనావైదుష్యాన్ని ప్రదర్శిస్తోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దేశ ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలో గాజాపై దాడులు నిలపాలనీ, కనీసం రంజాన్ మాసంలోనైనా కాల్పుల విరమణకు అంగీ కరించాలనీ నెతన్యాహూను కోరారు. మంచిదే. కానీ ఆయన లక్ష్యపెట్టిందెక్కడ? తన మాటకు విలువీయని దేశానికి బైడెన్ ఆయుధ సరఫరా ఎలా కొనసాగిస్తున్నారు? అమెరికాయే కాదు... దాని మిత్రదేశాలు కూడా ఈ ద్విపాత్రాభినయాన్ని అలవాటు చేసు కున్నాయి. ఇదే సమయంలో యుద్ధం ఆపాలంటూ వర్ధమాన దేశాలు తీసుకొస్తున్న తీర్మానాలకు భద్రతామండలిలో అమెరికా తన వీటో అధికారంతో గండికొడుతోంది. నెతన్యాహూపై బైడెన్ తరచు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రఫాపై దాడికి పూనుకుంటే లక్ష్మణరేఖ దాటినట్టేనని హెచ్చరిస్తున్నారు. ఎవరిని వంచించటానికి ఈ హెచ్చరికలు? గాజా ప్రజల క్షేమంపై ఆయనకు నిజంగా ఆందోళనవుంటే దాని పొరుగు దేశమైన ఈజిప్టును ఒప్పించి గాజా పౌరులు సరిహద్దుదాటి తలదాచుకునేందుకు అనుమతించమని అడగొచ్చు. కానీ ఆయన ఆ పని చేయటం లేదు. ఈజిప్టుకు ఏటా అమెరికా 103 కోట్ల డాలర్ల విలువైన సైనిక సాయాన్ని అందిస్తోంది. ఆ దేశాధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసితో బైడెన్‌కు మంచి సంబంధాలున్నాయి. అయినా ఈ ప్రతిపాదన చేయరు. ఇందుకు బదులు ఆహార పొట్లాలు అందించటం మొదలెట్టారు. ఆ ఉద్దేశం వెనకున్న ఆంతర్యాన్ని కూడా అనేకులు తప్పుబడుతున్నారు. దేశప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలో గాజాలో పోర్టు నిర్మాణాన్ని మొదలుపెడతామని బైడెన్ ప్రకటించారు. ఇది ఆహార సరఫరా సులభం చేయటం కోసమని ఆయన చెబుతున్నా ఆ వంకన అక్కడ తిష్టవేయటమే అమెరికా లక్ష్యమన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇజ్రా యెల్‌కు ఆత్మరక్షణ చేసుకునే హక్కుందని బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ మాట్లాడే మాటలు 31,000 మంది మరణించాక కూడా చెల్లుబాటవుతాయా? అయిదు నెలలు గడిచాక కూడా ఇంకా హమాస్‌ను అంతం చేయటమే లక్ష్యమంటూ ఇజ్రాయెల్ సాగిస్తున్న నరమేథాన్ని అమెరికా చూసీ చూడనట్టు వదిలేయటం సరైందేనా? హమాస్ తన దుందుడుకు చర్యలతో గాజా ప్రజలకు తీరని నష్టం చేసింది. దానిపై దాడి పేరుతో అదే పని ఇజ్రాయెల్ కూడా కొనసాగిస్తోంది. కానీ ఒకరి దాడిని ఉగ్రవాదంగా చిత్రీకరిస్తూ మరొకరిని అనునయిస్తూ, వేడుకుంటూ అదే సమయంలో వారికి కావల సిన ఆయుధ సామగ్రి అందిస్తూ కాలం గడపటం సరైందేనా? గాజాలో నాగరిక సమాజాలు ఏమాత్రం అంగీకరించటం సాధ్యంకాని ఉదంతాలు చోటుచేసు కుంటున్నాయి. గాజా పౌరులు ఆకలికి తట్టుకోలేక ఆకులు అలములు తింటున్నారు. కడుపు నింపు కోవటానికి పశుదాణా సైతం వినియోగిస్తున్నారు. నెలలు నిండకమునుపే గర్భిణులకు ప్రసవాలవు తున్నాయి. ఆ నవజాత శిశువులకు అవసరమైన సంరక్షణ కూడా సాధ్యం కావటం లేదు. అధిక రక్తస్రావంతో తల్లులు కన్నుమూస్తున్నారు. సకాలంలో మేల్కొని ఆపకపోతే ఇజ్రాయెల్‌తోపాటు అమెరికా కూడా దోషిగా నిలబడాల్సివస్తుంది. రష్యా సాగిస్తున్న దురాక్రమణ యుద్ధంలో దినదిన గండంగా బతుకుతున్న ఉక్రెయిన్‌కు ఇంతవరకూ అమెరికా ఒక్కటే 7,500 కోట్ల డాలర్ల సాయం అందించింది. నాటో సభ్య దేశాలు తమ వంతుగా మరింత సాయం అందిస్తున్నాయి. ఇందువల్ల రష్యా ఎక్కడా తగ్గిన దాఖలా లేదు. అటు ఉక్రెయిన్‌కు కూడా ఒరిగేదేమీ వుండటం లేదు. లాభపడేది అమెరికా రక్షణ ఉత్పత్తుల కంపెనీలే. సాయం పేరుతో అందించేదంతా తిరిగి ఆ కంపెనీలకు చేరుతోంది. ఉక్రెయిన్ ఆ డబ్బుతో అమెరికా ఆయుధాలు, క్షిపణులు వగైరాలు కొంటున్నది. అటు ఉక్రెయిన్, ఇటు గాజా ఏకకాలంలో శ్మశానాలను మరపిస్తుండగా... రక్షణ ఉత్పత్తుల కంపెనీలు మాత్రం పచ్చగా వెలుగుతున్నాయి. పోనీ అమెరికా అయినా ప్రశాంతంగా వుంటున్నదా? కొన్ని దశాబ్దాలక్రితం పౌరహక్కుల కోసం చేతులు కలిపిన నల్లజాతీయులు, యూదులు ఇప్పుడు పరస్పరం దూషించుకుంటున్నారు. యూదులపై అక్కడక్కడ దాడులు కూడా జరుగుతున్నాయి. దీన్నంతటినీ ఆపాలంటే గాజాతోపాటు ఉక్రెయిన్లోనూ ప్రశాంతత నెలకొనాలి. అది అమెరికా అధ్యక్షుడు బైడెన్ చేతుల్లోనేవుంది. ఇప్పుడు కావాల్సింది నటన కాదు... సరైన కార్యాచరణ. -
న్యూయార్క్ కోర్టు జడ్జిగా భారతీయుడు
అమెరికాలోని న్యూయార్క్‌లో గల తూర్పు జిల్లా కోర్టుకు భారత సంతతికి చెందిన సంకేత్ జయసుఖ్ బల్సరా న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ న్యూయార్క్‌లోని తూర్పు జిల్లా కోర్టుకు భారత సంతతి న్యాయమూర్తిని నామినేట్ చేశారు. న్యూయార్క్‌లోని డిస్ట్రిక్ట్ కోర్టులో పనిచేస్తున్న బల్సరా.. సెక్యూరిటీలు, కాంట్రాక్టులు, దివాలా, నియంత్రణ విషయాలలో తన నైపుణ్యాన్ని నిరూపించుకున్నారు. అతని తల్లిదండ్రులు భారతదేశం నుంచి ఇక్కడకు వలస వచ్చారు. 46 ఏళ్ల బల్సరా 2017 నుంచి న్యూయార్క్‌లోని ఈస్టర్న్ డిస్ట్రిక్ట్‌లో యూఎస్ మేజిస్ట్రేట్ జడ్జిగా పనిచేస్తున్నారు. యూఎస్ కోర్టుకు నియమితులైన మొట్టమొదటి దక్షిణాసియా అమెరికన్ ఫెడరల్ న్యాయమూర్తిగా బల్సరా ఘనత సాధించారు. బల్సరా న్యూ రోషెల్‌లో జన్మించారు. అతని తల్లిదండ్రులు 50 సంవత్సరాల క్రితం ఇక్కడకు వలస వచ్చి స్థిరపడ్డారు. అతని తండ్రి ఇంజనీర్‌గా పనిచేశారు. తల్లి నర్సు. బల్సరా 2002లో హార్వర్డ్ లా స్కూల్ నుండి జేడీ, 1998లో హార్వర్డ్ కళాశాల నుండి ఏబీ పట్టా పొందాడు. ప్రస్తుతం బల్సరా తన భార్య క్రిస్టీన్ డెలోరెంజోతోపాటు లాంగ్ ఐలాండ్ సిటీలో ఉంటున్నారు. -
బైడెన్ మళ్లీ నెగ్గుతారా?.. సర్వేలో ఆసక్తికర ఫలితాలు
వాషింగ్టన్: ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలపై పలు సంస్థలు నిర్వహిస్తున్న సర్వేలు ఆసక్తి రేపుతున్నాయి. తాజాగా నిర్వహించిన గాల్లప్ పోల్‌లో సంచలన ఫలితాలు వెలువడ్డాయి. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తిరిగి అధ్యక్ష పదవికి ఎన్నికయ్యేందుకు కేవలం 38 శాతం మాత్రమే అంగీకరిస్తున్నట్లు పోల్‌లో వెల్లడయ్యింది. ఇదే సమయంలో ట్రంప్ మళ్లీ అధ్యక్షుడయ్యేందుకు 50 శాతం మంది అమెరికన్లు మద్దతిస్తున్నారు. బైడెన్ అధిక వయసు వల్లే రెండోసారి ఆయన అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు చాలా మంది అంగీకరించకపోవడం గమనార్హం. వయసుతో పాటు మెక్సికోతో బోర్డర్ వివాదం, ద్రవ్యోల్బణం లాంటి అంశాలు బైడెన్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. మరోవైపు ట్రంప్ వయసుపై కూడా కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ బైడెన్‌తో పోల్చినపుడు వయసు విషయంలో సర్వేల్లో ట్రంప్ ముందంజలో ఉన్నారు. అయితే గతంలో గాలప్ పోల్స్ అంచనాలు చాలాసార్లు మిస్సయ్యాయి. ఇదీచదవండి.. న్యూజిలాండ్‌లో భారత విద్యార్థి మృతి -
అమెరికాలో తగ్గని ట్రంప్ హవా?
అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడంపై చాలామందికి సందేహాలు ఉండవచ్చు. కానీ, ఆయనకు దేశంలో మద్దతుదారులు పెరుగుతున్నారనే చెప్పాలి. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ట్రంప్‌కు రెండు రకాల ఇమేజ్‌లు ఉండటం. ఒకవైపేమో చట్టాలను కఠినంగా అమలు చేసే వ్యక్తిగా, సుస్థిర ఆర్థిక వ్యవస్థను అందించగలిగేవాడిగా, యుద్ధాలకు దూరంగా ఉండేవాడిగా చూస్తూంటే... ఇంకోవైపేమో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపేవాడిగా, వ్యవస్థలపై దాడి చేసేవాడిగా, దేశ ప్రాథమ్యాలను మార్చేసే వ్యక్తిగా చూస్తున్నారు. ఏమైనా ట్రంప్‌కు ఆదరణ పెరుగుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ మాత్రం సర్వేలను నమ్మొద్దనీ, తానే మళ్లీ అధికారంలోకి రానున్నాననీ ధీమాగా చెబుతున్నారు. అమెరికాలోని ఈశాన్య కారిడార్‌లో ఇటీవల జరిగిన పలు సంభాషణలు డోనాల్డ్ ట్రంప్‌కు ఆదరణ పెరిగిన విషయాన్ని నిరూపిస్తాయి. కేంబ్రిడ్జ్‌లోని మసాచూ సెట్స్‌లో తొలితరం అమెరికన్ , హైతీ సంతతి మహిళ తన రోజువారీ కష్టాలను వెళ్లగక్కుతోంది. రెండ్రెండు ఉద్యోగాలు చేస్తున్నా తన ముగ్గురు పిల్లలతో జీవనం దుర్భరమవుతోందని ఆమె వాపోయింది. అంతేకాదు... ఉక్రెయిన్ , ఇజ్రాయెల్ యుద్ధాలకు అమెరికా మద్దతుగా నిలవడాన్ని కూడా ప్రశ్నిస్తోంది. డబ్బులు ఎందుకు వృథా చేస్తున్నా మంటూ ఆక్షేపిస్తోంది. అదే సమయంలో దేశంలో అక్రమ చొరబాటు దారులు పెరిగిపోతూండటం కూడా ఆమెకు రుచించడం లేదు. చట్ట బద్ధంగా దేశంలోకి వస్తున్న వాళ్లు పౌరసత్వం పొందేందుకు ఏళ్ల తరబడి తంటాలు పడుతూంటే, అక్రమ వలసదారులు మాత్రంఎంచక్కా మంచి జీవితాన్ని అనుభవిస్తున్నారన్నది ఆమె ఆరోపణ. ఈ ఆర్థిక, వలసల సమస్యలకు బాధ్యుడు జో బైడెన్ అని ఆమె నిశ్చితా భిప్రాయం. అందుకే తాను ఈసారి ట్రంప్‌కు ఓటేస్తానని చెబుతోంది. ట్రంప్‌పై క్రిమినల్ కేసులున్న విషయాన్ని కూడా పట్టించుకోవడం లేదు. వ్యవస్థ తమలాంటి ప్రజల మాదిరే ట్రంప్‌ను కూడా హింసిస్తోందని అంటోంది. న్యూయార్క్‌లోని ఓ యువ ఊబర్ డ్రైవర్ ఏమంటున్నాడో చూడండి. డొమినికన్ రిపబ్లిక్ నుంచి వలస వచ్చిన ఈ యువకుడు 2016లో ట్రంప్‌కు ఓటేయవద్దని తన మిత్రులందరికీ చెప్పాడు. ఇప్పుడు మాత్రం తన ఆలోచనలు మారిపోయాయని అంటున్నాడు. బైడెన్ ఏలుబడిలో నేరాలు పెరిగిపోయాయని అతడి ఆరోపణ (నిజా నికి తగ్గాయి). అమెరికా యుద్ధాల్లో చిక్కుకుపోవడం కూడా ఇతడికి ఇష్టం లేదు. బైడెన్ వృద్ధుడు అయ్యాడని ఈ యువకుడి నమ్మకం (బైడెన్‌కు 81 ఏళ్లు. ట్రంప్‌కు 77). జనవరి 6 (2021) ఘటన (క్యాపి టల్‌పై ట్రంప్ అనుచరుల దాడి) మీద భిన్నాభిప్రాయాలు ఉన్నప్ప టికీ, వలసదారుల సమస్య అతడిని పీడిస్తోంది. 2022 నుంచి ఇప్పటి వరకూ న్యూయార్క్ నగరం దాదాపు 16,000 కాందిశీకుల నివాసానికి అనుమతులు జారీ చేసింది. ఇప్పటికే పనిభారంతో ఉన్న నగర పరి పాలన వ్యవస్థ మరో 68,000 మంది బాగోగులు చూసుకుంటోంది. ఈ చర్యలు కాస్తా అక్రమ వలసల విషయంలో ప్రజల్లోని వ్యతిరేక భావనలను మరింత పెంచుతున్నాయి. ఈ వ్యతిరేకత అటు డెమొక్రా ట్లతోపాటు ఇటు రిపబ్లికన్లలోనూ కొనసాగుతూండటం గమనార్హం. వాషింగ్టన్ డీసీలో ఉంటున్న సియెర్రా లియోన్ జాతీయుడి ఆలో చనలు ఎలా ఉన్నాయో చూడండి. 2008లో వలస వచ్చిన ఈ వ్యక్తి ఇప్పుడు అమెరికన్ పౌరుడు. ట్రంప్‌కు ఓటేసేందుకు ఎదురు చూస్తు న్నాడు. ఉక్రెయిన్ , ఇజ్రాయెల్‌లకు అమెరికా ఎందుకు మద్దతిస్తోందో ఇతడికి అర్థం కావడం లేదు. బైడెన్ చాలా యుద్ధాలు చేస్తున్నాడంటాడు. ట్రంప్ అధికారంలోకి వస్తే ఇజ్రాయెల్‌కు మద్దతు మరింత పెరుగుతుందన్న వాదనను తిప్పికొడుతున్నాడు. బైడెన్ ఏలుబడిలో రోజువారి వెచ్చాల ధరలు, అద్దెలు పెరిగిపోయాయనీ, ఆఫ్రికా దేశపు వ్యక్తిగా, ముస్లింగా జాతి వివక్ష విషయంలో డెమొక్రాట్లు, రిపబ్లికన్లలో తేడా ఏమీ లేదంటాడు. రిపబ్లికన్ల వైపు అనూహ్య మొగ్గు ఎక్కడైనా సరే, రాజకీయ వాతావరణం ఎలా ఉందో తెలుసు కోవాలంటే ఆయా పార్టీల మూలభూతమైన మద్దతుదారులు నమ్మ కంగా ఉన్నారా, లేదా? అన్నది ఒక ప్రామాణికమవుతుంది. తన ప్రాబ ల్యాన్ని విస్తరించుకోవడం ఇంకో కొలమానం. ఇప్పటివరకూ చెప్పు కున్న సంభాషణలన్నింటినీ ఒకసారి పరిశీలిస్తే ట్రంప్‌కు ప్రాథమిక స్థాయిలో ఉన్న ఆదరణ తగ్గలేదు సరికదా... ఎంతో కొంత పెరిగిందని స్పష్టమవుతుంది. హైతి, డొమినికన్ రిపబ్లిక్, సియెర్రా లియోన్ లకు చెందిన అమెరికన్ పౌరులు ట్రంప్ మద్దతుదారులుగా మారతారని ఎవరూ ఊహించరు. అయితే సర్వేలు, ఇతర అంశాలను పరిశీలిస్తే స్పానిష్, నల్లజాతీయుల్లో ఒక వర్గం కూడా నెమ్మదిగానైనా డెమొక్రాట్ల నుంచి రిపబ్లికన్ల వైపునకు మొగ్గుతున్నట్లు తెలుస్తుంది. జాతి ఆధారిత సమూహాలను కాసేపు పక్కనబెడితే... మిగిలిన వర్గాల్లో మాత్రం ట్రంప్ మాటలు బలమైన ముద్రే వేశాయని చెప్పాలి. కొంత తప్పుడు సమాచారం, ఎన్నికల సంవత్సరంలో జోబైడెన్ ప్రభుత్వ పోకడలపై నెలకొన్న అసంతృప్తి వీటికి ఆజ్యం పోస్తున్నాయి. వేర్వేరు వర్గాలు ట్రంప్ నుంచి వేర్వేరు రకాల సందేశాలు అందుకుంటున్నాయి. ఒక్కటైతే వాస్తవం. ట్రంప్ ఆదరణ పైపైకి పోతోంది. కాక పోతే ఇందుకు భిన్నమైన పార్శా్వలు ఉన్నాయి. బాగున్న బైడెన్ రికార్డ్ మొదటిది... ప్రస్తుతమున్న ప్రజల మూడ్ ఈ క్షణానికి సంబంధించింది మాత్రమే. ప్రచారం చేసేవారికి ఫీడ్‌బ్యాక్ లూప్గా ఉపయో గపడుతుంది కానీ విలువ తక్కువ. 2024 నవంబరులో ఏమవుతుందో ఎవరికీ తెలియదు. ట్రంప్ మళ్లీ ఈ స్థాయిలో పుంజుకుంటా డని గత ఏడాది ఎవరు ఊహించారు? రెండు... ట్రంప్ ఎదుర్కొంటున్న కేసులు పెద్ద సవాళ్లే విసర నున్నాయి. కొలరాడో, మైన్ లలో నమోదైన కేసుల్లో ఓటుపై నిషేధం పడటం ట్రంప్‌కు లాభిస్తోంది. బాధితుడిగా ప్రచారం చేసుకుంటు న్నారు. సుప్రీంకోర్టు ఈ తీర్పులను రద్దు చేయవచ్చు. కానీ ఓ పార్టీ తరఫున అధ్యక్ష స్థానానికి పోటీ పడుతున్న వ్యక్తి నాలుగు క్రిమినల్ శిక్షలు ఎదుర్కొంటున్నాడన్నా, పోలింగ్ రోజుకు ముందు మరిన్ని కేసులు ఎదుర్కునే అవకాశం ఉందన్నా దాని ప్రభావం ఓటింగ్‌పై కచ్చితంగా ఉంటుంది. మూడు... బైడెన్ స్థానిక ఎన్నికల ఏర్పాట్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. అయినప్పటికీ 1973లో తొలిసారి సెనేటర్‌గా ఎన్నికై అంచ లంచెలుగా ఎదిగిన బైడెన్ ఇలాంటి స్థితి నుంచి బయటపడటం చాలా సార్లు చూశాము. పాలన విషయంలో ఆయనపై ఎలాంటి మచ్చ లేకపోవడం, కోవిడ్ నుంచి సమర్థంగా బయటపడటం, ద్రవ్యోల్బణం, ఉపాధి అవకాశాలు, అభివృద్ధి వంటి అంశాల్లో చక్కటి సమ తౌల్యం కనిపిస్తూండటం బైడెన్ కు కలిసివచ్చే అంశాలు. ఈ చర్య లన్నింటి ఫలితం కూడా వడ్డీరేట్లు, ధరలు తగ్గడంలో ప్రతిఫలిస్తోంది. అదే సమయంలో మార్కెట్ కూడా పుంజుకుంటూండటం గమనార్హం. మౌలిక సదుపాయాలు, వాతావరణం, తయారీ రంగాలకు సంబంధించి బైడెన్ ఇప్పటికే విప్లవాత్మకమైన కొన్ని చట్టాలను ఆమోదింప జేసుకున్నారు. బైడెన్ కు ఇంకో రెండు సానుకూల అంశాలున్నాయి. అబార్షన్ పై వచ్చిన తీర్పు విషయంలో రిపబ్లికన్లపై బోలెడంత వ్యతిరేకత ఉంది. ట్రంప్ ఒంటెత్తు పోకడలపై కూడా ప్రజల్లో అభ్యంతరాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ యుద్ధం కొంతమంది వామపక్ష, ముస్లింల ఉత్సాహాన్ని దెబ్బకొట్టినప్పటికీ, యూదుల మద్దతు బైడెన్ కు లభించేలా చేసింది. అందుకేనేమో బైడెన్ చైనా అధ్యక్షుడికి సైతం సర్వేలను నమ్మొద్దనీ, తానే మళ్లీ అధికారంలోకి రానున్నాననీ ధీమాగా చెప్పారు. చివరగా... అమెరికాలోని రెండు పార్టీలకూ దాదాపుగా సమ స్థాయిలో మద్దతు ఉంది. అందుకే అమెరికాను 47 శాతం– 47 శాతం దేశమంటారు. రాష్ట్రాలకు రాష్ట్రాలు అటు ఇటో మొగ్గి ఉంటాయి. అన్ని అధ్యక్ష ఎన్నికల ఫలితాలు అటు ఇటూ మారిపోయే ఆరు లేదా ఏడు స్వింగ్ స్టేట్స్పై ఆధారపడి ఉంటాయి. అరిజోనా, నెవడా, మిషిగన్ , విస్కాన్సిన్ , జార్జియా, పెన్సెల్వేనియాల్లోని కొన్ని వేలమంది ఓటర్లు ఎటు మొగ్గు చూపుతారన్న అంశంపై అధ్యక్షుడి ఎన్నిక ఆధారపడి ఉంటుంది. కాకపోతే ప్రస్తుతానికి మాత్రం పరిస్థితి డోనాల్డ్ ట్రంప్‌కు అనుకూలంగా ఉందని చెప్పకతప్పదు. వ్యాసకర్త వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్ట్ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) - ప్రశాంత్ ఝా -
Hamas: అమెరికా బందీ మృతి.. బైడెన్ కీలక ప్రకటన
వాషింగ్టన్: హమాస్ చెరలో బందీగా ఉన్న తమ దేశ పౌరుడు గాడి హగ్గాయ్ మరణించాడన్న వార్తతో తన గుండె పగిలిపోయిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. హగ్గాయ్ మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు వైట్‌హౌజ్ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘హగ్గాయ్ గాజాలో హమాస్ చెరలోనే చనిపోయాడని తెలిసిన వెంటనే నా, నాభార్య జిల్ బైడెన్ హృదయాలు తీవ్ర విషాదంతో నిండిపోయాయి. హమాస్ వద్ద బందీగా ఉన్న హగ్గాయ్ భార్య క్షేమంగా తిరిగి రావాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూనే ఉంటాం’ అని జో బైడెన్ పేర్కొన్నారు. హగ్గాయ్ భార్య ఇప్పటికీ హమాస్ చెరలోనే బందీగా ఉందని ఇజ్రాయెల్ మీడియా తెలిపింది. గాజాలో హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారి కుటుంబాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక గ్రూపు హగ్గాయ్ మరణాన్ని ధృవీకరించింది. అయితే ఆయన ఎందుకు చనిపోయాడన్న కారణాలు తెలియరాలేదు. ఈ ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై పాలస్తీనాకు చెందిన ఉగ్రవాద గ్రూపు హమాస్ మెరుపు దాడులు జరిపిన విషయం తెలిసిందే. బాంబు దాడులతో పాటు గాజా సరిహద్దులో ఉన్న ఇజ్రాయెల్‌లోని ప్రాంతం నుంచి కొంత మందిని హమాస్ ఉగ్రవాదులు తమ వెంట బందీలుగా తీసుకెళ్లారు. అప్పటి నుంచి హమాస్ లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ బాంబులతో విరుచుకుపడుతూనే ఉంది. ఇదీచదవండి..గుడి గోడలపై ఖలిస్తానీ నినాదాలు -
అమెరికా అధ్యక్ష ఎన్నికలు: మళ్లీ ఆయనే హాట్ ఫేవరెట్!
వాషింగ్టన్: వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ ఫేవరెట్‌గా మారుతున్నారు. తాజాగా వాల్ స్ట్రీట్ జర్నల్ చేసిన సర్వేలో ప్రస్తుత అధ్యకక్షుడు జో బైడెన్‌కంటే 4 శాతం ఎక్కువ అప్రూవల్ రేటుతో ట్రంప్ ముందున్నారు. అమెరికా అధ్యక్షుడిగా జోబైడెన్‌ను 43 శాతం మంది ప్రజలు ఆమోదించగా ట్రంప్‌ను 47 శాతం మంది ఆమోదించడం విశేషం. అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి జో బైడెన్ అప్రూవల్ రేటు 43 శాతానికి పడిపోవడం ఇదే తొలిసారి. 2024 అధ్యక్ష ఎన్నికలకు ఏడాది కంటే తక్కువ టైమ్ ఉండడంతో డెమొక్రాట్లకు ఈ విషయం ఆందోళన కలిగిస్తోంది. దీంతో డెమొక్రాట్లు రెండోసారి అధ్యక్షపదవికి జోబైడెన్ పోటీలో ఉండటాన్ని వ్యతిరేకిస్తున్నారు. బైడెన్ రెండోసారి పోటీచేయవద్దనేందుకు వాళ్లు మరో కారణం కూడా చూపుతున్నారు. ఎన్నికల నాటికి ఆయన వయసు 81కి చేరనుందని, ఈ వయసులో మళ్లీ పోటీ ఎందుకని కొందరు డెమొక్రాట్ నేతలు వాదిస్తున్నారు. మరోవైపు రిపబ్లికన్ల తరపున అధ్యక్ష పదవికి పోటీలో ట్రంప్‌కు తిరుగులేని మద్దతు లభిస్తోంది. పార్టీలో ట్రంప్ పోటీదారులెవరూ ఆయన దరిదాపుల్లో కూడా లేరు. అయితే ట్రంప్ మీదున్న క్రిమినల్ కేసులు, గతంలో క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారుల దాడి వంటి అంశాలు ఆయన అభ్యర్థిత్వానికి ముప్పుగా పరిణమించే అవకాశాలు లేకపోలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదీచదవండి..ఈ రెస్టారెంట్లో చెంపదెబ్బలు వడ్డిస్తారు! -
ఇజ్రాయెల్-హమాస్ సంధిపై బైడెన్ కీలక వ్యాఖ్యలు
న్యూయార్క్: హమాస్-ఇజ్రాయెల్ మధ్య సంధి కుదరడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అంగీకరించిన కాల్పుల విరమణను పొడిగిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. హమాస్ చెరలో ఉన్న బందీలు విడదల కావడంపై స్పందిస్తూ.. ఇది ప్రారంభం మాత్రమే అని అన్నారు. తమ చెరలో ఉన్న 24 మంది బందీలను హమాస్ విడిచిపెట్టింది. వీరిలో 13 మంది ఇజ్రాయెల్ పౌరులు, 10 మంది థాయ్‌లాండ్ పౌరులు, ఒకరు ఫిలిప్పైన్స్ పౌరుడు ఉన్నారు. విడుదలైన బందీలంతా ఆరోగ్యంగానే కనిపిస్తున్నారని ఇజ్రాయెల్ వైద్య శాఖ తెలియజేసింది. కాగా.. నేడు మరో దఫా బందీలను హమాస్ విడుదల చేయనున్నట్లు సమాచారం. హమాస్ డిమాండ్‌ను నెరవేరుస్తూ ఇజ్రాయెల్ కూడా మొదటి దశలో 39 పాలస్తీనా ఖైదీలను విడుదల చేసిందని సమాచారం. ఇజ్రాయెల్-హమాస్ మధ్య అక్టోబర్ 7న యుద్ధం ప్రారంభం అయింది. హమాస్ అంతమే ధ్యేయంగా ఇజ్రాయెల్ గాజాపై దూకుడుగా ప్రవర్తించింది. గాజాను ఖాలీ చేయించింది. స్వతంత్ర్య పాలస్తీనాను నినదిస్తూ పశ్చిమాసియా దేశాలు ఏకమయ్యాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ రంగంలోకి దిగారు. ఇరుదేశాలు కాల్పుల విరమణ అంగీకారానికి రావాలని కోరారు. ఈ డిమాండ్ల తర్వాత నాలుగు రోజుల కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించింది. ఇందుకు బదులుగా హమాస్ తమ చెరలో ఉన్న 50 మందిని విడుదల చేయడానికి ఒప్పుకుంది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఇప్పటివరకు జరిగిన యుద్ధంలో గాజా వైపు 15,000 మంది మరణించారు. ఇజ్రాయెల్ వైపు 1,200 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదీ చదవండి: Israel-Hamas war: 24 మంది బందీలకు స్వేచ్ఛ -
జిన్‌పింగ్ ఓ నియంత.. బైడెన్ నోట మళ్లీ అదే మాట!
వాషింగ్టన్: రెండు అగ్రరాజ్యాల అధ్యక్షులు జో బైడెన్, జిన్‌పింగ్ బుధవారం భేటీ అయ్యారు. ఆసియా–పసిఫిక్ ఆర్థిక సహకార మండలి(ఏపీఈసీ) శిఖరాగ్ర సదస్సులో భాగంగా దాదాపు ఏడేళ్ల తర్వాత ఇద్దరు నేతలు సమావేశమయ్యారు. ఈ మీటింగ్ అనంతరం బయటకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ని నియంతగానే విశ్వసిస్తున్నానని చెప్పారు. చైనా ప్రభుత్వం, తమ ప్రభుత్వానికి చాలా తేడా ఉంటుందని అన్నారు. జిన్‌పింగ్‌ను నియంతలాగే చూస్తున్నారా..? అని ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య పోరు నడుస్తున్న నేపథ్యంలో బైడెన్ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ ఏడాది జూన్‌లోనూ బైడెన్ ఇదే మాట మాట్లాడారు. అప్పట్లోనే బైడెన్ తీరును చైనా ఖండించింది. మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేయడం వివాదానికి దారి తీసేలా కనిపిస్తోంది. కాగా.. కాలిఫోర్నియాలోని ఒక విశాలమైన భవనంలో ఈ సమ్మిట్ ముగిసింది. రెండు దేశాల మధ్య విబేధాలు సమసిపోయేలా, దౌత్య సంబంధాలు తప్పదోవపట్టకుండా కృషి చేయడానికి అధ్యక్షులు అంగీకరించారు. ఈ సమావేశంలో ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాలు, ఇరాన్, పశ్చిమాసియా, ఉక్రెయిన్, తైవాన్, ఇండో-పసిఫిక్, ఆర్థిక సమస్యలు, కృత్రిమ మేధస్సు, మాదక ద్రవ్యాల సరఫరా, వాతావరణం వంటి ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై చర్చించారు. అమెరికాలో అక్రమ మాదక ద్రవ్యాల వాణిజ్యం చేపడుతున్న చైనా సంస్థలపై చర్యలు తీసుకుంటానని జిన్‌పింగ్ హామీ ఇచ్చారు. అమెరికాను ఇరుకున పెట్టాలనే ఉద్దేశం లేదని జిన్‌పింగ్ స్పష్టంగా తెలియజేశారు. అలాగే.. అమెరికా కూడా చైనాను అణగదొక్కే చర్యలకు పాల్పడకూడదని పునరుద్ఘాటించారు. ఇరుదేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలు వివాదాలకు దారితీయకుండా చర్యలు తీసుకోవాలని ఇద్దరు అధ్యక్షులు అంగీకారానికి వచ్చారు. తైవాన్ అంశం ఇరుదేశాల మధ్య సంబంధాలకు చాలా సున్నితమైన అంశంగా మారిందని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అన్నారు. తైవాన్ స్వాతంత్య్రానికి అమెరికా మద్దతు ఇవ్వకూడదని కోరుతూ.. ఆయుధ సరఫరాను నిలిపివేయాలని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: బైడెన్‌తో జిన్‌పింగ్ భేటీ -
ఉపన్యాసం వద్దు.. ట్రంప్‌పై న్యాయమూర్తి ఆగ్రహం
న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను న్యాయమూర్తి మందలించారు.కోర్టులో రాజకీయ ప్రసంగాలు ఇవ్వరాదని చివాట్లు పెట్టారు. విచారణ సందర్భంగా అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇవ్వాలని చెప్పారు. బ్యాంకులు, బీమా కంపెనీల నుంచి ఎక్కువ మొత్తంలో రుణాన్ని పొందడానికి ట్రంప్ తన రియల్ ఎస్టేట్ ఆస్తుల విలువను ఎక్కువ చూపించారనే ఆరోపణల కేసులో విచారణ జరిగింది. "ఇది రాజకీయ ర్యాలీ కాదు. ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి. ప్రసంగాలు వద్దు.' అని ట్రంప్‌ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆర్థర్ ఎంగ్రోరోన్ హెచ్చరించారు. ట్రంప్‌ను ఎక్కువ మాట్లాడకుండా నియంత్రించాలని పిటిషనర్ తరుపు లాయర్‌పై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని కోర్టు హాల్లో ట్రంప్ అన్నారు. కోర్టుల్లో కాలయాపన చేస్తూ తన సమయాన్ని వృథా చేస్తున్నారని ఆరోపించారు. విచారణ అసంబద్ధంగా జరుగుతోందని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ ఆస్తుల్లో ట్రంప్ బ్రాండ్ విలువను కలపకుండానే ప్రకటించినట్లు పేర్కొన్నారు. కేవలం తన బ్రాండ్‌తోనే ఈ సారి ఎన్నికల్లో విజయం సాధిస్తానని అన్నారు. ట్రంప్ ప్రసంగంతో విసిగిన న్యాయమూర్తి మందలించారు. 2024 ఎన్నికల నేపథ్యంలో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి తరుపున ట్రంప్ పోటీలో ఉన్నారు. ఇదీ చదవండి: 17 సార్లు పొడిచి భార్యపై కిరాతకం.. అమెరికాలో కేరళవాసికి జీవిత ఖైదు -
ఇండోనేషియా రాయబారిగా ఇండో-అమెరికన్.. బైడెన్ కీలక నిర్ణయం
న్యూయార్క్: అమెరికాలో భారత సంతతి మహిళకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఇండోనేషియాలో అమెరికా రాయబారిగా భారత సంతతి మహిళ కమలా షిరిన్ లఖ్ధీర్‌ను అధ్యక్షుడు జో బైడెన్ నియమించారు. లఖ్ధీర్‌కు దాదాపు 30 సంవత్సరాలు విదేశాంగ శాఖలో పనిచేసిన అనుభవం ఉంది. ఇటీవల ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా కూడా పనిచేశారు. 2017 నుంచి 2021 వరకు మలేషియాలో అమెరికా అంబాసిడర్‌గా పనిచేయడానికి ముందు, ఆమె రాజకీయ వ్యవహారాల అండర్ సెక్రటరీకి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా కొనసాగారు. 2009 నుంచి 2011 వరకు ఉత్తర ఐర్లాండ్‌లో అమెరికా కాన్సుల్ జనరల్‌గా ఆమె పనిచేశారు. 1991లో ఫారిన్ సర్వీస్‌లో చేరిన లఖ్దీర్.. సౌదీ అరేబియాలోని అమెరికా ఎంబసీలో మొదట పనిచేశారు. మారిటైమ్ ఆగ్నేయాసియా వ్యవహారాల కార్యాలయానికి డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. ఆమె కెరీర్ ప్రారంభంలో, తూర్పు ఆసియా పసిఫిక్ వ్యవహారాల బ్యూరోలో తైవాన్ కోఆర్డినేషన్ స్టాఫ్‌కు డిప్యూటీ కోఆర్డినేటర్‌గా పనిచేశారు. భారతీయ తండ్రి, అమెరికన్ తల్లికి జన్మించిన లఖ్ధీర్.. హార్వర్డ్ కళాశాల నుంచి బీఏ, నేషనల్ వార్ కళాశాల నుంచి ఎమ్ఎస్ పట్టా పొందారు. చైనీస్, ఇండోనేషియాతో సహా పలు భాషలపై ఆమెకు పట్టు ఉంది. ఇదీ చదవండి: శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం.. భారత్‌తో సహా ఏడు దేశాలకు ఉచిత వీసాలు