
ముందస్తు నోటీసు ఇవ్వకుండా వీసాలను అధికారులు తిరస్కరించేందుకు వీలు కల్పించే ట్రంప్ పాలనా కాలపు విధాన నిర్ణయాన్ని తొలగించనున్నట్లు అమెరికా ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ (యూఎస్‌సీఐఎస్) వెల్లడించింది.
వాషింగ్టన్: ముందస్తు నోటీసు ఇవ్వకుండా వీసాలను అధికారులు తిరస్కరించేందుకు వీలు కల్పించే ట్రంప్ పాలనా కాలపు విధాన నిర్ణయాన్ని తొలగించనున్నట్లు అమెరికా ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ (యూఎస్‌సీఐఎస్) వెల్లడించింది. ఈ నిబంధన తొలగింపుతో లీగల్ ఇమ్మిగ్రేషన్‌కు ఉన్న అడ్డంకులు మరింతగా తగ్గనున్నాయి. జోబైడెన్-హారిస్ నేతృత్వంలో తీసుకున్న విధాన చర్యలు దేశ చట్టపరమైన ఇమ్మిగ్రేషన్ వ్యవస్థకు అనవసరమైన అడ్డంకులను తొలగించడానికి ఉపయోగపడుతుందని యుఎస్‌సీఐఎస్ డైరెక్టర్ ట్రేసీ రెనాడ్ చెప్పారు. అలాగే ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాలకు సంబంధించి వలసదారులపై భారాన్ని తగ్గించాలన్న లక్ష్యానికనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
ట్రంప్ 2018లో తెచ్చిన ఈ నిబంధన హెచ్1బీతో సహా ఎల్1, హెచ్2బీ, జే1, జే2, ఎఫ్, ఓ తదితర వీసా అప్లికేషన్లపై పడింది. తాజాగా ఆర్‌ఈఎఫ్, ఎన్‌ఓఐడీ నిబంధనలను మారుస్తున్నట్లు, కొన్ని రకాల ఎంప్లాయ్ ఆధరైజేషన్ డాక్యుమెంట్ల కాలపరిమితిని పొడిగిస్తున్నట్లు ఏజెన్సీ తెలిపింది. 2013లో తీసుకువచ్చిన నిబంధనలనే తిరిగి అమలు చేస్తామని, 2018లోతెచ్చిన నిబంధనను తొలగిస్తామని తెలిపింది. తాజా నిర్ణయంతో అప్లికేషన్లలో తప్పులను సవరించుకునే వీలు వీసా దరఖాస్తుదారులకు కలగనుంది. 2018 నిబంధన ప్రకారం ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా వీసాలు తిరస్కరించేందుకు ఏజెన్సీ అధికారులకుఅవకాశం ఉండేది. దీని ప్రభావం పలు ఐటీ కంపెనీల ఉద్యోగులపై పడింది. చట్టపరమైన ఇమ్మిగ్రేషన్ సజావుగా కొనసాగేందుకు తాము తగిన నిర్ణయాలు తీసుకుంటున్నామని హోమ్‌లాండ సెక్యూరిటీ కార్యదర్శి అలెజాండ్రో తెలిపారు.
చదవండి : Petrol Price: రూ.102 దాటేసింది!