భవిష్యత్తు బంగారమేనా? | Sakshi Editorial On America new president Donald Trump | Sakshi
Sakshi News home page

భవిష్యత్తు బంగారమేనా?

Published Wed, Jan 22 2025 4:52 AM | Last Updated on Wed, Jan 22 2025 8:54 AM

Sakshi Editorial On America new president Donald Trump

అనుకున్నదే అయింది. అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తూనే డొనాల్డ్‌ ట్రంప్‌ తన మాటలు, చేతలు, చేష్టల ద్వారా సంచలనాలు సృష్టించారు. గతంలో దేశానికి 45వ అధ్యక్షుడిగా పనిచేసి, తాజాగా 47వ అధ్యక్షుడిగా సోమవారం పదవీ ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్‌ తన తొలి ప్రసంగంలోనే ‘ఇక నుంచి అమెరికాకు స్వర్ణయుగం’ అంటూ అమెరికన్లలో ఆశలు, ఆకాంక్షలు పెంచారు. 

అయితే, ‘అమెరికాను మళ్ళీ ఘనమైన దేశంగా తీర్చిదిద్దాల’ని (మాగా) నినదిస్తూ ఆయన ప్రకటించిన కొన్ని చర్యలు ఆధిపత్య, విస్తరణవాదానికి ప్రతీకగానూ ప్రతిధ్వనించాయి. వర్తమాన ప్రపంచ అధికార క్రమాన్ని మార్చివేసే పలు చర్యలకు నడుం బిగి స్తున్న తీరు, అలాగే కోవిడ్, చైనాలను సాకుగా చూపుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి, అలాగే పర్యావరణ రక్షణపై ప్యారిస్‌ ఒప్పందం నుంచి పక్కకు తప్పుకుంటున్నట్లు ప్రకటించడం ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. 

ట్రంప్‌ పదవీ ప్రమాణ స్వీకారం పైకి సాదాసీదా అధికార మార్పిడిగా అనిపించవచ్చు. రాజకీయ ప్రత్యర్థులు సైతం చిరునవ్వులు చిందిస్తూ సౌహార్దం చూపుకుంటున్నట్టు కనిపించవచ్చు. అంతమాత్రాన అంతా మామూలే అనుకొంటే పొరపాటు. పదవీ ప్రమాణ స్వీకారోత్సవంలో దర్శనమిచ్చిన ఐక్యతకు భిన్నంగా ప్రత్యర్థులపై తుపాకులు ఎక్కుపెట్టిన తీరు ఆయన ప్రసంగంలో స్పష్టంగా వినిపించింది. 

కునారిల్లిన దేశాన్ని తాను మాత్రమే మళ్ళీ పునరుత్తేజితం చేయగలనన్న భావన కలిగించడంతో పాటు ఆయన ఒకటికి రెండు జాతీయ ఎమర్జెన్సీలు ప్రకటించడం పెను పర్యవసానమే. అలాగే, చైనా నుంచి పనామా కాలువను వెనక్కి తీసుకోవాలని పిలుపునివ్వడమూ వివాదాస్పదమే. బలప్రయోగం ద్వారా మాత్రమే సాధ్యమయ్యే అలాంటి పనుల ప్రస్తావన నిప్పుతో చెలగాటానికి సిద్ధమని స్పష్టం చేయడమే. ఇక, గద్దెనెక్కిన తొలిరోజునే ‘గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికో’ను ‘గల్ఫ్‌ ఆఫ్‌ అమెరికా’గా ట్రంప్‌ ప్రకటించడంతో రానున్న రోజుల్లో అంతర్జాతీయంగా మరెన్ని ఆశ్చర్యకర పరిణామాలు చోటుచేసుకుంటాయనే ఉద్విగ్నత నెలకొంది. 

పదవి చేపడుతూనే ట్రంప్‌ చకచకా సంతకాలు చేసిన పదుల సంఖ్యలోని కార్యనిర్వాహక ఆదేశాలు ఆసక్తికరం. పర్యావరణ పరిరక్షణను గాలికొదిలేయడం, జన్మహక్కుగా సంక్రమించే పౌర సత్వంపై అమెరికా రాజ్యాంగాన్ని సైతం తోసిపుచ్చడం లాంటివి ఇట్టే మింగుడుపడే అంశాలు కావు. జాతీయతతో సంబంధం లేకుండా దేశంలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్నవారికి పుట్టినబిడ్డలకు సైతం 150 ఏళ్ళ పైచిలుకుగా అమెరికా పౌరసత్వం దక్కుతూ వచ్చింది. కానీ, నెల రోజుల్లో అమలులోకి రానున్న తాజా ఆదేశం ఫలితంగా ఇప్పుడిక అలాంటి పిల్లలకు పౌరసత్వ పత్రాలివ్వరు. 

అదేమంటే, 1868లో చేసిన 14వ సవరణ కింద అమెరికా గడ్డపై పుడితేచాలు ఆ పిల్లలకు మారుమాట లేకుండా పౌరసత్వమివ్వాలనేమీ లేదనీ, సవరణను తప్పుగా వ్యాఖ్యానించారనీ ట్రంప్‌ వాదన. తాత్కాలిక వీసాలతో అమెరికాలో నివసిస్తూ, ఉద్యోగాధారిత గ్రీన్‌కార్డ్‌కై దీర్ఘ కాలంగా నిరీక్షిస్తున్న 10 లక్షల పైచిలుకు మంది భారతీయులకు ఈ కొత్త నిర్ణయం అశనిపాతమే. ఇప్పటికే కొన్నిచోట్ల ఇమ్మిగ్రేషన్‌ లాయర్లు కోర్టుకెక్కిన ఈ ఆదేశం గనక అమలైతే, తాత్కాలిక వర్క్‌ వీసాలు, టూరిస్ట్‌ వీసాలపై అగ్రరాజ్యంలో ఉంటున్నవారి సంతానానికి అక్కడి పౌరసత్వ ఆశలు అడుగంటినట్లే. 

2022 నాటి అమెరికా జనాభా లెక్కలపై ప్యూ రిసెర్చ్‌ విశ్లేషణ ప్రకారం అమెరికాలో 48 లక్షల మంది భారతీయ అమెరికన్లుంటే, వారిలో మూడింట రెండొంతుల మంది వలసజీవులే. కేవలం 34 శాతం, మరో మాటలో 16 లక్షల మంది మాత్రం అగ్రరాజ్యంలోనే పుట్టారు. ఇక, చట్టవిరుద్ధమైన వలసల్ని అడ్డుకుంటాననీ, సరైన పత్రాలు లేని లక్షలాది వలస జీవుల్ని దేశం నుంచి పంపివేస్తాననీ ట్రంప్‌ చేసిన గర్జన కూడా లక్షలమందికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఆ జాబితాలో మెక్సికో (40 లక్షలు), ఎల్‌ సాల్వడార్‌ (7.5 లక్షలు) తర్వాత 7.25 లక్షల మంది భారతీయులదే మూడో స్థానం. 

ఫలితంగా, ట్రంప్‌ ప్రతి మాట, ప్రతి అడుగు మనవాళ్ళలో ఆదుర్దా పెంచుతోంది. ఈ పరిస్థితుల్లో ట్రంప్‌ కొత్త ఏలుబడిలో భారత్‌తో బంధం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరం. మరోపక్క డెమోక్రాట్లను జనం బాధలు పట్టని కులీనులుగా చిత్రించి, సామాన్య పౌరుల సంరక్ష కుడిగా ఎన్నికల్లో తనను తాను చూపుకొన్న ట్రంప్‌ను అతిగా నమ్మి మోసపోయామనే భావన రేకెత్తడం సహజమే. చేతిలోని నియంత్రణ నిర్ణయాలే అండగా ఇటీవలే ఓ బ్రాండెడ్‌ క్రిప్టో టోకెన్‌ ద్వారా ఆయన వందల కోట్ల డాలర్ల లబ్ధి పొందాడనే విమర్శలూ గుప్పుమంటున్నాయి. 

రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన 80 ఏళ్ళ తర్వాత కీలక సమయంలో పగ్గాలు చేపట్టిన ట్రంప్‌ తన మద్దతుదారులకై ఏమైనా చేసేలా ఉన్నారు. 2021లో అమెరికా అధ్యక్ష భవనంపై దాడి చేసిన దాదాపు 1500 మంది దుండగులకూ ఆయన తక్షణం సామూహిక క్షమాభిక్ష ప్రసాదించడమే అందుకు తార్కాణం. నాలుగేళ్ళు విచారించి, శిక్షలు వేసిన న్యాయవ్యవస్థను అలా నూతన అధ్యక్షుడు పరిహసించినట్టయింది. 

ఆశ్రితులు, ఆర్థిక దాతలు, బంధు మిత్రులకై  క్షమాభిక్ష వ్యవస్థను దుర్వినియోగం చేయడంలో నిన్నటి బైడెన్‌ నుంచి నేటి ట్రంప్‌ దాకా అందరూ ఒకే తాను గుడ్డలన్న మాట. కాలు మోపిననాడే కాపురం చేసే లక్షణం తెలిసిందన్నట్టు ట్రంప్‌ 2.0 హయాం ఆరంభమవు తూనే రోజులు ఎలా ఉండనున్నాయో తేటతెల్లమైంది. బహుళ ధ్రువ ప్రపంచం వైపు అంతర్జాతీయ అధికార క్రమం అడుగులేస్తున్న కాలంలో ‘అమెరికా ఫస్ట్‌’ నినాదంతో సామాజిక, ఆర్థిక రంగాల్లో ట్రంప్‌ ఆధిపత్యభావ నిర్ణయాలు రానున్న నాలుగేళ్ళలో ప్రపంచాన్ని కుదిపేయడం ఖాయం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement