
న్యూఢిల్లీ: వివిధ దేశాలపై అమెరికా వడ్డించిన భారీ టారిఫ్‌ల వెనుక హేతుబద్ధత ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అసలు ఏ ప్రాతిపదికన ఈ టారిఫ్‌లను నిర్ణయించారనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. మిగతా దేశాలు తమపై ఎంత టారిఫ్‌లు విధిస్తున్నాయో అదే స్థాయిలో తామూ సుంకాలు విధించామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నప్పటికీ వాస్తవానికి లెక్కలు వేరేగా ఉన్నాయి. మిగతా దేశాలతో వాణిజ్య లోటును భర్తీ చేసుకునే విధంగా టారిఫ్‌లను నిర్ణయించినట్లుగా పరిశీలకులు చెబుతున్నారు.
సాధారణంగా పైకి కనిపించే టారిఫ్‌లే కాకుండా తమ ఉత్పత్తులకు నియంత్రణ సంస్థలపరమైన అడ్డంకులు, సాంకేతిక అవరోధాలు, కరెన్సీ హెచ్చుతగ్గులు తదితర టారిఫ్‌యేతర అంశాలు కూడా వాణిజ్య లోటుకు కారణమవుతున్నాయని అగ్రరాజ్యం భావిస్తోంది. కాబట్టి వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ప్రస్తుత రేటును నిర్ణయించింది. ఉదాహరణకు భారత్‌తో అమెరికాకు 46 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఉందంటే.. దాన్ని సున్నా స్థాయికి తీసుకొచ్చేలా సుంకాలను నిర్ణయించినట్లు పరిశీలకులు పేర్కొన్నారు. అంటే ప్రస్తుతం భారత్‌పై విధించిన 26% రేటు ద్వారా మన దేశంతో ఉన్న వాణిజ్య లోటును పూర్తిగా భర్తీ చేసుకోవచ్చని అమెరికా భావిస్తోంది. ఈ సుంకాల వల్ల భారతీయ ఉత్పత్తుల ధరలు పెరిగి, అమెరికన్లు మన దగ్గర నుంచి దిగుమతులు తగ్గించుకుంటారని, తద్వారా వాణిజ్య లోటు తగ్గుతుందని అమెరికా అభిప్రాయం.
లోపభూయిష్టమైన విధానం..
అయితే, ఇది తప్పుల తడక విధానమని విమర్శలు వస్తున్నాయి. వాణిజ్య లోటుకు లేదా మిగులుకు టారిఫ్‌లు, టారిఫ్‌యేతర అడ్డంకులు, కరెన్సీ హెచ్చుతగ్గుల్లాంటివి కారణమే అయినప్పటికీ.. కేవలం సుంకాల విధింపు ద్వారా దీన్ని పరిష్కరించుకోవడం సాధ్యపడదని విశ్లేషకులు చెబుతున్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్య లోటుకు కారణాలు అనేకం ఉంటాయని తెలిపారు. ఉదాహరణకు బియ్యం ప్రధాన ఆహారంగా ఉండే దేశానికి .. గోధుమలను భారీగా పండించి, ఎగుమతి చేసే మరో దేశం నుంచి ఎక్కువగా దిగుమతులు ఉండకపోవచ్చు. కానీ తాము దేశీయంగా ఉత్పత్తి చేసుకోలేని పరికరాలు, కంప్యూటర్లను ఎగుమతి చేసే ఇంకో దేశంతో వాణిజ్య లోటు ఉండొచ్చు. అలాగని ఈ వాణిజ్య లోటేమీ అవాంఛనీయమైన లేదా అనుచితమైనదేమీ కాదు.
ప్రస్తుతం అమెరికా పాటిస్తున్న విధానాన్ని బట్టి చూస్తే ఏప్రిల్ 2 నాటి టారిఫ్‌లే అంతిమం కాదని భావించాలి. రేప్పొద్దున్న డాలరు మారకం విలువ పెరిగి, అమెరికాలో మన ఉత్పత్తుల ధరలు పెరగకపోయి, అక్కడి వారు దిగుమతులు చేసుకోవడం కొనసాగిస్తే.. వాణిజ్య లోటు యథాప్రకారం కొనసాగుతుంది. అప్పుడు మళ్లీ వాణిజ్య లోటును భర్తీ చేసుకోవడానికి మళ్లీ టారిఫ్‌లు పెంచాల్సి వస్తుంది. ఆ విధంగా సుంకాల వడ్డింపు నిరంతర ప్రక్రియగా కొనసాగే అవకాశం ఉంది.