చేసిన వాగ్దానానికి కట్టుబడి ఉండటం, తలకెత్తుకున్న విలువలను చివరివరకూ శిరోధార్యంగా భావించటం అంత తేలిక కాదు. అధికార వైభోగాల్లో మునిగితేలేవారికి అది ప్రాణాంతకం కూడా. ఇందుకు మినహాయింపు ఎవరని జల్లెడ పడితే ప్రపంచవ్యాప్తంగా వేళ్లమీద లెక్కబెట్టేంత మంది మిగులుతారేమో! అధికార పీఠం నుంచి మరో నెలన్నరలో తప్పుకోబోతున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన కుమారుడు హంటర్ బైడెన్‌కు క్రిమినల్ కేసుల నుంచి విముక్తి కలిగించే ఉత్తర్వులపై ఆదివారం సంతకం చేసిన ఉదంతం ఇప్పుడు అమెరికాలో పెద్ద చర్చనీయాంశమైంది.
అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డోనాల్డ్ ట్రంప్ అధికార పీఠం అధిష్ఠించాక ఒక్కొక్కరి సంగతీ చూస్తానంటూ వీలైనప్పుడల్లా హూంకరిస్తున్నారు. ప్రత్యేకించి హంటర్ బైడెన్ గురించి కూడా చెప్పారు. మన అధమస్థాయి నేతల్లా ‘రెడ్ బుక్’ అని పేరేమీ పెట్టుకోలేదుగానీ వేధించదల్చుకున్నవారి పేర్లన్నిటినీ ఒక చిట్టాలో రాసుకున్నట్టే కనబడుతోంది. కత్తికి పదును పెట్టుకుంటున్న వైనం కళ్ల ముందే కనబడుతోంది.
2021 జనవరి 6న వాషింగ్టన్‌లో కీలక వ్యవస్థలన్నీ కొలువుదీరిన కాపిటల్ హిల్‌లోకి చొరబడి కనీవినీ ఎరుగని విధ్వంసం సృష్టించిన మూకకు క్షమాభిక్ష పెట్టడం ఆయన తొలి ప్రాధాన్యం. ఆ కేసుల్ని దర్యాప్తు చేసినవారినీ, కేసులు దాఖలు చేసిన న్యాయవాదులనూ, వీరి వెనకున్న డెమాక్రటిక్ నేతలనూ జైళ్లపాలు చేయటం ట్రంప్ ఎజెండా.
అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో అయితేనేమి... ఇతర సందర్భాల్లో అయితేనేమి తాను విలువలకు మారు పేరని బైడెన్ ఒకటికి పదిసార్లు చెప్పుకున్నారు. క్రిమినల్ కేసుల్లో ఇరుక్కుని విచారణ ఎదుర్కొంటున్న తన కుమారుడు హంటర్ బైడెన్‌కు అధ్యక్షుడిగా విశేషాధికారాలను వినియోగించి క్షమాభిక్ష పెట్టే యోచన లేదని చెప్పారు. నిరుడు హంటర్‌ను వివిధ అభియోగాల్లో నేరస్తుడని ప్రకటించి, శిక్షాకాలాన్ని తర్వాత ప్రకటిస్తామని న్యాయస్థానం చెప్పినప్పుడు ‘తుది నిర్ణయం ఏదైనా శిరసావహిస్తాను.
న్యాయవిచారణ ప్రక్రియను గౌరవిస్తాను’ అని బైడెన్ ప్రకటించారు. ఆర్నెల్ల క్రితం ఇటలీలో జీ–7 సమావేశాల సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో సైతం ఆయన దీన్నే చెప్పారు. మరేమైంది? తన మాటల్ని తానే ఎందుకు మింగేశారు? సరిగ్గా 82 ఏళ్ల వయసులో పదవి నుంచి నిష్క్రమించే వేళ తన డెమాక్రటిక్ పార్టీని ఎందుకని ఇరుకున పడేశారు? తమది పురాతన పరిణత ప్రజాస్వామ్యమని అమెరికన్లు గొప్పలు పోతారు.
ఎవరైనా– సామాన్య పౌరులైనా, ఉన్నతస్థాయి నేతలైనా–తమ దేశంలో చట్టం ముందు సమానులేనని చెప్పుకుంటారు. అయితే అదంతా నిజం కాదని అడపా దడపా రుజువవుతూనే ఉంటుంది. పైపైన చూస్తే ఇప్పుడు బైడెన్ చర్య కూడా ఆ తానులో ముక్కేనని అందరూ భావిస్తారు. కానీ ఆయన అందర్నీ మించిపోయాడన్నది డెమాక్రాట్లలోనే వినిపిస్తున్న విమర్శల సారాంశం.
ఎందుకంటే ఇంతక్రితం అధ్యక్షులు తమ సన్నిహితులకు క్షమాభిక్ష పెట్టారు తప్ప సంతానానికి ఇలాంటి వెసులుబాటు కల్పించే స్థితి ఏర్పడలేదు. గతంలో జార్జి డబ్లు్య బుష్ అమెరికా రక్షణ మంత్రిగా పనిచేసిన కాస్పర్ వీన్‌బెర్గర్‌నూ, మరికొంతమంది అధికారులనూ ఇరాన్–కాంట్రా వ్యవహారంలో నేరారోపణల నుంచి విముక్తం చేశారు. బిల్ క్లింటన్ తన సవతి సోదరుడిని మాదకద్రవ్యాల కేసు నుంచి తప్పించారు.
ట్రంప్ మాత్రం 2016–20 మధ్య ఎడాపెడా క్షమాభిక్షలు ప్రకటించారు. అందులో తన అల్లుడు జేర్డ్ కుష్నెర్ తండ్రి చార్లెస్ కుష్నెర్ ఒకరు. ఆయనకు పన్ను ఎగవేత కేసులో రెండేళ్ల శిక్షపడగా క్షమాభిక్ష పెట్టారు. అతన్నిప్పుడు ఫ్రాన్స్ రాయబారిగా కూడా ప్రకటించారు. హంటర్‌కు క్షమాభిక్ష పెట్టాక విడుదల చేసిన ప్రకటనలో బైడెన్ తన కుమారుణ్ణి కావాలని అన్యాయంగా ఇరికించి విచారణ తంతు సాగించారని ఆరోపించారు.
అతణ్ణి జైలుపాలుచేసి మానసికంగా తనను ఛిద్రం చేయాలని చూస్తున్నట్టు అర్థమవుతోందన్నారు. ‘ఇది ఇక్కడితో ఆగుతుందనుకోవటానికి లేద’ని ప్రకటించారు. హంటర్ కేసుల్ని గమనిస్తే జో బైడెన్‌ది పుత్ర ప్రేమ తప్ప మరేం కాదని సులభంగా తెలుస్తుంది. ఆయన మాదకద్రవ్యాల వినియోగంలో ఒకప్పుడు మునిగి తేలేవాడు. దశాబ్దం క్రితం ఆయనది చీకటి జీవితం.
ఒబామా హయాంలో తన తండ్రి ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయానికి హంటర్ కుటుంబాన్ని పట్టించుకునేవాడు కాదు. అతని ప్రవర్తన బైడెన్‌కు చాలా తలనొప్పులు తెచ్చిపెట్టింది. తుపాకీ కొనుగోలు చేశాక దాన్ని తన దగ్గర కేవలం 11 రోజులే ఉంచుకుని తిరిగి అధికారులకు అప్పగించి ఉండొచ్చు. కానీ దరఖాస్తు చేసినప్పుడు తన నేర చరిత్ర దాచిపెట్టాడు. మాదక ద్రవ్యాలు వాడుతున్న సంగతిని చెప్పలేదు. పన్ను ఎగవేత కేసు సరేసరి.
మొత్తానికి రెండు రకాల న్యాయం అమలవుతున్న వైనం కళ్ల ముందు కనబడుతుండగా అనవసర స్వోత్కర్షలకు పోరాదని ఇకనైనా అమెరికన్లు గుర్తించాల్సివుంది. నిజానికి ఇలాంటి అసమ వ్యవస్థే ట్రంప్ వంటివారి ఆవిర్భావానికి దారితీసింది. ఏదేమైనా విలువల గురించి మాట్లాడే నైతికార్హత డెమాక్రాట్లు కోల్పోయారు. ట్రంప్ మున్ముందు ఏం చేయబోతారో ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కాష్ పటేల్ నియామకమే చెబుతోంది. దాన్ని చూపించి బైడెన్ చర్య హేతుబద్ధమైనదని డెమాక్రాట్లు చెప్పలేరు. పైపెచ్చు వచ్చే నాలుగేళ్లలో తాను చేసే ప్రతి అక్రమాన్నీ సమర్థించుకోవటానికి డోనాల్డ్ ట్రంప్ బైడెన్‌ను ఉదాహరిస్తుంటే వారు మౌనంగా మిగిలిపోక తప్పదు.
బైడెన్ పుత్రవాత్సల్యం
Published Wed, Dec 4 2024 4:22 AM | Last Updated on Wed, Dec 4 2024 4:22 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment