రక్తసిక్త అమెరికా రాజకీయ చరిత్రలో కొత్త పేజీ అది. అమెరికా దేశాధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా నేడో రేపో అధికారికంగా ఖరారవుతారని భావిస్తున్న మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌పై పెన్సిల్వేనియా రాష్ట్రంలోని బట్లర్ వద్ద శనివారం జరిగిన కాల్పులు, హత్యాయత్నంతో అగ్రరాజ్యమే కాదు... యావత్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఓ ఎన్నికల ర్యాలీలో చేసిన ఈ దాడిలో దుండగుడి తుపాకీ తూటా ట్రంప్ కుడి చెవి పైభాగాన్ని రాసుకుంటూ, రక్తగాయం చేసి పోయింది. నిఘా వర్గాల భద్రతా వైఫల్యాన్ని బట్టబయలు చేసిన ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఆయన బయట పడ్డారు. ఎన్నికల బరిలో ట్రంప్‌కు ప్రధాన పోటీదారైన ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ సహా ప్రపంచ దేశాల నేతలందరూ ఈ దాడిని ఖండించారు.
దాడికి పాల్పడిన ఇరవై ఏళ్ళ వ్యక్తిని భద్రతా దళాలు మట్టుబెట్టారన్న మాటే కానీ, ఈ దుశ్చర్య వెనుక అసలు కారణాలు లోతైన దర్యాప్తులో గానీ వెలికిరావు. తాజా దాడి ఘటనతో అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయావకాశాలు పెరుగుతాయని ఓ అంచనా. అది నిజం కావచ్చు. కానీ, అంతకన్నా కీలకమైనది ఇంకోటుంది. ప్రపంచంలోని అతి ప్రాచీన ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకొనే నేలపై ఆ స్ఫూర్తి వెనకపట్టు పట్టి, హింసాకాండ చెలరేగుతోంది. అమెరికా సమాజమే కాదు... ప్రపంచమంతా ఆందోళన చెందాల్సిన విషయమిది.
అమెరికాలో నేతలపై దాడులు, హత్యాయత్నాలు ఇదే తొలిసారి కాదు. గతంలో అబ్రహామ్ లింకన్, జాన్ ఎఫ్. కెనడీ సహా నలుగురు దేశాధ్యక్షులు దుండగుల దుశ్చర్యలకు బలయ్యారు. రీగన్, థియోడర్ రూజ్‌వెల్ట్ లాంటి వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు. అయితే, తాజా ఘటన జనంలో మునుపెన్నడూ లేని రీతిలో పేరుకున్న అణిచిపెట్టుకున్న ఆగ్రహానికీ, చీలికకూ ప్రతీకగా కనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే, ట్రంప్‌పై హత్యాయత్న ఘటన జరిగిన కొద్ది గంటల తరువాత కూడా అమెరికాలో రాజకీయ భాష రెచ్చగొట్టే విధంగా సాగడం విషాదం.
ఘటన జరిగిన మూడు గంటలకే రక్తసిక్తమైన ట్రంప్ పిడికిలి బిగించిన ఫోటోలతో టీషర్ట్‌లు ఆన్‌లైన్‌లో అమ్మకానికి వచ్చేశాయి. ఈ జగడాలమారి వైఖరిని చూస్తుంటే, అగ్రరాజ్యంలో నేతలు పాఠాలు నేర్చుకున్నట్టు లేదు. విలువలు మరచిన మాటల దాడితో వేడెక్కుతున్న ఎన్నికల వాతావరణంలో ప్రజల్లో తీవ్రమైన ఇష్టానిష్టాలు ప్రబలి, పరిస్థితి ఎక్కడి దాకా పోయే ప్రమాదం ఉందో చెప్పడానికి ట్రంప్‌పై దాడి తార్కాణం. ఎన్నికలను యుద్ధంలా, రక్తం చిందించైనా సరే గెలవడమే పరమావధిగా భావించడం అతి పెద్ద తప్పు. ఇది అమెరికాయే కాక ప్రజాస్వామ్య దేశాలన్నీ విస్మరించలేని పాఠం.
ఈ పాపంలో అన్ని పార్టీలకూ భాగం ఉంది. అనేక జాతులు, తెగలతో కూడిన అమెరికా రాజకీయ వ్యవస్థలో విభేదాలు సహజమే. కానీ, ట్రంప్ మళ్ళీ పగ్గాలు చేపడితే అది అమెరికాకు విలయమేనంటూ డెమొక్రాట్లు ప్రచారం సాగిస్తూ వచ్చారు. రిపబ్లికన్లు, ట్రంప్ సైతం సైద్ధాంతికంగా దిగజారుడుతనంలో తక్కువ తినలేదు. అమెరికాలో ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ప్రతీకగా దేశ చట్టసభకు పీఠమైన యూఎస్ క్యాపిటల్ భవనాన్ని చుట్టుముట్టి, 2021 జనవరి 6న ట్రంప్ అనుకూల మూకలు యథేచ్ఛగా వ్యవహరించినప్పుడే ప్రజాస్వామ్య సౌధంలో ప్రమాద ఘంటికలు మోగాయి.
తాజా హత్యాయత్నానికి డెమోక్రాట్లు, బైడెన్‌ల ప్రచార ధోరణే కారణంటూ ట్రంప్ సహచరులు విరుచుకుపడుతున్నారు. ఒక్కమాటలో... అగ్రరాజ్యమనీ, భూతల స్వర్గమనీ అనుకొనే అమెరికాలో పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. పెరుగుతున్న హింసాత్మక ధోరణులు, పార్టీల వారీగా నిలువునా చీలిపోయిన జనం, ఆగని రాజకీయ హింస అక్కడి సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఆ దేశంలో తుపాకీ సంస్కృతి పెను సర్పమై బుసలు కొడుతోంది.
అమెరికాలో తుపాకీలు బజారులో అతి సులభంగా కొనుక్కోవచ్చన్నది జగమెరిగిన సత్యం. అమెరికా రాజ్యాంగ ప్రకారం ఆత్మరక్షణార్థం ఆయుధాలు కలిగివుండే హక్కు పౌరులకుంది. అమెరికా వయోజనుల్లో ప్రతి పది మందిలో నలుగురింట్లో తుపాకులున్నాయి. చిత్రమేమిటంటే, 2023 జూన్ నాటి ప్యూ రిసెర్చ్ సెంటర్ సర్వే ప్రకారం తుపాకీ చేతిలో ఉంటే చట్టాన్ని పాటించే పౌరులుగా తమను తాము కాపాడుకోవచ్చని నూటికి 49 మంది అమెరికన్లు భావిస్తున్నారు.
మరోమాటలో అమెరికన్ సమాజానికి దేశ శాంతి భద్రతలపై అంతటి అపనమ్మకం ఉందను కోవచ్చు. మరి, పౌరుల చేతిలోని ఈ ఆయుధాలు తప్పులు చేసేవారి చేతుల్లో పడితే పరిస్థితి ఏమిటన్నది ప్రశ్న. దేశంలో పాఠశాలలు, వాణిజ్యభవన సముదాయాల్లో విచక్షణారహితమైన కాల్పుల ఘటనల నుంచి తాజా హత్యాయత్నం దాకా అనేక సంఘటనలే అందుకు సమాధానాలు. తుపాకీలపై నియంత్రణలున్నంత మాత్రాన ఈ ఘటనలు జరగవని కాదు కానీ, లేనప్పుడు జరిగే అవకాశాలు ఇంకా ఎక్కువని ప్రత్యేకించి చెప్పనక్కర లేదు.
ప్రస్తుతం అమెరికా ముందు, ఆ దేశ రాజకీయ నేతలు, పార్టీలు, ప్రజల ముందు ఓ పెను సవాలుంది. అంతకంతకూ దిగజారుతున్న పరిస్థితులు, పేట్రేగుతున్న రాజకీయ విద్వేషం, హింస లకు అడ్డుకట్ట వేయాల్సింది వారే. అన్ని పక్షాలూ కళ్ళు తెరిచి, ఈ పతనాన్ని నివారించాలి. అతివాదాన్ని నిరసించాలి. ఎన్నికల ప్రచారంలో పరస్పర గౌరవంతో సైద్ధాంతిక చర్చలే అనుసరణీయ మార్గమన్న తమ మౌలిక సూత్రాలనే మళ్ళీ ఆశ్రయించాలి.
ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదనీ, ఎన్నికలొక్కటే సామాజిక, రాజకీయ సమస్యలన్నిటికీ పరిష్కారమని ఓటర్లు తమ తీర్పు ద్వారా మరోసారి చాటాలి. అలా కాక, ఇలాంటి ఘటనల్ని వాటంగా చేసుకొని ఎవరికి వారు మరింత రెచ్చగొట్టుడు ధోరణికి దిగితే కష్టం. అది ప్రజాస్వామ్య వ్యవస్థకే పెను ప్రమాదం.
మారకుంటే... ముప్పు
Published Tue, Jul 16 2024 12:56 AM | Last Updated on Tue, Jul 16 2024 12:56 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment