
నాలుగు నెలల్లో మూడోసారి నేరాభియోగాలను ఎదుర్కోవడం... అదీ అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా వ్యవహరించిన వ్యక్తి అంటే అసాధారణమే! అందులోనూ ఏకంగా దేశాన్నే మోసం చేశారంటూ ఆరోపణ రావడం అమెరికా చరిత్రలోనే తొలిసారి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు అందులోనూ రికార్డు సృష్టించారు. పదవిలో ఉన్నా, లేకున్నా వింత ధోరణి, విచిత్రమైన మాటలతో వార్తల్లో నిలిచిన ట్రంప్‌ను పాత తప్పులు వెంటాడుతున్నాయి.
2020 నాటి అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయినా, ఫలితాన్ని తారుమారు చేసేందుకు శతవిధాల ప్రయత్నించారంటూ 4 అంశాల ప్రాతిపదికన 45 పేజీల్లో మంగళవారం ఆయనపై నమోదైన నేరాభియోగం అందుకు తాజా ఉదాహరణ. ఈ ఏడాది ఇప్పటికే మరో రెండు నేరాభియోగాలు మీదపడ్డ ట్రంప్ మెడకు రోజురోజుకూ చట్టం ఉచ్చు బిగిస్తోంది. మళ్ళీ అమెరికా అధ్యక్ష పోటీలో నిలవాలనుకుంటున్న ఆయన వీటి నుంచి బయటపడగలరా? మరో 15 నెలల్లో జరిగే ఎన్నికలపై వీటి ప్రభావమేంటి?
నేరాభియోగాలు ఎదుర్కోవడం ట్రంప్‌కు ఇప్పుడు నిత్యవ్యవహారమైపోయింది. 2016 ఎన్నికల ప్రచారవేళ ఓ నీలిచిత్రాల తార నోరు మూయించేందుకు భారీగా డబ్బు చెల్లించారంటూ ఈ ఏడాది ఏప్రిల్‌లో 30 అంశాల ప్రాతిపదికన మన్‌హాటన్ కోర్ట్ అభిశంసించింది. రహస్య జాతీయ భద్రతా పత్రాలను అనధికారికంగా ట్రంప్ ఉంచుకున్నారంటూ జూన్‌లో ఫ్లోరిడాలోని గ్రాండ్ జ్యారీ 37 అంశాలతో నేరాభియోగం మోపింది.
ఆ రెండు నేరాభియోగాల తర్వాత ఈ ఆగస్ట్ 1న ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ చేసిన అభియోగం ముచ్చటగా మూడోదన్న మాట. అయితే, మునుపటి రెండింటి కన్నా ఇది భిన్నమైనది, తీవ్రమైనది. 2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి బైడెన్ విజయం సాధించినా ట్రంప్, మరో ఆరుగురితో కలసి ఆ ఫలితాన్ని మార్చాలని చూశారన్నది తాజా అభియోగం.
ఓటింగ్‌లో మోసమేమీ లేదని ట్రంప్‌కు తెలిసినా ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ఆరోపణలతో కుట్ర చేశారనీ, ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పోగొట్టేందుకు ప్రయత్నించారనీ ఆరోపణ. నిరుడు సభాసంఘం నివేదిక సైతం ఇలాంటి నిర్ణయాలకే వచ్చింది. ఎన్నికల తర్వాత 2021 జనవరి 6న అమెరికా అధ్యక్ష భవనంపై ట్రంప్ సమర్థకుల మూకదాడికీ, దానికి దారితీసిన పరిస్థితులకూ పూర్తి బాధ్యత ట్రంప్‌దేనని తేల్చేందుకు చట్టపరమైన తొలి ప్రయత్నం ఈ తాజా నేరాభియోగం.
కిందపడ్డా తనదే పైచేయి అన్నట్టుగా... 2020 ఎన్నికల్లో ఓడిపోయినా సరే అధికార పీఠంపై కొనసాగేందుకు అమెరికా లాంటి ప్రజాస్వామ్య అగ్రరాజ్యపు అధ్యక్షుడు ప్రవర్తించడం, ఎన్నికల ఫలితాలకు కుట్ర సిద్ధాంతాలు ఆపాదించడం ఎలా చూసినా సమర్థించలేనివి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల నిర్వహణ, ప్రశాంతంగా అధికార బదలాయింపు అనేవి గణతంత్ర అమెరికాకు మూలస్తంభాలు. కానీ, ఎన్నికల కౌంటింగ్ నియమాలు ఏర్పాటు చేశాక, గత 130 ఏళ్ళ పైగా అంతా ప్రశాంతంగా సాగితే, 2021లో ట్రంప్ తన చర్యలతో మూలాలకే దెబ్బకొట్టారు.
ఎన్నికల్లో మోసం జరిగిందన్న తన వాదనకు మద్దతునివ్వాలంటూ అధికారులపై ఆయన ఒత్తిడి తెచ్చారు. చివరకు బైడెన్ విజయాన్ని ఖరారు చేసే శాసననిర్మాతల్ని సైతం ఆ జనవరి 6 నాటి మూకదాడితో భయపెట్టే ప్రయత్నమూ చేశారు. ఇది నేరమే కాదు... ఘోరం. అయితే, ఎన్నికల్లో మోసం జరిగిందని తాను చేస్తున్న వాదన బోగస్సని తెలిసినాసరే, ట్రంప్ కావాలనే అలా అడ్డంగా వాదించారని ప్రాసిక్యూటర్లు నిరూపించగలరా అన్నది ప్రశ్న. అలా నిరూపించడం మీదే చర్యలు ఆధారపడి ఉంటాయి. ట్రంప్ మాత్రం ఈ అభియోగాలన్నీ తనపై రాజకీయ వేధింపుల్లో భాగమని ఆరోపిస్తున్నారు.
వచ్చే 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగాలని 77 ఏళ్ళ ట్రంప్ ఉవ్విళ్ళూరుతున్నారు. చిత్రంగా మునుపు మీద పడ్డ రెండు నేరాభియోగాల వల్ల ఆయన ఎన్నికల రేటింగ్ తగ్గకపోగా విపరీతంగా పెరిగింది. కోర్టు వ్యవహారాల వల్ల ట్రంప్ ఆర్థిక వనరులు తరిగిపోవచ్చు. కోర్ట్ విచారణ మాటెలా ఉన్నా తాజా అభియోగాన్ని సైతం ట్రంప్ తన రాజకీయ లాభానికి వాడుకోవడం ఖాయం.
కక్ష సాధిస్తున్నారనీ, అసలైన బాధితుణ్ణి తానే అనీ ఆయన తన ప్రచారంలో వేడి పెంచగలరు. అసలు నిజం, సాక్ష్యాధారాలేమైనా, గణనీయ సంఖ్యలో అమెరికన్ ఓటర్లు ట్రంప్ వాదననే సమర్థించవచ్చు. వెరసి అమెరికా చరిత్రలో మునుపెన్నడూ లేనట్టు ఓటర్లు పూర్తిగా రెండు వర్గాలుగా చీలిపోయే పరిస్థితుల్లో రానున్న ఎన్నికలు జరిగే ప్రమాదం కనిపిస్తోంది.
ట్రంప్ తన రాజకీయ చాణక్యంతో కోర్టులో ఉచ్చు నుంచి జారుకొనే ప్రయత్నం చేస్తారు. వకీళ్ళ ద్వారా వ్యవహారాన్ని వీలైనంత జాప్యం చేసి, రేపు మళ్ళీ శ్వేతసౌధ పీఠమెక్కితే అక్కడ నుంచి ఇక అంతా తన కనుసన్నల్లో జరపాలన్నది ఆయన పేరాశ. నిజానికి, శృంగార తార కేసు వచ్చే మార్చిలో, రహస్య పత్రాల కేసు వచ్చే మేలో కానీ తేలవు. వచ్చే జనవరిలో ఎంపిక ప్రక్రియ ప్రారంభించే రిపబ్లికన్ పార్టీ ఆ లోగా తమ అభ్యర్థి ఎవరో ఖరారు కూడా చేసేస్తుంది.
ఈ పరిస్థితుల్లో సత్వరమే ఈ అభియోగాలపై విచారణ జరిపి, తప్పొప్పులు తేల్చడమే అమెరికన్ కోర్టుల కర్తవ్యం. ట్రంప్ తప్పు లేదని తేలితే చేసేది లేదు. ఒకవేళ తప్పు చేసినట్టు ఆయనపై నేరాభియోగాలు రుజువైతే తగిన శిక్ష విధించి, చట్టం ముందు ఎంతటి వారైనా ఒకటేనని చూపవచ్చు. అమెరికా ప్రజాస్వామ్య స్ఫూర్తిని లోకానికి చాటవచ్చు. దేశ రాజ్యాంగ వ్యవస్థనే అవహేళన చేసిన ఘటనలో రాజకీయాల రొచ్చులోకి పోకుండా కోర్టులు అప్రమత్తతతో వ్యవహరించడమే ప్రజాస్వామ్య విలువలకు శ్రీరామరక్ష. ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తోంది అందుకే!
Comments
Please login to add a commentAdd a comment