
ఒక ప్రాంత ప్రజల ఆకాంక్షలను ఉక్కుపాదంతో అణచాలని చూస్తే... దాని అభివృద్ధిని నిర్లక్ష్యం చేసి అక్కడి వనరులను పీల్చిపిప్పి చేస్తే... ఎప్పుడో ఒకప్పుడు, ఏదో ఒక రూపంలో ఆగ్రహజ్వాలలు ఎగిసిపడతాయి. విభజనానంతరం పాకిస్తాన్ ఒక దేశంగా ఏర్పడినప్పుడు అందులో విలీనం కాకుండా తాము స్వతంత్రంగా ఉంటామని కరాత్ సంస్థానం ప్రకటించినప్పుడు నూతన పాలకులు ససేమిరా అంగీకరించలేదు. అక్కడి వనరులపై కన్నేసిన పాలకులు ఆ సంస్థానాన్ని నమ్మించి, స్నేహ ఒడంబడిక కుదుర్చుకుని చివరకు దాన్ని బుట్టదాఖలా చేశారు.
ఈ ద్రోహం వెనక పాక్ జాతిపిత మహమ్మదాలీ జిన్నాతోసహా పలువురున్నారు. దాని పర్యవసానాలు ఈ ఏడున్నర దశాబ్దాలుగా ఆ దేశం అనుభవిస్తూనే ఉంది. క్వెట్టానుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను మంగళవారం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) మిలిటెంట్లు హైజాక్ చేసి వందలమందిని అపహ రించుకు పోవటం, కొందరిని హతమార్చటం ఆ వరసలో మరో చర్య. బుధవారం భద్రతా దళాలను రంగంలోకి దింపి దాదాపు 200 మంది ప్రయాణికులను విడిపించినట్టు చెబుతున్నారు.
ఇందుకు ప్రతిగా 50 మంది బందీలను మిలిటెంట్లు హతమార్చగా, ఆ తర్వాత మిలిటెంట్లందరినీ పాక్ సైన్యం మట్టుబెట్టిందంటున్నారు. ఇలా నిత్యం నెత్తురోడుతున్న బలూచిస్తాన్ భౌగోళికంగా పాకిస్తాన్‌లోనే ఉన్నా, అక్కడివారు తమను తాము పాకిస్తానీలుగా పరిగణించుకోరు. ఒకనాడు సాధారణ సమస్యల కోసం ఉద్యమించినవారు ఇప్పుడు స్వాతంత్య్రాన్ని కోరుకునేదాకా వచ్చారు. పాక్ పాలకుల నిర్వాకమే ఇందుకు కారణం.
బలూచిస్తాన్ సాధారణ ప్రాంతం కాదు. ఇక్కడి భూమిలో బంగారం, వజ్రాలు, వెండి, రాగి వనరులు నిక్షిప్తమైవున్నాయి. దేశ వర్తక, వాణిజ్యాలను అత్యున్నత స్థాయికి తీసుకుపోగల డీప్ సీ పోర్టు ఉన్న గ్వాదర్ కూడా ఇక్కడిదే. 2002లో ఈ ఓడరేవు తొలి దశలో కొంత భాగాన్ని పూర్తిచేసి ఆదరాబాదరాగా ప్రారంభించారు. కానీ ఆ తర్వాత పనులు పడకేశాయి. దీన్ని నిర్మిస్తున్న చైనా... స్థానికులకు నామమాత్రం అవకాశాలిచ్చింది.
ఇది బలూచి వాసుల అసంతృప్తిని మరిన్ని రెట్లు పెంచింది. భౌగోళికంగా వైశాల్యంలో ఫ్రాన్స్‌ను పోలివుండే ఈ ప్రాంత జనాభా కేవలం 90 లక్షలు. ఇంత తక్కువ జనాభాతో, అపరిమితమైన వనరులతో ఉండే ఈ బలూచిస్తాన్ గత 77 ఏళ్లలో వాస్తవానికి అద్భుతమైన ప్రగతి సాధించివుండాలి. కానీ విషాదమేమంటే ఇక్కడున్న 70 శాతం మంది ప్రజలు దుర్భర దారిద్య్రంలో మగ్గుతుంటారు. వారికి ఉపాధి అవకాశాలుండవు.
వేరేచోటకు వెళ్లి స్థిరపడేంత చదువుసంధ్యలుండవు. సైనిక దళాల్లో సైతం బలూచిస్తాన్ వాసులకు మొండిచేయి చూపారు. వారిపై పాక్ సైన్యాధికారుల్లో వున్న అపనమ్మకమూ, భయాందోళనలే అందుకు కారణం. తెలివైన పాలకులైతే ఆ ప్రాంతానికి స్వయంప్రతిపత్తినిచ్చి, దాని అభివృద్ధికి బాటలు పరిచే వారు. కానీ పాకిస్తాన్ పాలకులు అణచివేతే పరిష్కారం అనుకున్నారు. సైనిక పదఘట్టనలతో అది పాదాక్రాంతం అవుతుందనుకున్నారు.
బలూచిస్తాన్‌లో తరచు మిలిటెంట్ దాడులకు పాల్పడే బీఎల్‌ఏ 2000 సంవత్సరంలో ఏర్పడినా అంతకు చాలాముందునుంచే ఉద్యమకారులను అపహరించి మాయం చేయటం, బూటకపు ఎన్ కౌంటర్లలో వారిని హతమార్చటం పాక్ సైన్యం ఒక పద్ధతిగా కొనసాగించింది. 2011 నుంచి లెక్కేసినా దాదాపు 10,000 మంది అదృశ్యమయ్యారని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అంటున్నది.
బీఎల్‌ఏ సైతం అదే మార్గం ఎంచుకుంది. మొదట్లో చెదురు మదురు ఘటనలకే పరిమితమైన ఆ సంస్థ ఇటీవలి కాలంలో భారీ దాడులకు పాల్పడుతోంది. బీఎల్‌ఏ కారణంగా చైనా–పాకిస్తాన్ కారిడార్ (సీపీఈసీ) అటకెక్కేలావుంది. చైనా ఖండాంతర ప్రాజెక్టు బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్(బీఆర్‌ఐ)లో సీపీఈసీ కీలకమైనది.
కారిడార్‌లో భాగంగా నిర్మిస్తున్న జాతీయ రహదారులనూ, ఇతర మౌలిక సదుపాయాలనూ బీఎల్‌ఏ లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేయటం ఇందుకే. 6,500 కోట్ల డాలర్ల విలువైన సీపీఈసీలో ఇంధనం, రవాణా, పారిశ్రా మిక కారిడార్లూ, గ్వాదర్ పోర్టు వగైరాలున్నాయి. స్థానికులకు అవకాశాలీయకుండా ఇంత పెద్ద నిర్మాణాన్ని తలకెత్తుకుంటే అసంతృప్తి రాజుకుంటుందన్న ఇంగితజ్ఞానం పాలకులకు కొరవడింది.
బలూచిస్తాన్ వాసుల డిమాండ్లు ధర్మమైనవి. కానీ అందుకు హింసాత్మక మార్గాన్ని ఎంచు కోవటంవల్ల న్యాయమైన సమస్య మరుగున పడుతుంది. బలూచిస్తాన్‌లో జాతి, మత, తెగ, రాజకీయ విశ్వాసాలతో నిమిత్తం లేకుండా మానవ హక్కుల కోసం పోరాడే బలూచ్ యక్‌జహితీ కమిటీ (బీవైసీ) 2019 నుంచీ పనిచేస్తోంది.
ఆ సంస్థ నాయకురాలు డాక్టర్ మెహ్రాంగ్ బలూచ్‌కు అన్ని వర్గాల నుంచీ అపారమైన ఆదరణ వుంది. పాక్ సైన్యం ఆగడాల కారణంగా తండ్రి అదృశ్యం కావటం, చాన్నాళ్ల తర్వాత ఛిద్రమైన ఆయన మృతదేహం లభ్యం కావటం ఆమె పట్టుదలను మరింత పెంచాయి. నిరుడు ఆగస్టులో డాక్టర్ మెహ్రాంగ్ గ్వాదర్‌లో తలపెట్టిన ర్యాలీయే దీనికి రుజువు. సైన్యం ఎన్ని అడ్డంకులు కల్పించినా అది విజయవంతమైంది.
శాంతియుతంగా జరిగిన ఆ ర్యాలీలో పాల్గొన్నారన్న కక్షతో డజన్లకొద్దీమందిని అరెస్టు చేస్తే దానికి నిరసనగా 12 రోజుల పాటు ధర్నా సాగించి వారిని విడిపించుకున్న చరిత్ర బీవైసీది. అణచివేత ధిక్కారానికి దారి తీస్తుంది. దాన్ని ఉపేక్షిస్తే తిరుగుబాటుకు బాటలు పరుస్తుంది. ప్రజల మౌలిక ఆకాంక్షలను బేఖాతరు చేస్తే ఎంత శక్తిమంతమైన రాజ్యానికైనా భంగపాటు తప్పదు. బలూచిస్తాన్ ప్రజలు దాన్నే చాటుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment