భారత్‌లో స్టార్‌లింక్‌ ఇంటర్నెట్‌ ఛార్జీలు ఇలా.. | what are the Elon Musk Starlink internet charges in India | Sakshi
Sakshi News home page

భారత్‌లో స్టార్‌లింక్‌ ఇంటర్నెట్‌ ఛార్జీలు ఇలా..

Published Thu, Mar 13 2025 1:28 PM | Last Updated on Thu, Mar 13 2025 1:34 PM

what are the Elon Musk Starlink internet charges in India

మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సదుపాయాన్ని అందించాలనే లక్ష్యంతో ఎలాన్‌మస్క్‌ ఆధ్వర్యంలోని స్టార్‌లింక్‌(Starlink) భారత్‌లో ప్రవేశించేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఇప్పటికే భారత టెలికాం విభాగానికి అనుమతి పత్రాలను దాఖలు చేసింది. ప్రస్తుతం అవి పరిశీలనలో ఉన్నాయి. కేంద్రం షరతులను సంస్థ ప్రతినిధులు అంగీకరించడంతో భారత్‌లోకి మార్గం సుగమం అవుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు స్టార్‌లింక్‌ ప్రవేశాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించిన టాప్‌ టెలికాం ఆపరేటర్లు ఎయిర్‌టెల్‌, జియో ఆ కంపెనీతోనే ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అయితే సామాన్యులకు స్టార్‌లింక్‌ ఏమేరకు ప్లాన్లను తీసుకొస్తుందనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే కంపెనీ భూటాన్‌, అమెరికా వంటి దేశాల్లో సర్వీసులు అందిస్తోంది. ఆయా దేశాల్లో ఇంటర్నెట్‌ ఛార్జీలను అనుసరించి భారత్‌లో రేట్లు ఎలా ఉండవచ్చో నిపుణులు అంచనా వేస్తున్నారు.

యూఎస్‌లో ఛార్జీలు ఇలా..

  • స్టార్‌లింక్‌ యూఎస్‌లో రెసిడెన్షియల్‌ విభాగంలో నెలకు రూ.6,976 నుంచి ప్లాన్లు అందిస్తోంది. కేబుల్‌ నెట్‌వర్క్‌కు ఎలాగైతే రూటర్‌ కొనుగోలు చేస్తామో.. అలాగే శాటిలైట్‌ సేవల కోసం కూడా పరికరాలకు ఒకసారి చెల్లించాల్సిన సొమ్ము అదనం. యూఎస్‌లో స్టాండర్డ్‌ ఎక్విప్‌మెంట్‌ కిట్‌ ధర రూ.30,443గా ఉంది.

  • ఇక మొబైల్‌ సేవలు కావాల్సినవారు నెలకు కనీసం రూ.4,360 చెల్లించాల్సి ఉంటుంది. డేటా అపరిమితంగా అందుకోవచ్చు. 220 ఎంబీపీఎస్‌ వరకు స్పీడ్‌ ఆఫర్‌ చేస్తోంది.

  • రెసిడెన్షియల్‌ లైట్, రెసిడెన్షియల్‌ ప్లాన్లలో కూడా వినియోగదారులు అపరిమిత డేటాను అందుకోవచ్చు.

  • రోమింగ్‌ ప్లాన్‌ తీసుకునే వినియోగదారులు దేశవ్యాప్తంగా, ప్రయాణంలో, అంతర్జాతీయ ప్రయాణ సమయంలో కూడా వినియోగం, తీర ప్రాంతాల్లో కవరేజీ పొందవచ్చు. బిజినెస్‌ విభాగంలో నెలకు రూ.12,208 నుంచి రూ.4,36,000 వరకు ప్లాన్స్‌ ఉన్నాయి.

భూటాన్‌లో ఇలా..

ఇక భూటాన్‌లో రెసిడెన్షియల్‌ లైట్‌ ప్లాన్‌ కింద స్టార్‌లింక్‌ నెలకు రూ.3,000 చార్జీ చేస్తోంది. ఈ ప్లాన్‌లో ఇంటర్నెట్‌ 23–100 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో ఆఫర్‌ చేస్తోంది. ఊక్లా నివేదిక ప్రకారం స్టార్‌లింక్‌ ఇంటర్నెట్‌ వేగం యూరప్‌లోని హంగరీలో అక్టోబర్‌–డిసెంబర్‌ కాలంలో గరిష్టంగా 135.11, కనిష్టంగా సైప్రస్‌లో 36.52 ఎంబీపీఎస్‌ నమోదైంది.

మనదగ్గర ఇప్పటివరకు ఇలా..

శాటిలైట్‌ ఇంటర్నెట్‌ చార్జీలతో పోలిస్తే మన దేశంలో మొబైల్, బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ చాలా చవక. అటూ ఇటూగా రూ.20 చెల్లిస్తే ఒక జీబీ డేటా అందుకోవచ్చు. సుమారు రూ.50 నుంచి అన్‌లిమిటెడ్‌ ప్యాక్స్‌ లభిస్తాయి. హోమ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లు నెలకు కనీసం రూ.400 నుంచి ఉన్నాయి. హై–ఎండ్‌ ప్లాన్‌ అయితే నెలకు రూ.4,000 వరకు ఉంది. దీనిలో 10 జీబీపీఎస్‌ వరకు వేగం, అన్ని ఓటీటీ యాప్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ కూడా అందుతుంది. రూటర్‌కు అయ్యే వ్యయమూ తక్కువే. శాటిలైట్‌ టెలికం కేవలం ఇంటర్నెట్‌కే పరిమితం. కాల్స్‌ చేయాలంటే ఓటీటీ యాప్స్‌పైన ఆధారపడాల్సిందే.

ఇండియాలో స్టార్‌లింక్‌ ఛార్జీలపై అంచనాలు..

స్టార్‌లింక్‌ ఇంటర్నెట్‌ కోసం అవసరమయ్యే హార్డ్‌వేర్‌కు ప్రస్తుతం రూ.25,000-రూ.35,000 మధ్య ఖర్చు అవుతుంది. నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ రూ.5,000-రూ.7,000గా అంచనా వేస్తున్నారు. ఇంటర్నెట్‌ స్పీట్‌ 25-220 ఎంబీపీఎస్‌ ఉంటుందని చెబుతున్నారు. ఆ ధర భారతదేశం సగటు బ్రాండ్‌బ్యాండ్‌ వ్యయం నెలకు రూ.700-రూ.1,500 కంటే చాలా ఎక్కువ. బ్రాండ్‌బ్యాండ్‌ పోటీదారులకు ధీటుగా విస్తృతంగా ఇంటర్నెట్‌ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు స్పేస్ఎక్స్ భారతదేశంలో నిర్దిష్ట ధరలను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి: పదేళ్లలో 10 లక్షల స్టార్టప్‌లు

స్టార్‌లింక్‌ ప్రత్యేకతలు ఇవీ..

  • లోఎర్త్‌ ఆర్టిట్‌ శాటిలైట్‌ ఆధారిత ఇంటర్నెట్‌ సేవలు అందిస్తారు. ఇందుకోసం స్పేస్‌ఎక్స్‌ ఉపగ్రహాలను వినియోగిస్తున్నారు.

  • కక్ష్యలో ఉన్న ఉపగ్రహాలు: సుమారు 7,000

  • శాటిలైట్‌ ఇంటర్నెట్‌ అందిస్తున్న దేశాలు: 100కుపైగా

  • వినియోగదారులు: సుమారు 50 లక్షలు (2024 డిసెంబర్‌ చివరినాటికి) అమెరికాలో దిగ్గజ బ్రాండ్‌బ్యాండ్‌ కంపెనీలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గట్టి పోటీనిస్తోంది.

  • రూరల్‌ కనెక్టివిటీ: మారుమూల ప్రాంతాలు, పల్లెలకు వేగంగా ఇంటర్నెట్‌ అందిస్తోంది. విద్య, ఆరోగ్య సేవలు, ఈ–కామర్స్‌కు వెన్నుదన్నుగా నిలుస్తోంది.

  • భారత్‌లో పోటీ: దేశంలో 94.5 కోట్ల మంది బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగదారులు ఉన్నారు. అందులో 90.4 కోట్ల మంది వైర్‌లెస్‌/మొబైల్‌ ఇంటర్నెట్‌ను వాడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
 
Advertisement