
కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ తాజాగా ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్(Starlink) శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు స్వాగతం అంటూ ఎక్స్(ట్విటర్) వేదికగా పోస్ట్ చేశారు. మారుమూల ప్రాంతాల్లో, ముఖ్యంగా రైల్వే ప్రాజెక్టుల కనెక్టివిటీలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి స్టార్‌లింక్ సామర్థ్యాన్ని మంత్రి హైలైట్ చేశారు. కానీ, ఈమేరకు చేసిన ట్వీట్‌ను కాసేపటికే డిలీట్ చేయడం గమనార్హం.
కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియాలో స్టార్‌లింక్ భారత్‌లో ప్రవేశించబోతుండడంపై స్పందిస్తూ..‘భారత్‌లోకి స్టార్‌లింక్‌కు స్వాగతం! మారుమూల ప్రాంత రైల్వే ప్రాజెక్టులకు ఇది ఎంతో ఉపయోగం’ అని తెలిపారు. దేశంలోని రెండు ప్రముఖ టెలికాం దిగ్గజాలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ తమ సేవలను విస్తరించేందుకు ఇప్పటికే స్పేస్‌ఎక్స్ ఆధ్వర్యంలోని స్టార్‌లింక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఈనేపథ్యంలో మంత్రి ట్వీట్ క్షణాల్లో వైరల్ అయింది. కానీ, కాసేపటికే దాన్ని మంత్రి తన ఎక్స్ ఖాతా నుంచి డిలీట్ చేశారు. అందుకుగల కారణాలు తెలియరాలేదు.
స్టార్‌లింక్ లోఎర్త్ ఆర్బిట్ ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది రైల్వే కార్యకలాపాలను పెంచుతుందని, డిజిటల్ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తుందని, గ్రామీణ అభివృద్ధికి మద్దతుగా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. దాంతో ఇటీవల టెలికాం కంపెనీ కుదుర్చుకున్న భాగస్వామ్యాలు ఈ రంగంలో మార్పును సూచిస్తున్నాయి. ఒకప్పుడు భారత్‌లోకి స్టార్‌లింక్ ప్రవేశాన్ని వ్యతిరేకించిన కంపెనీలు ఇప్పుడు ఆ కంపెనీతో జతకట్టడం డిజిటల్ ఎకోసిస్టమ్‌లో రాబోతున్న మార్పును తెలియజేస్తుంది.
షరతులకు అంగీకారం
దేశంలో శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలకు సంబంధించిన షరతులను స్టార్‌లింక్ అధికారికంగా ఇప్పటికే అంగీకరించింది. ఈ సేవలు ప్రారంభించేందుకు అవసరమైన లైసెన్స్ పొందడానికి భారత ప్రభుత్వం విధించిన నియమాలకు కట్టుబడి ఉంటానని తెలిపింది. స్టార్‌లింక్ భారత్‌లో ప్రవేశించేందుకు ఇది కీలక పరిణామమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దేశంలోని మారుమూల ప్రాంతాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించాలని స్టార్‌లింక్ ఎప్పటినుంచో యోచిస్తోంది.
ఇదీ చదవండి: భయపడుతున్న‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత..
యూజర్ డేటాను దేశంలోనే నిల్వ చేసేలా..
ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం కంపెనీ మొత్తం యూజర్ డేటాను దేశంలోనే నిల్వ చేయాల్సి ఉంటుంది. అవసరమైనప్పుడు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో ఈ సమాచారాన్ని నిర్ధారించుకోవాలి. దీనికి స్టార్‌లింగ్ అంగీకరించింది. అయితే ఇటీవల టెలికమ్యూనికేషన్స్ విభాగానికి (DoT) రాసిన లేఖలో స్టార్‌లింక్ కొన్ని షరతులను సడలించాలని అభ్యర్థించింది. దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత కాలక్రమేణా వాటిని పాటించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం కీలకం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment