స్టార్‌లింక్‌ సేవలను ధ్రువీకరించిన మస్క్‌ | SpaceX CEO Elon Musk confirmed that Starlink satellite internet is now available in Bhutan | Sakshi
Sakshi News home page

స్టార్‌లింక్‌ సేవలను ధ్రువీకరించిన మస్క్‌

Published Wed, Feb 12 2025 6:34 PM | Last Updated on Wed, Feb 12 2025 7:14 PM

SpaceX CEO Elon Musk confirmed that Starlink satellite internet is now available in Bhutan

శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలందిస్తున్న స్టార్‌ లింక్‌ తన సర్వీసులు విస్తరించినట్లు పేర్కొంది. తాజాగా భూటాన్‌లో కంపెనీ సేవలు ప్రారంభించినట్లు సంస్థ సీఈఓ ఎలాన్‌మస్క్‌ ధ్రువీకరించారు. స్టార్‌ లింక్‌ శాటిలైట్‌ ఇంటర్నెట్ సేవలను భూటాన్‌లో 2024 డిసెంబర్‌లో ప్రారంభించినట్లు మస్క్ ఫిబ్రవరి 11, 2025న తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ద్వారా పేర్కొన్నారు. సంప్రదాయ ఇంటర్నెట్ మౌలిక సదుపాయాలు లేని ప్రాంతాల్లో నెట్‌ సేవలందించాలని స్టార్‌లింక్‌ లక్ష్యంగా పెట్టుకుంది.

ధరలు ఇలా..

భూటాన్ సమాచార శాఖ స్టార్‌లింక్‌ ప్రణాళికలకు బేస్ ధరను నిర్ణయించింది. రెసిడెన్షియల్ లైట్ ప్లాన్ నెలకు సుమారు రూ.3,000 నుంచి ప్రారంభమవుతుంది. ఇది 23 ఎంబీపీఎస్‌ నుంచి 100 ఎంబీపీఎస్ వరకు డేటా స్పీడ్‌ను అందిస్తుంది. స్టాండర్డ్ రెసిడెన్షియల్ ప్లాన్ నెలకు రూ.4,200గా ఉంది. ఇందులో అపరిమిత డేటాను అందిస్తున్నారు. 25 ఎంబీపీఎస్ నుంచి 110 ఎంబీపీఎస్ డేటా స్పీడ్‌ ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ ధరలు స్థానిక టెలికాం ఆపరేటర్లు అందించే రేట్ల కంటే అధికంగా ఉన్నప్పటికీ, మారుమూల ప్రాంతాల్లో స్టార్‌లింక్‌ అందించే కనెక్టివిటీ చాలా కీలకమని కొందరు భావిస్తున్నారు.

ఇదీ చదవండి: Infosys ఉద్యోగుల జీతాలు పెంపు.. ఎంతంటే..

భారత్‌లో ఇలా..

భారత్‌లో శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలకు సంబంధించిన షరతులను స్టార్‌లింక్‌ అధికారికంగా ఇప్పటికే అంగీకరించింది. ఇక్కడ సేవలు ప్రారంభించేందుకు అవసరమైన లైసెన్స్ పొందడానికి భారత ప్రభుత్వం విధించిన నియమాలకు కట్టుబడి ఉంటానని తెలిపింది. స్టార్‌లింక్‌ భారత్‌లో ప్రవేశించేందుకు ఇది కీలక పరిణామమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. భారత ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం కంపెనీ మొత్తం యూజర్‌ డేటాను దేశంలోనే నిల్వ చేయాల్సి ఉంటుంది. అవసరమైనప్పుడు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో ఈ సమాచారాన్ని నిర్ధారించుకోవాలి. దీనికి స్టార్‌లింక్‌ అంగీకరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement