
ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ భారతదేశంలో అదనపు ఆర్థిక భారాలను ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కంపెనీ దాని సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం(ఏజీఆర్)పై సుమారు 3 శాతం స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీ (ఎస్‌యూసీ)లు, 8 శాతం టెలికాం లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉండడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి స్థానిక నెట్‌వర్క్ ప్రొవైడర్లకు కొన్నేళ్ల క్రితమే ఈ స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జీల నుంచి మినహాయింపు ఇచ్చారు. ఒకవేళ స్టార్‌లింక్ సర్వీసులపై ఈ ఛార్జీలు విధిస్తే దీని సబ్‌స్రిప్షన్ ప్లాన్లు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జీలు (ఎస్‌యూసీ) అనేది రేడియో ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్‌ను వినియోగిస్తున్నందుకు బదులుగా టెలికాం ఆపరేటర్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్)కు చేసే చెల్లింపులు. ఇప్పటికే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) శాటిలైట్ స్పెక్ట్రమ్ ధర, కాలపరిమితి, పన్నులకు సంబంధించిన వివరాలను ఖరారు చేసే పనిలో ఉందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ముందుగా నిర్ణయించిన ధరకే స్పెక్ట్రమ్‌ను కేటాయిస్తారు కాబట్టి శాట్ కామ్ సంస్థలకు ఎస్‌యూసీ తప్పనిసరి చేయాల్సిన అవసరం ఉందని ట్రాయ్ నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ట్రాయ్ చేసిన ఈ సిఫార్సులను డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (డీసీసీ), కేబినెట్‌కు తుది ఆమోదం కోసం సమర్పించే ముందు డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్) సమీక్షించే అవకాశం ఉంది.
మరిన్ని కంపెనీలపై ప్రభావం
ఈ ఎస్‌యూసీ పాలసీ వల్ల ప్రభావితమయ్యే ఏకైక శాటిలైట్ ఆపరేటర్ స్టార్‌లింక్ మాత్రమే కాదు. ఎయిర్‌టెల్ ప్రమోటర్ సునీల్ మిట్టల్ పెట్టుబడులున్న యూటెల్ శాట్ వన్ వెబ్, జియో ప్లాట్‌ఫామ్స్, లక్సెంబర్గ్‌కు చెందిన ఎస్‌ఈఎస్‌ల జాయింట్ వెంచర్ రిలయన్స్ జియో-ఎస్‌ఈఎస్ వంటి ఇతర శాటిలైట్ కమ్యూనికేషన్ ప్లేయర్లపై కూడా ప్రభావం పడనుంది. సెప్టెంబర్ 15, 2021 తర్వాత వేలం వేసిన బ్యాండ్‌విడ్త్‌పై ఎస్‌యూసీని తొలగించాలని 2022 జూన్‌లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే కొత్త చట్టం ప్రకారం వేలం లేకుండా శాట్‌కామ్ కంపెనీలు స్పెక్ట్రమ్‌ను పొందే వీలుంది. దాంతో ఈ ఆపరేటర్లపై ఎస్‌యూసీని తప్పనిసరి చేయాలనే ప్రతిపాదనలున్నాయి.
ఈ ప్రతిపాదనల వల్ల భారత్‌లో ప్రవేశించాలని చూస్తున్న స్టార్‌లింక్ ఇంటర్నెట్ ఛార్జీలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే ఇతర దేశాల్లో సేవలందిస్తున్న కంపెనీ ప్లాన్‌లు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.
యూఎస్‌లో స్టార్‌లింక్ ఛార్జీలు ఇలా..
స్టార్‌లింక్ యూఎస్‌లో రెసిడెన్షియల్ విభాగంలో నెలకు రూ.6,976 నుంచి ప్లాన్లు అందిస్తోంది. కేబుల్ నెట్‌వర్క్‌కు ఎలాగైతే రూటర్ కొనుగోలు చేస్తామో.. అలాగే శాటిలైట్ సేవల కోసం కూడా పరికరాలకు ఒకసారి చెల్లించాల్సిన సొమ్ము అదనం. యూఎస్‌లో స్టాండర్డ్ ఎక్విప్‌మెంట్ కిట్ ధర రూ.30,443గా ఉంది.
ఇక మొబైల్ సేవలు కావాల్సినవారు నెలకు కనీసం రూ.4,360 చెల్లించాల్సి ఉంటుంది. డేటా అపరిమితంగా అందుకోవచ్చు. 220 ఎంబీపీఎస్ వరకు స్పీడ్ ఆఫర్ చేస్తోంది.
రెసిడెన్షియల్ లైట్, రెసిడెన్షియల్ ప్లాన్లలో కూడా వినియోగదారులు అపరిమిత డేటాను అందుకోవచ్చు.
రోమింగ్ ప్లాన్ తీసుకునే వినియోగదారులు దేశవ్యాప్తంగా, ప్రయాణంలో, అంతర్జాతీయ ప్రయాణ సమయంలో కూడా వినియోగం, తీర ప్రాంతాల్లో కవరేజీ పొందవచ్చు. బిజినెస్ విభాగంలో నెలకు రూ.12,208 నుంచి రూ.4,36,000 వరకు ప్లాన్స్ ఉన్నాయి.
భూటాన్‌లో ఇలా..
ఇక భూటాన్‌లో రెసిడెన్షియల్ లైట్ ప్లాన్ కింద స్టార్‌లింక్ నెలకు రూ.3,000 చార్జీ చేస్తోంది. ఈ ప్లాన్‌లో ఇంటర్నెట్ 23–100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఆఫర్ చేస్తోంది. ఊక్లా నివేదిక ప్రకారం స్టార్‌లింక్ ఇంటర్నెట్ వేగం యూరప్‌లోని హంగరీలో అక్టోబర్–డిసెంబర్ కాలంలో గరిష్టంగా 135.11, కనిష్టంగా సైప్రస్‌లో 36.52 ఎంబీపీఎస్ నమోదైంది.
మనదగ్గర ఇప్పటివరకు ఇలా..
శాటిలైట్ ఇంటర్నెట్ చార్జీలతో పోలిస్తే మన దేశంలో మొబైల్, బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ చాలా చవక. అటూ ఇటూగా రూ.20 చెల్లిస్తే ఒక జీబీ డేటా అందుకోవచ్చు. సుమారు రూ.50 నుంచి అన్‌లిమిటెడ్ ప్యాక్స్ లభిస్తాయి. హోమ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు నెలకు కనీసం రూ.400 నుంచి ఉన్నాయి. హై–ఎండ్ ప్లాన్ అయితే నెలకు రూ.4,000 వరకు ఉంది. దీనిలో 10 జీబీపీఎస్ వరకు వేగం, అన్ని ఓటీటీ యాప్స్ సబ్‌స్క్రిప్షన్ కూడా అందుతుంది. రూటర్‌కు అయ్యే వ్యయమూ తక్కువే. శాటిలైట్ టెలికం కేవలం ఇంటర్నెట్‌కే పరిమితం. కాల్స్ చేయాలంటే ఓటీటీ యాప్స్‌పైన ఆధారపడాల్సిందే.
ఇండియాలో స్టార్‌లింక్ ఛార్జీలపై అంచనాలు..
స్టార్‌లింక్ ఇంటర్నెట్ కోసం అవసరమయ్యే హార్డ్‌వేర్‌కు ప్రస్తుతం రూ.25,000-రూ.35,000 మధ్య ఖర్చు అవుతుంది. నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ రూ.5,000-రూ.7,000గా అంచనా వేస్తున్నారు. ఇంటర్నెట్ స్పీట్ 25-220 ఎంబీపీఎస్ ఉంటుందని చెబుతున్నారు. ఆ ధర భారతదేశం సగటు బ్రాండ్‌బ్యాండ్ వ్యయం నెలకు రూ.700-రూ.1,500 కంటే చాలా ఎక్కువ. బ్రాండ్‌బ్యాండ్ పోటీదారులకు ధీటుగా విస్తృతంగా ఇంటర్నెట్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు స్పేస్ఎక్స్ భారతదేశంలో నిర్దిష్ట ధరలను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి: ఆల్ఫాబెట్ రూ.2.75 లక్షల కోట్లతో కంపెనీ కొనుగోలు
స్టార్‌లింక్ ప్రత్యేకతలు ఇవీ..
లోఎర్త్ ఆర్టిట్ శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు అందిస్తారు. ఇందుకోసం స్పేస్‌ఎక్స్ ఉపగ్రహాలను వినియోగిస్తున్నారు.
కక్ష్యలో ఉన్న ఉపగ్రహాలు: సుమారు 7,000
శాటిలైట్ ఇంటర్నెట్ అందిస్తున్న దేశాలు: 100కుపైగా
వినియోగదారులు: సుమారు 50 లక్షలు (2024 డిసెంబర్ చివరినాటికి) అమెరికాలో దిగ్గజ బ్రాండ్‌బ్యాండ్ కంపెనీలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గట్టి పోటీనిస్తోంది.
రూరల్ కనెక్టివిటీ: మారుమూల ప్రాంతాలు, పల్లెలకు వేగంగా ఇంటర్నెట్ అందిస్తోంది. విద్య, ఆరోగ్య సేవలు, ఈ–కామర్స్‌కు వెన్నుదన్నుగా నిలుస్తోంది.
భారత్‌లో పోటీ: దేశంలో 94.5 కోట్ల మంది బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులు ఉన్నారు. అందులో 90.4 కోట్ల మంది వైర్‌లెస్/మొబైల్ ఇంటర్నెట్‌ను వాడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment