బకాయిల బడి!
సాక్షి, ముంబై: ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా కార్పొరేషన్ పాఠశాలలను తీర్చిదిద్దుతామని చెబుతున్న బీఎంసీ అధికారులు, ఆచరణలో విఫలమవుతున్నారు. కొత్త హంగుల సంగతి దేవుడెరుగు... పాఠశాలల్లో ఆరేళ్ల కిందటే కల్పించిన సదుపాయాల నిర్వహణపై ఏమాత్రం శ్రద్ధ పెట్టకపోవడంతో అవి కూడా కనుమరుగువుతున్నాయి. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) పరిధిలో మొత్తం 1,074 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 4.36 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 2006-07 విద్యాసంవత్సరంలో పిల్లల సౌకర్యార్థం ఈ పాఠశాలలకు ల్యాండ్ లైన్ ఫోన్, ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించారు. ఆయా పాఠశాలల్లో విద్యార్థుల గురించి, వారి తల్లిదండ్రులకు ఏదైనా సమాచారం ఇవ్వడానికి ఫోన్ ఉపయోగపడుతుందని, అలాగే పిల్లల్లో విజ్ఞానం పెంపొం దించడానికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించామని అప్పట్లో బీఎంసీ అధికారులు ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నారు.
అయితే ఫోన్, ఇంటర్నెట్ బిల్లులు చెల్లిం చేందుకు బీఎంసీ ఎటువంటి నిధులు కేటాయించలేదు. దాంతో వాటి బిల్లుల బకాయిలు పేరుకుపోవడంతో కొన్నాళ్లకు సుమారు 90 శాతం పాఠశాలల్లో టెలిఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్లను తొల గించారు. దీంతో అత్యవసర సమయాల్లో విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారర చేరవేసేందుకు తమ సొంత మొబైల్ ఫోన్ను ఉపయోగించాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. ఇలా రోజుకు వంద ఫోన్లు చేయాల్సిరావడంతో తమకు ఆర్థికంగా భారం పడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లేదంటే విద్యార్థుల ఇళ్లకు వెళ్లాల్సి వస్తోందని వడాలాలో ఉన్న నద్కర్నిరోడ్ మున్సిపల్ పాఠశాల ఉపాధ్యాయురాలు శ్రద్ధాజాదవ్ పేర్కొన్నారు.
ఈ విషయమై డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ (విద్య) సునీల్ ధామ్నే మాట్లాడుతూ.. కార్పొరేషన్ పాఠశాలలు ఫోన్, ఇంటర్నెట్ బిల్లులు చెల్లించనందునే చాలా పాఠశాలల్లో కనెక్షన్లు తొలగించారని తెలిపారు. అయితే ఫోన్ బిల్లుల బకాయిల చెల్లింపునకు బీఎంసీ నిర్ణయించిందని ధామ్నే వివరించారు. అన్ని పాఠశాలలకు చెందిన బిల్లు బకాయిల వివరాలను వార్డుల వారీగా తమకు అందజేయాలని కోరినట్లు చెప్పారు. అలాగే ఆయా పాఠశాలల్లో ఇంటర్నెట్ కనెక్షన్లను కూడా పునరుద్ధరించనున్నట్లు పేర్కొన్నారు.