USA presidential election 2024: మళ్లీ ఆ ఇద్దరే! | USA presidential election 2024: Biden, Trump clinch nominations | Sakshi
Sakshi News home page

USA presidential election 2024: మళ్లీ ఆ ఇద్దరే!

Mar 14 2024 5:49 AM | Updated on Mar 14 2024 5:49 AM

USA presidential election 2024: Biden, Trump clinch nominations - Sakshi

అమెరికా అధ్యక్ష తుది రేసులో నిలిచిన బైడెన్, ట్రంప్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష రేసులో చివరకు మళ్లీ బైడెన్, ట్రంప్‌లే నిలిచారు. అధ్యక్ష పీఠం కోసం తమ తమ పార్టీల తరఫున అధ్యక్ష అభ్యర్ధిత్వాలను బైడెన్, ట్రంప్‌ గెల్చుకున్నారు. మెజారిటీ డెలిగేట్ల ఓట్లను సాధించడం ద్వారా రిపబ్లికన్‌ పార్టీ తరఫున డొనాల్డ్‌ ట్రంప్, డెమొక్రటిక్‌ పార్టీ తరఫున 81 ఏళ్ల జో బైడెన్‌లు తమ అభ్యర్దిత్వాన్ని ఖరారుచేసుకున్నారు. తాజాగా జార్జియాలో జరిగిన డెమొక్రటిక్‌ ప్రైమరీలో గెలిచి ఇప్పటిదాకా బైడెన్‌ 2,099 డెలిగేట్ల ఓట్లను సాధించారు.

మొత్తం 3,933 ఓట్లలో 1,968 ఓట్లు వచ్చినా అభ్యర్ధిత్వం ఖరారు అవుతుంది. ఇప్పటికే బైడెన్‌ ఆ సంఖ్యను దాటేయడం విశేషం. డెమొక్రటిక్‌ పార్టీ తరఫున బైడెన్‌ అభ్యర్ధిత్వాన్ని ఆగస్ట్‌లో చికాగోలో జరిగే పార్టీ జాతీయ సదస్సులో అధికారికంగా ప్రకటిస్తారు. రిపబ్లికన్‌ పార్టీ తరఫున అభ్యర్ధిత్వం సాధించాలంటే కనీసం 1,215 ఓట్లు గెలవాలి. ట్రంప్‌ ఇప్పటిదాకా మొత్తంగా 1,228 ఓట్లను గెల్చుకున్నారు.

జూలైలో మిల్‌వాకీలో జరిగే రిపబ్లికన్‌ నేషనల్‌ కన్వెన్షన్‌లో ట్రంప్‌ అభ్యర్ధిత్వాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. మంగళవారం నాటి ప్రైమరీలో గెలవడం ద్వారా ట్రంప్‌ రిపబ్లికన్‌ పార్టీ తరపున వరసగా మూడోసారి అధ్యక్ష ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. 2020 నాటి ప్రత్యర్థులే మళ్లీ అధ్యక్ష సమరంలో గెలుపు కోసం పోరాడుతున్నా ఈసారి ఎన్నికల్లో ప్రధాన అంశాలు, ప్రచార అస్త్రాలు మారాయి. ఆనాడు ట్రంప్‌పై ఎలాంటి కేసులు లేవు. కానీ ఇప్పుడు ట్రంప్‌ మెడకు 91 కేసులు చుట్టుకున్నాయి.

ఎవరికి ఓటేస్తారు?: బైడెన్‌
మంగళవారం నాటి ప్రైమరీ గెలుపు తర్వాత బైడెన్‌ మాట్లాడారు. ‘‘ప్రజాస్వామ్యాన్ని గెలిపిస్తారా? లేదంటే కూలదోస్తారా?. స్వేచ్ఛ, ఎన్నుకునే హక్కులను పునరుద్దరించుకుందామా? లేదంటే వాటిని అతివాదులకు అప్పగిద్దామా?’’ అని పరోక్షంగా ట్రంప్‌ను విమర్శిస్తూ బైడెన్‌ ఓటర్లకు పిలుపునిచ్చారు. చరిత్రలో చెత్త అధ్యక్షుడు బైడెన్‌ను గద్దె దించాల్సిన సమయమొచ్చింది అని ట్రంప్‌ సైతం ఒక వీడియో సందేశంలో రిపబ్లికన్‌ ఓటర్లకు పిలుపునిచ్చారు.

డెమొక్రటిక్‌ పార్టీలో అభ్యర్థులు గెల్చిన డెలిగేట్ల ఓట్లు
జో బైడెన్‌    2,099
ఇతరులు    20
జేసన్‌ పామర్‌    3

రిపబ్లికన్‌ పార్టీలో అభ్యర్థులు గెల్చిన డెలిగేట్ల ఓట్లు
ట్రంప్‌    1,228
నిక్కీ హేలీ    91
రాన్‌ డీశాంటిస్‌    9
వివేక్‌ రామస్వామి    3

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement