అమెరికా అధ్యక్షుడు బైడెన్ మండిపాటు
వాషింగ్టన్: తన కంటే ముందు దేశాధ్యక్షుడిగా పనిచేసిన ఒక నాయకుడు అమెరికాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం, స్వేచ్ఛకు ముప్పుగా పరిణమించాడని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరోపించారు. మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్‌పై పరోక్షంగా దుమ్మెత్తి పోశారు.
ఏ అధ్యక్షుడైనా అమెరికా ప్రజలను రక్షించడాన్ని కనీస బాధ్యతగా భావిస్తాడని, ఈ విషయంలో ఆ మాజీ అధ్యక్షుడు పదవిలో ఉన్నప్పుడు ఈ విషయంలో దారుణంగా విఫలమయ్యాడని, అతడిని క్షమించలేమని అన్నారు. బైడెన్ గురువారం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గంటపాటు మాట్లాడిన బైడెన్.. ట్రంప్ పేరును 13 సార్లు పరోక్షంగా ప్రస్తావించారు. పలు అంశాల్లో ట్రంప్ వైఖరిని తప్పుపట్టారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ ముందు ట్రంప్ మోకరిల్లాడని, ఇది చాలా ప్రమాదకరమని అన్నారు. ‘నాటో’ దేశాలను ఏమైనా చేసుకోండి అంటూ పుతిన్‌కు సూచించాడని ఆరోపించారు. పుతిన్ చర్యలను అడ్డుకోకపోతే ప్రపంచ దేశాలకు నష్టం తప్పదని హెచ్చరించారు. పుతిన్ ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి ఉక్రెయిన్‌కు అన్ని రకాలుగా సాయం అందించాల్సి ఉందని పేర్కొన్నారు. గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో సాధారణ పాలస్తీనియన్లు మరణించడం చూసి తాను తీవ్రంగా చలించిపోయానని బైడెన్ చెప్పారు.
గంజాయి తీసుకుంటే నేరం కాదు
డెమొక్రటిక్ పార్టీ నేత జో బైడెన్ మరోసారి అమెరికా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మళ్లీ నెగ్గడానికి యువ ఓటర్ల మనసులు గెలుచుకొనే పనికి శ్రీకారం చుట్టారు. గంజాయి తీసుకుంటే, గంజాయి కలిగి ఉంటే నేరంగా పరిగణించవద్దని తేలి్చచెప్పారు. గంజాయి విషయంలో అమల్లో ఉన్న నిబంధనలను సమీక్షించాలని తన మంత్రివర్గాన్ని ఆదేశించానని చెప్పారు. సాధారణంగా స్టేట్ ఆఫ్ ద యూనియన్ అడ్రస్‌లో తమ విదేశాంగ విధానంతోపాటు దేశీయంగా కీలక అంశాలను అమెరికా అధినేతలు ప్రస్తావిస్తుంటారు. కానీ, గంజాయి గురించి మాట్లాడిన మొట్టమొదటి అధ్యక్షుడు మాత్రం బైడెన్ కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment