State of the Union address
-
ట్రంప్ ప్రపంచానికే ముప్పు
వాషింగ్టన్: తన కంటే ముందు దేశాధ్యక్షుడిగా పనిచేసిన ఒక నాయకుడు అమెరికాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం, స్వేచ్ఛకు ముప్పుగా పరిణమించాడని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరోపించారు. మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్‌పై పరోక్షంగా దుమ్మెత్తి పోశారు. ఏ అధ్యక్షుడైనా అమెరికా ప్రజలను రక్షించడాన్ని కనీస బాధ్యతగా భావిస్తాడని, ఈ విషయంలో ఆ మాజీ అధ్యక్షుడు పదవిలో ఉన్నప్పుడు ఈ విషయంలో దారుణంగా విఫలమయ్యాడని, అతడిని క్షమించలేమని అన్నారు. బైడెన్ గురువారం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గంటపాటు మాట్లాడిన బైడెన్.. ట్రంప్ పేరును 13 సార్లు పరోక్షంగా ప్రస్తావించారు. పలు అంశాల్లో ట్రంప్ వైఖరిని తప్పుపట్టారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ముందు ట్రంప్ మోకరిల్లాడని, ఇది చాలా ప్రమాదకరమని అన్నారు. ‘నాటో’ దేశాలను ఏమైనా చేసుకోండి అంటూ పుతిన్‌కు సూచించాడని ఆరోపించారు. పుతిన్ చర్యలను అడ్డుకోకపోతే ప్రపంచ దేశాలకు నష్టం తప్పదని హెచ్చరించారు. పుతిన్ ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి ఉక్రెయిన్‌కు అన్ని రకాలుగా సాయం అందించాల్సి ఉందని పేర్కొన్నారు. గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో సాధారణ పాలస్తీనియన్లు మరణించడం చూసి తాను తీవ్రంగా చలించిపోయానని బైడెన్ చెప్పారు. గంజాయి తీసుకుంటే నేరం కాదు డెమొక్రటిక్ పార్టీ నేత జో బైడెన్ మరోసారి అమెరికా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మళ్లీ నెగ్గడానికి యువ ఓటర్ల మనసులు గెలుచుకొనే పనికి శ్రీకారం చుట్టారు. గంజాయి తీసుకుంటే, గంజాయి కలిగి ఉంటే నేరంగా పరిగణించవద్దని తేలి్చచెప్పారు. గంజాయి విషయంలో అమల్లో ఉన్న నిబంధనలను సమీక్షించాలని తన మంత్రివర్గాన్ని ఆదేశించానని చెప్పారు. సాధారణంగా స్టేట్ ఆఫ్ ద యూనియన్ అడ్రస్‌లో తమ విదేశాంగ విధానంతోపాటు దేశీయంగా కీలక అంశాలను అమెరికా అధినేతలు ప్రస్తావిస్తుంటారు. కానీ, గంజాయి గురించి మాట్లాడిన మొట్టమొదటి అధ్యక్షుడు మాత్రం బైడెన్ కావడం విశేషం. -
‘చట్టబద్ధంగా వచ్చిన వారికే మా దేశంలో చోటు’
వాషింగ్టన్ : చట్టబద్దంగా వచ్చిన వారికే అమెరికాలో చోటు ఉంటుందని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. మంగళవారం ఆయన యూఎస్ కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వలసదారుల అంశాన్ని ప్రస్తావిస్తూ.. తమ దేశానికి వచ్చేవారు న్యాయపరంగా రావాలని ట్రంప్ కోరారు. అక్రమ వలసదారులే దేశానికి పెను ముప్పని తేల్చారు. ఈ సందర్భంగా ట్రంప్ ‘అమెరికన్ల ఉద్యోగాలకు, వారి భవిష్యత్తుకు రక్షణ కల్పిస్తూ బలమైన వలస వ్యవస్థను రూపొందించడం మా నైతిక బాధ్యత. న్యాయపరంగా వచ్చే వలసదారులు మా దేశానికి ఎంతగానో ఉపయోగపడుతున్నారు. విదేశీయులు ఇంకా ఎక్కువ మంది మా దేశానికి రావాలని కోరుకుంటున్నాను. కానీ వారు న్యాయపరంగా రావాలి’ అని ట్రంప్ చెప్పుకొచ్చారు. అక్రమ వలసల్ని, మాదక ద్రవ్యాలను అడ్డుకోవాలంటే సరిహద్దు గోడ నిర్మాణం తప్పనిసరని తేల్చారు. అమెరికా భద్రతకు అత్యంత కీలకంగా నిలిచే సరిహద్దు గోడ నిర్మాణాన్ని డెమోక్రాట్లు అడ్డుకోవడం సరికాదన్నారు ట్రంప్. గతంలో చాలా మంది సరిహద్దు గోడ నిర్మణానికి మద్దతు తెలిపారని.. కానీ నేడు వ్యతిరేకిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. ఈ నెల 15 లోగా సరిహద్దు గోడ నిర్మాణం గురించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలంటూ గడువు విధించారు. చట్టబద్దంగా వచ్చిన వారికే అమెరికాలో చోటు ఉంటుందని తెలిపారు. అంతేకాక అదేసమయంలో 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యానికి సంబంధించి డెమొక్రాట్లు చేస్తున్న విమర్శల విషయంలో ఘాటుగా స్పందించారు. వాటిని పనికిమాలిన ఆరోపణలుగా కొట్టిపారేశారు. -
ఒబామా ప్రసంగం.. కాస్త వెరైటీగా!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వచ్చేవారం కాంగ్రెస్(అమెరికా ఉభయ సభలు)ను ఉద్దేశించి చివరిసారి ప్రసంగించేందుకు సిద్ధమయ్యారు. దేశంలో కొత్త ఏడాదిలో తీసుకురాబోయే చట్టాలు, ప్రభుత్వ విధానాలను ఈ ప్రసంగం(స్టేట్ ఆఫ్ ద యూనియన్ అడ్రస్)లో వివరించడం ఆనవాయితీ. కానీ ఈ సంప్రదాయానికి భిన్నంగా ఒబామా ప్రసంగం సాగనుంది. దేశాన్ని శక్తిమంతంగా మార్చాలంటే ఏం చేయాలి? చిన్నారుల బంగారు భవిత కోసం ఏం చర్యలు తీసుకోవాలన్న అంశాలపై మాట్లాడనున్నారు.