నటన ఒక స్థాయికి మించితే బెడిసికొడుతుంది. తెరపై అతిగా నటిస్తే ఓవరాక్షన్ అంటారు. ఆ పనే నిజజీవితంలో చేస్తే వంచన అంటారు. గాజాపై ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణకాండ 157 రోజులుగా అంతూ దరీ లేకుండా సాగుతోంది. ముస్లింలు ఎంతో పవిత్రంగా పరిగణించే రంజాన్ మాసం మొదలైనా మారణకాండ, విధ్వంసం ఆగటంలేదు. ఆకలితో అల్లాడుతున్న ప్రజానీకం అడపాదడపా వచ్చిపడుతున్న క్షిపణులకూ, బాంబులకూ పిట్టల్లా రాలుతున్నారు. ఇప్పటికి 31,000 మంది పౌరులు ఈ దాడుల్లో మరణించారని పాలస్తీనా అధికారులు, స్వచ్ఛంద సంస్థలు చెబుతుండగా అందులో 13,000 మంది ఉగ్రవాదులున్నారని ఇజ్రాయెల్ ప్రకటిస్తోంది.
‘సంపూర్ణ విజయం’ సాధించేవరకూ విశ్రమించబోమని ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ చెబుతున్నారు. నిరుడు అక్టోబర్ 7న ఇజ్రాయెల్ భూభాగంలోకి ప్రవేశించిన హమాస్ మిలిటెంట్లు 1,200 మంది ఇజ్రాయెల్ పౌరులను హతమార్చి, 250 మంది పౌరులను అపహరించినప్పటినుంచీ గాజాపై దాడులు సాగుతూనేవున్నాయి. కిడ్నాప్ చేసినవారిలో 150 మందిని హమాస్ విడుదలచేసింది. ఇంకా 100 మంది వారి చెరలోనేవున్నారు.
ఈ మానవ హననాన్ని నిలువరించటానికి తన పలుకుబడిని వినియోగించాల్సిన అగ్రరాజ్యం అమెరికా అందుకు భిన్నంగా ద్విపాత్రాభినయం చేస్తూ తన నటనావైదుష్యాన్ని ప్రదర్శిస్తోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దేశ ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలో గాజాపై దాడులు నిలపాలనీ, కనీసం రంజాన్ మాసంలోనైనా కాల్పుల విరమణకు అంగీ కరించాలనీ నెతన్యాహూను కోరారు. మంచిదే. కానీ ఆయన లక్ష్యపెట్టిందెక్కడ? తన మాటకు విలువీయని దేశానికి బైడెన్ ఆయుధ సరఫరా ఎలా కొనసాగిస్తున్నారు?
అమెరికాయే కాదు... దాని మిత్రదేశాలు కూడా ఈ ద్విపాత్రాభినయాన్ని అలవాటు చేసు కున్నాయి. ఇదే సమయంలో యుద్ధం ఆపాలంటూ వర్ధమాన దేశాలు తీసుకొస్తున్న తీర్మానాలకు భద్రతామండలిలో అమెరికా తన వీటో అధికారంతో గండికొడుతోంది. నెతన్యాహూపై బైడెన్ తరచు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రఫాపై దాడికి పూనుకుంటే లక్ష్మణరేఖ దాటినట్టేనని హెచ్చరిస్తున్నారు.
ఎవరిని వంచించటానికి ఈ హెచ్చరికలు? గాజా ప్రజల క్షేమంపై ఆయనకు నిజంగా ఆందోళనవుంటే దాని పొరుగు దేశమైన ఈజిప్టును ఒప్పించి గాజా పౌరులు సరిహద్దుదాటి తలదాచుకునేందుకు అనుమతించమని అడగొచ్చు. కానీ ఆయన ఆ పని చేయటం లేదు. ఈజిప్టుకు ఏటా అమెరికా 103 కోట్ల డాలర్ల విలువైన సైనిక సాయాన్ని అందిస్తోంది. ఆ దేశాధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసితో బైడెన్‌కు మంచి సంబంధాలున్నాయి. అయినా ఈ ప్రతిపాదన చేయరు. ఇందుకు బదులు ఆహార పొట్లాలు అందించటం మొదలెట్టారు.
ఆ ఉద్దేశం వెనకున్న ఆంతర్యాన్ని కూడా అనేకులు తప్పుబడుతున్నారు. దేశప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలో గాజాలో పోర్టు నిర్మాణాన్ని మొదలుపెడతామని బైడెన్ ప్రకటించారు. ఇది ఆహార సరఫరా సులభం చేయటం కోసమని ఆయన చెబుతున్నా ఆ వంకన అక్కడ తిష్టవేయటమే అమెరికా లక్ష్యమన్న ఆరోపణలు వస్తున్నాయి.
ఇజ్రా యెల్‌కు ఆత్మరక్షణ చేసుకునే హక్కుందని బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ మాట్లాడే మాటలు 31,000 మంది మరణించాక కూడా చెల్లుబాటవుతాయా? అయిదు నెలలు గడిచాక కూడా ఇంకా హమాస్‌ను అంతం చేయటమే లక్ష్యమంటూ ఇజ్రాయెల్ సాగిస్తున్న నరమేథాన్ని అమెరికా చూసీ చూడనట్టు వదిలేయటం సరైందేనా? హమాస్ తన దుందుడుకు చర్యలతో గాజా ప్రజలకు తీరని నష్టం చేసింది. దానిపై దాడి పేరుతో అదే పని ఇజ్రాయెల్ కూడా కొనసాగిస్తోంది. కానీ ఒకరి దాడిని ఉగ్రవాదంగా చిత్రీకరిస్తూ మరొకరిని అనునయిస్తూ, వేడుకుంటూ అదే సమయంలో వారికి కావల సిన ఆయుధ సామగ్రి అందిస్తూ కాలం గడపటం సరైందేనా?
గాజాలో నాగరిక సమాజాలు ఏమాత్రం అంగీకరించటం సాధ్యంకాని ఉదంతాలు చోటుచేసు కుంటున్నాయి. గాజా పౌరులు ఆకలికి తట్టుకోలేక ఆకులు అలములు తింటున్నారు. కడుపు నింపు కోవటానికి పశుదాణా సైతం వినియోగిస్తున్నారు. నెలలు నిండకమునుపే గర్భిణులకు ప్రసవాలవు తున్నాయి. ఆ నవజాత శిశువులకు అవసరమైన సంరక్షణ కూడా సాధ్యం కావటం లేదు. అధిక రక్తస్రావంతో తల్లులు కన్నుమూస్తున్నారు. సకాలంలో మేల్కొని ఆపకపోతే ఇజ్రాయెల్‌తోపాటు అమెరికా కూడా దోషిగా నిలబడాల్సివస్తుంది.
రష్యా సాగిస్తున్న దురాక్రమణ యుద్ధంలో దినదిన గండంగా బతుకుతున్న ఉక్రెయిన్‌కు ఇంతవరకూ అమెరికా ఒక్కటే 7,500 కోట్ల డాలర్ల సాయం అందించింది. నాటో సభ్య దేశాలు తమ వంతుగా మరింత సాయం అందిస్తున్నాయి. ఇందువల్ల రష్యా ఎక్కడా తగ్గిన దాఖలా లేదు. అటు ఉక్రెయిన్‌కు కూడా ఒరిగేదేమీ వుండటం లేదు. లాభపడేది అమెరికా రక్షణ ఉత్పత్తుల కంపెనీలే. సాయం పేరుతో అందించేదంతా తిరిగి ఆ కంపెనీలకు చేరుతోంది. ఉక్రెయిన్ ఆ డబ్బుతో అమెరికా ఆయుధాలు, క్షిపణులు వగైరాలు కొంటున్నది.
అటు ఉక్రెయిన్, ఇటు గాజా ఏకకాలంలో శ్మశానాలను మరపిస్తుండగా... రక్షణ ఉత్పత్తుల కంపెనీలు మాత్రం పచ్చగా వెలుగుతున్నాయి. పోనీ అమెరికా అయినా ప్రశాంతంగా వుంటున్నదా? కొన్ని దశాబ్దాలక్రితం పౌరహక్కుల కోసం చేతులు కలిపిన నల్లజాతీయులు, యూదులు ఇప్పుడు పరస్పరం దూషించుకుంటున్నారు. యూదులపై అక్కడక్కడ దాడులు కూడా జరుగుతున్నాయి. దీన్నంతటినీ ఆపాలంటే గాజాతోపాటు ఉక్రెయిన్‌లోనూ ప్రశాంతత నెలకొనాలి. అది అమెరికా అధ్యక్షుడు బైడెన్ చేతుల్లోనేవుంది. ఇప్పుడు కావాల్సింది నటన కాదు... సరైన కార్యాచరణ.
సరైన కార్యాచరణ ఎక్కడ?!
Published Tue, Mar 12 2024 12:10 AM | Last Updated on Tue, Mar 12 2024 4:44 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment