అగ్రరాజ్యం అమెరికాలో ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ శుక్రవారం యూఎస్‌కు కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో సంభాషించారు. ఈ సందర్భంగా గాజాలో న్యాయమైన, సమగ్రమైన శాంతి కోసం పని చేయడానికి సంసిద్ధతను ట్రంప్‌నకు తెలియజేసినట్లు ఆయన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికాకు అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఘన విజయానకి అబ్బాస్ అభినందనలు తెలియజేశారు.
‘‘అంతర్జాతీయ చట్టాల ఆధారంగా న్యాయమైన, సమగ్రమైన శాంతిని సాధించేందుకు ట్రంప్‌తో కలిసి పని చేసేందుకు పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ సంసిద్ధతను వ్యక్తం చేశారు. గాజా ప్రాంతంలో శాంతిని నెలకొల్పడానికి ప్రపంచంలోని సంబంధిత పార్టీలతో కలిసి పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నామని అబ్బాస్ ట్రంప్‌నకు తెలిపారు. దీంతో గాజాలో హమాస్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు కృషి చేస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు. గాజాలో యుద్ధాన్ని ఆపేందుకు కృషి చేస్తానని ట్రంప్ తెలిపారు’’ అని పాలస్తీనా అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. అయితే ట్రంప్ తన ప్రచారం సమయంలో గాజాలో యుద్ధం ముగించడానికి కృషి చేస్తానని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
గత ఏడాది అక్టోబర్ 7 నుంచి గాజాలో హమాస్, ఇజ్రాయెల్ బలగాల మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధంలో 43,500 మంది గాజా ప్రజలు మృతిచెందినట్లు అధికారులు పేర్కొంటున్నారు.వేల మంది ప్రజలు గాజా నుంచి ఇతర ప్రాంతాలకు వలసవెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment