న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల క్యాంపెయిన్‌లో భాగంగా నిర్వహిస్తున్న బిగ్ డిబేట్‌కు కొద్ది గంటగల ముందు రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఊరట లభించింది. హష్ మనీ కేసులో భాగంగా న్యూయార్క్‌లోని మన్‌హట్టన్ కోర్టు గతంలో ట్రంప్‌పై విధించిన గ్యాగ్(సైలెన్స్) ఆంక్షలను కొద్దిగా సడలించింది.
సవరించిన ఆర్డర్ ప్రకారం హష్ మనీ కేసులో సాక్షులపై మాట్లాడడానికి ట్రంప్‌నకు అనుమతి లభించింది. అయితే కేసులో ప్రాసిక్యూటర్లు, ఇతర వ్యక్తులపై కామెంట్ చేయడానికి మాత్రం కోర్టు అనుమతివ్వలేదు.
త్వరలో జరగబోయే డిబేట్‌లో డెమొక్రాట్ అభ్యర్థి, ప్రస్తుత దేశ అధ్యక్షుడు జో బైడెన్ మాటల దాడిని ఎదుర్కొని ధీటుగా సమాధానం చెప్పేందుకు కోర్టు విధించిన ఆంక్షలు అడ్డొస్తున్నాయని ట్రంప్ లాయర్లు వాదించారు. ట్రంప్ లాయర్ల అభ్యర్థనకు ప్రాసిక్యూటర్లు కూడా వ్యతిరేకించకపోవడంతో కోర్టు ఆంక్షలను కొంత మేర సడలించింది.
హష్ మనీ కేసులో ట్రంప్ దోషి అని కోర్టు ఈ ఏడాది మే30న తేల్చింది. ఈ కేసులో కోర్టు జ్యూరీ తుది తీర్పు వెలువరించడంతో పాటు శిక్షను ఖరారు చేయాల్సి ఉంది. తనను లైంగికంగా వాడుకొని ఆ విషయం బయటికి చెప్పకుండా ఉండేందుకు డబ్బులు చెల్లించాడని పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్ ట్రంప్‌పై హష్ మనీ కేసు పెట్టింది.
కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక ఘట్టంగా చెబుతున్న ట్రంప్, జో బైడెన్‌ల బిగ్ డిబేట్ గురువారం(జూన్27)న జార్జియాలో జరగనుంది. పలు అంశాలపై 90 నిమిషాల పాటు జరగనున్న ఈ డిబేట్‌లో జో బైడెన్, ట్రంప్ పలు కీలక అంశాలపై ముఖాముఖి చర్చించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment