అమెరికా అధ్యక్షులను ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తులుగా పరిగణిస్తారు. అటువంటిప్పుడు వారు తమకు నచ్చిన ఏదైనా గాడ్జెట్‌ను ఉపయోగించగలుగుతారని మనం అనుకుంటాం. కానీ ఇది నిజం కాదు. వారు నూతన సాంకేతికత పరికరాలకు దూరంగా ఉంటారు. వారు తమకు నచ్చిన ప్రతి గాడ్జెట్‌ను ఉపయోగించలేరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హ్యాకర్లకు అధునాతన ఎలక్ట్రానిక్ పరికరాలే కీలక టార్గెట్ అని అమెరికన్ సెక్యూరిటీ ఏజెన్సీలు గాఢంగా నమ్ముతాయి. ఈ నేపధ్యంలోనే అమెరికా అధ్యక్షులు పరిమిత గాడ్జెట్‌లను మాత్రమే ఉపయోగించగలుగుతారు.
ఒక అధికారి తెలిపిన వివరాల ప్రకారం బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడైన తర్వాత తాను బ్లాక్‌బెర్రీని ఉపయోగించడానికి భద్రతా సలహాదారులతో చాలా కాలం పోరాడారు. చివరికి భద్రతా సలహాదారులు అధ్యక్షుడు ఒబామా బ్లాక్‌బెర్రీని వినియోగించేందుకు ఆమోదించారు. అయితే సీనియర్ ఉద్యోగులు, దగ్గరి స్నేహితులతో టచ్‌లో ఉండేందుకు మాత్రమే ఒబామా దీనిని వినియోగించాలనే షరతు విధించారు. 2010లో ఐప్యాడ్ మార్కెట్లోకి వచ్చినప్పుడు అధ్యక్షుడు బరాక్ ఒబామా దానిని తన వద్ద ఉంచుకోవాలని భావించారు. ఒబామా కోరిక మేరకు అమెరికా జాతీయ భద్రతా సలహాదారులు మరింత సురక్షితమైన ఐప్యాడ్ ‘ఒబామాప్యాడ్’ని రూపొందించారు. ఒబామాప్యాడ్‌ను అధ్యక్షుని వ్యక్తిగత సిబ్బందికి కూడా ఇచ్చారని సమాచారం.
గతంలో వైట్ హౌస్‌లో వైఫై ఉండేది కాదు. దీంతో అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్‌హౌస్‌లో వైఫై ఇన్‌స్టాల్ చేయడం గురించి చర్చించారు. అయితే భద్రతా సలహాదారులు వైఫైని ఇన్‌స్టాల్ చేయడం భద్రతా ఉల్లంఘనను దారితీస్తుందని ఒబామాకు తెలిపారు. చివరకు అధికారులు బరాక్ ఒబామా పట్టుదలకు తలొగ్గవలసి వచ్చింది. ఎట్టకేలకు ఒబామా నివాసంలో వైఫైని ఏర్పాటు చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పదవీకాలంలో ట్విట్టర్‌ను విరివిగా ఉపయోగించారు. అతను వ్యక్తిగత పనుల కోసం బర్నర్ ఫోన్లు వాడినట్లు సమాచారం. తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా వాటిని తొలగించారు. ట్రంప్ కంప్యూటర్లు, ఈమెయిల్ వాడకంపై సందేహించేవారు. దీంతో ట్రంప్ కమ్యూనికేషన్ కోసం పేపర్‌ను వినియోగించేవారు.
స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన హెర్బర్ట్ లిన్ తెలిపిన వివరాల ప్రకారం హ్యాక్ చేయలేని స్మార్ట్ గాడ్జెలు చాలా అరుదుగా ఉన్నాయి. అయితే ఇవి కమ్యూనికేషన్‌లో సమస్యలను సృష్టిస్తుంటాయి. అమెరికా అధ్యక్షుని విషయానికొస్తే అతనికి రక్షణ అత్యంత అవసరం. అందుకే అతను ఏ స్మార్ట్ గాడ్జెట్‌ను ఉపయోగించకూడదు. అందుకే అమెరికా మాజీ అధ్యక్షులు అధ్యక్షులు బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్ స్మార్ట్ గాడ్జెట్లకు దూరంగా ఉన్నారు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ యాపిల్ న్యూస్ యాప్ వినియోగిస్తున్నారు. ఇది ఎప్పుడైనా సమస్యలను సృష్టించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎవరికైనా స్మార్ట్ గాడ్జెట్‌లు అంత సురక్షితం కావని, వాటితో ఎప్పటికైనా ముప్పు తప్పదని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: ‘హైదరాబాద్ హౌస్’ యజమాని ఎవరు? డబ్బును నీళ్లలా ఎందుకు ఖర్చు చేశారు?
Comments
Please login to add a commentAdd a comment