వాషింగ్టన్: ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే తాను తొలుత చేసే పనులేంటో దేశ మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. 2021లో వాషింగ్టన్ క్యాపిటల్ హిల్ భవనంపై దాడి ఘటనలో అరెస్టయి జైళ్లలో ఉన్నవారిని వెంటనే విడుదల చేస్తానని, మెక్సికోతో సరిహద్దును మూసేసి అక్రమ వలసదారులకు అడ్డకట్ట వేస్తామని తెలిపారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌లో ట్రంప్ తాజాగా ఒక పోస్టు పెట్టారు. 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత జో బైడెన్ గెలుపు అక్రమమని ట్రంప్ ఒక ప్రసంగం చేశారు. దీంతో రెచ్చిపోయిన ఆయన మద్దతుదారులు 2021, జనవరి 6న వాషింగ్టన్‌లోని చారిత్రాత్మక క్యాపిటల్ హిల్ భవనంపై దాడి చేశారు. ఈ కేసులో వందల మంది అరెస్టయి జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు.
క్యాపిటల్ హిల్ తిరుగుబాటు కేసులో అధ్యక్షునికి రాజ్యాంగ రక్షణ ఉంటుందా లేదా అనే కేసులో ట్రంప్‌పై వచ్చే ఏప్రిల్ 25న అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించనుంది. ఈ తీర్పుపైనే ట్రంప్‌నకు రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టే అర్హత ఉందా లేదా అనేది తేలిపోనుంది. కాగా, ఈ ఏడాది నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ట్రంప్, ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ మళ్లీ తలపడనున్నారు. అధ్యక్ష అభ్యర్థిని నిర్ణయించే రిపబ్లికన్ ప్రైమరీల్లో ట్రంప్ ఇప్పటికే ఘన విజయం సాధించారు.
ఇదీ చదవండి.. అమెరికాలో టిక్‌టాక్ పాలిటిక్స్.. ట్విస్ట్ ఇచ్చిన ట్రంప్
Comments
Please login to add a commentAdd a comment