ఇజ్రాయెల్‌పై అడ్డుకట్టకు ఖతార్‌తో జోబైడెన్‌ భేటీ | Biden Urges Qatar to Pressure Hamas into Accepting Cease Fire Proposal | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌పై అడ్డుకట్టకు ఖతార్‌తో జోబైడెన్‌ భేటీ

Published Tue, Jun 4 2024 9:00 AM | Last Updated on Tue, Jun 4 2024 10:30 AM

Biden Urges Qatar to Pressure Hamas into Accepting Cease Fire Proposal

గత ఆరు నెలలుగా హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతోంది. హమాస్‌ను నిర్మూలించాలనే ఇజ్రాయెల్ లక్ష్యం.. గాజా స్ట్రిప్‌లోని ప్రజలను కష్టాలపాలు చేస్తోంది. గాజాలో తలెత్తుతున్న విధ్వంసకర పరిస్థితులపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

అమెరికాలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఇది అధ్యక్షుడు జో బైడెన్‌కు కొత్త సమస్యలను తెచ్చిపెట్టేదిగా మారింది. దీంతో బైడెన్‌ గాజాలో యుద్ధాన్ని నివారించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. గాజాలో కాల్పుల విరమణ, బందీల విడుదల కోసం ఇజ్రాయెల్ ప్రతిపాదనను బైడెన్‌ ఇటీవలే ప్రకటించాడు.

తాజాగా అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ మరోసారి ఈ ఒప్పందానికి సంబంధించి ఖతార్ ఎమిరేట్స్‌తో మాట్లాడారు. కాల్పుల విరమణ ప్రతిపాదనను ఆమోదించేలా హమాస్‌పై ఒత్తిడి తేవాలని కోరారు. గాజాలో సంక్షోభాన్ని అంతం చేయడానికి, కాల్పుల విరమణ, బందీ ఒప్పందాన్ని అమలు చేయడంపై ఖతార్ ఎమిర్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో చర్చించారు.

‘నేను ఈ రోజు ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో మాట్లాడాను’ అని బైడెన్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో తెలిపారు. కాల్పుల విరమణ, బందీ ఒప్పందానికి సంబంధించిన ప్రణాళికను ఎలా రూపొందించాలనే దానిపై చర్చించానన్నారు. హమాస్ ఒప్పందాన్ని ఆమోదించేలా అన్ని తగిన చర్యలను తీసుకోవాలని తాను అమీర్ తమీమ్‌ను కోరానన్నారు. గాజాలో బందీలుగా ఉన్న వారిని విడుదల చేయడానికి  కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలిపానన్నారు. ఈ ఒప్పందం అమలుకు ఈజిప్ట్, ఖతార్‌లతో కలిసి యునైటెడ్ స్టేట్స్ పని చేస్తుందని బైడెన్‌ పేర్కొన్నారు.

ఐదు వేలకు పైగా రాకెట్లను ప్రయోగిస్తూ హమాస్ అక్టోబర్ 7న ఇజ్రాయెల్ నగరాలపై దాడి మొదలుపెట్టింది. అనంతరం హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించి అక్కడి ప్రజలపై దాడులు జరిపారు. దీనికి ప్రతిగా గాజాలోని హమాస్ ఉగ్రవాదులపై ఇజ్రాయెల్ ఆపరేషన్ ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌లో గాజాలోని హమాస్ స్థావరాలపై భారీ బాంబు దాడులు జరిగాయి. ఫలితంగా గాజాలోని పలు ప్రాంతాలు శిథిలమయ్యాయి. ఇజ్రాయెల్,గాజాలలో ఇప్పటివరకు మొత్తం 34,622 మంది మృతి చెందారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement