వేల ప్రాణాలు బలిగొని.. లక్షల మందిని నిరాశ్రయులిగా మార్చేసి.. తొమ్మిది నెలలుగా కొనసాగుతున్న గాజా సంక్షోభంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా ప్రతిపాదించిన ఒప్పందంపై హర్షం వ్యక్తం చేసిన హమాస్.. ఇప్పుడు ఇజ్రాయెల్ బందీల విడుదల చర్చలకు అంగీకారం తెలిపింది. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ రాయిటర్స్ ఓ కథనం ప్రచురించింది.
‘‘తొలి దశ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత మా దగ్గర బందీలుగా ఉన్న ఇజ్రాయిలను విడుదల చేస్తాం. అయితే ఒప్పందంలోకి ప్రవేశించేముందు ఒక షరతు. శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందంపై ఇజ్రాయెల్ తప్పకుండా సంతకం చేయాలి’’ అని హమాస్ సీనియర్ కమాండర్ ఒకరు చెప్పినట్లు రాయిటర్స్ కథనం ఇచ్చింది. మరోవైపు.. ఇజ్రాయెల్ ఓ అడుగు ముందుకు వేస్తే గాజా యుద్ధానికి తెర పడుతుందని ఇజ్రాయెల్-హమాస్ మధ్య దౌత్యం వహిస్తున్న పాలస్తీనా అధికారి ఒకరు తెలిపారు.
అమెరికా ప్రతిపాదించిన ఒప్పందం ఇదే..
మొదటి దశ.. ఇది ఆరు వారాలు కొనసాగుతుంది. ఇందులో ఇజ్రాయెల్-హామాస్ బలగాలు పూర్తిస్థాయిలో కాల్పుల విరమణను పాటించాలి. గాజాలోని జనాలు ఉండే ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ బలగాలు వెనుదిరగాలి. వందల మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేయాలి. ప్రతిగా మహిళలు, వృద్ధులు సహా పలువురు బందీలను హమాస్ అప్పగించాలి.
రెండో దశలో.. సైనికులు సహా సజీవ ఇజ్రాయెలీ బందీలందరినీ హమాస్ విడిచిపెట్టాలి. గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలు పూర్తిగా వెనక్కి వచ్చేయాలి.
మూడో దశలో.. గాజాలో పునర్నిర్మాణ పనులు భారీస్థాయిలో ప్రారంభమవుతాయి. బందీలుగా ఉన్నప్పుడు ప్రాణాలు కోల్పోయినవారి అవశేషాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించాలి.
అయితే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రూపొందించిన ఈ ప్రతిపాదనలో తాత్కాలిక కాల్పుల విరమణ, మానవతా సాయానికి అనుమతి, ఒప్పందంలో రెండో దశలోకి ప్రవేశించేంత దాకా ఇజ్రాయెల్ తన బలగాల్ని వెనక్కి తీసుకోవడం లాంటి అంశాలున్నాయి. దీంతో ఇజ్రాయెల్, హమాస్ తాజా ప్రతిపాదనకు ఎలా స్పందిస్తుందో చూడాలి.
అక్టోబర్ 7న హమాస్ బలగాలు ఇజ్రాయెల్ దక్షిణ సరిహద్దులోని నగరాలపై అన్ని మార్గాల నుంచి మీదుగా దాడులకు దిగడం.. ప్రతిగా గాజాపైకి ఇజ్రాయెల్ రక్షణ దళం దండెత్తడంతో ఈ సంక్షోభం మొదలైంది. గాజాలో ఇప్పటిదాకా ఇజ్రాయెల్ బలగాలకు దాడులకు 38వేల మంది చనిపోయారు. సురక్షిత ప్రాంతాల పేరిట లక్షల మంది వలసలు వెళ్లారు. గాజా యుద్ధం ముగిసేందుకు.. ఇజ్రాయెల్ బలగాలు వెనక్కి మళ్లేందుకు ఎలాంటి ఒప్పందానికైనా సిద్ధమని హమాస్ ప్రకటించింది. అయితే హమాస్‌ను శాశ్వతంగా తుడిచిపెట్టేంతదాకా యుద్ధం ఆపేది లేదని, కావాలంటే తాతల్కాలిక విరామం మాత్రమే ఉంటుందని చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment