ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ ఒప్పందం ఆదివారం నుంచి అమలులోకి వస్తుందని ఖతార్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్‌థానీ ఘనంగా ప్రకటించడం తెలిసిందే. అయితే ఆఖరి నిమిషయంలో ఇటు ఇజ్రాయెల్.. అటు హమాస్‌లు ఒక అడుగు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
కాల్పుల విరమణ(Ceasefire Deal) ఒప్పందానికి ఆమోదం తెలిపేందుకు తమ కేబినెట్ సమావేశం ప్రస్తుతానికి జరగట్లేదని ఇజ్రాయెల్ ప్రకటించింది. అందుకు హమాస్ చివరి నిమిషంలో పెట్టిన కొర్రీలే కారణమని ఆరోపించింది. ఒప్పందం తుది ముసాయిదాపై ఇంకా కసరత్తు జరుగుతోందని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ప్రకటించిన కాసేపటికే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. దీంతో తర్వాత ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠ నెలకొంది.
చివరి నిమిషంలో హమాస్(Hamas) ఉగ్రసంస్థ ఒప్పందంలో మార్పులు సూచించడమే అందుకు కారణమని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ప్రకటించింది. అయితే ఆ కారణం ఏంటన్నదానిపై మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు.. హమాస్ మాత్రం మధ్యవర్తులు తెచ్చిన ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని చెబుతోంది. ఇజ్రాయెల్ తాజాగా చేస్తున్న ఆరోపణలపై మాత్రం స్పందించకపోవడం గమనార్హం.
పదిహేను నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలుకుతూ ఇజ్రాయెల్-హమాస్‌లు ఓ అంగీకారానికి వచ్చినట్లు మధ్యవర్తిత్వం వహిస్తున్న ప్రతినిధులు బుధవారం ప్రకటించారు. ఖతార్ ఈ ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించింది. తొలి ఫేజ్‌లో భాగంగా.. గాజాలో తాము బంధీలుగా ఉంచిన 33 మందిని హమాస్ విడుదల చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా మొదట ఇద్దరు అమెరికన్లను విడుదల చేస్తారు. దానికి ప్రతిగా తమ దేశ జైళ్లలో మగ్గుతున్న పాలస్తీనా బంధీలను ఇజ్రాయెల్ విడుదల చేయాలి.
ఇదీ చదవండి: గాజా శాంతి ఒప్పందం ఘనత ఎవరిదంటే..
అయితే.. ఆ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ (Israel) గాజాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ప్రకటన వెలువడినప్పటి నుంచి జరిగిన దాడుల్లో 71 మంది మరణించినట్లు గాజా సివిల్ ఎమర్జెన్సీ సర్వీస్ వెల్లడించింది. పైగా ఈ చర్యలతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారని, పదుల సంఖ్యలో భవనాలు కుప్పకూలగా.. మరికొందరికి గాయాలైనట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో ఈ ఆదివారం(జనవరి 19) నుంచి మొదలుకావాల్సిన ఒప్పందం అమలుపై నీలినీడలు కమ్ముకునే అవకాశం లేకపోలేదు.
అక్టోబరు 7, 2023న సరిహద్దులు దాటి ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించి 1200 మంది ఇజ్రాయెల్ పౌరులను హతమార్చి, 250 మందిని బందీలుగా చేసుకోవడం ద్వారా హమాస్ మధ్య ఆసియాలో యుద్ధానికి బీజం వేసింది. హమాస్‌కు మద్దతుగా హెజ్‌బొల్లా, హూతీ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై దాడులకు దిగాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పరస్పర క్షిపణి దాడులకు పాల్పడ్డాయి. 15 నెలల యుద్ధంలో 46 వేల మంది పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందారు. ఈ యుద్ధాన్ని నివారించడానికి ప్రపంచ దేశాలు కృషి చేస్తూ వచ్చాయి. అటు అమెరికా.. ఇటు ఈజిప్ట్,ఖతారులు కొన్ని నెలలుగా కాల్పుల విరమణ చర్చలు జరుపుతూ వచ్చాయి.
ఖతార్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్‌థానీ టెలివిజన్ ముఖంగా చేసిన ప్రకటనతో.. పాలస్తీనాలో సంబురాలు జరిగాయి. ఇటు గాజా సరిహద్దులో శరణార్థ శిబిరాల్లో ఉన్నవాళ్లు సైతం హర్షం వ్యక్తం చేశారు. ఇకనైనా మానవతా ధృక్పథంతో ముందకు సాగాలని, గాజా కోలుకునేందుకు అవసరమైన సాయం కోసం ఒప్పందంపై ఇరువర్గాలు సంతకాలు చేయాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు.. గాజా శాంతి ఒప్పందం ఓ కొలిక్కి వచ్చిందన్న పరిణామంపై భారత్ సహా పలుదేశాలు స్వాగతించాయి.
Comments
Please login to add a commentAdd a comment