వాషింగ్టన్: వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ ఫేవరెట్‌గా మారుతున్నారు. తాజాగా వాల్ స్ట్రీట్ జర్నల్ చేసిన సర్వేలో ప్రస్తుత అధ్యకక్షుడు జో బైడెన్‌కంటే 4 శాతం ఎక్కువ అప్రూవల్ రేటుతో ట్రంప్ ముందున్నారు. అమెరికా అధ్యక్షుడిగా జోబైడెన్‌ను 43 శాతం మంది ప్రజలు ఆమోదించగా ట్రంప్‌ను 47 శాతం మంది ఆమోదించడం విశేషం.
అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి జో బైడెన్ అప్రూవల్ రేటు 43 శాతానికి పడిపోవడం ఇదే తొలిసారి. 2024 అధ్యక్ష ఎన్నికలకు ఏడాది కంటే తక్కువ టైమ్ ఉండడంతో డెమొక్రాట్లకు ఈ విషయం ఆందోళన కలిగిస్తోంది. దీంతో డెమొక్రాట్లు రెండోసారి అధ్యక్షపదవికి జోబైడెన్ పోటీలో ఉండటాన్ని వ్యతిరేకిస్తున్నారు. బైడెన్ రెండోసారి పోటీచేయవద్దనేందుకు వాళ్లు మరో కారణం కూడా చూపుతున్నారు. ఎన్నికల నాటికి ఆయన వయసు 81కి చేరనుందని, ఈ వయసులో మళ్లీ పోటీ ఎందుకని కొందరు డెమొక్రాట్ నేతలు వాదిస్తున్నారు.
మరోవైపు రిపబ్లికన్ల తరపున అధ్యక్ష పదవికి పోటీలో ట్రంప్‌కు తిరుగులేని మద్దతు లభిస్తోంది. పార్టీలో ట్రంప్ పోటీదారులెవరూ ఆయన దరిదాపుల్లో కూడా లేరు. అయితే ట్రంప్ మీదున్న క్రిమినల్ కేసులు, గతంలో క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారుల దాడి వంటి అంశాలు ఆయన అభ్యర్థిత్వానికి ముప్పుగా పరిణమించే అవకాశాలు లేకపోలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment