
దక్షిణ కొరియా విపక్ష నేతకు 34 శాతం మద్దతు
జూన్ 3న ఎన్నికలు
సియోల్: దక్షిణ కొరియా అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నట్లు ప్రతిపక్ష నేత లీ జే మ్యుంగ్ ప్రకటించారు. అధ్యక్ష పదవి నుంచి యూన్ సుక్ యోల్ తొలగింపు సబబేనన్న రాజ్యాంగ న్యాయస్థానం తీర్పుతో దేశంలో ఎన్నికలు అనివార్యం కావడం తెలిసిందే. జూన్ 3న ప్రజలు కొత్త అధ్యక్షున్ని ఎన్నుకోనున్నారు. తాను బరిలోకి దిగుతున్నట్లు లీ వీడియో సందేశంలో పేర్కొన్నారు.
మానవ హక్కుల న్యాయవాదిగా చేసిన ఆయన దేశ రాజకీయాల్లో అత్యంత సంచలనాత్మక నేత. 61 ఏళ్ల వయసులో ప్రధాన స్రవంతి రాజకీయాల్లోకి పునఃప్రవేశించారు. 2022 అధ్యక్ష ఎన్నికల్లోనూ లీ పోటీ చేశారు. దేశ చరిత్రలోనే అతి తక్కువ తేడాతో యూన్ చేతిలో ఓడారు. గతేడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం విపక్ష డెమొక్రటిక్ పార్టీకి భారీ విజయం సాధించిపెట్టారు.
ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరిస్తా
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధిరేటు క్షీణించడంతో కేవలం ప్రైవేటు రంగం బలంతో ఆర్థిక వ్యవస్థను నిర్వహించడం, అభివృద్ధి చేయడం కష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరిస్తానని లీ ప్రకటించారు. ‘‘దేశంలో విభజనను, సామాజిక సంఘర్షణలను సైనిక చట్టం బహిర్గతం చేసింది. పేద, ధనిక అంతరం పెరగడమే దీనికి కారణం’’అని లీ అన్నారు.
ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేందుకు, ఆదాయ ధ్రువీకరణను సులభతరం చేయడానికి ప్రభుత్వ వ్యయాన్ని ముమ్మరం చేస్తామని హామీ ఇచ్చారు. ‘‘గతంలో కంటే మన దగ్గర ఎక్కువే ఉన్నాయి. కానీ సంపద కొన్ని ప్రాంతాల్లోనే కేంద్రీకృతమై ఉంది. అమెరికాతో బలమైన మైత్రిని, జపాన్ తో త్రిముఖ సహకారాన్ని కొనసాగించడం ముఖ్యం. జాతీయ ప్రయోజనాలే మా పరమావధి’’అని ఉద్ఘాటించారు.
సర్వేలో ముందంజ
శాసనసభ్యుడిగా, ప్రొవిన్షియల్ గవర్నర్‌గా, మేయర్‌గా పనిచేసిన లీది నిర్మొహమాట శైలి. సంపన్నుల వ్యతిరేకిగా కొనసాగుతూ వస్తున్నారు. విపక్ష నేతగా సమర్థ పనితీరుతో ప్రజల మద్దతు పెంచుకున్నారు. 34 శాతం మంది మద్దతుతో ప్రస్తుతానికి లీ ముందంజలో ఉన్నట్లు ఏప్రిల్ 4న జరిగిన గాలప్ కొరియా సర్వే తేల్చింది. లీ బలమైన పోటీదారుగా కనిపిస్తున్నా ఆయనకు అడ్డంకులు లేకపోలేదు.
లంచం ఆరోపణలు, బిలియన్ డాలర్ల రియల్ ఎస్టేట్ కుంభకోణంలో పాత్రతో సహా ఆయనపై పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘించిన కేసులో ఆయన గతంలో దోషిగా తేలారు. ఆ తీర్పును ఎగువ కోర్టు కొట్టేసినా దానిపై ప్రాసిక్యూటర్లు మళ్లీ అప్పీల్ చేశారు. ఈ ఆరోపణలన్నీ రాజకీయపరమైనవని ఆయన అభిమానులు అంటున్నారు. 2024 జనవరిలో ఓ కార్యక్రమంలో లీపై హత్యాయత్నం కూడా జరిగింది. కత్తిపోట్లకు గురైనా ఆయన ప్రాణాలతో బయటపడ్డారు.
అభ్యర్థిని ప్రకటించని పీపీపీ
అధికార పీపుల్ పవర్ పార్టీ (పీపీపీ) ఇంకా న అభ్యరి్థని ఎంపిక చేయలేదు. యూన్ పతనం పార్టీని ఇరకాటంలో పడేసింది. పీపీపీ నుంచి సుమారు 10 మంది నామినేషన్ వేస్తారని భావిస్తున్నారు, ఇప్పటికీ పార్టీని నియంత్రిస్తున్న యూన్ విధేయులకు, సంస్కరణవాదుల మధ్య విభేదాలకు ఇది నిదర్శనమంటున్నారు. మాజీ న్యాయ మంత్రి హాన్ డాంగ్ హూన్, సియోల్ మేయర్ ఓహ్ సె హూన్, టెక్ దిగ్గజం అహ్న్ చియోల్ సో సహా పలువురి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వారిలో ఎవరూ ఇప్పటిదాకా ప్రజల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు మొదలు పెట్టలేదు.