
దూర దేశాల్లో నిత్య వేధింపులు
దక్షిణకొరియా చిన్నారుల దైన్యం
దర్యాప్తు కమిషన్ విచారణలో వెలుగులోకి
దశాబ్దాలుగా లోపభూయిష్టంగా కార్యక్రమం
ప్రభుత్వ క్షమాపణకు కమిషన్ సిఫార్సు
దత్తత మాటున దారుణాలు. కొరియా యుద్ధం తాలూకు విషాదంలో మరో చీకటి అధ్యాయం. దీనికి సంబంధించి తాజాగా బహిర్గతమైన విషయాలు విస్మయం కలిగిస్తున్నాయి. 1950ల్లో యుద్ధం కారణంగా దక్షిణ కొరియా పేదరికంలో కూరుకుపోయింది. జనం తమ సంతానాన్ని పోషించుకోలేని దుస్థితికి దిగజారడంతో వారిని ఆదుకునే సాకుతో ప్రభుత్వం తెచ్చిన పథకం అక్రమాలకు నెలవుగా, అంతులేని విషాదానికి చిరునామాగా మారింది.
తొలుత ప్రశంసలు అందుకున్నా విదేశీ దత్తత పథకంలోని చీకటి కోణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో ఎన్నో అక్రమాలు జరిగాయని, లక్షలాది మంది చిన్నారులు సొంతవారికి దూరమై విదేశాల్లో కష్టాల పాలయ్యారని దీనిపై విచారణకు నియమించిన కమిషన్ కుండబద్దలు కొట్టింది. ‘‘ఇది పిల్లల భవిష్యత్తులో క్రూర చెలగాటం. దీనికి ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి’’ అని సిఫార్సు చేసింది. దత్తత పేరుతో దూర దేశాలకు తరలిపోయిన తమ చిన్నారుల కన్నీటి గాథలు దక్షిణ కొరియన్లను కంటతడి పెట్టిస్తున్నాయిప్పుడు...!
విదేశాల్లో మొదలైన కష్టాలు
దత్తత తీసుకున్న తల్లిదండ్రుల చెంత హాయిగా పెరిగిన పిల్లలు కొందరే. అత్యధికులు బానిసలుగా బతికారు. సరైన పోషణ, సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హింస, వేధింపులు నిత్యకృత్యమయ్యాయి. దత్తత తండ్రుల చేతుల్లో అత్యాచారాలకు బలైన అమ్మాయిలు కోకొల్లలు. దత్తత సమయంలో తప్పుడు ఊళ్లు, పేర్లు, అన్నీ మార్చేసిన కారణంగా అసలు తమ కన్న తల్లిదండ్రులు ఎవరనేదీ పెద్దయ్యాక ఆ పిల్లలకు తెలీకుండా పోయింది. నార్వేలో జీవిస్తున్న 60 ఏళ్ల ఇంగర్ టోన్ ఉయిలాండ్ షిన్ కన్నీటిగాథ ఇలాంటిదే. ‘‘13 ఏళ్ల వయసులో నన్ను దత్తత తీసుకుని నార్వేకు తీసుకొచ్చారు.
తిండి, వాతావరణం ఏదీ నాకు సరిపడలేదు. పెంపుడు తండ్రి లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయి. నాకన్నా పెంపుడు కుక్కనే బాగా చూసుకునేవాళ్లు. చేసిన నేరానికి శిక్ష అనుభవించకుండానే వాళ్లు చనిపోయారు. నేను మాత్రం ఇలా మిగిలిపోయా. చిన్ననాటి జ్ఞాపకాలు, అందమైన బాల్యం, సర్వం కోల్పోయా’’ అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. అమెరికా, ఆ్రస్టేలియాతో పాటు యూరప్‌లోని ఎన్నో దేశాలకు దత్తు వెళ్లిన ఆయిలాండ్ వంటి చిన్నారుల కన్నీటిగాథలు కోకొల్లలని ‘ట్రూత్ అండ్ రీకన్సిలియేషన్ కమిషన్’ పేర్కొంది. మూడేళ్ల దర్యాప్తు తర్వాత బుధవారం సమగ్ర నివేదిక సమర్పించింది. అంతర్జాతీయ దత్తత చట్టాలు, చిన్నారుల పరిరక్షణపై ‘ది హేగ్ ఒడంబడిక’ను దక్షిణ కొరియా ప్రభుత్వం తుంగలో తొక్కిందని కమిషన్ చైర్‌పర్సన్ పార్క్‌సన్ యంగ్ మండిపడ్డారు.
ఎందుకీ దుస్థితి?
1950వ దశకంలో కొరియా ద్వీపకల్పంలో మొదలైన యుద్ధమే ఈ దత్తత దారుణాలకు ప్రధాన కారణం. దేశ భూభాగంలో ఉత్తరభాగం డెమొక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా (డీపీఆర్‌కే)గా, దక్షిణభాగం రిపబ్లిక్ ఆఫ్ కొరియాగా రెండు ముక్కలైంది. ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధించినాసరే అమెరికాసహా 17 దేశాలు ద.కొరియాకు మద్దతు ప్రకటించాయి. చైనా, రష్యాలు ఉత్తరకొరియాకు అండగా నిలబడ్డాయి. చాన్నాళ్లు కొనసాగిన ఈ యుద్ధంలో ఒక్క దక్షిణకొరియాలోనే దాదాపు 2,00,000 మందికిపైగా మహిళలు తమ భర్తలను కోల్పోయి వితంతువులుగా మిగిలిపోయారు.
మరో 1,00,000 మంది చిన్నారులు అనాథలయ్యారు. వితంతులు తమ పిల్లలను పెంచే స్తోమతలేక అనాథాశ్రమాల్లో చేర్పించారు. దీంతో దేశవ్యాప్తంగా అనాథాశ్రయాల్లో చిన్నారుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. యుద్ధంకారణంగా పేదరికం కోరల్లో చిక్కుకుపోయిన ద.కొరియా సర్కార్‌కు వీళ్ల పోషణ పెద్ద భారంగా తయారైంది. యుద్దంలో ద.కొరియాకు సాయంగా దేశంలో తిష్టవేసిన అమెరికా సైనికులు స్థానిక మహిళలతో సంబంధాలు పెట్టుకోవడంతో లక్షలాది మంది చిన్నారులు జని్మంచారు. ఇలాంటి వాళ్లకు సమాజంలో ఆదరణ కరువైంది.
ఛీత్కారాలను ఎదుర్కొన్నారు. వితంతువుల పిల్లలు, అమెరికన్ల పిల్లలు, అనాథాశ్రయాల్లోని చిన్నారుల బాగోగులు చూసేందుకు ప్రభుత్వం విదేశీ దత్తత కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వీళ్లను దత్తత తీసుకునేందుకు పశ్చిమదేశాల్లోని జంటలు తెగ ఆసక్తి చూపించారు. ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్‌లోని కొన్ని దేశాల నుంచి దత్తత డిమాండ్లు అధికమయ్యాయి. 1954లో ఈ ధోరణి ఊపందుకుంది. 1948 నుంచి 1960 వరకు సింగ్‌మాన్ రీ పాలనకాలంలో, తర్వాత పార్క్ చుంగ్ హీ హయాంలో 1961నుంచి 1979 కాలంలో ఈ పోకడ విపరీతంగా పెరిగిపోయింది.
వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు
దత్తత ప్రక్రియ పూర్తి లోపభూయిష్టమని, తమను అన్యాయంగా, అక్రమంగా విదేశాలకు తరలించారని చాలామంది చిన్నారులు పెద్దయ్యాక ఫిర్యాదులు చేశారు. వాటిపై కమిషన్ దర్యాప్తులో విస్మయకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ‘‘దత్తత ప్రక్రియ తప్పులతడకగా సాగింది. పేర్లు మార్చేయడం, తల్లిదండ్రులున్నా అనాథ అని పేర్కొనడం వంటి ఎన్నో అక్రమాలు వెలుగు చూశాయి. విదేశీ జంటలకు అప్పగింతపై నెలవారీ పరిమితి ఉన్నా ఆ కోటాను ప్రభుత్వమే తుంగలో తొక్కింది.
అలా ప్రైవేట్ ఏజెన్సీలు దశాబ్దాలుగా లక్షలాది మంది చిన్నారులను విదేశాలకు తరలించాయి. ఉచితంగా జరగాల్సిన దత్తత ప్రక్రియలో అడుగడుగునా భారీగా నగదు చేతులు మారింది’’ అని కమిషన్ పేర్కొంది. ఎట్టకేలకు 2023లో దత్తత ప్రక్రియలో కఠిన నిబంధనలను అమల్లోకి తెచ్చారు. ఇకపై ప్రైవేట్ ఏజెన్సీలకు బదులు విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో దత్తత కార్యక్రమం నడుస్తుందని ప్రకటించింది. కానీ కమిషన్ వెల్లడించిన కఠోర వాస్తవాలపై మాత్రం ప్రభుత్వం పెదవి విప్పలేదు. తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని తేలినా క్షమాపణ చెప్పలేదు. దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దారి తప్పిన పథకం
పశ్చిమ దేశాల జంటలకు అనాథలను దత్తతనిచ్చే కార్యక్రమం మొదట్లో సవ్యంగా సాగినా రానురాను ఇది అక్రమాలకు నెలవుగా తయారైంది. దత్తత ప్రక్రియ నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం పూర్తిగా ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించి చేతులు దులుపుకుంది. దీంతో ఈ ఏజెన్సీలు పశ్చిమదేశాల జంటల నుంచి అత్యధిక మొత్తాలను వసూలుచేసి వాళ్లకు నచ్చిన పిల్లలను విదేశాలకు తరలించడం మొదలెట్టాయి. ఇందుకోసం ఏజెన్సీలు ఎన్నో అక్రమ మార్గాలను ఎంచుకున్నాయి. అక్రమాలు బయటపడకుండా ఉండేందుకు పిల్లల అసలు పేర్లను మార్చేసి దొంగ డాక్యుమెంట్లు సృష్టించేవారు. కుటుంబాలతో ఉంటున్న అందంగా, పుష్టిగా ఉన్న చిన్నారులు కొందరిని కిడ్నాప్ చేసి మరీ విదేశాలకు తరలించారు. కుటుంబాలకు చెందిన పిల్లలను అనాథలుగా ముద్రవేసి విదేశీ జంటలకు అప్పగించారు. ఇలా లక్షలాది మంది చిన్నారులను దేశం దాటించారు.
– సాక్షి, నేషనల్ డెస్క్