slaves
-
Ancient Slave Room: రెండు వేల ఏళ్ల నాటి బానిస గది ఇదిగో..!
Archaeologists Discover slave Room at Pompeii: రాజులు బానిసలను ప్రత్యేకమైన దీవులు, గుహలు, గదుల్లో బంధించినట్లు చర్రితలో చదివాం. అయితే ఈ ఆధునిక కాలంలో బానిస వ్యవస్థ దాదాపు లేదు అనటంలో సందేహం లేదు. అయితే పురాతన కాలంలో బానిసలకు సంబంధించిన విషయాలు ఆసక్తిగా ఉండటంతో పాటు భయం గొల్పుతాయి కూడా! అయితే తాజాగా ఇటలీలోని రోమ్‌లో ఓ పురాతన ‘బానిస గది’ తవ్వకాల్లో బయటపడింది. పాంపీ పురావస్తు శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో ఈ గది బయటపడింది. సుమారు రెండు వేల ఏళ్ల క్రితం వెసువియస్ పర్వతం విస్ఫోటనం వల్ల వెలువడిన బూడిద కింద పాంపీ నగరం సమాధి అయిపోయిన విషయం తెలిసిందే. సివిటా గియులియానా విల్లాలో జరిపిన తవ్వకాల్లో బయటపడ్డ బానిసరూంలో మూడు బెడ్స్, ఒక మట్టి కుండ, చెక్కపెట్టెను పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ గదిలోని మంచాలు 1.7 మీటర్ల పోడవు, 1.4 మీట్లర్ల వెడల్పుతో ఉన్నాయి. వాటితోపాటు కుండలు, కొని ఇతర వస్తువులు కూడా లభించాయి. వాటిని చూస్తే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బానిసలు ఈ గదిలో ఉన్నట్లు తెలుస్తోందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఈ గది గోడకు ఓ చిన్న కిటికి ఉండి.. గోడలకు ఎటువంటి అలంకరణ లేకుండా ఉన్నాయని తెలిపారు. అక్రమ తవ్వకాలు జరిగి కొంతమంది ఇక్కడ లభించే కళాఖండాలను అమ్ముకుంటున్నారని పురావస్తు శాస్త్రవేత్తలు అధికారికంగా 2017లో తవ్వకాలు ప్రారంభించారు. ‘బానిస గది’ పై స్పందించిన పాంపీ డైరెక్టర్ జనరల్ గాబ్రియేల్ జుచ్ట్రిగెల్ మాట్లాడుతూ.. చరిత్రక మూలాల్లో అరుదుగా కనిపించే వ్యక్తులకు సంబంధించిన వాస్తవికత బయటకు వచ్చిందని తెలిపారు. పురాతనమైన కాలానికి చెందినవారు ఎలా జీవించారనే విషయం స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. తన జీవితంలో ఇది ఓ గొప్ప తవ్వకమని పేర్కొన్నారు. -
హారియట్ టబ్‌మన్ బానిసల ప్రవక్త
వారు నివసించిన ఖండాన్ని చీకటి ఖండం అన్నారు. వారి జీవితాలను సదా చీకటితో నింపారు. నల్ల పుట్టుక పుడితే బానిస అని అన్నారు. సంకెలలతో బంధించి హింసించారు. తెల్లవారి సేవకు ఆఫ్రికా నుంచి తరలింపబడ్డ నల్లవారు అమెరికాలో తమ స్వేచ్ఛ కోసం, గౌరవం కోసం యుగాలుగా పెనుగులాడుతూనే ఉన్నారు. జార్జ్ ఫ్లాయిడ్ ఘటన నేపథ్యంలో ఆ స్వేచ్ఛాపోరాటాలను గుర్తు చేసుకుంటున్నారు. ‘హారియట్ టబ్‌మన్’ ఇప్పుడు పదేపదే ప్రస్తావనకు వస్తున్నారు. బానిసగా పుట్టి బానిసల విముక్తి కోసం జీవితాన్ని ధారపోసిన ధీర ఆమె. 2019లో ఆమెపై వచ్చిన బయోపిక్ ‘హారియట్’ పరిచయం ఇది. ‘ఇక్కడి నుంచి తర్వాతి సురక్షితమైన చోటు 25 మైళ్ల దూరంలో ఉంది. అంత దూరం ఒక్కదానివే ఎలా నడుస్తావు?’ అని అడుగుతాడు మిత్రుడు. ‘ఏం పర్లేదు. నేను దేవుడితో పాటు నడుస్తాను’ అంటుంది హారియట్. ‘బానిసల మొర దేవుడు వినడు’ అని ఆమె సోదరుడు ఒక సందర్భంలో హారియట్తో అంటాడు ఈ సినిమాలో. కాని హారియట్ ఎప్పుడూ దేవుడు తమ మిత్రుడని అనుకుంది. దేవుడు తన దగ్గరగా నిలబడి తనను నడిపిస్తున్నాడు అనుకుంది. దేవుడు తనకు చూపిన మార్గమే బానిసల విముక్తి అని అనుకుంది. ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు దశాబ్దాల పాటు ఆమె బానిసల విముక్తి కోసమే పోరాడింది. వారి కోసం కత్తి పట్టుకుంది. తుపాకీని పేల్చింది. యుద్ధమే చేసింది. అమెరికా సమాజం నేటికీ సగౌరవంగా తలిచే ఆ నల్లవనిత హారియట్ టబ్‌మన్ (1822– 1913) జీవితం మీద ఎన్నో పుస్తకాలు సినిమాలు వచ్చాయి. 2019 వచ్చిన ‘హారియట్’ ఆస్కార్ నామినేషన్ల వరకూ వెళ్లింది. బానిసల రాష్ట్రంలో అమెరికాలో 19వ శతాబ్దపు తొలి దశకాలు ఘోరమైన బానిస వ్యవస్థకు సాక్ష్యంగా నిలిచాయి. పారిశ్రామికీకరణ ఉన్న ఉత్తరాది రాష్ట్రాలు బానిస వ్యవస్థను అసహ్యించుకుంటే శారీరక శ్రమ అవసరమైన వ్యవసాయ ఆధారిత దక్షిణాది రాష్ట్రాలు బానిసల వ్యవస్థను స్థిరపరుచుకోవడానికి ఎంతకైనా తెగించే వరకూ వెళ్లాయి. ఈ ‘స్లేవ్ స్టేట్స్’, ‘ఫ్రీ స్టేట్స్’కు మధ్య నలిగి ఇక్కడి నుంచి అక్కడికి పారిపోవడానికి ప్రయత్నించిన ఆఫ్రికన్ అమెరికన్ల కథలు వేనవేలు. అలాంటి వారిలో ఒకరు మన కథానాయిక హారియట్ టబ్‌మన్. బానిసల రాష్ట్రాలలో ఒకటైన మేరీల్యాండ్‌లో ఆమె కథ మొదలవుతుంది. ఆమె తల్లిదండ్రులు బానిసలు. అయితే తల్లి ఒక యజమాని దగ్గర తండ్రి ఒక యజమాని దగ్గర విడిగా ఉంటూ పని చేసే దురవస్థ ఆ రోజుల్లో ఒక విషాదకర వాస్తవం. హారియట్కు ఆరేళ్లు వచ్చి ఊహ తెలిసే సమయానికి ఆమెకు స్ఫురణకు వచ్చిన ఒకే ఒక్క విషయం– తన వైపు దిగులుగా చూస్తూ వేరే యజమానికి అమ్ముడుపోయి వెళ్లిపోయిన అక్క ముఖం. ఆ రోజుల్లో బానిసల యజమానులు తమ దగ్గర ఉన్న బానిసలను వేరే యజమానుల దగ్గరకు డబ్బు కోసం కిరాయికి పంపేవారు. టబ్‌మన్ అలా ఎనిమిదేళ్ల వయసులో కిరాయికి వెళ్లి ఒక్కర్తే అనుభవించిన వేదన ఆమెకు ఆ వయసులోనే బానిస వ్యవస్థ పట్ల ఏహ్యతను కలిగించింది. అమ్మకానికి సిద్ధం హారియట్ ఇప్పుడు వయసుకు వచ్చింది. పెళ్లి కూడా చేసుకుంది. ఆమె భర్త స్వతంత్రం పొందిన నల్లవాడు. ఈమె ఇంకా బానిసే. ఈమెకు రేపు పిల్లలు పుడితే ఆ పిల్లలు కూడా బానిసలే అవుతారు. స్వేచ్ఛ పొందే వీలు లేదు. ఇదంతా ఆలోచించే కొద్దీ ఆమెకు గుక్క తిప్పుకోకుండా ఉంటుంది. యజమాని కొడుకు ఇది గమనిస్తాడు. ఈమె ఉంటే ప్రమాదం అని తలచి అమ్మకానికి ప్రకటన విడుదల చేస్తాడు. అమ్మకం అంటే ఇక భర్తను వదిలి తల్లిదండ్రులను తోబుట్టువులను వదిలి ఎక్కడకు వెళ్లాలో. ఎవరు కొనుక్కుంటే వారి దగ్గరకు. ‘నేను బతికితే స్వేచ్ఛగా బతుకుతాను. లేదా చస్తాను. నేను ప్రాణాలతో ఉండగా నన్నెవరూ బానిసగా ఉంచలేరు’ అని ప్రకటిస్తుంది హారియట్. కెనడాను అప్పట్లో ‘ప్రామిస్డ్ ల్యాండ్’ అనేవారు. అంటే బానిసల స్వేచ్ఛా ప్రాంతం. అక్కడి వరకూ పారిపోవాలి. లేదా ఉత్తరాన ఉన్న ఫిలడల్ఫియాకు పారిపోగలిగినా చాలు. అది ఫ్రీ స్టేట్. హారియట్ ఫిలడల్ఫియాకు పారిపోతుంది. ఒక్కత్తే. అర్ధరాత్రి. ‘ఆకాశంలో నార్త్స్టార్ని చూడు. దానిని చూస్తూ దానివైపు పరిగెత్తు’ అని చెబుతాడు చర్చి ఫాదర్. చీకటి బతుకులో మినుకు మినుకుమనే నక్షత్రమే పెద్ద ఆశ. అండర్‌గ్రౌండ్ రైల్రోడ్ స్లేవ్ స్టేట్స్ నుంచి ఫ్రీ స్టేట్స్కు పారిపోవడానికి ఒక రహస్య వ్యవస్థ ఉండేది. దీనిని ‘అండర్‌గ్రౌండ్ రైల్రోడ్’ అనేవారు. అంటే గమ్యం చేరడానికి అవసరమైన అడ్డదార్లు, దారి మధ్యలో రహస్య షెల్టర్లు, ఆశ్రయం ఇచ్చే వ్యక్తులు వీరితో నిండిన వ్యవస్థ అన్నమాట. ఇందులో నల్లవాళ్లు ఉండేవారు, బానిసల పట్ల సానుభూతి ఉన్న తెల్లవారూ ఉండేవారు. ఆ వ్యవస్థను సమర్థంగా ఉపయోగించుకున్న ఏకైక బానిస నిర్మూలనకర్త హారియట్. ఫిలడల్ఫియాకు చేరుకున్న తర్వాత ఆమె తన జీవితం, స్వార్థం చూసుకోలేదు. దక్షిణాది రాష్ట్రాలలో ఉన్న బానిసల విముక్తి కోసం అలసట లేనట్టుగా పని చేసింది. తన జీవితకాలంలో 13 సార్లు ఉత్తరాది నుంచి దక్షిణాదికి రహస్య ప్రయాణం చేసి 70 మంది బానిసలను అర్ధరాత్రి ప్రయాణాలతో విముక్తి కలిగించింది. ‘నేను ఒక్కసారి కూడా దారి తప్పలేదు. ఒక్క బానిస ప్రాణం కూడా పోనివ్వలేదు’ అని గర్వంగా చెప్పుకుందామె. జనం క్రమంగా ఆమెను ‘మోసెస్’ అని పిలవడం మొదలెట్టారు. నాడు ప్రజలను విముక్తం చేయడానికి వచ్చిన ప్రవక్త మోసెస్. నేడు నల్లవారిని విముక్తికి వచ్చిన ప్రవక్త హారియట్. సివిల్ వార్ బానిసల వ్యవస్థ ఉండాలని దక్షిణాది రాష్ట్రాలు, నిర్మూలించాలని ఉత్తరాది రాష్ట్రాలు సివిల్ వార్ (1861–65)కు దిగినప్పుడు అదే అదనుగా హారియట్ ఒక గెరిల్లా సైన్యమే తయారు చేసింది. 150 మంది నల్లవారితో ఆమె దళం ఉండేది. హారియట్ స్వయంగా తుపాకీ పట్టి ఈ సేనను నడిపించేది. ఆమె తన దళంతో దక్షణది రాష్ట్రాలపై చేసిన ఒక పెద్ద దాడిలో 750 మంది బానిసలు ఒకే సమయంలో స్వేచ్ఛను పొందారు. ఇది ఒక వీరోచిత గాథ. ఇంతా చేస్తున్నది ఒక ఆజానుబాహురాలు కాదు. కేవలం ఐదు అడుగుల ఎత్తు ఉండే పిట్టంత మనిషి. కాని ఆమె గుండె ధైర్యం ఒక ప్రామిస్డ్ ల్యాండ్ అంత. చివరి రోజులు హారియట్ తన చివరి రోజులు న్యూయార్క్‌లో గడిపింది. తన 91వ ఏట అయినవారందరి సమక్షంలో ప్రశాంతంగా వీడ్కోలు తీసుకుంది. అమెరికా ఆమె గౌరవార్థం స్మారక స్థూపాలు, చిహ్నాలు ఏర్పాటు చేసింది. ఆమె నివసించిన స్థలాలు, ఆమె పారిపోయిన అడవి దారి దర్శనీయ స్థలాలుగా మారాయి. ఆమె ముఖచిత్రంతో 20 డాలర్ల నోటు విడుదల అయ్యింది. డాక్యుమెంటరీలు, సినిమాలు అనేకం వచ్చాయి. కాని ఆమె గురించి నిజంగా బయట వారికి తెలియడం తక్కువ. ఈ బానిసల ముక్తిదాయిని గురించి తీసిన సినిమా ‘హారియట్’లో ఆమె పాత్రను గొప్ప నటి సింథియా ఇరివో పోషించింది. నటి కశి లెమొన్స్ దర్శకత్వం వహించింది. నల్లవారి గురించి చర్చ జరుగుతున్న ఈ సమయంలో ఈ సినిమా వీక్షణం ఒక చరిత్ర దర్శనమే. – సాక్షి ఫ్యామిలీ -
వీడియో గేమ్స్... కొకైన్, జూదం లాంటివే!
పారిస్: కొకైన్, జూదం తరహాలో ప్రజలు వీడియో గేమ్స్‌కు బానిసలుగా మారే ప్రమాదముందని ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. అంతర్జాతీయ వ్యాధుల వర్గీకరణ (ఐసీడీ) 11వ సంచికను ఆ సంస్థ సోమవారం విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణుల్ని సంప్రదించిన తర్వాత ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ‘వీడియో గేమ్ డిజార్డర్’ను ఈ జాబితాలో చేర్చినట్లు డబ్ల్యూహెచ్‌వో మానసిక ఆరోగ్య విభాగం డైరెక్టర్ శేఖర్ సక్సేనా తెలిపారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఈ జాబితాలో భారీ మార్పులు చేర్పులు చేయడం ఇదే తొలిసారన్నారు. వీడియో గేమ్ వ్యసనాన్ని ఓ వ్యాధిగా గుర్తించాలని గత జనవరిలోనే నిర్ణయించినట్లు వెల్లడించారు. వీడియోగేమ్‌ను వదల్లేకపోవడం, తిండీతిప్పలు గుర్తురాకపోవడం, నిద్రపోకపోవడం దీని ముఖ్య లక్షణాలని పేర్కొన్నారు. -
మనమంతా ‘సోషల్’ బానిసలం..
టొరంటో: ‘రోజంతా మా అబ్బాయి స్మార్ట్‌ఫోన్‌కు అతుక్కుపోతున్నాడు. ఇంట్లో ఎవరితోనూ కలవడు. స్మార్ట్‌ఫోన్ చూస్తూ.. భోజనం, ఆటలు, చదువు ఇలా అన్ని మర్చిపోతున్నాడు’అంటూ తల్లిదండ్రులు తెగ కంగారు పడిపోతుంటారు. దీంతో స్మార్ట్‌ఫోన్ వాడద్దంటూ పిల్లలపై ఆంక్షలు విధిస్తుంటారు. అలాగే పెద్దలు కూడా స్మార్ట్‌ఫోన్ వాడుతుంటే స్మార్ట్‌ఫోన్ బానిసలం అని వ్యాఖ్యానిస్తుంటాం. వాస్తవానికి పిల్లలతోపాటు పెద్దలెవరూ కూడా స్మార్ట్‌ఫోన్‌కు బానిసలు కారట.. కేవలం మనమంతా సామాజిక మాధ్యమాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న బలమైన కోరిక వల్లే స్మార్ట్‌ఫోన్ వాడుతుంటామని తాజా అధ్యయనంలో వెల్లడైంది. అంటే మనమంతా స్మార్ట్‌ఫోన్‌కు కాకుండా.. సోషల్ మీడియాకు మాత్రమే బానిసలం అని అంటున్నారు. ఇలాంటి వారంతా కేవలం హైపర్ సోషల్ తప్ప యాంటీ సోషల్ కాదని అధ్యయనం పేర్కొంది. సోషల్ మీడియాలో వేరే వాళ్ల గురించి తెలుసుకోవడానికి.. అలాగే తాను చేసేది అందరూ చూడాలనే కోరిక వల్లే సామాజిక మాధ్యమాల్లో అధిక సమయం గడుపుతున్నామని కెనడాలోని మెక్ గిల్ యూనివర్సిటీకి చెందిన శామ్యూల్ తెలిపారు. ఇలా ఒకరి గురించి తెలుసుకోవాలనుకోవడం... మన గురించి ఇతరులు తెలుసుకోవాలనుకోవడం ఇప్పుడు కొత్తదేం కాదని.. పూర్వీకుల నుంచే వస్తోందని వివరించారు. నోటిఫికేషన్స్‌ను ఆఫ్ చేయడం, ఫోన్ చూడాల్సిన సందర్భాలను ముందుగానే ఎంచుకోవడం వంటివి చేయడం వల్ల స్మార్ట్‌ఫోన్‌కు కొంచెం దూరంగా ఉండొచ్చని వెల్లడించారు. -
ఏం మనుషులో..?
-
అంగట్లో అమ్మేస్తున్నారు!
మనుషుల వేలం... మీరు చదివింది నిజమే. మధ్యయుగాలను గుర్తుకుతెస్తూ... 2017లో లిబియా రాజధాని ట్రిపోలీలో సాగుతున్న అమానవీయ వేలం. బానిసలుగా మనుషులను అమ్ముతున్న దారుణం. వేలాది మంది ఆఫ్రికన్లను అమ్ముతూ అక్రమ రవాణా ముఠాలు సాగిస్తున్న దందా. ఈ ఉదంతాలను ప్రముఖ అంతర్జాతీయ వార్తాసంస్థ సీఎన్ఎన్ రహస్యంగా చిత్రీకరించి ప్రపంచం ముందుంచింది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ ఎవరు వీరు... పశ్చిమాఫ్రికా, మధ్య ఆఫ్రికా దేశాల్లో పేదరికం, అంతర్గత కలహాలు, అస్థిరత కారణంగా... బంగారు భవిష్యత్తును వెతుక్కుంటూ యూరప్‌కు పయనమవుతుంటారు శరణార్థులు. బంగ్లాదేశీలు కూడా ఎక్కువే ఉంటారు. వారు రోడ్డు మార్గం ద్వారా దేశాల సరిహద్దులను అక్రమంగా దాటుతూ లిబియాకు చేరుకుంటారు. లిబియా నుంచి ఇటలీ, ఇతర యూరప్ దేశాలకు చేరుకొని కొత్త జీవితం గడపాలనేది వారి ఆశ. దీనికోసం మనుషులను అక్రమంగా రవాణా చేసే ముఠాలకు భారీ మొత్తంలో సొమ్ము చెల్లిస్తుంటారు. లిబియా చేరుకున్నాక చిన్నచిన్న పడవల్లో కిక్కిరిసి ప్రయాణిస్తూ ప్రాణాలకు తెగించి మధ్యధరా సముద్రం దాటే ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో వేల మంది సముద్రంలో మునిగి చనిపోతుంటారు. స్వచ్ఛంద సంస్థలు నడిపే బోట్లు కొందరిని కాపాడుతున్నాయి. అక్రమ వలసదారులు, శరణార్థుల తాకిడి ఎక్కువై... యూరప్ దేశాలు తమ తీర ప్రాంతాల్లో గస్తీ పెంచాయి. దీంతో అదృష్టంకొద్దీ యూరప్ తీరానికి చేరినా... అక్కడ పట్టుబడి తిరిగి స్వదేశానికి వస్తుంటారు. ఎక్కడెక్కడ... మధ్యధరా తీరానికి సమీపంలో ఉన్న జువారా, సబ్రాత్, కాసిల్‌వెర్డే, గర్యాన్, అల్‌రుజ్బాన్, అల్‌జింటాన్, కబావ్, గడామిస్... తదితర పట్టణాల్లో ఈ ముఠాలు ప్రైవేటు నిర్బంధ కేంద్రాలను నిర్వహిస్తున్నాయి. యూరప్‌కు చేర్చుతామని ఒప్పందం కుదుర్చుకొని తెచ్చిన వారిని నిర్బంధిస్తున్నాయి. ఇచ్చిన మొత్తం ప్రయాణానికి సరిపోవడం లేదని, మధ్యవర్తులు వారి తాలూకు మొత్తం డబ్బును తమకు చెల్లించలేదని... సాకులు చూపుతారు. గాలి, వెలుతురు సరిగాలేని గోదాముల్లో ఆఫ్రికన్లను కుక్కుతారు. వాటిల్లో కనీస సదుపాయాలుండవు. సరిగా తిండి కూడా పెట్టరు. ఎదురుతిరిగితే చిత్రహింసలే. ఇలా నిర్బంధించిన వారి ఇళ్లకు ఫోన్లు చేస్తూ... తాము చెప్పినంత డబ్బు చెల్లిస్తే మీ వాడిని విడిచిపెడతామని బేరం పెడతారు. అలా డబ్బు గుంజుతారు. అప్పటికే ఉన్నదంతా ఊడ్చి వాళ్ల చేతిలో పెట్టిన నిర్భాగ్యులు ఏమీ చెల్లించకపోతే... వారిని బానిసల వేలం మార్కెట్లలో అమ్మేస్తారు. పులులను బోన్లలో పెట్టినట్లు... వారిని ప్రదర్శనకు పెట్టి వేలం వేస్తారు. నియమిత కాలానికి వేలం వేసి... ఆ సమయం ముగిశాక మళ్లీ వెనక్కితెస్తారు. వేలంలో వచ్చిన దానితో బాకీ తీరలేదని చెప్పి మళ్లీ వేలానికి పెడతారు. ఎంత మంది... ప్రస్తుతం లిబియాలో 7 లక్షల నుంచి 10 లక్షల మంది శరణార్థులు ఉంటారని ఐక్యరాజ్యసమితి అంచనా. మొత్తం 25,000 మంది లిబియా ప్రభుత్వం నిర్వహిస్తున్న శరణార్థి కేంద్రాల్లో ఉన్నారు. వారిని స్వదేశాలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నా... వారి మాతృదేశాలు సహకరించడం లేదని లిబియా ఆరోపణ. లిబియాలోని దుర్భర పరిస్థితులను చూశాక... స్వదేశానికి తిరిగి వెళ్లడానికి 8,800(ఈ ఏడాది ఇప్పటివరకు) మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ సంస్థ తెలిపింది. సీఎన్ఎన్ చిత్రీకరించి ప్రసారం చేసిన వీడియోతో ప్రపంచ దేశాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో బానిసల వేలంపై దర్యాప్తు జరుపుతామని లిబియా ప్రభుత్వం ప్రకటించింది. మానవత్వానికే మచ్చ శరణార్థులకు బానిసలుగా అమ్ముతున్నారనే విషయం భీతిగొల్పుతోంది. ఇది మానవత్వానికే మచ్చ. అంతర్జాతీయ సమాజం దీన్ని అడ్డుకోవాలి. చట్టపరమైన వలసలను ప్రోత్సహించాలి. – అంటోనియో గుటెరస్, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ నన్ను అమ్మారు... నైజీరియాలో పెచ్చరిల్చిన అవినీతి, పేదరికంతో యూరప్‌కు వలస వెళ్లాలని ఇంటిని వీడాను. లక్షా 80 వేల రూపాయలు స్మగ్లర్ల చేతుల్లో పోశాను. లిబియాలో నరకం చూపించారు. నన్ను పలుమార్లు వేలం వేశారు. మా ఇంటికి ఫోన్ చేసి డబ్బు చెల్లించాల న్నారు. చివరకు నన్ను వదిలేశారు. – 21 ఏళ్ల విక్టరీ, నైజీరియన్ 900 దినార్లు... నా పాట 1,000 1,100 మరొక బిడ్డర్ 1,200 లిబియా దినార్లు... ఓకే...డీల్ డన్ ఇది ఏ పాత కారో, ఫర్నిచరో, కొద్ది గజాల స్థలానికో జరిగిన వేలంపాట కాదు... ఇద్దరు నల్లజాతీయులను బానిసలుగా కొనుక్కోవడానికి వారి కొత్త యజమాని 1,200 లిబియా దినార్లు (రూ.52 వేలు) చెల్లించేందుకు పాడిన పాట ఇది. ‘కందకాలు తవ్వడానికి మనిషి కావాలా? ఇదిగో బలిష్టుడు, ఆజానుబావుడు... బాగా పనికొస్తాడు.’వేలం వేస్తున్న వ్యక్తి తాను అమ్ముతున్న ‘సరుకు’ గురించి చేస్తున్న వర్ణనిది. లిబియానే ఎందుకు? 2011లో లిబియాలో ప్రజా తిరుగుబాటుతో నియంత గడాఫీ హతమయ్యాక ఆ దేశంలో అస్థిరత నెలకొంది. ఐక్యరాజ్యసమితి అండతో సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతున్నా... దేశమంతటా దీని పాలన లేదు. దీంతో మనుషులను అక్రమ రవాణా చేసే ముఠాలు లిబియాను కేంద్రంగా చేసుకొని దందా సాగిస్తున్నాయి. యూరో కలలుగంటున్న పేద ఆఫ్రికన్ల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. -
ఇక్కడ మనుషులు అమ్మబడును
-
బానిసత్వంలో భారత్ ది నాలుగో స్థానం!
శాస్త్ర సాంకేతిక విజ్ఞానంతో చంద్రలోకానికి చేరినా.. స్వాతంత్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా.. బానిస బతుకుల్లో మాత్రం వెలుగులు కనిపించడం లేదు. ఎన్ని ప్రతిపాదనలు చేసినా, ప్రత్యేక చట్టాలు తెచ్చినా కార్మికుల శ్రమ దోపిడీ ఆగడం లేదు. నేటికీ కడుపు కాలే కష్టజీవులు బానిసత్వం మాటున దుర్భర జీవితాలను గడుపుతున్నారనడానికి తాజా సర్వేలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. తక్కువ వేతనానికి కార్మికులను నియమించుకొని, వారి శ్రమను దోపిడీ చేయడంతోపాటు, బానిసలుగా చూడటంలో ప్రపంచంలోనే భారత్ నాలుగో స్థానంలో ఉంది. థర్డ్ గ్లోబల్ స్లేవరీ ఇండెక్స్ పేరిట నిర్వహించిన తాజా సర్వే ఈ నిజాలను వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 4.6 కోట్లమంది ప్రజలు ఇంకా బానిస జీవనాన్ని కొనసాగిస్తున్నట్లు సర్వే తేల్చి చెప్పింది. కేవలం భారత దేశంలోనే 1,83,54,700 మంది ఇంకా బానిసలుగా ఉండటమే కాక, వారి పిల్లలను సైతం సెక్స్ వర్కర్లుగా మార్చి వారికి దుర్భర జీవితాన్ని అంటగట్టడమో, లేదంటే కూలీలుగా ఉపయోగించుకోవడమో చేస్తున్నారని సర్వే వెల్లడించింది. హ్యూమన్ రైట్స్ గ్రూప్ వాక్ ఫ్రీ ఫౌండేషన్ సంస్థ నిర్వహించిన సర్వేల్లో 2016 గ్లోబల్ స్లేవరీ ఇండెక్స్ ప్రకారం బానిసత్వాన్ని అమలు చేయడంలో భారత్ నాలుగో స్థానంలో నిలిచినట్లు తెలిపింది. 2014 లో ప్రపంచ వ్యాప్తంగా మూడు కోట్లకు పైగా ఉన్న సంఖ్య... రెండేళ్ళలో 2016 నాటికి నాలుగు కోట్లకు పైగా చేరి సుమారు 30 శాతం బానిసత్వం పెరిగిందని తెలిపింది. భారత్ తో పాటు, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఉజ్బెకిస్తాన్ దేశాల్లో కూడ శ్రమ దోపిడీ భారీగానే జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. మొత్తం 167 దేశాల్లో చేపట్టిన సర్వేలో భారత్ లోనే అత్యధికంగా బానిస బతుకులు గడుపుతున్నవారు ఉన్నట్లుగా తేటతెల్లం చేసింది. ఆధునిక కాలంలో బానిసత్వ విధానమే మారిపోయిందని, అక్రమ పరిశ్రమల్లో అత్యధికంగా బానిసత్వం కనిపిస్తోందని, అత్యంత లాభదాయక నేర పరిశ్రమల్లో మూడో స్థానంలో యునైటెడ్ నేషన్స్ నుంచి అక్రమంగా రవాణా అవుతున్న ఆయుధ, ఔషధ పరిశ్రమలు నిలుస్తున్నట్లు తాజా సర్వేలు అభిప్రాయం వ్యక్తం చేశాయి. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ ఓ) 21 మిలియన్లమంది ప్రజలు నిర్బంధిత కార్మికులుగా, ఇతర ఆధునిక బానిసత్వ చట్రంలోనూ చిక్కుకున్నారని అంచనా వేస్తోంది. -
'నా కథే బాధగా ఉంటే.. నాలాగా ఇంకెందరో..'
లండన్: ఒక్కసారి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల చేతిలోపడితే వారు చూపించే నరకం అంతా ఇంతా కాదని యాజిది వర్గానికి చెందిన నదియా మురాద్ (21) అనే యువతి తెలిపింది. కొన్ని నెలల కిందట వారి చెరలో ఇరుక్కుని ఏదో ఒకలా బయటపడిన ఆమె ప్రస్తుతం ఐసిస్‌కు వ్యతిరేకంగా వారి బారిన పడిన మహిళలందరినీ ఏకం చేస్తోంది. లండన్‌లోని ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ హౌస్‌లో ఆమె మాట్లాడుతూ తనకు జరిగిన అన్యాయాన్ని, ఉగ్రవాదుల చెరలో పలు కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించింది. 'నేను మాట్లాడేది నా ఒక్కదాని తరుఫున కాదు.. ఇరాక్ యుద్ధ క్షేత్రంలో ఇస్లామిక్ స్టేట్ చేతుల్లో ఇరుక్కుపోయిన అన్ని కుటుంబాలు, మహిళలు, చిన్నారుల తరుపున మాట్లాడుతున్నాను. యాజిదీలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రతి ఒక్కరికి తెలిసేలా నేను ప్రచారం ప్రారంభించి రెండు నెలలు పూర్తయింది. 5,800మంది యాజిదీ మహిళలను, చిన్నారులను ఉగ్రవాదులు ఎత్తుకెళ్లారు. వారిలో ఎంతోమందిని చంపేశారు. చాలాకుటుంబాలకు నిలువ నీడ లేకుండా చేశారు. మా యాజిదీల్లో ఉగ్రవాదుల పురుషులను హత్య చేస్తారు. స్త్రీలను ఎత్తుకెళతారు. ఎత్తుకెళ్లిన తర్వాత హత్య చేయొచ్చు అత్యాచారం చేయవచ్చు.. వారి ఇష్టం వచ్చినట్లు ఏమైనా చేయొచ్చు. ఇస్లాం పేరుమీద వారు ఎప్పుడు ఏం చేస్తారో ఊహించలేం. నా కుటుంబంలోనే ఆరుగురుని హత్య చేశారు. నా సోదరులను చంపేశారు. నా సోదరులను చంపుతుంటే మా అమ్మ చూసిందని ఆమెను చంపేశారు. నన్ను మోసుల్ కు ఎత్తుకెళ్లి అత్యాచారం చేశారు. ఆ సమయంలో నేను నా తల్లిని, సోదరులను మరిచిపోయాను. ఎందుకంటే ఓ మహిళపట్ల ఉగ్రవాదులు ఆ సమయంలో ప్రవర్తించే తీరు చావుకంటే భయంకరంగా ఉంటుంది. కొందరికీ నా ఈ కథే బాధకరంగా ఉండొచ్చు. కానీ నాకంటే కూడా బాధకరమైన కథలు ఉన్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా ఇస్లామిక్ ఉగ్రవాదుల చేతుల్లో 3,400మంది మహిళలు ఉన్నారు. ఏడాదిన్నరగా మాపై ఈ హత్యాకాండ ఆగడం లేదు' అని ఆమె వాపోయింది. ప్రపంచ దేశాలు తమకు సహాయం చేయాలని కోరింది. -
సెక్స్ బానిసల వినియోగంపై ఐఎస్ఐఎస్ ఫత్వా!
-
బహుముఖీన బానిసత్వం
వివరం కన్నీటికి ఇంకిపోయే లక్షణమే లేకుంటే ఈ ప్రకృతిలో మరో సాగరం పొంగుతూ ఉండేది. ఈ అనంత చరిత్రలో బానిసలు కార్చిన కన్నీటిరాశి సాగరమంత పరిమాణంలోనే ఉంటుంది. ఆ వ్యవస్థది అంత లోతైనవిషాద గాథ. కానీ, శబ్దం చేయకుండా ఆ కన్నీటి సంద్రం చరిత్రనంతటినీ తడుపుతూనే ఉంది. పిరమిడ్ల నిర్మాణానికి రాళ్లెత్తిన వాళ్లూ; అమెరికా, రష్యాల ఆర్థిక వ్యవస్థలకు పునాదులు తవ్విన వాళ్లూ బానిసలే. పురాతన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నిర్మాతలు వారే. అయినా ఈ భూప్రపంచం మీద ఏ జాతి, ఏ దేశం, ఏ కాలం, ఏ మతం బానిస వ్యవస్థ మౌన రోదనకు కరగలేదు? ఆధునిక నాగరికతకు ఆకృతినివ్వడానికి బానిసలు కురిపించిన ఘర్మజలానికి ఎవరూ ఖరీదు కట్టలేదు. ఒక మనిషిని బానిసగా పని చేయించుకోవడం కంటె, స్వేచ్ఛాజీవిగా విడిచి పని చేయించుకుంటే ఎక్కువ లాభమని మానవతావాదులు చెప్పినా ప్రపంచం వినలేదు. మెడనీ, మణికట్లనీ, పాదాలనీ కలిపి బంధించే మొరటు సంకె ళ్ల కఠోర శబ్దం ఇప్పుడు వినిపించకపోవడం ఆధునిక ప్రపంచం చేసుకున్న అదృష్టం. కానీ మనుషుల అక్రమ రవాణా, వ్యభిచారానికి అమ్ముడుపోతున్న అబల దేహం, సంఘ వ్యతిరేక శక్తుల హుంకారాలతో తుపాకీ పట్టిన బాల్యం బానిస వ్యవస్థ కొనసాగింపే. డిసెంబరు 2 అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినం. ఆ సందర్భంగా క్రీ.పూ.1వ శతాబ్దం నుండి క్రీ.శ.21వ శతాబ్దం వరకు ఉనికిలో ఉన్న బహుముఖీన బానిసత్వంపై ఈవారం మన ‘వివరం’. బానిసత్వం, బానిసలు అనే పేర్లు వినగానే అదేదో వేల ఏళ్ల నాటిదని ప్రపంచం భావించవచ్చు. కానీ అది శుద్ధ అబద్ధం. వాస్తవానికి ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ బానిసత్వాన్ని రద్దు చేశాయి. కానీ ఎక్కడ చూసినా ఆ వ్యవస్థ జాడ కనిపిస్తోంది. ఈ ఆధునిక ప్రపంచంలో కాళ్లకూ చేతులకూ గొలుసులతో, అర్ధనగ్నంగా బానిసలు కానరారు. కానీ బానిస వ్యవస్థ ఒక వాస్తవం. గ్లోబల్ సర్వే ఇండెక్స్ అంచనా ప్రకారం ప్రపంచంలో ఇవాళ మూడు కోట్ల అరవై లక్షల మంది బానిసలుగా బతుకుతున్నారు. బలవంతపు చాకిరి, రుణం చెల్లించలేక బానిసలుగా బతకడం, అక్రమ రవాణాతో స్త్రీ, పురుషులు బానిసలుగా మారిపోవడం, బలవంతపు పెళ్లిళ్లు ఇవన్నీ బానిసత్వం పరిధిలోనివేనని అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి. బానిసత్వం గురించి కొద్దికాలం క్రితం బీబీసీ చేసిన వ్యాఖ్య మరీ ఆందోళన కలిగిస్తుంది. 16వ శతాబ్దంలో ఆఫ్రికా నుంచి తెచ్చిన నల్ల బానిసలతో జరిగిన వ్యాపారం చరిత్రలోనే అతి పెద్దది. అప్పుడు విక్రయించిన బానిసలు కోటీ 20 లక్షలు. కానీ ఆ సంఖ్య ఇప్పుడు రెట్టింపు పైనే ఉందని (రెండు కోట్ల 70 లక్షలు) అని బీబీసీ వెల్లడించింది. ఈ వ్యవస్థను ధ్వంసం చేయడానికి ఇప్పుడు తీవ్ర కృషి ప్రారంభించినా మరో 30 ఏళ్లు పడుతుందని ఆ అంతర్జాతీయ సమాచార వ్యవస్థ అభిప్రాయపడింది. హమ్మురాబి స్మృతి (క్రీ.పూ.1754), రుగ్వేదం, మను స్మృతి, నారద స్మృతి, ఆర్థశాస్త్రం, బైబిల్లలో బానిస వ్యవస్థ స్వరూప స్వభావాలు కనిపిస్తాయి. అయితే భారతదేశంలో బానిస వ్యవస్థకీ, ప్రపంచంలో మిగిలిన చోట్ల కనిపించే బానిసత్వానికీ ఎంతో తేడా ఉంది. ఏమైనా క్రీస్తుపూర్వమే ఈ భూమ్మీద బానిస వ్యవస్థ ఆవిర్భవించింది. ఆ ఘోర వ్యవస్థను నిర్మూలించడానికి ప్రయత్నాలు కూడా జరిగాయి. నిగళాలు తెంపి పారేయడానికి బానిసల తిరుగుబాట్లు జరిగాయి. సంస్కరణోద్యమాలు జరిగాయి. అంతర్జాతీయ సదస్సులు జరిగాయి. కానీ 2014 సంవత్సరంలో కూడా ఆ వ్యవస్థ జాడలు సుస్పష్టంగా కనిపించడమే అతి పెద్ద విషాదం. ఆధునికత , శాస్త్ర సాంకేతిక ప్రగతి వంటి భావనలను హేళన చేసే విషయం కూడా. ఈ మధ్య కాలంలో ఇస్లామిక్ స్టేట్ పేరుతో ఉగ్రవాదం నెరపుతున్న ముఠాలు... యాజ్డి, క్రిస్టియన్ తెగలకు చెందిన స్త్రీలను అపహరించి, బానిసలుగా అంతర్జాతీయ విపణిలో విక్రయించారు. ఇది ఐక్యరాజ్య సమితి వెల్లడించిన వాస్తవం. ఐదు నుంచి ఏడువేల మంది స్త్రీలను ఇలా బానిసలుగా విక్రయించారని సమితి ప్రకటించింది. ఇందులో బాలలు కూడా ఉన్నారు. మెగస్తనీస్ లేదని చెప్పినా... భారతదేశంలో బానిసలు లేరు అని ప్రకటించాడు గ్రీక్ యాత్రికుడు మెగస్తనీస్. ‘ఇండికా’ ఇతడి గ్రంథమే. క్రీస్తుపూర్వం 350-290 ప్రాంతంలో పాటలీపుత్రం వచ్చిన మెగస్తనీస్కు ఇక్కడి ‘బానిస’లను, ఆ వ్యవస్థ రూపురేఖలను చూశాక అలాంటి అభిప్రాయం కలగడంలో ఆశ్చర్యం లేదు. అయితే పునాతన భారతంలో బానిసలు లేకపోలేదు. కానీ గ్రీస్, రోమ్ వంటి ప్రదే శాలతో పోల్చినపుడు ఇక్కడ బానిస వ్యవస్థ లేదనే అనిపిస్తుంది. అలాగే మెగస్తనీస్ అభిప్రాయానికి పరిమితులు ఉన్నాయి. ఆయన పాటలీపుత్రం, మిగిలిన ఉత్తర భారతాన్ని చూసి ఈ విషయం నమోదు చేసి ఉండవచ్చు. అయినా బానిస వ్యవస్థ విషయంలో పురాతన భారతం కనికరంతోనే ఉంది. హరిశ్చంద్రుడు, చంద్రమతి, లోహితాస్యుడు బానిసలుగా అమ్ముడు పోయిన ఘట్టం మన పురాణాలలో కనిపిస్తుంది. దస్యులు లేదా దాస తెగ వారిని బానిసలుగానే రుగ్వేదం పేర్కొంటున్నది. జాతక కథలలోను ఈ వ్యవస్థ గురించి రేఖామాత్రంగా ప్రస్తావన కనిపిస్తుంది. యుద్ధఖైదీలను ప్రపంచం మొత్తం బానిసలుగానే చూసింది. భారత్ కూడా అందుకు మినహాయింపు కాదు. కానీ ఇక్కడ బానిసలకు కొన్ని హక్కులు ఇచ్చారు. బానిస సాక్ష్యం చెల్లదు! బానిస యజమాని ఆజ్ఞలనే శిరసావహించాలని నారద స్మృతి చెబుతోంది. మనుస్మృతి ప్రకారం బానిసలకు సొంత ఆస్తి ఉండకూడదు. బానిసల సాక్ష్యం చెల్లదు. ఈ కట్టుబాట్లతో పాటు కొన్ని హక్కులు కూడా దక్కాయి. బానిసతో యజమాని ఘర్షణ పడకూడదు. బానిస దండించవలసిన స్థాయిలో తప్పు చేస్తే వీపు మీద తప్ప కొట్టరాదు. తల మీద అసలే కొట్టకూడదు. ప్రాణం తీసే హక్కు యజమానికి లేదు. అన్నిటికీ మించి వృద్ధాప్యంలో బానిసను యజమాని వదిలి పెట్టకూడదు. కౌటిల్యుడి అర్థశాస్త్రం బానిసల పట్ల మరింత ఉదార వైఖరిని అవలంబించింది. బానిసల పిల్లలు కూడా యజమాని సొంతమే. కానీ అనివార్య పరిస్థితులలో తప్ప వారిని విక్రయించరాదు. మహిళా బానిసను సగౌరవంగా చూడాలి. మహిళ పట్ల అనుచితంగా వ్యవహరిస్తే ఆమెకు విముక్తి కల్పించడంతో పాటు, నష్ట పరిహారం కూడా ఇవ్వాలి. ఆమెకు పిల్లలు ఉంటే వాళ్లకి కూడా స్వేచ్ఛ ఇవ్వాలి. బానిసలు అసలు యజమాని దగ్గర పని లేనపుడు వేరే చోట్ల పని చేసి డబ్బు సంపాదించుకోవచ్చునని అర్థశాస్త్రం చెబుతోంది. సాధారణ యువతి ఒక బానిసను వివాహం చేసుకుంటే ఆమె స్వేచ్ఛను కోల్పోక తప్పదని కాత్యాయన స్మృతి శాసిస్తున్నది. ఇందులో చాలా విషయాలు అశోకుడి శాసనాలలో కనిపిస్తాయి. మౌర్యుల కాలంలో వీరిపట్ల కనిపించే ఔదార్యం గుప్తుల కాలానికి సడలిపోయినట్టు చరిత్రకారులు చెబుతారు. అయినా ఏ కాలంలోనూ ఇక్కడ బానిస విక్రయ విపణులు నెలకొనలేదు. నిజానికి పురాతన భారతంలో బానిసలు ఆర్థిక వ్యవస్థను నిర్మించిన వారు కాదు. వీరు ప్రధానంగా ఇంటి సేవకులు. లేదా వ్యక్తిగత సేవకులు. దీనితో వీరికి దాదాపు కుటుంబ సభ్యుని హోదా లభించేది. భారతదేశంలో వ్యవసాయం ఎక్కువగా శూద్రుల వల్లే జరిగింది తప్ప బానిసల వల్ల కాదు. కోటీ 50 లక్షల మంది! ఆధునిక భార తదేశంలోనూ బానిస వ్యవస్థ జాడలు కనిపిస్తాయి. ఈ దేశాన్ని బానిస రాజులే (1206-1290) పాలించారు. దాని పేరే బానిస వంశం. అందులో ప్రముఖలైన అల్త్‌మష్, బాల్బన్ బానిసలే. 1841 నాటికి భారతదేశంలో 80 నుంచి 90 లక్షల మంది బానిసలు ఉన్నారని హెన్రీ బార్ట్లే ఫ్రెరే రాశాడు. ఇతడు వైశ్రాయ్ కౌన్సిల్ సభ్యుడు. దక్షిణ భారతంలోని మలబార్ ప్రాంత ప్రజలలో 15 శాతం బానిసలేనని చెబుతారు. దేశంలో బానిస వ్యవస్థ రద్దు కోసం ఈస్టిండియా కంపెనీ పాలనలోనే 1843లో ఇండియన్ స్లేవరీ యాక్ట్‌ను అమలులోకి తెచ్చారు. ఇక్కడ బానిసలను పశువుల్లా చూడలేదన్న గత చరిత్ర గర్వకారణమే. కానీ 2013 కంటె 2014లో భారత్‌లో బానిసత్వం పెరిగిందన్న లెక్క అత్యంత అవమానకరం. ప్రస్తుతం భారత్‌లో కోటి నలభై లక్షల మంది బానిసలు ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి. చైనాలో 30 లక్షల మంది బానిసలు ఉన్నారని చెబుతున్నారు. ఈ లెక్కలు వాస్తవికమైతే ప్రపంచ బానిసలలో సగం మంది ఇక్కడే ఉన్నారు. ఆధునిక యుగం తన శైలికి తగ్గట్టు బానిస వ్యాపారానికి కూడా పరిశ్రమ హోదా వచ్చింది. కాబట్టి గణాంకాలలో దాని స్వరూపం చూడవచ్చు. ఐక్యరాజ్య సమితి లెక్క ప్రకారం బానిస వ్యాపారంలో మూడు కోట్ల మంది ఉండవచ్చు. దీని వ్యాపారం మొత్తం 35 బిలియన్ డాలర్లుగా లెక్క కట్టారు. పది దేశాలకు సంబంధించిన వారే 76 శాతం వరకు ఈ వ్యాపారంలో వస్తువయ్యారు. మనుషులను అక్రమంగా తరలించి బలవంతంగా పనులు చేయించడం, బాల కార్మిక వ్యవస్థ, బలవంతంగా పెళ్లి చేసుకుని తీసుకువెళ్లడం, వ్యభిచార కూపాలలోకి పంపడం, వెట్టి... వీటన్నిటినీ ఇప్పుడు బానిస వ్యవస్థలో భాగంగానే పరిగణిస్తున్నారు. సూడానీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వంటి ఉగ్రవాద సంస్థలు పిల్లలను తమ కార్యకలాపాలలో భాగం చేస్తున్నాయి. ఆయుధాలు పట్టిస్తున్నాయి. ఇది కూడా ఒక రకం బానిసత్వమే. ఇదే పని శ్రీలంకలో ఎల్టీటీఈ కూడా చేసింది. ఈ దారుణమైన వ్యవస్థను నిర్మూలించడానికి ప్రయత్నాలు జరగకపోలేదు. ఈ దిశగా అంతర్జాతీయ స్థాయిలో జరిగిన తొలియత్నం 1926 నాటి జెనీవా స్లేవరీ కన్వెన్షన్. నానాజాతి సమితి దీనిని నిర్వహించింది. తరువాత 1930, 1948, 1956లలో అంతర్జాతీయ సదస్సులు జరిగాయి. వీటితో మార్పు రాలేదని చెప్పడం లేదు. కానీ కొత్త రూపంలో మళ్లీ బానిసత్వం దర్శనమిస్తూనే ఉంది. ఇది ప్రపంచ మానవాళి చిత్తశుద్ధిని శంకించేదే. బానిసత్వ నిర్మూలన దినమంటూ పాటించడం దాని ఫలితమే. సాటి మనిషిని బానిసగా, పశువులా చూడ్డమనే కళంకం నుంచి ప్రపంచం బయటపడలేదని గుర్తు చేయడమే. - డా॥గోపరాజు నారాయణరావు ఒక దుఃఖసాగరం బాటకు ఇరువైపులా సిలువలు, పాదాలకీ, మణికట్లకీ మేకులు వేసి వాటికి దిగ్గొట్టిన మానవ దేహాలు, వాటి ఎడమ రొమ్ము నుంచి కింద నుంచి రాలుతున్న నెత్తురు చుక్కలు.. వాటి మీద వాలి పొడుచుకు తింటున్న రాబందులు... ఇది ‘స్పార్టకస్’ నవల (హోవార్డ్ ఫాస్ట్) తొలి ఘట్టం. చరిత్ర ప్రసిద్ధి గాంచిన రోమ్ బానిసల తిరుగుబాటు అనంతర దృశ్యమది. తమను అత్యంత దారుణంగా హింసిస్తున్న యజమానుల మీద తిరుగుబాటు చేసిన బానిసలకు అప్పటి రాచరికం పట్టించిన దుర్గతి అది. అమెరికా రచయిత మార్క్ ట్వేన్ ‘హకల్‌బెరీఫిన్’ నవలలో బానిసలను ఎంత హీనంగా, కఠినంగా చూశారో వివరించే దృశ్యాలను నమోదు చేశారు. ఇక ఎలెక్స్ హేలీ నవల ‘రూట్స్’ (తెలుగు అనువాదం ‘ఏడుతరాలు’) నల్ల కలువల నెత్తుటి చరిత్రను అద్భుతంగా చిత్రించింది. చరిత్రకారుడు హోవార్డ్ జోన్స్ రచనల ఆధారంగా స్టీవెన్ స్పీల్బెర్గ్ తీసిన ‘అమిస్టాడ్’ చిత్రం మరొక అద్భుతం. ఇవన్నీ మనిషిని మనిషి ఎంత అమానుషంగా వేధించాడో చెప్పేవే. క్యూబా తీరం నుంచి 58 మంది బానిసలతో అమెరికాకు వస్తున్న నౌక లా అమిస్టాడ్. అందులో జరిగిన చరిత్రాత్మక తిరుగుబాటు ఉదంతాన్ని స్పీల్బెర్గ్ తెరకెక్కించారు. శ్వేత జాతీయుల దురహంకారం, కాఠిన్యం ఈ రచనలన్నిటిలో సమంగా ప్రతిబింబిస్తాయి. పారిపోయేందుకు ప్రయత్నించిన బానిసల మర్మావయవాలను కూడా తొలగించేటంత కర్కశత్వం కనిపిస్తుంది. బానిసల దుస్థితి గురించి ఏ కొద్దిమందో నిరసన తెలియచేశారు. అయినా అది కొనసాగింది! ఇరవై ఒకటో శతాబ్దంలో 2008 వరకు కూడా!! సుమేరు, ఈజిప్ట్, చైనా, అక్కాడియన్ సామ్రాజ్యం, అస్సీరియా, భారత్, రోమ్ వంటి పురాతన నాగరికతలలో బానిసలు ఉన్నారు. ఏథెన్స్ నగరంలో క్రీ.పూ. 6, 5 శతాబ్దాలలో 80,000 మంది బానిసలు ఉన్నారని చరిత్ర చెబుతోంది. 1723 నాటికి రష్యాలో బానిస వ్యవస్థ ప్రబలంగా ఉంది. ఆధునిక యుగంలో ‘కానిస్టాంట్ నోపుల్’ అతి పెద్ద బానిస విక్రయ కేంద్రంగా పేర్గాంచింది. క్రీ.శ. ఐదో శతాబ్దానికి ఇది ప్రపంచంలోనే ఐదో పెద్ద బానిసల మార్కెట్ కూడా. 1833లోనే ఇంగ్లండ్ బానిస వ్యవస్థను రద్దు చేసింది. కానీ అమలు చేయలేకపోయింది. ఒట్టోమన్ సామ్రాజ్యంలో 1908 సంవత్సరంలో కూడా ఆడ బానిసలను నడి వీధిలో విక్రయించారు. ప్రపంచంలోనే ఒక ఆర్థిక శక్తిగా ఆవిర్భవించిన చైనాలో 2007లో 550 మంది బానిసలను ఇటుక బట్టీల నుంచి విముక్తం చేశారు. షాంగ్జీ, హెనాన్ అనే ప్రాంతంలో ఇది జరిగింది. మన మహా రచయిత్రి మహాశ్వేతాదేవి ‘శనిచరి’ కథ కూడా బానిసత్వానికి సంబంధించినదే. బెంగాల్లో ఒకప్పుడు ఇటుక బట్టీలలో పని పేరుతో తీసుకువచ్చిన బాలికలను వ్యభిచార గృహాలకు ఎలా విక్రయించేవారో, వారి బతుకులు ఎంత దీనంగా తెల్లవారేవో ఈ కథలో మహాశ్వేత ఆవిష్కరించారు. ప్రాచీన కాలంలో క్రూరమైన బానిస వ్యవస్థకు పేర్గాంచిన బ్రెజిల్లో 5000 మంది బానిసలకు 2008లో విముక్తి లభించింది. 2003 నుంచి అక్కడ సాగిన పెద్ద ఉద్యమం ఫలితంగా ఇది సాధ్యమైంది. బానిసలతో పని చేయించుకుంటున్న సంస్థల పేర్లను ఉద్యమకారులు ‘డర్టీలిస్ట్’ పేరుతో బహిర్గతం చేశారు. 300 కంపెనీల పేర్లు ఆ జాబితాలో చేరాయి. ఎట్టకేలకు 2008లో ప్రభుత్వం కదిలింది. ఆ సంవత్సరమే నేపాల్‌లో ‘హలియా’ పేరుతో కొనసాగుతున్న బానిసత్వాన్ని రద్దు చేసి 20,000 మందికి స్వేచ్ఛ కల్పించారు. న్యోబోటో.... అలా ఎందరో! ‘రూట్స్’ నవలలో హేలీ చిత్రించిన ఒక పాత్ర న్యోబోటో. ఒక తండాలోని కుటుంబాల వారి పిల్లలను సాకుతూ అందరికీ తలలో నాలుకలా ఉండే అవ్వ ఆమె. ఆమె బానిస. ఆ తండా కలసి కొనుక్కున్న బానిస. కానీ ఆమెను ఎవరూ అలా చూడరు. న్యోబోటో ఆమె అసలు పేరు కూడా కాదు. మరి ఆమె ఎవరు? ఒకసారి తన కథ చెబుతుంది. ఆఫ్రికాలోనే ఒకసారి తెల్లవాళ్లు (అమెరికన్లు) న్యోబోటో ఉండే తండా మీద దాడి చేసి అందరినీ తీసుకు వెళ్లారు. పిల్లలను, వృద్ధులను చంపారు. వారితో ప్రయోజనం లేదు కాబట్టి. వయసులో ఉన్నవారిని మాత్రం ఓడలకు ఎక్కించారు. అప్పుడే ఎందుకో మరి, న్యోబోటోను దారిలో ఈ తండాకు అమ్మేశారు- బస్తాడు జొన్నలకు. న్యోబోటో అంటే బస్తాడు జొన్నలు. ఆ పేరే ఆమెకు ఖాయమైంది. బానిస వ్యాపారంలోని క్రూరత్వానికి ఈ పాత్ర గొప్ప నిదర్శనం. ఒక కుటుంబంలో తల్లిని ఒకచోట, బిడ్డలను వేరేచోట, తండ్రిని వేరే చోట విక్రయించేవారు. బతికి ఉండగా మళ్లీ ఆ కుటుంబం కలుసుకోవడం దాదాపు అసాధ్యం. ఇలా ఎన్ని కుటుంబాలో... ఎందరు న్యోబోటోలో! -
కిరాతక వ్యాపారం
-
కాంట్రాక్టు ఉద్యోగులు మీకు పట్టరా?
-
లండన్‌లో ఘోరం.. 30 ఏళ్ల బానిసత్వానికి విముక్తి
లండన్ : ముగ్గురు మహిళలను అమానుషంగా చూస్తూ,బాహ్య ప్రపంచం అంటే ఏమిటో తెలియకుండా 30 ఏళ్లుగా బానిసలుగా కొనసాగిస్తున్న దంపతులను అరెస్ట్ చేసి ఆ మహిళలకు విముక్తి ప్రసాదించిన సంఘటన దక్షిణలండన్లోని లాంబెట్లో జరిగింది. భారత సంతతికి చెందిన మహిళ సారథ్యంలోని ఓ స్వచ్ఛందసంస్థ ఇచ్చిన సమాచారంతో స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు ఆ మహిళలను గత అక్టోబర్ 25న చెరనుంచి విడిపించారు. ఈ కిరాతక సంఘటనలో నిందితులైన దంపతులను ఈనెల 21న అరెస్ట్ చేసి అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు.వివరాలిలా ఉన్నాయి. మలేషియాకు చెందిన 69 ఏళ్ల మహిళ, ఐర్లాండ్‌కు చెందిన మరో57 ఏళ్ల మహిళ, బ్రిటన్‌కు చెందిన 30 ఏళ్ల ఇంకో యువతి ఆ దంపతుల చెరలో బానిసలుగా మగ్గుతున్నారు. అనితా ప్రేమ్ అనే ఫ్రీడమ్ చారిటీ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు బానిసబతుకునీడుస్తున్న ఐర్లాండ్ మహిళతో సాగించిన ఫోన్ సంభాషణ ఆధారంగా ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది.దీంతో ఆమె వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.కాగా 67 ఏళ్ల ఆ దంపతులు బ్రిటన్ జాతీయులు కాదని అనిత చెప్పారు. ఇంత సుదీర్ఘకాలం ఈ వ్యవహారం వెల్లడికాకుండా ఆ ఇంట్లో ఎలా ఉండగలిగారో విచారించాల్సి ఉందన్నారు.నిత్యం అత్యంత బిజీగా ఉండే ఈ నగరంలో పక్కింట్లో ఎవరుంటున్నారో మనకు తెలియదని ఆమె తెలిపారు. తమ అభీష్టానికి వ్యతిరేకంగా ఎవరింట్లోనైనా పనిమనుషులుగా మగ్గుతున్నారో తెలుసుకోవడమే తమ సంస్థ పని అని అనిత వివరించారు.ఐర్లాండ్ మహిళ తమతో రహస్యంగా ఫోన్లో మాట్లాడడంతో ఈ దారుణం వెలుగులోకి తీసుకురాగలిగానని ఆమె చెప్పారు.ఆ ఇంటిని పోలీసులు చుట్టుముట్టడంతో ముగ్గురు మహిళలు ధైర్యంగా బయటపడ్డారని ఆమె తెలిపారు.వారిని పునరావాస శిబిరానికి తరలించి కౌన్సెలింగ్ చేస్తున్నామని ఆమె చెప్పారు.బయటి ప్రపంచం అంటే ఏమిటో తెలియకుండా 30 ఏళ్లుగా వాళ్లు ఇంట్లోనే ఉండిపోయారని పోలీసులు తెలిపారు.బాధితుల నుంచి సమాచారం సేకరించడానికి కొంత సమయం పడుతుందని వారు చెప్పారు.