బహుముఖీన బానిసత్వం | Bahumukhina slavery | Sakshi
Sakshi News home page

బహుముఖీన బానిసత్వం

Published Sun, Nov 30 2014 1:00 AM | Last Updated on Tue, Oct 2 2018 4:09 PM

బహుముఖీన బానిసత్వం - Sakshi

బహుముఖీన బానిసత్వం

వివరం
 
కన్నీటికి ఇంకిపోయే లక్షణమే లేకుంటే ఈ ప్రకృతిలో మరో సాగరం పొంగుతూ ఉండేది. ఈ అనంత చరిత్రలో బానిసలు కార్చిన కన్నీటిరాశి సాగరమంత పరిమాణంలోనే ఉంటుంది. ఆ వ్యవస్థది అంత లోతైనవిషాద గాథ. కానీ, శబ్దం చేయకుండా ఆ కన్నీటి సంద్రం చరిత్రనంతటినీ తడుపుతూనే ఉంది. పిరమిడ్ల నిర్మాణానికి రాళ్లెత్తిన వాళ్లూ; అమెరికా, రష్యాల ఆర్థిక వ్యవస్థలకు పునాదులు తవ్విన వాళ్లూ బానిసలే. పురాతన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నిర్మాతలు వారే. అయినా ఈ భూప్రపంచం మీద ఏ జాతి, ఏ దేశం, ఏ కాలం, ఏ మతం బానిస వ్యవస్థ మౌన రోదనకు కరగలేదు? ఆధునిక నాగరికతకు ఆకృతినివ్వడానికి బానిసలు కురిపించిన ఘర్మజలానికి ఎవరూ ఖరీదు కట్టలేదు.

ఒక మనిషిని బానిసగా పని చేయించుకోవడం కంటె, స్వేచ్ఛాజీవిగా విడిచి పని చేయించుకుంటే ఎక్కువ లాభమని మానవతావాదులు చెప్పినా ప్రపంచం వినలేదు.  మెడనీ, మణికట్లనీ, పాదాలనీ కలిపి బంధించే మొరటు సంకె ళ్ల కఠోర శబ్దం ఇప్పుడు వినిపించకపోవడం ఆధునిక ప్రపంచం చేసుకున్న అదృష్టం. కానీ మనుషుల అక్రమ రవాణా, వ్యభిచారానికి అమ్ముడుపోతున్న అబల దేహం, సంఘ వ్యతిరేక శక్తుల హుంకారాలతో తుపాకీ పట్టిన బాల్యం బానిస వ్యవస్థ కొనసాగింపే. డిసెంబరు 2 అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినం. ఆ సందర్భంగా క్రీ.పూ.1వ శతాబ్దం నుండి క్రీ.శ.21వ శతాబ్దం వరకు ఉనికిలో ఉన్న బహుముఖీన బానిసత్వంపై ఈవారం మన ‘వివరం’.
 
 బానిసత్వం, బానిసలు అనే పేర్లు వినగానే అదేదో వేల ఏళ్ల నాటిదని ప్రపంచం భావించవచ్చు. కానీ అది శుద్ధ అబద్ధం. వాస్తవానికి ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ బానిసత్వాన్ని రద్దు చేశాయి. కానీ ఎక్కడ చూసినా ఆ వ్యవస్థ జాడ  కనిపిస్తోంది. ఈ ఆధునిక ప్రపంచంలో కాళ్లకూ చేతులకూ గొలుసులతో, అర్ధనగ్నంగా బానిసలు కానరారు. కానీ బానిస వ్యవస్థ ఒక వాస్తవం. గ్లోబల్ సర్వే ఇండెక్స్ అంచనా ప్రకారం ప్రపంచంలో ఇవాళ మూడు కోట్ల అరవై లక్షల మంది బానిసలుగా బతుకుతున్నారు.

బలవంతపు చాకిరి, రుణం చెల్లించలేక బానిసలుగా బతకడం, అక్రమ రవాణాతో స్త్రీ, పురుషులు బానిసలుగా మారిపోవడం, బలవంతపు పెళ్లిళ్లు ఇవన్నీ బానిసత్వం పరిధిలోనివేనని అంతర్జాతీయ సంస్థలు  చెబుతున్నాయి. బానిసత్వం గురించి కొద్దికాలం క్రితం బీబీసీ చేసిన వ్యాఖ్య మరీ ఆందోళన కలిగిస్తుంది. 16వ శతాబ్దంలో ఆఫ్రికా నుంచి తెచ్చిన నల్ల బానిసలతో జరిగిన వ్యాపారం చరిత్రలోనే అతి పెద్దది. అప్పుడు విక్రయించిన బానిసలు కోటీ 20 లక్షలు. కానీ ఆ సంఖ్య ఇప్పుడు రెట్టింపు పైనే ఉందని (రెండు కోట్ల 70 లక్షలు) అని బీబీసీ వెల్లడించింది. ఈ వ్యవస్థను ధ్వంసం చేయడానికి ఇప్పుడు తీవ్ర కృషి ప్రారంభించినా మరో 30 ఏళ్లు పడుతుందని ఆ అంతర్జాతీయ సమాచార వ్యవస్థ అభిప్రాయపడింది.
 
హమ్మురాబి స్మృతి (క్రీ.పూ.1754), రుగ్వేదం, మను స్మృతి, నారద స్మృతి, ఆర్థశాస్త్రం, బైబిల్‌లలో బానిస వ్యవస్థ స్వరూప స్వభావాలు కనిపిస్తాయి. అయితే భారతదేశంలో బానిస వ్యవస్థకీ, ప్రపంచంలో మిగిలిన చోట్ల కనిపించే బానిసత్వానికీ ఎంతో తేడా ఉంది. ఏమైనా క్రీస్తుపూర్వమే ఈ భూమ్మీద బానిస వ్యవస్థ ఆవిర్భవించింది. ఆ ఘోర వ్యవస్థను నిర్మూలించడానికి ప్రయత్నాలు కూడా జరిగాయి. నిగళాలు తెంపి పారేయడానికి బానిసల తిరుగుబాట్లు జరిగాయి. సంస్కరణోద్యమాలు జరిగాయి.

అంతర్జాతీయ సదస్సులు జరిగాయి. కానీ 2014 సంవత్సరంలో కూడా ఆ వ్యవస్థ జాడలు సుస్పష్టంగా కనిపించడమే అతి పెద్ద విషాదం. ఆధునికత , శాస్త్ర సాంకేతిక ప్రగతి వంటి భావనలను హేళన చేసే విషయం కూడా. ఈ మధ్య కాలంలో ఇస్లామిక్ స్టేట్ పేరుతో ఉగ్రవాదం నెరపుతున్న ముఠాలు... యాజ్డి, క్రిస్టియన్ తెగలకు చెందిన స్త్రీలను అపహరించి, బానిసలుగా అంతర్జాతీయ విపణిలో విక్రయించారు. ఇది ఐక్యరాజ్య సమితి వెల్లడించిన వాస్తవం. ఐదు నుంచి ఏడువేల మంది స్త్రీలను ఇలా బానిసలుగా విక్రయించారని సమితి ప్రకటించింది. ఇందులో బాలలు కూడా ఉన్నారు.  
 
మెగస్తనీస్ లేదని చెప్పినా...

భారతదేశంలో బానిసలు లేరు అని ప్రకటించాడు గ్రీక్ యాత్రికుడు మెగస్తనీస్. ‘ఇండికా’ ఇతడి గ్రంథమే. క్రీస్తుపూర్వం 350-290 ప్రాంతంలో పాటలీపుత్రం వచ్చిన మెగస్తనీస్‌కు ఇక్కడి ‘బానిస’లను, ఆ వ్యవస్థ రూపురేఖలను  చూశాక అలాంటి అభిప్రాయం కలగడంలో ఆశ్చర్యం లేదు. అయితే పునాతన భారతంలో బానిసలు లేకపోలేదు. కానీ గ్రీస్, రోమ్ వంటి ప్రదే శాలతో పోల్చినపుడు ఇక్కడ బానిస వ్యవస్థ లేదనే అనిపిస్తుంది. అలాగే మెగస్తనీస్ అభిప్రాయానికి పరిమితులు ఉన్నాయి. ఆయన పాటలీపుత్రం, మిగిలిన ఉత్తర భారతాన్ని చూసి ఈ విషయం నమోదు చేసి ఉండవచ్చు. అయినా బానిస వ్యవస్థ విషయంలో పురాతన భారతం కనికరంతోనే ఉంది.
 
హరిశ్చంద్రుడు, చంద్రమతి, లోహితాస్యుడు బానిసలుగా అమ్ముడు పోయిన ఘట్టం మన పురాణాలలో కనిపిస్తుంది. దస్యులు లేదా దాస తెగ వారిని బానిసలుగానే రుగ్వేదం పేర్కొంటున్నది. జాతక కథలలోను ఈ వ్యవస్థ గురించి రేఖామాత్రంగా ప్రస్తావన కనిపిస్తుంది. యుద్ధఖైదీలను ప్రపంచం మొత్తం బానిసలుగానే చూసింది. భారత్ కూడా అందుకు మినహాయింపు కాదు. కానీ ఇక్కడ బానిసలకు కొన్ని హక్కులు ఇచ్చారు.
 
బానిస సాక్ష్యం చెల్లదు!

బానిస యజమాని ఆజ్ఞలనే శిరసావహించాలని నారద స్మృతి చెబుతోంది. మనుస్మృతి ప్రకారం బానిసలకు సొంత ఆస్తి ఉండకూడదు. బానిసల సాక్ష్యం చెల్లదు. ఈ కట్టుబాట్లతో పాటు కొన్ని హక్కులు కూడా దక్కాయి. బానిసతో యజమాని ఘర్షణ పడకూడదు. బానిస దండించవలసిన స్థాయిలో తప్పు చేస్తే వీపు మీద తప్ప కొట్టరాదు. తల మీద అసలే కొట్టకూడదు. ప్రాణం తీసే హక్కు యజమానికి లేదు. అన్నిటికీ మించి వృద్ధాప్యంలో బానిసను యజమాని వదిలి పెట్టకూడదు. కౌటిల్యుడి అర్థశాస్త్రం బానిసల పట్ల మరింత ఉదార వైఖరిని అవలంబించింది. బానిసల పిల్లలు కూడా యజమాని సొంతమే. కానీ అనివార్య పరిస్థితులలో తప్ప వారిని విక్రయించరాదు. మహిళా బానిసను సగౌరవంగా చూడాలి. మహిళ పట్ల అనుచితంగా వ్యవహరిస్తే ఆమెకు విముక్తి కల్పించడంతో పాటు, నష్ట పరిహారం కూడా ఇవ్వాలి. ఆమెకు పిల్లలు ఉంటే వాళ్లకి కూడా స్వేచ్ఛ ఇవ్వాలి. బానిసలు అసలు యజమాని దగ్గర పని లేనపుడు వేరే చోట్ల పని చేసి డబ్బు సంపాదించుకోవచ్చునని అర్థశాస్త్రం చెబుతోంది. సాధారణ యువతి ఒక బానిసను వివాహం చేసుకుంటే ఆమె స్వేచ్ఛను కోల్పోక తప్పదని కాత్యాయన స్మృతి శాసిస్తున్నది. ఇందులో చాలా విషయాలు అశోకుడి శాసనాలలో కనిపిస్తాయి. మౌర్యుల కాలంలో వీరిపట్ల కనిపించే ఔదార్యం గుప్తుల కాలానికి సడలిపోయినట్టు చరిత్రకారులు చెబుతారు. అయినా ఏ కాలంలోనూ ఇక్కడ బానిస విక్రయ విపణులు నెలకొనలేదు. నిజానికి పురాతన భారతంలో బానిసలు ఆర్థిక వ్యవస్థను నిర్మించిన వారు కాదు. వీరు ప్రధానంగా ఇంటి సేవకులు. లేదా వ్యక్తిగత సేవకులు. దీనితో వీరికి దాదాపు కుటుంబ సభ్యుని హోదా లభించేది. భారతదేశంలో వ్యవసాయం ఎక్కువగా శూద్రుల వల్లే జరిగింది తప్ప బానిసల వల్ల కాదు.
 
కోటీ 50 లక్షల మంది!

ఆధునిక భార తదేశంలోనూ బానిస వ్యవస్థ జాడలు కనిపిస్తాయి. ఈ దేశాన్ని బానిస రాజులే (1206-1290) పాలించారు. దాని పేరే బానిస వంశం. అందులో ప్రముఖలైన అల్త్‌మష్, బాల్బన్ బానిసలే. 1841 నాటికి భారతదేశంలో 80 నుంచి 90 లక్షల మంది బానిసలు ఉన్నారని హెన్రీ బార్‌ట్లే ఫ్రెరే రాశాడు. ఇతడు వైశ్రాయ్ కౌన్సిల్ సభ్యుడు. దక్షిణ భారతంలోని మలబార్ ప్రాంత ప్రజలలో 15 శాతం బానిసలేనని చెబుతారు. దేశంలో బానిస వ్యవస్థ రద్దు కోసం ఈస్టిండియా కంపెనీ పాలనలోనే 1843లో ఇండియన్ స్లేవరీ యాక్ట్‌ను అమలులోకి తెచ్చారు. ఇక్కడ బానిసలను పశువుల్లా చూడలేదన్న గత చరిత్ర గర్వకారణమే. కానీ 2013 కంటె 2014లో భారత్‌లో బానిసత్వం పెరిగిందన్న లెక్క అత్యంత అవమానకరం. ప్రస్తుతం భారత్‌లో కోటి నలభై లక్షల మంది బానిసలు ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి. చైనాలో 30 లక్షల మంది బానిసలు ఉన్నారని చెబుతున్నారు. ఈ లెక్కలు వాస్తవికమైతే ప్రపంచ బానిసలలో సగం మంది ఇక్కడే ఉన్నారు.
 
ఆధునిక యుగం తన శైలికి తగ్గట్టు బానిస వ్యాపారానికి కూడా పరిశ్రమ హోదా వచ్చింది. కాబట్టి గణాంకాలలో దాని స్వరూపం చూడవచ్చు.  ఐక్యరాజ్య సమితి లెక్క ప్రకారం బానిస వ్యాపారంలో మూడు కోట్ల మంది ఉండవచ్చు. దీని వ్యాపారం మొత్తం 35 బిలియన్ డాలర్లుగా లెక్క కట్టారు. పది దేశాలకు సంబంధించిన వారే 76 శాతం వరకు ఈ వ్యాపారంలో వస్తువయ్యారు. మనుషులను అక్రమంగా తరలించి బలవంతంగా పనులు చేయించడం, బాల కార్మిక వ్యవస్థ, బలవంతంగా పెళ్లి చేసుకుని తీసుకువెళ్లడం, వ్యభిచార కూపాలలోకి పంపడం, వెట్టి... వీటన్నిటినీ ఇప్పుడు బానిస వ్యవస్థలో భాగంగానే పరిగణిస్తున్నారు. సూడానీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వంటి ఉగ్రవాద సంస్థలు పిల్లలను తమ కార్యకలాపాలలో భాగం చేస్తున్నాయి. ఆయుధాలు పట్టిస్తున్నాయి.  ఇది కూడా ఒక రకం బానిసత్వమే. ఇదే పని శ్రీలంకలో ఎల్‌టీటీఈ కూడా చేసింది.
 
ఈ దారుణమైన వ్యవస్థను నిర్మూలించడానికి ప్రయత్నాలు జరగకపోలేదు. ఈ దిశగా అంతర్జాతీయ స్థాయిలో జరిగిన తొలియత్నం 1926 నాటి జెనీవా స్లేవరీ కన్వెన్షన్. నానాజాతి సమితి దీనిని నిర్వహించింది. తరువాత 1930, 1948, 1956లలో అంతర్జాతీయ సదస్సులు జరిగాయి.  
 
వీటితో మార్పు రాలేదని చెప్పడం లేదు. కానీ కొత్త రూపంలో మళ్లీ బానిసత్వం దర్శనమిస్తూనే ఉంది. ఇది ప్రపంచ మానవాళి చిత్తశుద్ధిని శంకించేదే.  బానిసత్వ నిర్మూలన దినమంటూ పాటించడం దాని ఫలితమే. సాటి మనిషిని బానిసగా, పశువులా చూడ్డమనే కళంకం నుంచి ప్రపంచం బయటపడలేదని గుర్తు చేయడమే.
 -
 డా॥గోపరాజు నారాయణరావు
 
 ఒక దుఃఖసాగరం
 
 బాటకు ఇరువైపులా సిలువలు, పాదాలకీ, మణికట్లకీ మేకులు వేసి వాటికి దిగ్గొట్టిన మానవ దేహాలు, వాటి ఎడమ రొమ్ము నుంచి కింద నుంచి రాలుతున్న నెత్తురు చుక్కలు.. వాటి మీద వాలి పొడుచుకు తింటున్న రాబందులు... ఇది ‘స్పార్టకస్’ నవల (హోవార్డ్ ఫాస్ట్) తొలి ఘట్టం. చరిత్ర ప్రసిద్ధి గాంచిన రోమ్ బానిసల తిరుగుబాటు అనంతర దృశ్యమది. తమను అత్యంత దారుణంగా హింసిస్తున్న యజమానుల మీద తిరుగుబాటు చేసిన బానిసలకు అప్పటి రాచరికం పట్టించిన దుర్గతి అది. అమెరికా రచయిత మార్క్ ట్వేన్ ‘హకల్‌బెరీఫిన్’ నవలలో బానిసలను  ఎంత హీనంగా, కఠినంగా చూశారో వివరించే దృశ్యాలను నమోదు చేశారు. ఇక ఎలెక్స్ హేలీ నవల ‘రూట్స్’ (తెలుగు అనువాదం ‘ఏడుతరాలు’) నల్ల కలువల నెత్తుటి చరిత్రను అద్భుతంగా చిత్రించింది. చరిత్రకారుడు హోవార్డ్ జోన్స్ రచనల ఆధారంగా స్టీవెన్ స్పీల్‌బెర్గ్ తీసిన ‘అమిస్టాడ్’ చిత్రం మరొక అద్భుతం. ఇవన్నీ మనిషిని మనిషి ఎంత అమానుషంగా వేధించాడో చెప్పేవే. క్యూబా తీరం నుంచి 58 మంది బానిసలతో అమెరికాకు వస్తున్న నౌక లా అమిస్టాడ్. అందులో జరిగిన చరిత్రాత్మక తిరుగుబాటు ఉదంతాన్ని స్పీల్‌బెర్గ్ తెరకెక్కించారు. శ్వేత జాతీయుల దురహంకారం, కాఠిన్యం ఈ రచనలన్నిటిలో సమంగా ప్రతిబింబిస్తాయి. పారిపోయేందుకు ప్రయత్నించిన బానిసల మర్మావయవాలను కూడా తొలగించేటంత కర్కశత్వం కనిపిస్తుంది. బానిసల దుస్థితి గురించి ఏ కొద్దిమందో నిరసన తెలియచేశారు. అయినా అది కొనసాగింది! ఇరవై ఒకటో శతాబ్దంలో 2008 వరకు కూడా!!
 
సుమేరు, ఈజిప్ట్, చైనా, అక్కాడియన్ సామ్రాజ్యం, అస్సీరియా, భారత్, రోమ్ వంటి పురాతన నాగరికతలలో బానిసలు ఉన్నారు. ఏథెన్స్ నగరంలో క్రీ.పూ. 6, 5 శతాబ్దాలలో 80,000 మంది బానిసలు ఉన్నారని చరిత్ర చెబుతోంది. 1723 నాటికి రష్యాలో బానిస వ్యవస్థ ప్రబలంగా ఉంది. ఆధునిక యుగంలో ‘కానిస్టాంట్ నోపుల్’ అతి పెద్ద బానిస విక్రయ కేంద్రంగా పేర్గాంచింది. క్రీ.శ. ఐదో శతాబ్దానికి ఇది ప్రపంచంలోనే ఐదో పెద్ద బానిసల మార్కెట్ కూడా. 1833లోనే ఇంగ్లండ్ బానిస వ్యవస్థను రద్దు చేసింది. కానీ అమలు చేయలేకపోయింది. ఒట్టోమన్ సామ్రాజ్యంలో 1908 సంవత్సరంలో కూడా ఆడ బానిసలను నడి వీధిలో విక్రయించారు. ప్రపంచంలోనే ఒక ఆర్థిక శక్తిగా ఆవిర్భవించిన చైనాలో 2007లో 550 మంది బానిసలను ఇటుక బట్టీల నుంచి విముక్తం చేశారు. షాంగ్జీ, హెనాన్  అనే ప్రాంతంలో ఇది జరిగింది. మన మహా రచయిత్రి మహాశ్వేతాదేవి ‘శనిచరి’ కథ కూడా బానిసత్వానికి సంబంధించినదే. బెంగాల్‌లో ఒకప్పుడు ఇటుక బట్టీలలో పని పేరుతో తీసుకువచ్చిన బాలికలను వ్యభిచార గృహాలకు ఎలా విక్రయించేవారో, వారి బతుకులు ఎంత దీనంగా తెల్లవారేవో ఈ కథలో మహాశ్వేత ఆవిష్కరించారు.

ప్రాచీన కాలంలో క్రూరమైన బానిస వ్యవస్థకు పేర్గాంచిన బ్రెజిల్‌లో 5000 మంది బానిసలకు 2008లో విముక్తి లభించింది. 2003 నుంచి అక్కడ సాగిన పెద్ద ఉద్యమం ఫలితంగా ఇది సాధ్యమైంది. బానిసలతో పని చేయించుకుంటున్న సంస్థల పేర్లను ఉద్యమకారులు ‘డర్టీలిస్ట్’ పేరుతో బహిర్గతం చేశారు. 300 కంపెనీల పేర్లు ఆ జాబితాలో చేరాయి. ఎట్టకేలకు 2008లో ప్రభుత్వం కదిలింది.  ఆ సంవత్సరమే నేపాల్‌లో ‘హలియా’ పేరుతో కొనసాగుతున్న బానిసత్వాన్ని రద్దు చేసి 20,000 మందికి స్వేచ్ఛ కల్పించారు.
 
న్యోబోటో.... అలా ఎందరో!
 
‘రూట్స్’ నవలలో హేలీ చిత్రించిన ఒక పాత్ర న్యోబోటో. ఒక తండాలోని కుటుంబాల వారి పిల్లలను సాకుతూ అందరికీ తలలో నాలుకలా ఉండే అవ్వ ఆమె.  ఆమె బానిస. ఆ తండా కలసి కొనుక్కున్న బానిస.  కానీ ఆమెను ఎవరూ అలా చూడరు. న్యోబోటో ఆమె అసలు పేరు కూడా కాదు. మరి ఆమె ఎవరు?  ఒకసారి తన కథ చెబుతుంది. ఆఫ్రికాలోనే ఒకసారి తెల్లవాళ్లు (అమెరికన్లు) న్యోబోటో ఉండే తండా మీద దాడి చేసి అందరినీ తీసుకు వెళ్లారు. పిల్లలను, వృద్ధులను చంపారు. వారితో ప్రయోజనం లేదు కాబట్టి.  వయసులో ఉన్నవారిని మాత్రం ఓడలకు ఎక్కించారు. అప్పుడే ఎందుకో మరి, న్యోబోటోను దారిలో ఈ తండాకు అమ్మేశారు- బస్తాడు జొన్నలకు. న్యోబోటో అంటే బస్తాడు జొన్నలు. ఆ పేరే ఆమెకు ఖాయమైంది. బానిస వ్యాపారంలోని క్రూరత్వానికి ఈ పాత్ర గొప్ప నిదర్శనం. ఒక కుటుంబంలో తల్లిని ఒకచోట, బిడ్డలను వేరేచోట, తండ్రిని వేరే చోట విక్రయించేవారు.  బతికి ఉండగా మళ్లీ ఆ కుటుంబం కలుసుకోవడం దాదాపు అసాధ్యం. ఇలా ఎన్ని కుటుంబాలో... ఎందరు న్యోబోటోలో!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement